హనుమాన్ చాలీసా (తెలుగు)

P Madhav Kumar

ఆపదామపహర్తారం
దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహమ్ ॥

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ।
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్యదర్పహా ।
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ ॥

చాలీసా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు ।
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు ॥

జయ హనుమంత జ్ఞానగుణవందిత
జయ పండిత త్రిలోకపూజిత

రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవనసుతనామ

ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన

కాంచనవర్ణ విరాజిత వేష
కుండలమండిత కుంచిత కేశ ॥

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి

జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకను గాల్చి

భీమ రూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన

॥ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ॥

సీత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని

సహస్ర రీతుల నిను గొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ

వానరసేనతో వారిధి దాటి
లంకేశునితో తలపడి పోరి

హోరుహోరున పోరు సాగిన
అసురసేనల వరుసన గూల్చిన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణప్రదాత

రామ లక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని శ్రీ రామబాణము
జరిపించెను రావణ సంహారము

ఎదిరిలేని ఆ లంకాపురమున
ఏలికగా విభీషణు జేసిన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి

అంతులేని ఆనందాశ్రువులే
అయోధ్యాపురి పొంగిపొరలె

సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం

రామచరిత కర్ణామృతగాన
రామనామ రసామృతపాన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీ కృప జాలిన

కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న

రామ ద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా

భూత పిశాచ శాకిని ఢాకిని
భయపడి పారు నీ నామ జపము విని

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా

ఈశ్వరాంశ సంభూత పవిత్రా
కేసరీపుత్ర పావనగాత్రా

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు

యమ కుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

సోదర భరత సమానా యని
శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమా

సాధుల పాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగ
జానకీమాత దీవించెనుగా

రామ రసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసిన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

నీ నామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన

ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు

ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

శ్రద్ధగ దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు కలుగు సుమా

భక్తి మీరగా గానము చేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసిదాస హనుమాను చాలిసా
తెలుగున సులువుగ నలుగురు పాడగ

పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

మంగళ హారతి గొను హనుమంతా
సీతారామలక్ష్మణ సమేత ।
నా అంతరాత్మ నిలుమో అనంతా
నీవే అంతా శ్రీ హనుమంతా ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః ।

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat