అక్షయ తృతీయ ఆరోజునే చందనోత్సవం ఎందుకు ?

P Madhav Kumar

 


సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజ రూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు.


ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ?

పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి , నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది. చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు.


అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి…. తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ , ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది. ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు.


ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు. అలా స్వామి వారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజ రూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat