హనుమంతుడి అమ్మమ్మ అహల్య... ఆమె శాపంతో హనుమంతుడికి వానర రూపం...

P Madhav Kumar

 *

గౌతమ మహర్షి, అహల్య దంపతులకు కలిగిన పుత్రులు వాలి, సుగ్రీవులు మర్కట రూపులుగా ఎందుకు ఉన్నారు? వీరి పుత్రిక అంజనా దేవి కుమారుడు ఆంజనేయ స్వామి మర్కట రూపుడు అవడానికి కారణమేమిటి? తెలుసుకుందాం. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్కరించిన తరువాత తను బ్రహ్మచర్యము వీడి తను ఇచ్చటనే ఉండి ఇంకనూ సంతానం పొందగోరి సంసార జీవితం గడిపారు. అహల్య గౌతమ మహర్షి దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కలిగారు. వీరి కుమారులు వాలీ, సుగ్రీవులు. వీరి కుమార్తెయే ఆంజనేయస్వామి వారి కన్నతల్లి అంజనాదేవి.

ఇంద్రుడు అహల్యను చూసిన తరువాత ఆమె అందచందాలకు ఆమెపై మోజుపడతాడు. అహల్య, ఇంద్రునికి దక్కకపోవడం చేత ఒకనాడు మహర్షి లేని సమయాన గౌతమ మహర్షి రూపములో వచ్చి అహల్యతో సంభోగించి ఇంద్రుడు తన కోరికను తీర్చుకున్నాడు. ఈ విషయము అంజనాదేవి కనిపెట్టినా మౌనముగా ఉండిపోయింది. 


ఒకనాడు గౌతమ మహర్షి తన ఇరువురు కుమారులను రెండు భుజములపై ఎక్కించుకుని కుమార్తెను చేత పట్టుకుని సరస్సు గట్టుపై నడుస్తున్న సమయాన చిరంజీవి అంజనా తన తండ్రి తనకు పుట్టిన నన్ను నడిపిస్తూ, పరులకు పుట్టిన వారిని భుజములపై మోయుచున్నాడని బాధపడుతుంది. ఇది మనోనేత్రమున గమనించిన మహర్షి అంజనా దేవి ద్వారా అసలు విషయం తెలుసుకుని తన కూతురు చెప్పిన విషయంలో నిజమెంతో పరీక్షించదలచి ఈ సరస్సులోని నీటిలో వీరిద్దరిని పడవేస్తాను. 


పరులకు పుట్టినవారైతే మర్కట రూపులుగా, తనకు పుట్టినవారైతే తమ స్వరూపులుగా ఈ నీటి నుండి తిరిగి వస్తారని చెప్పి పిల్లలిద్దరిని నీటిలో పడవేస్తాడు. పిల్లలిద్దరూ మర్కట రూపులై తిరిగి రావడం చూసి గౌతమ మహర్షి మిక్కిలి కోపిస్టులవుతారు. ఈ విషయం తెలిసిన అహల్య అచ్చటకు వచ్చినది. కోపిష్టుడైన మహర్షి పరపురుషుని స్పర్శ తెలియనంతగా బండరాతివై ఉన్నావా? నీవు రాతి బండవు కమ్మని అహల్యను శపించి పిల్లలను వదిలేసి మహర్షి కోపముతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.


అప్పుడు అహల్యాదేవి తన కుమార్తె అంజనాతో పరపురుషులు తన తండ్రి రూపముతో వచ్చినారని తెలిసి కూడా తనతో ఇంతకాలం చెప్పక తను శాపగ్రస్తురాలగుటకు, తన కుమారులు మర్కట రూపులు అగుటకు కారణమైతివి. కాబట్టి నీవు అంధురాలివికమ్ము. నీకు పుట్టబోయే కుమారుడు కూడా మర్కట రూపుడై పుట్టుగాక అని తన కుమార్తె అంజనాదేవిని శపించినది. తల్లి శాపముతో అంధురాలిగా మారిన అంజనాదేవి ఆ ప్రాంతం వదిలి కిష్కింద చేరి అచ్చట కేసరి అనునతడిని వివాహమాడినది. వారికి కలిగిన సంతానమే ఆంజనేయస్వామి. ఆనాడు అహల్య పెట్టిన శాపం వల్ల అంజనాదేవి కుమారుడైన ఆంజనేయస్వామికి మర్కట రూపం వచ్చింది..



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat