ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా..
ఉత్తుంగశబరిగిరిశృంగ, నిత్యనిస్సంగ, మంగళాంగ,
పంపాతరంగ, పుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగ!
ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా..
బ్రహ్మచారినై, భక్తియోగినై, ద్వంద్వము అన్నది వీడి,
విగతకామినై, మోక్షగామినై, తాపత్రయమును విడచి
కన్నెసామినై, కర్మధారినై, కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా! బంధము తెంచితి పన్నగవాసా!
ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా..
శరణం శరణం భవతరణ, శబరిగిరీశా అయ్యప్పా!
శుభదం, సుఖదం నీ చరణం, హరిహరపుత్రా అయ్యప్పా!
అయనరేఖలా సంగమవేళ మిథ్యావాదపు మధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మపరిధిలో నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచరసృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది,
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా, ఈ మహికి దేవుడే అయ్యప్ప!
శబరిగిరీశా ధన్యోహం ||
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏