🔆 నల్గొండ జిల్లా : సురేంద్రపురి

P Madhav Kumar


👉 శ్రీ కుందా సత్యనారాయణ కళాధామం


💠 సకల దేవతామూర్తులను సహజంగా సృష్టించిన కళాద్భుతం ఇది. 

పౌరాణిక ఘట్టాలలో అపురూప దృశ్యాలను కళాఖండాలుగా రూపొందించి కళాప్రియులకే కాకుండా పర్యాటకులకు కూడా కనువిందు చేసే సర్వదేవలోక సన్నిధానం తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి గుట్టకు సమీపంలో ఏర్పాటైంది.


💠 భాగ్యనగరానికి దగ్గరలో యాదగిరిగుట్ట సమీపంలో సుందర సురేంద్రపురిలో అత్యంత మనోహరమైన కుందా సత్యనారాయణ కళాధామం పేరుతో పౌరాణిక విజ్ఞాన కేంద్రం ప్రజల మనసులను ఆకట్టుకుంది.


💠 దివ్య శోభాలంకృతమైన ఈ కళాధామంలో సంపూర్ణ భారతదేశ ప్రముఖ ఆలయాలు, సర్వదేవతలతో ఒకేచోట సురేంద్రపురిలోని కళాధామంలో తిలకించవచ్చు. 


💠 రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలలోని ప్రధాన ఘట్టాలను శిల్పాలుగా మలిచి నయనమనోహరంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. 

కురుక్షేత్రంలోని పద్మవ్యూహం, దేవీ భాగవతంలోని పద్మద్వీపం (మణిదీపం), క్షీరసాగర మధనం, గజేంద్రమోక్షం, కాళీయ మర్థనం, గోపికా వస్త్రాపహరణం, గంగావతరణం, మహిషాసురమర్థిని దృశ్యాలను కమనీయంగా చిత్రించారు.


🔆 కళాదారామం ప్రత్యేకత


💠 బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఇంద్రలోకం, యమలోకం, నరకలోకం, నాగలోకం, పాతాళ లోకాలే కాక అనేక లోకాలు, ఎందరెందరో దేవతామూర్తులు ఈ కళాధామంలో దర్శనమిస్తారు. 


💠 మేఘాలు, హంసలతో ఆహ్లాదకర వాతావరణంలో బ్రహ్మ, సరస్వతి తామర పుష్పంలో ఆసీనులై ఉండడం చూపరులను ఆకర్షిస్తుంది.సప్తరుషులు, మానస పుత్రులు, నవబ్రహ్మలు ఇక్కడ దర్శనమిస్తారు. 


💠 పాల సముద్రంలో శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు శయనించడం, లక్ష్మీదేవి పాదసేవ చేయడాన్ని కడురమ్యంగా చిత్రించారు.


💠 నాగలోకంలో నాగరాజు, రాణి, యువరాణి, నాగసైనికులతో భీముడు బంధించబడి ఉన్న దృశ్యం సముద్రగర్భంలో ఉన్న అనుభూతిని కల్గిస్తుంది.


💠 నరకలోకంలో వైతరణీ నది ప్రవహిస్తుండగా యమభటులు శిక్షలు అమలుచేసే దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.


💠 అమ్మలకు అమ్మ అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆనంద నిలయమే అద్భుత పద్మద్వీపం. సకల స్త్రీదేవతామూర్తులు నవదుర్గలతో కొలువుతీరిన పీఠం దిగువ భాగాన మహా మహిమాన్వితమైన సాక్షాత్తూ వైష్ణవీదేవిని ఇందులో చూడవచ్చు. 


💠 గోవర్ధన గిరిని ఎత్తడం, రాసక్రీడలు, రాక్షసులను సంహరించిన శిల్పఘట్టాలు దర్శనమిస్తాయి.


💠 హనుమంతుడు స్వహస్తాలతో ప్రసాదమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. 

ఆవు పొదుగునుంచి అప్పటికప్పుడే వేడిపాలతో టీ, కాఫీ తాగే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. 


💠 కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. 

ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు.

 ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.


💠 నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించారు. 

పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు.


💠 ఆంజనేయస్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. 

వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.


💠 అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశమార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల మినీ రూపాలు ఉన్నాయి. 

వీటిలో విజయవాడ కనకదుర్గ ఆలయం, 

షిర్డి సాయిబాబా గుడి ,

తిరుమల వెంకటేశ్వర ఆలయం.


💠 ఈ ప్రదేశాన్ని చూడాల్సిందేగానీ, చెప్పేందుకు అలవికానట్టిదిమొత్తం ఈ ప్రదేశాన్నంతా కలియదిరిగేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది.


💠 మహాభారత యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూపదర్శనం, అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడు విగ్రహం మనసుకు ఆనందాన్ని కలుగచేస్తుంది.


💠 కుందా సత్యనారాయణ కళాధామం

టికెట్ బుకింగ్ టైమింగ్స్ : ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు .

సందర్శించు వేళలు : ఉదయం 9:00 నుండి రాత్రి 7 :00 వరకు(ప్రతిరోజూ )


💠 ఎలా వెళ్లాలి?

హైదరావాడ్ నుండి 65కిమీ దూరంలో ఉంది. రాయ్గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుంచి చాలా బస్సులు కలవు.

 యాదాద్రికి వచ్చే అన్ని బస్సులు సురేంద్రపురి మీదుగానే వెళతాయి. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.







Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat