🎻🌹🙏 ధర్మనిరతి అంటే..!!

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿పూర్వం కాశీరాజ్యంలోని ఒక అడవిలో ధర్మనిరతుడు అనే భిక్షువు ఉండేవాడు. ఆ అడవిలో ఒక పెద్ద కొలను ఉంది. దాన్నిండా తామరపూలు. లేత పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి.



🌸 ఆ సరోవరం దాపునే ధర్మనిరతుని నివాసం. ఆ సరోవరానికి ఒక కాపలాదారు ఉన్నాడు. ఒకరోజున ఉదయాన్నే ధర్మనిరతుడు లేచి కొలనులో స్నానం చేసి, గాలి వాలుకు పోయి నిలబడ్డాడు. 


🌿పూలపరిమళాలు పీలుస్తూ తన్మయుడవుతున్నాడు. అంతలో అతన్ని కాపలాదారు ‘‘స్వామీ! దొంగతనం తప్పా? ఒప్పా?’’ అడిగాడు.


🌸 ‘‘నాయనా! దొంగతనమే కాదు, ఒకరు ఇవ్వకుండా మనది కానిది ఏది తీసుకున్నా తప్పే. అదీ దొంగతనం కిందే లెక్క’’ అన్నాడు చిరునవ్వుతో.


🌿 ‘‘అయితే... మీరు దొంగే!’’ అన్నాడు కాపలాదారు. ‘‘నేనా? నేనేమీ దొంగిలించలేదే’’ అన్నాడు భిక్షువు. ‘‘ఇదిగో... ఈ పూలపరిమళాలు ఆఘ్రాణించారు కదా! ఇది గంధచౌర్యమే కదా.


🌸తమరు నా కొలనులోని సువాసనల్ని దొంగిలించినట్లే కదా’’ అన్నాడు. భిక్షువు అతనితో అలా మాట్లాడుతూ ఉండగానే, కొలను ఆవలిగట్టున ఒక వ్యక్తి వచ్చి కొలనులో దిగి కొన్ని తామరపూలు తెంపుకుని వెళ్లిపోయాడు. 


🌿అతణ్ణి కాపలాదారు చూశాడు. కానీ, అతణ్ణి ఏమీ అనలేదు. కనీసం కేకవేసి మందలించలేదు. అప్పుడు భిక్షువు– ‘‘బాగుందయ్యా! వాసన చూసిన నన్ను తప్పుపట్టావు. 


🌸పూలు తెంపుకుపోతున్న వాణ్ణి పన్నెత్తి చూడలేదు’’అని అడిగాడు. ‘‘స్వామీ! అతను లోభి. ధూర్తుడు. అజ్ఞాని. కానీ, తమరు జ్ఞానులు. ప్రబోధకులు. స్వచ్ఛమైన కర్మలు ఆచరించేవారు.


🌿 దోషం ఎంచలేని దొడ్డవారు. అతను పెద్ద తప్పు చేసినా చిన్నగానే కనిపిస్తుంది. మీలాంటివారు కంట్లో నలుసంత తప్పు చేసినా కారుమేఘమంతగా అందరికీ కనిపిస్తుంది కదా!’’ అన్నాడు. భిక్షువు మౌనం వహించాడు. 


🌸ధార్మికులు జీవితంలో ఎంత జాగరూకులై ఉండాలో జగత్ గురువులు చెప్పిన సందేశాత్మక కథ ఇది...స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat