1. ఇదే జన్మలో మోక్షం సాధించాలనుకొనే వ్యక్తి ఈ జన్మలోనే వేల సంవత్సరాల పని చేయాలి. ఈ యుగ వేగాన్ని దాటి ఎంతో ముందుకు వెళ్ళాలి. కలలో కనిపించిన మానావమానాలు, మంచీ-చెడులు, నీదీ-నాదీ అనే భావాలు నిద్ర నుండి మేల్కొన్న తరువాత ఎలా అసత్యమవుతాయో, ఈ ప్రాపంచిక జగత్తు కూడా అంతే ! ఇలా భావించుకొంటే చాలు, వేల సంవత్సరాల పని పూర్తయినట్లే. ఈ మాటను మన హృదయంలో దృఢంగా నాటుకునేలా చెప్పగల మహాపురుషుడు ఎవరయినా తారసపడితే వేల సంవత్సరాల సంస్కారాలు, నీదీ-నాదీ అనే భ్రమలు రెండు క్షణాల్లో పటా పంచలైపోతాయి.
2. నిజస్వరూపానికి భక్తుడిగా మారితే ఆజన్మాంతం ఉండే జీవనోపాధి; స్త్రీ చర్చలు, శతృస్మరణ వంటి కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఉదరచింతా ప్రియచర్చా విరహి కో జేసే ఖలే ౹
నిజ స్వరూప్ మే నిష్ఠా హో తో యే సభీ సహజ్ మే టలే ౹౹
ఉదర చింత, ప్రియురాలి చర్చ ఇవన్నీ బాధాకరం. నీ నిజస్వరూపం తెలుసుకొన్నావంటే చాలు, ఇక ఈ జగత్తు మొత్తం సుఖమయం.
3. నిన్ను నువ్వు ఇతరుల దృష్టితో చూసుకొని బాధపడటమే సకల దుఃఖాలకు మూలకారణం. ఇతరుల దృష్టిలో బాగా కనిపించాలని కోరుకోవడమే మనం సాంఘికంగా చేసేటటువంటి తప్పు.
4. జనులు ఎందుకు దుఃఖిస్తున్నారు? ఎందుకంటే అజ్ఞానం కారణంగా వారు తమ సత్య స్వరూపమును మరిచిపోయారు, ఇతరులు తమను గురించి ఎలా భావిస్తారో అలానే తాము అని భావించుకొంటున్నారు. ఆత్మ సాక్షాత్కారం అవ్వనంత వరకు ఈ దుఃఖం దూరం కాదు.
5. శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక పరమైన బాధలు అన్నీ వేదాంత అనుభవం వల్ల వెంటనే దూరమైపోతాయి. ఎవరైన బ్రహ్మనిష్ఠుడైన మహాపురుషుని సాన్నిధ్యం లభించినట్లయితే ఆ అనుభవం జ్ఞానం కష్టమేమీ కాదు.
6. మీ అంతర్యామి అయిన భగవంతుడిని సంతోష పెట్టేందుకు ప్రయత్నం చెయ్యండి. ప్రజలను-వాళ్ల అభిప్రాయాలను మీరు సంతృప్తి పరచలేరు. మీ ఆత్మదేవుడు మీపై ప్రసన్నమైతే చాలు, జనమంతా మీ వల్ల సంతుష్టులవుతారు.
7. సకల ప్రాణులలో బ్రహ్మను చూడలేకపోతే అందరికంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో, కనీసం ఆ ఒక్క వ్యక్తిలో పరమాత్మను దర్శించేందుకైనా ప్రయత్నం చెయ్యండి. బ్రహ్మానందం తొణికిసలాడుతున్న తత్త్వజ్ఞాని అగు మహాపురుషుని శరణు వేడండి. ఆయన దృష్టి పడగానే మీలో బ్రహ్మానంద అనుభూతి చిగురిస్తుంది. ఎక్స్‌రే మిషను బట్టలను, చర్మ-మాంసాలను చీల్చి ఎముకలను ఎలా ఫోటో తీయగలుగుతుందో, అలాగే జ్ఞాని యొక్క దృష్టి మీ చిత్తములోని దేహధ్యాస పొరలను చీల్చి మీలోని పరమాత్మను దర్శించగలుగుతుంది. ఆయన ద్వారా చెదిరిన ఆ అజ్ఞాన పొరలను ఛేదించడం మీకు కూడా తేలిక అవుతుంది. మీరు కూడా మీలోని భగవంతుడిని దర్శించుకోగలుగుతారు. అందుకే మీ హృదయంపై జ్ఞాని అయిన మహాపురుషుని దృష్టి పడనివ్వండి. రెప్పవాల్చకుండా శాంత ఆహాభావాలతో ఆయన ఎదుట కూర్చుని ఉంటే మీ చిత్తంపై ఆయన దృష్టి పడుతుంది.
8. సముద్రంలో చేపలు ఉన్నట్లుగా, ఆకాశంలో పక్షులు ఉన్నట్లుగా మీరు జ్ఞానరూప ప్రకాశ పుంజంలోనే ఉండండి. ప్రకాశంలో సంచరిస్తూ, నడుస్తూ ప్రకాశంలోనే నివాసం ఉండండి. ఇక అప్పుడు చూడండి! జీవితం ఎంత ఆనందమయమో!
9. ఓ తుఫానూ! లే. భయంకరమైన గాలి-వాన సాగించు. ఓ ఆనంద మహాసాగరమా! భూమి ఆకాశాలను చీలదీసి ఏకం చెయ్యి. ఓ మానవా! నీలోని ఆలోచనలు, చింతలు చిన్నాభిన్నం అయిపోయేట్లుగా ఆ మహా సాగరంలో లోతైన మునక వెయ్యి. నీ హృదయంలోని ద్వైతభావాన్ని బయటకు త్రోసివెయ్యి. నీలోని సంకీర్ణపు గోడలను సమూలంగా నేలమట్టం చెయ్యి. అప్పుడే ఆనందసాగరం నీ ఎదుట సాక్షాత్కారిస్తుంది. ఓ ప్రేమ మాధుర్యమా! ఆత్మధ్యాన మధూజలమా! నీవు మాపై ప్రసరించి, నీలో మమ్మల్ని ముంచి వెయ్యి. ఆలస్యం చెయ్యడం వలన లాభమేమి? నా మనస్సు ఇక ఒక్క క్షణం కూడా ఈ ప్రాపంచిక విషయాలలో నిమగ్నం కాలేదు. అందుకే నీ మనస్సును ఆ పరమాత్మలో లీనం చెయ్యి. స్వపరభేదాలకు నిప్పు పెట్టు. ఆశలు, ఆకాంక్షలను అవతల పారవేయుము. ద్వైత భావాన్ని సమూలంగా పెకలించు. నుసి నుసి చేసి గాలిలో కలిపి వేసేయి. ఆహారం దొరకదా? ఫరవాలేదు. ఆశ్రయం లభించదా? నష్టంలేదు. ఆ దివ్య ప్రేమ లభించితే చాలు. దానికై పడే తపన చాలు.
వేదము, పురాణాలు, కాదు, సత్యభోద చెయ్యండి ఎవరైనా!
ప్రేమ భిక్ష పెట్టండి ఎవరైనా సరే !
ఉచ్ఛ,నీచ (తక్కువ ఎక్కువ తారతమ్యాలు) భేదములు,
జాతీయత విద్వేషాలు,
పూజలలో భేదాలు
ఇవేమీ లేని చోటికి పదండి.
సత్యసారమే జీవితము.
ప్రేమసారమే మూలము. ఆ చోటికి నావను నడిపించుకు పొండి.
10. స్వప్నావస్థలో కలగనేవాడు, ఒంటరిగానే వుంటాడు. కానీ తన కల్పనతో పులులను, సింహాలను, గొర్రెలను, మేకలను, నదులను, నగరాలను, తోటలను, ఇలా సమస్త సృష్టినీ నిర్మించుకొంటాడు. ఆ లోకంలో తనే వాటిని చూసి భయపడతాడు. కల అని తెలియక పోవడం వల్ల దుఃఖిస్తాడు. కానీ, కలలోంచి మేల్కొన్న తర్వాత నిజానికి తాను తప్ప ఎవరూ లేరని గ్రహిస్తాడు. ఇదంతా తన కల్పనే అని గ్రహిస్తాడు. ఇదే విధంగా ఈ ప్రాపంచిక జగత్తు కూడా పరమాత్మ సృష్టి మాత్రమే, వాస్తవం కాదు. జీవుడు తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తే అతనిలోని సమస్త దుఃఖ దారిద్య్రము క్షణంలో నశించి పోతుంది.