నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు
సాధారణంగా హిందువులు ఎవరైనా సరే ఏ దేవున్ని లేదా దేవతను అయినా సరే.. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్రహాలను చూస్తూ దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రం దైవ దర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శనం చేసుకుంటారు. ఆ తరువాతే ఆలయంలోకి వెళ్లి లింగ దర్శనం చేసుకుంటారు. అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి ? నేరుగా వెళ్లి శివున్ని దర్శించుకుంటే ఏమవుతుంది ? అలా ఎందుకు చేయరాదు ? అంటే..
శివుడు త్రిమూర్తులలో ఒకడు. కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు. ఆయన్ను లింగ రూపంలో దర్శించుకోవాలి. శివుడు లయ కారకుడు. ఆయనకున్న మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అయిపోతుంది. అంతటి శక్తి ఆయన మూడో కన్నుకు ఉంటుంది. కనుక అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోరాదు. ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతే కానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. వెళితే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది వీపుపై నిమురుతూ మన కుడి చేతితో నంది చెవి మూయాలి. అనంతరం మన మనస్సులో ఉన్న కోరికతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి. అలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవెరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందట. మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి.