*మానవ జీవితం దాన ఫలం*

P Madhav Kumar


దానము చేసే గుణము సద్గుణము. ఇది మానవ జాతికే దక్కిన సుగుణం. ఒక వస్తువు మీద లేక పదార్థము మీద తనకున్న హక్కును వదులుకొని ఇతరులకు ఆ హక్కులు కల్పించడం. ఒకరు ఇచ్చిన దానిని మరొకరు స్వీకరిస్తే దానమవుతుందని యాజ్ఞవల్కుడు చెప్పాడు. దానం వలన చిత్తశుద్ధితో పాటు మనిషికి మనిషిగా గుర్తించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మనుషులకే కాదు సర్వజీవులు ఒక్కటేననే సమభావ, సమానత్వం ప్రదర్శించటం దానము అవుతుంది. గత జన్మలో మనం దాన ధర్మాలు చేయకపోవడం వల్ల ఈ జన్మలో దారిద్య్రం ప్రాప్తిస్తుంది. దారిద్య్రం వల్ల బుద్ధి చెడి పాపకార్యములు చేయుట జరుగుతుంది.


ఇలా పాపాలు చేయుట వలన మళ్లీ మరో జన్మలో కూడా దరిద్రులుగా పుడతారు. కనుక దరిద్రపు జీవితం రాకుండా ఉండాలంటే మనకు తోచినది మన దగ్గర ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేయడం ప్రతి మానవుడు తన ధర్మంగా భావించాలి. మానవులందరూ హాయిగా జీవితాన్ని గడిపేందుకు ఏర్పాటు చేసిన ఒక పవిత్ర కార్యం దానం. ఈ దానం కొందరికి భుక్తి ప్రదాయకమయితే మరికొందరికి ముక్తి ప్రదాయకం. దానం ఇచ్చేవారి ఆయుష్షు పెరుగుతుంది. కానీ పుచ్చుకునే వారి ఆయుష్షు మాత్రం క్షీణించదు. దానం విలువను గురించి అగ్నిపురాణంలో అగ్నిదేవుడు వశిష్టుడికి వివరించాడు.

దానం త్రివిధ రూపంగా చేయబడును.


శక్తిలేని వానికి యోగ్యునికి తగినచోటు తగిన సమయంలో దానము చేయుట కర్తవ్యమని నిశ్చయముతో చేయు దానం సాత్వికము. దానం చేయటం వ్యక్తిగా నీ ధర్మమని దానం చేయాలి. పుణ్య కోసమని దానం చేస్తే అది ప్రత్యుపకారమవుతుంది. కనుక దేనినో ఆశించి దానం ఇవ్వకూడదు. ప్రత్యుపకారము ఫలము ఆపేక్షించి అని ఇష్టముగా చేసే దానము రాజసం. రజోగుణ స్వభావులు దానం చేస్తే సంస్థగాని, దేవాలయముగాని తను చేసే దానం వలన తనకు కీర్తి రావాలని ఆశిస్తాడు. ఆ విధమైన దానం దానమే కాదని శాస్త్రవచనం. ప్రదేశము కాలముతో పని లేకుండా అపాత్రులకు అమర్యాద పూర్వకంగా ఇచ్చు దానం తామసం అన్నారు.


రాజస, తామస, సాత్విక దానములలో సాత్విక దానము ఉత్తమమైనదిగా గీతలో శ్రీకృష్ణుని సందేశం. దానము చేసేటప్పుడు సత్కారభావముతో మర్యాద పూర్వకంగా ఇవ్వాలి. పాపఫలితంగా దరిద్రుడైన వాడు, దీనుడు మూఢుడు అపాత్రులైన వారికి దానధర్మాలు చేయడం దాతకు అన్ని విధాలా శ్రేయస్కరం. దానం చేయడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్న దానికి సవరణలు కూడా ఉన్నాయి. యోగ్యునికి దానం చేయడం వలన దాతయొక్క సంపదలు అభివృద్ది చెందుతాయి.దాని వలన దాత అనేక పుణ్యకార్యాలు చేయవచ్చును.


దానం చేయుటచే పుణ్యం లభిస్తుంది. పుణ్యకార్యాలు చేయటం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. దాని వలన తిరిగి ఉత్తమమైన జన్మ లభించి సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చును. కృతయుగం నందు తపస్సు త్రేతాయుగం నందు బ్రహ్మజ్ఞానము, ద్వాపర యుగమందు యజ్ఞయాగాదులు, ఈ కలియుగంలో దానం ఉత్కృష్ట ధర్మములని నాలుగు యుగధర్మాలుగా మనుస్మృతి చెపుతుంది.


దానము, తపస్సు ఆచరించదగినవే గాని విడువదగినవి కావని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించాడు. ఈ లోకంలో విధి విధానముగా సత్పాత్రుని కీయబడిన దానము అక్షయ వలవృ సదృశ్యమైనదని ఆదిశంకరాచార్యుల వారి ఉవాచ. నిస్వార్థ దానముతో భగవదర్పణ బుద్ధితో దానం చేసిన భగవత్రాప్తి సిద్ధించును.


*సేకరణ*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat