జలదానం ఎంతో పుణ్యమిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలం ఒక్క జల దానం వలన వస్తుందని చెప్పబడింది. అందుకే ప్రతి చోటా చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తున్నదే. ఈ చలివేంద్రాలు పితరులకు, భగవంతుడు కి, మనుష్యులకు, అందరికీ ష్టమైనదే. పూర్వికులంత పుణ్య లోకాన్ని పొందుతారు. నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది.
జలదానం ప్రాముఖ్యత గురించి స్కాందపురాణంలోని ఒక కధ ఉంది.పూర్వకాలంలో సూర్యవంశంలో హేమాంబరుడనే రాజు రాజ్యపాలన చేసేవాడు. అతడు గోదాన, భూదాన, సువర్ణదానాది పధ్నాలుగు రకాల దానాలు చేస్తూ అపరకర్ణునిగా పేరుగాంచాడు. అయితే అత్యంత ప్రశస్తమైన జలదానాన్ని మాత్రం విస్మరించాడు. కులగురువైన వశిష్ఠుడు ఉద్భోధించినా, లెక్కచేయక కొంతకాలానికి గర్విష్ఠియై సద్బ్రాహ్మణులను లెక్కచేయక, సజ్జనులను విడిచి దుష్టులకే పెద్దపీట వేసి గతితప్పడం వల్ల తరువాత వరుసగా మూడుజన్మలలో గ్రద్దగాను, మూడు జన్మలలో కాకిగాను, ఐదుజన్మలలో కుక్కగాను జన్మించి, అటు పిమ్మట మిథిలానగర రాజైన శ్రుతకీర్తి ఇంట బల్లియై జన్మించి గోడమీద ఈగలను, పురుగులను తింటూ కాలం గడుపుతున్నాడు.
ఒకసారి శ్రుతకీర్తి ఇంటికి విద్యాధరుడు అనే ఋషిపుంగవుడు మార్గాయాసం తీర్చుకోవడానికి రాగా, రాజు అతనికి పాదప్రక్షాళన చేసి ఆ జలాన్ని తన శిరస్సున చల్లుకొని, తన పరివారంపై కూడ చల్లుతుంటే అందులో రెండుచుక్కలు వచ్చి గోడమీద ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ జలమహిమవల్ల ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగి, ఆ మునిపుంగవుని పాదాల చెంత వాలి, మహాతమా! నన్ను రక్షించండి అని ప్రార్థించింది. విధ్యాధరుడు, మనిషిలా మాట్లాడుతున్న ఆ బల్లిని చూసి ఆశ్చర్యపడి, నీవెవరివని ప్రశ్నించగా, అది తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపి, తనకి ఈ విధమైన జన్మలు కలగడానికి కారణం ఏమిటి? తరుణోపాయం సెలవీయమని వేడుకుంది.
ఋషి తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకుని హేమాంబరా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక దానాలు చేసినా, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిరమైన విప్రునికి జలదానం చేయలేదు. అదికాకుండా వేదవిదులైన విప్రులను విడిచి మంత్రం రాని వేదవిహీనులైన వారికే దానాలు చేసావు. అందుకే నీకీ దుస్థుతి కలిగింది. నేను చేసిన వ్రత ఫలాన్ని నీకు ధారపోస్తాను, దానివల్ల నీకు బల్లి రూపం నుండి విముక్తి కలిగిస్తానని, తానుకొన్నిదినాలు ఆచరించిన వ్రతఫలాన్ని ధారపోస్తూ ఆ నీటిని బల్లిపై విడువగానే, అది రత్న కిరీటకేయూరాలతో మహారాజు రూపుదాల్చి విద్యాధరునికి నమస్కరించి నిలిచి, కృతజ్ఞతలు తెలుపగా, ఇంతలో స్వర్గం నుండి విమానం వచ్చి ఆ హేమాంబరుని స్వర్గలోకానికి తీసుకుపోయింది. అతడు పదివేల సంవత్సరాలు అన్నిభోగాలు అనుభవించి, తిరిగి ఇక్ష్వాకువంశంలో కాకుస్థుడుగా జన్మించాడు.
సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్నదానాల వల్ల వచ్చే పుణ్యఫలం ఒక్క జలదానం చేస్తే వస్తుందని చెప్పబడింది. వేసవికాలంలో ఎండల్లో నడిచి వెళ్లే బాటాసారుల కోసం, ఒక కుండలో నీళ్ళను ఏర్పాటు చేసి, అడిగిన వాళ్లకు ఇస్తే, అదే జలదానమవుతుంది. ఇలా జలదానం చేయడం వల్ల, దానం చేసినవారితో పాటు వారి ఆప్తులందరికీ విష్ణు సాయుజ్యం కలుగుతుంది.