ఆత్మకు నాశనం లేదు, శరీరానికి తప్ప...!

P Madhav Kumar

ఆయుధాలు, అగ్ని, వాయువు, నీరు మొదలైనవి ఏవీ ఆత్మను సంహరించలేవు. నింగి, నేల, నీరు, అగ్ని, వాయువు మొదలైన పంచ భూతాలతో చేసి ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటితో పాటు ఆధునిక యుగంలో అగ్నిని కూడా జోడించి తయారు చేస్తున్నారు. అణ్వాయుధాల ఈ కోవకు చెందినవే. అయితే గతంలో భౌతిక పదార్థాలను ఉపయోగించి ఆయుధాలను తయారు చేసేవారు. పూర్వం ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిని జ్వలింపజేస్తే దానికి బదులుగా వరుణాస్త్రాన్ని ప్రయోగించి జలధారలతో వాటిని ఆర్పివేసేవారు. ఆధునిక సైన్సులో దీనికి సంబంధించిన ఙ్ఞానం కనిపించదు. తుఫాను లాంటి ఆయుధాల గురించి శాస్త్రవేత్తలకు అవగాహన కూడా ఉండదు.

ఆత్మను నశింపజేయడం అసాధ్యం. మాయాశక్తికి లోబడి ఉండటం వల్ల అఙ్ఞానంతో కూడుకున్న ఆత్మ ఏ విధంగా విడదీయబడుతుందో మాయావాదులు వివరించలేరు. ఎందుకంటే జీవులందరూ అణుమాత్ర రూపులైన సనాతన ఆత్మలు అయినప్పటికీ మాయా ప్రభావితులై భగవంతుని సాహచర్యం నుంచి విడిపోయారు. నిప్పు కణికలు ఏవిధంగా అయితే పైకి లేచినప్పుడు, దానికి దూరం కాగానే ఆరిపోయినట్టు, భగవంతునిలోని సనాతన అంశాలైన జీవులు వాస్తవానికి తమ ఉనికిని కోల్పోయిన జీవాత్మలు. వరాహ పురాణంలో జీవులను భగవంతుని నుంచి విడిపోయిన అంశాలుగా వర్ణించారు. భగవద్గీత ప్రకారం కూడా ఆత్మ నిత్యం, శాశ్వతం. కాబట్టి అఙ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందినప్పటికీ ‘జీవులు తమ ప్రత్యేకమైన ఉనికిని పోగొట్టుకోవు’అనడానికి గీతోపదేశం చక్కటి తార్కాణం. కృష్ణుడి ద్వారా పొందిన ఙ్ఞానంతో అర్జునుడు ఙ్ఞానవంతుడయ్యాడే గాని భగవానుడిలో ఐక్యం మాత్రం కాలేదు.


ఇదే విషయాన్ని పార్థుడుకి పరమాత్ముడు బోధించారు. ‘ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడూ ఇద్దరును అజ్ఞానులే. ఎందుకుంటే వాస్తవానికి ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యం, శాశ్వతం, పురాతనం, శరీరం ఉనికి కోల్పోయినా ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితం, నిత్యమనియు జననమరణములు లేనిది, మార్పులేనిది, శాశ్వతమైంది, సర్వవ్యాప్తిచెందింది, చలింపనిది, స్థిరమైంది, సనాతనమైనది. ఇంద్రియాలకు కనిపించనిది... మనస్సునకు అందనిది. వికారములు లేనిది’ అని భగవానుడు తెలిపాడు.


నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః | న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||


తాత్పర్యం


“ ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు ; అగ్ని దహించలేదు ; నీరు తడపలేదు ; గాలి ఆరబెట్టనూ లేదు. ”


వివరణ


పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం.


“ దహ్యతే ఇతి దేహః ” … దహింపబడేది కనుక …


ఈ శరీరాన్ని “ దేహం ” అన్నారు.


భౌతిక శరీరం నీటితో తడిచి, చివికి, నాని పోతుంది.


గాలి భౌతిక శరీరాన్ని ఎండించ గలదు …


భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది …


కానీ “ఆత్మ” అనేది శస్త్రాలతో ఛేదింపబడదు … అగ్నిచేత దహింపబడదు …


నీటి చేత ఏమాత్రం తడుపబడదు.


పాంచభౌతిక శరీరాన్ని నాశనం చెయ్యగలవి అన్నీ కూడానూ …


ఆత్మను ఏమీ చేయలేవు !


అంటే … దేహం యొక్క ధర్మం వేరు .. ఆత్మ యొక్క ధర్మం వేరు.


దేహం యొక్క గుణం వేరు … ఆత్మ యొక్క గుణం వేరు.


ఈ భౌతిక శరీరం వేరు … ఆత్మపదార్థం వేరు.


దేహం వేరు … దేహి వేరు!


రెండూ వేరు వేరు!


ఒకటి నశించేది ;


ఇంకొకటి నిత్యమైనది … నశించనిది.


శరీరం పుడుతుంది, చస్తుంది.


కానీ ఆత్మపుట్టదు, చావదు.


“ ఆత్మ ” అన్నది నిత్యమైనది …


మార్పులు చెందనిది …


సర్వవ్యాప్తమైనది … సత్యమైనది.


ఇదంతా తెలుసుకోవాలంటే


ధ్యానం చెయ్యాలి …


అనుదిన ధ్యానాభ్యాసం చేయాలి.


ప్రతి రోజూ … ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి … ఎప్పుడైనా సరే! కళ్ళు రెండూ మూసుకోవాలి !


శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి … చిత్తవృత్తులను నిరోధించుకోవాలి !


అప్పుడే మనకు తెలుస్తుంది…


మనం శరీరాలం కాదు, ఆత్మపదార్థం అని !

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat