పాఠకుల ప్రశ్నలకు పూజ్యగురువుల సమాధానం
ఏ దేవతానుగ్రహం లభించాలన్నా ఉండవలసింది నిష్కపటమైన భక్తి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అని శాస్త్రం మనకి ఉన్నది. ఎవరు ఏ మేరకు ఆరాధన చేస్తే వారిని ఆ మేరకు అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆరాధనా పద్ధతులలో వారి వారి నిష్ఠకి, శ్రద్ధకి తగ్గట్లుగా ఫలితం ఉంటుంది. శ్రద్ధయే ఫలాన్నిస్తుంది. కర్మ శ్రద్ధతో కూడుకున్నప్పుడు తప్పకుండా సత్ఫలితాన్ని పొందగలం. చాలామంది ఒకే కర్మ చేస్తారు, ఒకరు గొప్ప ఫలితాన్ని పొందుతారు, ఒకరు పొందలేకపోతూ ఉంటారు. ఒకే కర్మ అయినప్పుడు ఫలితం ఎందుకు రాలేదు అంటే శ్రద్ధ. అందుకు ప్రధానంగా సరస్వతీ అనుగ్రహం కావాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములపై విశ్వాసం. ఈ తల్లి సరస్వతీ దేవి ఉపాసించిన నన్ను అనుగ్రహిస్తుంది అని అకుంఠితమైన విశ్వాసంతో, భక్తితో అమ్మని సేవిస్తే తప్పకుండా అనుగ్రహిస్తుంది. కనుక భక్తి శీఘ్రఫలప్రదాయిని.
సరస్వతీ ఆరాధకులు సాత్వికమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సరస్వతీ తత్త్వమే శుద్ధసత్త్వగుణం.
శుద్ధసత్వం అంటే
రజోగుణ తమోగుణ దోషాలు లేనటువంటి ప్రశాంతమైన, ప్రసన్నమైన, ఆహ్లాదకరమైనటువంటి జ్ఞానమే ఆ సరస్వతి.
అందుకు మనలో కూడా ఆ స్వభావాలు పెంచుకోవాలి. సాత్విక గుణాలైనటువంటి సత్యము, అహింస, శౌచము ఇలాంటి పవిత్రమైన పద్ధతులు పాటిస్తూ వాక్కును నిగ్రహించుకోవాలి. సరస్వతీ ఉపాసకులు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే వాగ్రహణం. వాక్కును నియమించుకోవాలి. వాచిక రూప తపస్సు సరస్వతీ ఆరాధనకు చాలా అవసరం. వాణిగ్రహణ ఎలా జరుగుతుంది? అంటే గీతలో కృష్ణపరమాత్మ చెప్తున్నాడు- అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ! స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే!!' – మనం మాట్లాడే మాట ఎదుటి వారిని ఆందోళనకు గురిచేయరాదు. భయపెట్టరాదు, ఉద్రేకానికి గురిచేయరాదు. 1 ప్రియంగా, హితంగా, సత్యంగా, మితంగా మాట్లాడాలి. దీనితో పాటు స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే పెద్దలు నటి ఉత్తమ గ్రంథాలను మన వాక్కుతో పఠించాలి. దివ్యమైనటువంటి శబ్దములు మన నోటితో పలకాలి. ఇలా వాక్కును నిగ్రహించుకొని, మనస్సును ప్రసన్నంగా ఉంచుకొని నిరంతరం నియమంగా అమ్మవారిని ఆరాధన చేయాలి. అమ్మవారి ఆరాధనలో తామసిక పదార్థాలను విసర్జించాలి. తామసిక పదార్థాలు అంటే మనలో తమోవృత్తిని పెంచేటటువంటి నిషేధపదార్ధములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ విసర్జించి సాత్వికమైన, మితమైన ఆహారాన్ని తీసుకుంటూ అది కూడా అమ్మవారికి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించి సాధన చేస్తే ప్రసాద భక్షణం వల్ల శరీరశుద్ధి, మనశ్శుద్ధి ఏర్పడతాయి. ఇటువంటి వాణ్ణిగ్రహణం వల్ల కూడా త్రికరణశుద్ధి ఏర్పడుతుంది. అలాంటి శుద్ధితో, శ్రద్ధతో అమ్మవారిని ఆరాధించి 'శ్రీసరస్వత్యై నమః' మంత్రాన్ని జపించితే శీఘ్రమైన ఫలం అమ్మ అందజేస్తుంది.