ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు. మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది. మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.
అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.
కొన్ని ఇళ్ళు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులుపడవలసి రావచ్చు. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు వుంటాయి. ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం వుండదు. అయినా మనలో అంతర్లీనంగా వున్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.
అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము. అందుకని శాస్త్రజ్ఞులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు. అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.