ధర్మ సూక్ష్మములు మరియు సనాతన ధర్మమము - Dharma's subtle and classical dharma

P Madhav Kumar

సనాతన ధర్మమము మరియు ధర్మ సూక్ష్మములు.:

 వేదః అఖిలః ధర్మమూలమ్.

అహింసా పరమోధర్మహః , ధర్మోరక్షతి రక్షితఃధర్మము అనగా ఏమి? ఇది ఎప్పుడు పుట్టినది, ఎప్పటినుండి ఉంది? మనది సనాతన ధర్మము. సనాతనము అనగా ఎప్పుడు పుట్టినదో ఎలా పుట్టినదో తెలియనిది నాలుగు యుగములకంటే ముందునుంచి ఉన్నది కావున ఇది సనాతనము.

ఈ విశ్వములో అనగా నాలుగు యుగములలో అందరూ (ఎంతటి వారైనా) పాప పరిహారార్థం ధర్మపరులై,ధర్మవర్తనములో జీవించువానే ఆశ్రఇస్తారు. ఎందుకనగా ధర్మాచరణ పరులను, ధర్మాత్ములను దర్శించి వారి దివ్య ఆశీస్సులు పొందుటవలన మనము చేసిన పాపములు పఠాపంచలైపోతాయి. “ధర్మేణ పాప మపనుదతి” కదా. మరియు ధర్మమే ఈ జగత్తుకు మూలాధారము. “ధర్మో విశ్వస్య జగతః” అన్నారు. అంటే ఈ సృష్టి, స్థితి, లయములకు ధర్మమే కారణము ధర్మమే ఆధారము.


పరమోత్కృస్టమైనది ధర్మము ధర్మాన్ని పట్టుకోవడం, ఆచరించడం అంత సులభముకాదు. ధర్మాని పట్టువదలకుండా పట్టుకొని ఆచరించాలంటే అందుకు చాలా ఓర్పు, సహనం, ధైర్యము, మనోనిబ్భరము కావలయును. ఎన్నో క్లేశములను, మనస్తాపాలను ఎదుర్కోవలసి వస్తుంది. కావున ఓర్పు, సహనము మనోనిబ్భరము లేనివారు ధర్మాచారణ చేయలేరు. అదియునూ కాక ధర్మము తన ఫలములను వెంటనే ఇవ్వదు. ఎంతో ఓరిమి వహిస్తేకాని ఆ ఫలములు మనకు అందవు. మరియు ఆ అందిన ధర్మ ఫలములు శాశ్వితములు.

 “ధర్మోఏవహతో హన్తి ధర్మోరక్షతి రక్షితః,

తస్మోద్ధర్మన త్యజామి మానోధర్మో హాతోవధీత్.”

యజుర్వేదాంతర్గత, తైత్తరీయ, శిక్షావళ్ళి నుండి.


ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో అనగా మాటలలో కాదు, ధర్మము తెలిసి ఉండడముకాదు, చేతలలో ధర్మాని జీవితములో ఆచరించి పట్టువిడవకుండా ధర్మానిపట్టుకొని జీవిస్తారో వారిని సర్వకాలసర్వావస్తలయందు ధర్మము వారికి అంగరక్షకుడుగా నిలబడి కాపాడుతుంది. ఎవరైతే ధర్మాన్ని తప్పి ధర్మానికి క్లేశము, హాని కలిగిస్తారో వారిని ధర్మమే నశింపచేస్తుంది. ఇది వారు వీరు చెప్పినమాట కాదు సాక్షాత్తు వేదమాత వేదములో యజుర్వేదములో, తైత్తరీయోపనిషత్తు లో, శిక్షావళ్ళిలో చెప్పిన వేదప్రమాణము.

ధర్మబద్ధముగా జీవించాలి, వేదప్రమాణము కానీ పనులను, కుకర్మలను చేయరాదు. “కుశయనం, కుస్త్రీ,కుభోజ్యం వ్రజః” దుష్టమైన చోట నిదురించరాదు, దుష్టస్త్రీ సాంగత్యము చేయరాదు, దుష్టాహారము తినరాదు. వీటివలన మరణము అనారోగ్యము కలుగును.

ధర్మయుతముకాని, వేదమంగీకరించని సంపాదన, సుఖము, సంతోషము, భోగము, విద్యలు నిరుపయోగములు. నిరుపయోగమేకాక వాటివలన వచ్చు ఆ తాత్కాలిక సుఖము, భోగము, సంతోషము, సంపాదనల పాపము కలుగడమేకాక వీటివలన జీవితము నరకప్రాయమౌతుంది. ఆ పాపము మనలను మాత్రమేకాక మన వంశాన్ని (వంశములో ముందు తరాలవారిని వెనుక రాబోవు వంశోద్ధారకులను) కట్టి కుదుపుతుంది. కావున

 “శ్రోత్రత్వక్కు చక్షురవ్సు జిహ్వఘ్రాణ జ్ఞానేంద్రియాణి,

వాక్పాణి పాదయూ పస్థాఖ్యాని కర్మేంద్రియాణి”

ఐదుజ్ఞానేంద్రియములు, ఐదుకర్మేంద్రియములు, ఐదుప్రాణములు, ఒక మనస్సు, ఒక బుద్ధి వీటితో నడచుచున్న ఈ ఉపాధిని చాలాజాగ్రత్తగా సర్వకాల సర్వావస్తలయందు అనగా ధన సంపాదనను, వాక్కును, కర్మను (చేసే పనులు) మనసును, చూపులను, వాసనలను ధర్మమార్గములో ఉండునట్లు జీవించే విధముగా మలచుకోవాలి. ఈ విధముగా వేదప్రోక్తముగా, పరమాత్మ మెచ్చుకొను విధముగా జీవించే జీవితము ధన్యము.


పంచమవేదమని పిలువబడే మహాభారతములో శౌనకుడు ధర్మరాజుతో ధర్మము గురించిన ధర్మవిచారము ఏమనగా విషయవాంఛలచేత రాగము, దానిచే కామము, దానిచే తృష్ణ, దానిచే సర్వపాపములు కలుగును. అర్థమే (డబ్బు) అన్ని అనర్ధములకూ మూలము. అర్ధము వలన లోభ, మోహ, మద, మాత్సర్య, గర్వ గుణములు వృద్ధి చెందును. ఈ ధనాశచే ధర్మమునకు హాని తలపోయును. కావున ధర్మవిదితమైన ధనసంపాదనే యోగ్యము శ్రేయోదాయకము.


మహాభారతములో లోశమ మహర్షులవారు ధర్మరాజుతో ధర్మాధర్మ విషయములను ఈ విధముగా నుడివిరి. అధర్మపరులకు అభివృద్ధి నేనువెంటనే కలుగును. కానీ అది క్షణికము. అధర్మమును ఆశ్రఇంచినవాడు దుష్ట బుద్ధితో ఎదుటవారిని గోతిలో పడవేయడానికి ఒక పెద్ద గొయ్యి తీసి ఉంచుతాడు. కానీ ఆ గోతిలో తానే పడి విలవిలలాడుతాడు. అధర్మము వలన ధనము,(అధికారము), దానివలన దర్పము, స్వాభిమానము, దానివలన క్రోధము, దానివలన కలిగిన గర్వముతో విచక్షణా హీనులై, లజ్జాహీనులై శీలమును కోల్పోతారు. ఎప్పుడైతే శీలమును కోల్పోతారో అపుడు లక్ష్మీదేవి వారిని వీడి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడముతో ధైర్యము వెళ్లిపోతుంది. అందువలన సర్వమూ కోల్పోయి అష్ట దరిద్రు లవుతారు. మరి ధర్మమును నమ్ముకొని ధర్మాచారరణతో జీవించువారు ఎన్నో కష్టాలను, అవమానములను, మనస్తాపము లను ఎదుర్కొని వాటిని భరిస్తారో వారు అధర్మ పరులకంటే వేయి రెట్లు సుఖ సంతోషములను పొందుతారు. అలా పొందిన సుఖ సంతోషములు శాశ్వితమైనవి.

మార్కండేయ మహర్షులవారు ధర్మరాజుతో యుగధర్మములను గురించి ఈ విధముగా వివరించారు. కృత యుగములో ధర్మము నాలుగు పాదములతోనూ, త్రేతాయుగములో ధర్మము మూడు పాదములతోనూ, ద్వాపరయుగ ములో ధర్మము రెండు పాదములతోనూ, కలియుగములో ధర్మము ఒంటి పాదముతోనూ వర్తించును. మరియు కొన్ని కలియుగ లక్షణములను ఈ విధముగా వివరించారు. ఆవు పాలు తరిగి శంకరజాతి పాడి పెరుగును. నవరసముల రుచి తగ్గును. జలచరములు భోగ్య, భోజ్య వస్తువులగును. ధనము కొరకు విప్రులు శూద్ర సేవలతో, వేదపఠనము మరచి సంద్యావందనము, నిత్యపూజాది క్రతువులకు తిలోదకాలిచ్చి మదోన్మత్తులై మధుపానము, మాంస భక్షణము,వేదవిక్రయము, చేయుచుందురు. భ్రూణహత్యలు, స్త్రీ పతనం, వేదధూషణం, కపటవ్యాపారములు ఇత్యాది అకృత్యములు చేయుటలో ఉత్సాహవంతులై వర్ణాశ్రమ వ్యవస్థను పూర్తిగా పతనము చేయుచుందురు. కృతయుగమున తపముచేత, త్రేతాయుగమున యజ్ఞయాగాదులచేత, ద్వాపరయుగమున కర్మచేత,కలియుగమున కేవలము భాగవన్నామ జపముచేత మరియు వేదప్రోక్తమైన ధర్మాచరణముచేత ముక్తి పొందగలరని సెలవిచ్చారు.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat