కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెబుతారు. వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది. పుట్టింటికి వెళ్లినా, మరెవరైనా బంధువుల ఇంటికి వెళ్లినా తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయరాదనేది ప్రయాణ నవమి నియమం.
ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి తొమ్మిదో రోజు తిరిగి ఇంటికి రాకూడదని ప్రవేశ నవమి హెచ్చరిస్తుంది. అలాగే నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతుంది. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు. ఆడపడుచును పార్వతీదేవిగానూ, లక్ష్మీదేవిగానూ భావించడం మన సంప్రదాయం. నవమి తిథి అధిష్ఠాన దేవత దుర్గాదేవి. శక్తికి ప్రతిరూపమైన ఆడపడచును అత్తవారింటికి ఆడపిల్లను పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి పుట్టినింటికీ, మెట్టినింటికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ప్రయాణ నవమిగా చెప్పుకొనే తొమ్మిదో రోజు ఆడకూతురును అత్తగారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ప్రయాణం మంచిదికాదనే విశ్వాసం ఏర్పడింది