*విశ్వభాష మౌనం!**మౌనమూ ఒక భాషే!*

P Madhav Kumar


*నోరు మూసుకు కూర్చుంటే, గొంతు విప్పకుండా ఉంటే దాన్ని ఏమంటారు? మౌనం అంటారు సామాన్యంగా.*


*అయితే ఇది మౌనం కానేకాదు. మరికొందరు మౌనంగా ఉన్నామంటూ కాగితాల మీద రాసి చూపిస్తుంటారు.* 


*అంటే మాట్లాడాల్సిన దానిని రాయడం ద్వారా తెలియజేస్తున్నారన్నమాట.* 


*సంజ్ఞల ద్వారా కూడా కొందరు భావ వ్యక్తీకరణ చేస్తుంటారు. నవ్వడం, వద్దని, అవుననీ ఇలా ఎన్నో సంకేతాలు ఇస్తుంటారు.*


*మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం మౌనం పంచేంద్రియాలకు సంబంధించినది. మన దేహంలోని పంచేంద్రియాలు మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి.*


*శరీరం, కళ్లు, చెవులు తమ తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి. మొదటి జ్ఞానేంద్రియం శరీరం. అంటే మన కాళ్ళు చేతులు ఇలా అన్నింటి సమూహం. ఇవి మౌనం వహించేందుకు శరీరాన్ని స్థిరంగా ఉంచే మార్గాన్ని సుగమం చేస్తాయి. శరీరంలో అత్యంత ప్రధానమైన ఇంద్రియం కన్ను. చూపు మనసును ఇట్టే కదిలిస్తుంది. మనస్సు చలిస్తే మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కదులుతాయి. మనస్సు బుద్ధిని కదిలిస్తుంది. బుద్ధి గట్టిదయితే అది మనస్సుని బంధించి, జ్ఞానేంద్రియాలను కదిలిస్తుంది. ఒక వేళ మనస్సుకు లొంగిపోతే బుద్ధి లేని పనులు చేయాల్సి వస్తుంది.* 


*మీరు వినే ఉంటారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ”నీకు బుద్ధిలేదా?” అని మందలిస్తాం. చేయకూడని పనిచేస్తే.. ”నీ బుద్ధి గడ్డి తిందా!” అంటాము.*


*కళ్లకు శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్బుత, శాంత రసాలను చూపించగల శక్తి ఉంది. కళ్లు నవ్వుతాయి, కోప్పడతాయి. మోహం కురిపిస్తాయి. తపఃస్సంపన్నుడైన విశ్వామిత్రుడంతటి వాడే మేనక వలలో పడి తన మొత్తం తపస్సుని పాడు చేసుకున్నాడు. ఇక మిగిలినవి నాలుక , చెవులు, ముక్కు. వీటి విషయం అందరికీ తెలిసిందే. ఇవి కూడా మనస్సుపై విపరీత ప్రభావాన్ని చూపిస్తాయి. విన్న వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి మనస్సు కలవరపడుతుంది. తద్వారా నాలుక ఒక్కోసారి విపరీతమైన తప్పుడు మాటలు పలుకుతుంది. ఆ మాటలే ఒక్కో సారి జీవన గమనాన్ని మార్చివేస్తాయి కూడా. అందుకే అన్ని వేళలా మనసును మౌనంగా ఉంచుకోవాలంటే ముఖ్యంగా ఈ అయిదింటి మీదా శ్రద్ధ ఉండాలి. అదుపు కావాలి. వాటిని నియంత్రించు కోగలిగితేనే మనకు మౌనం సాధ్యపడుతుంది. అందుకే తత్వవేత్త్తలు ”మౌనమె నీ భాష ఓ మూగ మనసా” అన్నారు.* 


*దీపాన్ని మీరు చూశారా! నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూరా కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప మనస్తత్వం కలవారు కూడా అంతే నిశ్శబ్దంగా ఉంటారు. వారు సాధించిన విజయాలే వారు లోకానికి తెలిసేలా చేస్తాయి*


*ఒకసారి డాక్టర్‌.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అరుణాచలం వెళ్ళి రమణ మహర్షిని దర్శించారు. అయన రమణుల ముందు ఎంతో సేపు కనులు మూసుకుని మౌనంగా కూర్చున్నారు. రమణులు మాట్లాడలేదు. నేరుగా వారు మాట్లాడుకోలేదు. రాధాకృష్ణన్‌ వెళ్ళిపోయారు. అయితే తన ప్రశ్నలన్నిటికీ మహర్షి సమాధానమిచ్చారని రాధాకృష్ణన్‌ గారే దీని గురించి ఒక చోట రాశారు. దీనిని బట్టి మౌనంలో ఎంతటి అద్భుత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది.*


*తాత్విక జ్ఞాన సముపార్జనలో మౌనం ముఖ్య పాత్ర వహిస్తుందన్నమాట వాస్తవం. తాత్విక జ్ఞానులు అడవుల్లో ఉన్నా, ఎక్కడో పర్వత శ్రేణుల్లో ఉన్నా, ఎవ్వరితోనైనా, ఎప్పుడైనా సంభాషించగలరన్న విషయం మనకు పలువురు మహాత్ములైన దివ్య పురుషుల జీవిత విశేషాలను తెలుసుకుంటే బోధపడగలదు. అందుకే జిజ్ఞాసులైనవారు సదా శాంతిసూచక మైన, శుభప్రదమైన కాల వినిమయానికి మౌనం శ్రేయోమార్గంగా ఎంచి ఆద్యాత్మిక మార్గంలో సాగిపోవాలి. తద్వారా దైవీశక్తులు సైతం వారికి తెలియకుండానే సంక్రమించే అవకాశం ఉందంటారు.*


*శాస్త్త్ర వచనం ప్రకారం కూడా కొన్ని సందర్భాల్లో మౌనం పాటించాల్సి ఉంది. ఇతరులకు వెల్లడించకూడని, వారికి అనవసర విషయాలని వారికి చెప్పవలసిన అవసరం లేని సమయాల్లో మౌనం పాటింపు అవసరమనేది వారి భావమై ఉంటుందని కొందరి అభిప్రాయం. అయితే మాట, మౌనం రెండూ కూడా మానవ జీవితంలో మాత్రమే కనిపించే అద్భుత దశలు. పెద్దల మాటను రజతంగాను, మౌనాన్ని స్వర్ణంగాను విశ్లేషించారు విజ్ఞులు.*


*మౌనంగా ఉన్నప్పుడే చేతులు కూడా దక్షతను ప్రదర్శించే అవకాశం ఉంది. మాటలు తగ్గించి మనసును లక్ష్యంపై పెడితే సరైన ఏకాగ్రత కుదురు తుంది. బాహ్య మౌనం కన్న మానసిక మౌనమే ముఖ్యం. అటు వంటి స్థితి అంతులేని మనశ్శాంతినే కాక తపస్సుగా మారి చివరకు అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది.* 


*కఠోపనిషత్తులో చెప్పి నట్లుగా ఎవరైతే ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తారో వారి కోసం అమృత రాజ్య ద్వారాలు తెరచి ఉంటాయి.

    

.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat