#ప్రత్యంగిరాదేవి

P Madhav Kumar

 

         అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరా దేవి అవతారం చాలా ఉగ్రస్వరూపం. ఆమె సింహముఖంతో ఉంటుంది. ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. 

       

         పూర్వం హిరణ్యకశిపుడిని చంపేందుకు, విష్ణువు నరసింహస్వామిగా అవతరించి, హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడి సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం చల్లారలేదట. దాంతో బ్రహ్మాది దేవతల కోరిక మీద శివుడు, శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఎదిరించి ఓడించి... ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. 


        ఆ సమయంలో అమ్మవారు- శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరుడికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించి స్తుతించారట. 


        అందుకనే ఆ రుషులిద్దరి గుర్తుగా ఈమెను ప్రత్యంగిరా అని పిలుస్తుంటారు. ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. 


        అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్న వారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు.


        ప్రత్యంగిరా దేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసిన వాళ్లు ఎలాంటి విజయాన్నయినా అందుకుంటారట. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది. 


        తమిళనాడు, తంజావూరు జిల్లాలోని అయ్యావడి ఊరిలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చి లాంటి 108 రకాల వస్తువులను ఉపయోగిస్తారు. హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం అమ్మవారి మహిమ.


        ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు... ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. 


        అయితే ప్రత్యంగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం, మాంసాహారం తినడంలాంటి పనులు చేయకూడదు. వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి.


         మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాలలో వారిని ఆదుకుంటాడు. అమ్మవారు కూడా అంతే!                         

  🚩 శ్రీ మాత్రేనమః 🚩

సేకరణ:-

   🌹#శుభమస్తు🌹

         🙏🕉🙏



Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat