గోపద్మ వ్రతము....!!

P Madhav Kumar


🌿గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము.


🌸 దీనిని సుమంగళి స్త్రీలు ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు.


🌿గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను / కొట్టాలను శుభ్ర పరచి , వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు.


🌸 ఈ ముగ్గుల్లో భాగంగా ఆవునూ మరియు దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు.


🌿 పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు , 33 సార్లు అర్ఘ్యం ఇస్తారు , మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. 


🌸పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గువేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని అయిదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు.


🌿మన హిందూ సంప్రదాయం లో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. 

సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు.


🌷గోపద్మ వ్రత విధానము🌷


🌸వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి , చెక్కెర / స్వీటును నైవేద్యంగా పెట్టాలి. 

వాటిచుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించాలి. 


🌿తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహినీ దేవతలకు ప్రతిగా వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి. 


🌸హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి. 

మళ్ళీ ఆరుగురు మోహినీ దేవతలకు ఆరు సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి. 


🌿తరువాత గోపద్మ వ్రత కథను చదివి , అక్షతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమింపమని కోరాలి.


🌸 స్వీట్లు మొదట సోదరులకు , తర్వాత ఇతరులకు దానమివ్వాలి.

ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి.


🌿 ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా , ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమింపమని కోరాలి.


🌸 ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భగ్నం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. 


🌿ఈ మధ్య కాలములో సమయాభావము వలన చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి 1-2 సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు.


🌷గోపద్మ వ్రత కథ :🌷


🌸ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా 


🌿 ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యమ్ముణ్ని పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మం తెచ్చి తబలాను బాగుచేయవలసిందిగా కోరతాడు. 


🌸దానికి యముడు , భూలోకములో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. 


🌿ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి , సావిత్రి , అనసూయ , ద్రౌపది , అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు.


🌸 ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటివద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియచేసారు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. 


🌿ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్లి ఆమెను ఇంటివద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా ,


🌸 దానికి సుభద్ర నాకు సూర్య , చంద్రుల వంటి ఇద్దరు సోదరులు , మహావీరుడైన అర్జునుని వంటి భర్త , దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. 


🌿దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నాగానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు.


 🌸గద్ద , విష్ణు పాదము , శంఖము , చక్రము , గద , పద్మము , స్వస్తిక , బృందావన , వేణువు , వీణ , తబలా , ఆవు , దూడ , 33 పద్మములు , రాముని ఊయల , సీత చీర అంచు , తులసి ఆకు , ఏనుగు మరియు భటుడులను ముగ్గుతో నదులు , చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు.


🌿 అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది.  


🌸ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి , యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటినుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది.


🌿 యమభటులు ఉత్తరానికి తల పెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగుచేసుకున్నారు....


గోపద్మ వ్రతమ కథ సంపూర్ణం.. సేకరణ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat