దీక్ష అనేపదము వేదము నుంచి ఉత్పన్నమైనది. ఒక యజ్ఞము జరుగుతున్న సందర్భములో లేక ప్రతిష్ట జరుగుతున్న సందర్భములో ప్రతిష్ట చేయించే గురువు గారు దీక్షా ధారణ చేయిస్తారు అక్కడి నుంచి వేద ప్రమాణమునకు కట్టుబడవలసి ఉంటుంది. ఇలాగే తల్లితండ్రులు పెద్దలు గతించిన సందర్భములో ఆశౌచ దీక్ష వుంటుంది. వారి వారి కుల మత ధర్మాలను అనుసరించి ఈ దీక్ష చెయ్యాలి. అలాగే ఒక అయ్యప్ప దీక్ష, భవాని దీక్ష, శివ దీక్ష వంటి వాటిలో ప్రత్యేకముగా గురు స్థానము గురువు దీక్ష ఇవ్వటము, గురువును అనుసరించి పూజ, ధ్యానము నేర్చుకోవటము, మంత్ర,తంత్ర,ముద్ర,ధ్యాన,యోగ రహస్యాలు తెలుసుకోవటం జరుగుతుంది. చివరకు ఇరుముడి కట్టి భగవంతుని చూపే స్వరూపమే గురువు. తనతో పాటు మాల ధారణ చేయించి, స్నానము ఎలా చెయ్యాలి నుంచి భోజన శయన పూజ భజన పద్ధతులను నేర్పి 41 రోజులు నిన్ను పూర్తిగా స్వామికే అంకితమయ్యేలాగ తయారుచేసి శబరిమలై యాత్ర చేయించి జ్యోతి స్వరూపుని చూపి నిన్ను జ్యోతిగా మార్చి ఆయన పాదాల చెంతకు తీసుకు వెళ్ళే ఏకైక స్వరూపము గురు స్వరూపము. అటువంటి గురువు దొరికిన శిష్యుడు ఎంతటి అదృష్టవంతుడో ... ఇన్ని నియమాలు పాటించి తనమాట ప్రకారము నడుచుకునే శిష్యుడు లభిస్తే గురువు పొంగిపోతాడు. అన్ని రహస్యాలు చెప్పేస్తాడు. అందుకే గురువుకి అంత ప్రత్యేకత. తల్లితండ్రులు చనిపోతే ఒక్క సంతానమే బాధ పడతారు. గురువు పోతే సమాజమే పాడైపోతుంది. అందుకే గురువుని కాపాడుకోవటం మన బాధ్యత