కర్ణుడు కేవలం అధర్మ పక్షాన పోరాడడం మాత్రమే చేయలేదు. అతను చేసిన ఒక ఘోరమైన పాపమే మహాభారతంలో కురుక్షేత్ర యుధ్ధానికి కారణం.
అతను చేసిన పాపం ఒక పతివ్రతా మూర్తిని ద్రౌపదీ మాతను నిండు సభలో పర పురుషుల ముందు వివస్త్రను చేయమని ఒక వికృతమైన సలహాను ఇవ్వడం. ఒకసారి ఊహించుకోండి ఎవరైనా ఆడకూతురిని నడి బజారులో బట్టలు ఊడదీస్తే ఎలా ఉంటుంది? ఆటలో ఓడిపోయి బానిసలు కావొచ్చు కానీ అంతమాత్రాన ఇటువంటి దారుణం చేస్తారా ఆ తల్లికి?
అదే అతని పతనానికి నాంది. ఆ విధముగా చేయడానికి కారణం కూడా ద్రౌపదీ స్వయంవరంలో ఓడిపోవడం, పైగా అతని అసూయకు కారణమైన అర్జునుడు గెలిచి ద్రౌపదీ మాతను పొందడం. అసలు భారతంలో కర్ణుడి పరిచయమే అర్జునుడి మీద అసూయతో మొదలౌతుంది. నేను అర్జునుడి కంటే గొప్పవాడని అనుకుని వస్తాడు. అది చూసే గోతి కాడ నక్క లాగా ఉన్న దుర్యోధనుడు వెంటనే అంగ రాజ్యానికి రాజును చేసేస్తాడు. ఇక్కడ పాండవులు న్యాయంగా అడ్డుకోవచ్చు నువ్వేవడవు రాజ్యం ఇవ్వడానికి అని. ఎందుకు అంటే రాజ్యం దుర్యోధనుడిది కాదు. అంటే పాండవుల దయ కూడా ఉండబట్టే కర్ణుడికి రాజ్యం వచ్చింది. చాలా మంది పసిగట్టని విషయం ఇది.
అర్జునుడు అంటే విపరీతమైన కుళ్లు. తనకి దక్కని ద్రౌపదీ దేవి అర్జునుడికి దక్కింది కాబట్టి ఆ కుళ్ళుకి వివస్త్రను చేయమని సలహా ఇచ్చాడు. ఇది ఒక్కటీ చాలదా అండి అతను ఎంత దుర్మార్గుడో చెప్పడానికి? ఎందుకు కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఒకడు? ఇందుకే. ఎన్ని దాన ధర్మాలు చేస్తే ఈ పాపం పోతుంది?
చాలా సార్లు అర్జునుడి చేతిలో ఓడిపోయిన ఇంకా నేను ఈకేస్తా, పీకేస్తా అంటూ దుర్యోధనుడితో ప్రగల్భాలు పలికాడు. నిజంగా మంచివాడు అయితే, లేదా ఏ మూలనన్నా కొంచెమైనా మంచితనం ఉంటే మొత్తం మహాభారతంలో ఎక్కడైనా ఓ దుర్యోధనా యుధ్దం మంచిది కాదు, ఎందరో ప్రాణాలు పోతాయి యుధ్దం విడిచి పాండవులతో రాజ్యం పంచుకో అని చెప్పాడా? లేదు. అర్జునుడిని చంపేసి వీరుడిని అనిపించుకోవాలి అనే గర్వమే, ఆ ప్రగల్భాలే దుర్యోధనుడికి కర్ణుడి మీద విపరీతమైన నమ్మకం కలిగించి ఎందరు చెప్పినా వినకుండా యుధ్దం వరకూ తీసుకుని వెళ్ళింది.
అసలు కర్ణుడే గనక లేకపోతే దుర్యోధనుడు యుద్ధమే చేసేవాడు కాదు. ఎందుకు అంటే అర్జునుడిని ఎవరూ ఓడించలేరు అని దుర్యోధనుడికి తెలుసు. కర్ణుడు ఓడించేస్తాడు అని నమ్మకం. ఆ గుడ్డి నమ్మకమే కురుక్షేత్ర యుద్ధానికి కారణం కొన్ని లక్షల మంది సైనికులు, ఎందరో వీరుల మరణం.
ఇంత చేసినా ఖర్మ ఫలితముగా ఒక వీరుడి లాగా చావలేకపోయాడు కర్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు అతను భూమిపై, నిస్సహాయంగా ఉండగా అర్జునుడిని బాణం వేసి కొట్టమని చెప్పాడు ఎందుకు? ఏ వీరుడిని, సూరుడిని అని విర్రవీగాడో ఆ వీర మరణమే భగవంతుడు ఇవ్వలేదు అతని పాపానికి.
కాబట్టి మహాభారతంలో అసలు కర్ణుడు లేకపోతే ఏమీ లేదు. ద్రౌపదీ మాత వస్త్రాపహరణం లేదు, ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామం లేదు.