‘భక్తసౌభాగ్యదాయినీ’

P Madhav Kumar


భక్తులకు సౌభాగ్యమును కృప చేస్తుంది. సౌభాగ్యము అనగా సభర్తృక అయి ఉండటము మాత్రమే కాదు. అలా ఉండటము పూర్ణత్వము అనిపించుకోదు. పిల్లాపాపలతో ఉండి ఆ బిడ్డలకు బిడ్డలుకలిగి తామరతంపరగా ఆ ఇల్లు వృద్ధిలోకి రావాలి. అమ్మవారి అనుగ్రహము లేకపోతే ఆ ఇంట్లో సభ్యులు కలసి ఉండటము కుదరదు. సౌభాగ్యము విషయములో అత్యద్భుతమైన ఒక రహస్యము ఉన్నది. అమ్మవారి అనుగ్రహము ఉన్నచోట ప్రయత్నము, కీర్తి రెండూ కలుస్తాయి. అమ్మవారు జనము ఏమి చేస్తారో చూద్దామని తాను కొన్నిసౌభాగ్యవస్తువులుగా లోకములో కదులుతుంది. తాటి చెట్టు, చెఱకుకర్ర, జీలకర్ర, ధనియాలు, పాలు, ఉప్పు, ఎర్రటి పువ్వులు, అనుములు ఈ ఎనిమిదీ పూజనీయమై అమ్మవారి సౌభాగ్య అష్టకముగా పేరు పొందాయి వాటిని పరమ మర్యాదతో చూడవలసి ఉంటుంది. 

సౌభాగ్యము అన్నమాటను చాలా జాగ్రత్తగా పరిశీలనము చేస్తే అమ్మవారి అనుగ్రహము కలిగితే జీవితములో వారు సమన్వయము చేసుకునే విధానము వేరుగా ఉంటుంది. సౌభాగ్యము, సంతోషము అమ్మవారి వాక్కుని వినడములో ఉంటుంది. ఆ తల్లి చెప్పడము అంటే వేదమును చెప్పడము. వేదమును భగవంతుని నమ్ముకున్నవారు ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడతారు. ఈశ్వర కృప కాపాడుతుంది. అది సౌభాగ్యము. ఒక గడ్డి పరకను సముద్రంలో వేస్తే దానిని నెత్తిన పెట్టుకున్నది. రత్నమును కింద ఎక్కడో పెడుతుంది. కింద పెట్టబడినంత మాత్రము చేత రత్నం గౌరవము తగ్గలేదు. నెత్తి మీద పెట్టుకున్నదని గడ్డిపరక గొప్పది కాలేదు. బుద్ధిహీనతవలన సముద్రము గడ్డిపరకను నెత్తిమీద రత్నమును కాళ్ళ దగ్గర పెట్టుకున్నది. లాగేసేవారిని విడిచి పెట్టడము, ప్రోత్సహించే వారి గురించి ప్రార్థన చెయ్యడము చేతనయి ఉండాలి. అది సౌభాగ్యము. పదిమంది తోస్తేనే రాయి శిఖరము మీదకు వెడుతుంది. ఒక్కడు తోస్తే ఎక్కదు. ఒక రాయి శిఖరము మీదకు ఎక్కి ఒక విగ్రహముగా ప్రతిష్ఠ చెయ్యబడినది అంటే మలచిన వాళ్ళు, ప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక వ్యక్తి ఈశ్వరుని చేరుకోవడము అంటే తేలిక అయిన విషయము కాదు. ఎవరితో కూడాలో వారితో కూడి, ఎవరికి దూరం అవాలో వారికి దూరముగా ఉండటము రావాలి అదే సౌభాగ్యము. ఈవిషయము అనుష్ఠాన పర్యంతములోకి రావాలి. 


‘భక్తప్రియ’ 


అమ్మవారు భక్తి చేత చాలా ప్రీతి చెందే తల్లి. ప్రేమకి, భక్తికి తేడా ఉండదు. ప్రేమ ఎటువంటిదో భక్తి అటువంటిదే. భగవంతుని పట్ల భక్తి కలగడానికి కూడా అనుబంధమే కారణము. మిగిలిన అనుబంధములన్నీ ఈశ్వరునితో ఉన్న అనుబంధము గట్టిపడటానికి, ఈశ్వరుని చేరుకోవడానికి ఉపయోగపడాలి. ఈశ్వరానుగ్రహము చేత రోజు ప్రారంభము అవుతున్నది. ఎవరూ దానిని వెనకకు, ముందుకు జరపలేరు. కాల స్వరూపములో శుభ, అశుభములను ఇవ్వకలిగిన శక్తి ఒకటి కంటికీ కనపడకుండా సమస్తమును నడిపిస్తున్నది. ఈ శక్తిని సనాతన ధర్మము గుర్తించింది. ఏ స్వరూపమైనా ఆ తత్త్వము వంటబట్టాలి. అది వంటబడితే భక్తి ఏర్పడుతుంది. ఏ కంటికీ కనపడని వస్తువు ఈ లోకమును, పిండాండము నుంచి బ్రహ్మాండము వరకు నిర్వహణ చేస్తున్నదో ఆ శక్తిని స్తోత్రము చెయ్యడము సనాతన ధర్మములో ఉన్న గొప్పదనము. అంతటా నిండిపోయిన ఆ శక్తి పట్ల విశేషముగా భక్తి ఏర్పడితే అది కొన్ని గమ్మత్తులు చేస్తుంది. దానికే భక్తిప్రియ అని అమ్మవారికి పేరు. ఆ పరాశక్తిని జగదంబ అంటున్నాము. జగత్తు నిర్వహిస్తున్న పరిపాలకురాలు అంటున్నాము. 

ఉ || అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె

        ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి వుచ్చిన యమ్మ, దన్ను బో

        నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ, మా

       యమ్మ, కృపాభ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ ||

భాగవతములో పోతనగారు అన్నారు. అమ్మా ! అనడమే పరమ సత్యం. లోకములో పురుషుడు అనేవాడు శివుడు ఒక్కడే. ఆయన లోపలే అమ్మవారు ఉంటుంది. వారిద్దరూ ‘శివశక్త్యాత్మక’ముగా ఉంటారు.🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏


🙏🙏🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat