#కర్మాచరణ

P Madhav Kumar

 

కర్మాచరణమనగా కర్మను ఆచరించడం.అసలు కర్మను ఎందుకు ఆచరించాలి?ఆచరిస్తే ఎలాంటి కర్మను ఆచరించాలి?

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు చెప్పిన ప్రకారం కర్మను ఆచరించక పోవడం కంటే ఆచరించడమే మంచిది.కర్మము వలన యజ్ఞము,యజ్ఞము వలన వర్షము,వర్షము వలన అన్నము,అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి.అందుచేత అన్నిటికీ మూలం కర్మయే.ఏ కర్మనూ చేయవలసిన అవసరం లేకపోయినా తాను కూడా అందరికీ మార్గదర్శకత్వం కోసం కర్మను చేస్తున్నానని గీతాచార్యులవారు చెప్పేరు.ఇంక ఎలాంటి కర్మను చెయ్యాలి? ఫలాపేక్ష లేకుండా చేసే కర్మయే మిక్కిలి ఉత్తమమైనది.అదే నిష్కామ కర్మ.అటువంటి కర్మనే ఆచరించి జనకాది రాజర్షులు తరించేరు.అట్టి కర్మనాచరించినవారే మోక్షాన్ని పొందగలరు. దీనికొక పురాణ గాథ.


దేవఋషి వరేణ్యుడునూ,సర్వలోక సంచారీ అయిన నారదుడొకసారి అరణ్య మార్గంలో వెళ్తూ ధ్యాన నిమగ్నుడైన ఓ పురుషుని చూసేడు.అతని మీద పుట్టలు పెరిగి ఉన్నాయి.అతడు నారదుని చూసి " తాపసోత్తమా! మీరెక్కడకు వెళ్తున్నారు?" అని అడుగగా కైలాసమునకని నారదుడు చెప్పేడు.అప్పుడతడు తనకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో పరమేశ్వరుని కనుక్కుని రమ్మని నారదుని ప్రార్థించేడు.నారదుడు "సరే " అని కొంతదూరం వెళ్ళిన తర్వాత మరొక పురుషుడు కనబడ్డాడు.అతడు ఆడుతూ,పాడుతూ ఎగిరి గంతులు వేస్తూ నారదుని చూసి " మునీంద్రా! తమరెక్కడకు వెళ్ళుచున్నారు?" అని అడిగేడు. కైలాసమునకని నారదుడు చెప్పగానే అతడు పరమేశ్వరుని అనుగ్రహం తనకెప్పుడు లభిస్తుందో కనుక్కుని రమ్మని వేడుకున్నాడు.నారదుడందులకంగీకరించి తన దారిన తాను వెళ్లిపోయేడు.


కాలక్రమంలో నారదుడాత్రోవనే తిరిగి రావడం తటస్థించింది.చెదల పుట్టలో ధ్యానిస్తున్న తాపసి దేవర్షిని చూసి " మునివరా! నా గురించి దేవదేవుడు ఏమన్నాడు? " అని అడుగగా " ఇక నాలుగు జన్మలలో నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పెను." అని నారదుడు చెప్పేడు.అప్పుడతడు చెదలు నాపై పుట్టలు పోసేవరకూ ధ్యానిస్తున్నానే అయ్యో! నేనింకా నాలుగు జన్మలు ఎత్తాలా? అని పెద్దగా ఏడవ సాగేడు.


నారదుడు రెండవ వాని వద్దకు వెళ్ళగానే అతడు కూడా " స్వామీ! నా గురించి మహాదేవుని అడిగేరు కదా!" అని ప్రశ్నించేడు." అడిగేను. ఆ చింత చెట్టును చూడు.దానికెన్ని ఆకులున్నాయో నీవన్ని జన్మల నెత్తాలి. అప్పుడు నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పేడు." అని నారదుడు చెప్పగానే అతడు "ఆహా! ఇంత శీఘ్రకాలంలో నాకు ముక్తి లభిస్తుందా?" అని ఆనందపరవశుడై నాట్యం చేయసాగేడు.అప్పుడు " నా తండ్రీ! నీవీ క్షణాన్నే ముక్తుడవవుతావు." అని అశరీరవాణి పలికింది.


అతని ఫలాపేక్ష లేని కర్మాచరణకది ప్రతిఫలం.ఎన్ని జన్మల సాధనకైనా అతడు సంసిద్దుడై ఉన్నాడు.ఇక మొదటివానికి నాలుగు జన్మలే దుర్భరమైన దీర్ఘకాలంగా తోచింది.అతడు చేసే తపస్సు శీఘ్రకాలంలో ముక్తి లభించాలనే కోరికతో కూడుకున్నది.అదే కామ్యకర్మ.రెండవవాడు చేసేది నిష్కామకర్మ.యుగయుగములవరకు నిరీక్షించుకుని ఉండడానికి అతడు సిద్ధపడి ఉన్నాడు.అటువంటి కర్మయే మహోన్నత ఫలదాయకమవుతుంది.


మనం పూజ చేసేటప్పుడు సంకల్పంలో క్షేమ,స్థైర్య,ధైర్య,విజయ,అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం,ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని గంపెడు కోరికలు కోరుతూ ఇష్ట కామ్యార్థ సిద్ధికి పూజ చేస్తున్నాం.లేదా దేవాలయాలలో చేయిస్తున్నాం. పూజ వైదికమైనా చేసేది కామ్యకర్మయే.భగవంతుని పూజించేటప్పుడు మనకేం కావాలో ఆయనకు మనం చెప్పాలా? మన యోగ క్షేమాల్ని ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతోనే మనం ఆయన్ని అర్చించాలి.ఆరాధించాలి.సేవించాలి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat