*మాఘ పౌర్ణమి*
హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 16 న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.
కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.
మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*
*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*
*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''* అని అర్థం.
అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.
*☘మాఘం అమోఘం :☘*
మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.
*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*
*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*
మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.
త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .
*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*
మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*
మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.
*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*
*"నదీనాం సాగరో గతి:''*
సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం.
అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.
సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.
సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.
సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం.
*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*
1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*
2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*
3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*
4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*
5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*
6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*
7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*
8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*
9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*
ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*
*"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*
*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*
*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*
*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''*
అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం.
ఆ తరువాత ...
*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*
*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.
ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*
నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.
శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.
తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.
మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -
*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*
*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -
*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*
*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*
అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి.
*☘చివరగా ఓ మాట☘*
మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం.
జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.
*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.
*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*
పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని 16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు గర్భం పొందటానికి వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.
ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేవిని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.
_*స్వామియే శరణం అయ్యప్ప*_