విష్ణువు నెలకొన్న 108 దివ్యదేశాలుగా 12 ఆళ్వారులచే కీర్తింపబడ్డ వాటిల్లో, అరన్ మూల పార్థసారధి ఆలయం ఒకటి. ఇది అరన్ మూల, పతనంతిట్ట జిల్లా, కేరళలో ఉంది. ఇది కేరళ సంప్రదాయంలో కట్టబడి ఉన్నా 6-9 శతాబ్దులలో ఆళ్వారులు కీర్తించినది. ఇది విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని గుడి.
అర్జునిడికి యుద్ధంలో సహాయం చేయటం వల్ల శ్రీకృష్ణునికి పార్థసారధి అని పేరు వచ్చింది. కేరళలోని కృష్ణ ఆలయాల్లో ఇది ప్రధానమైంది. ఇతరాలయాలు – గురువాయూరు, త్రిచంబరం, తిరువర్పావు, అంబలప్పుళ. చెంగన్నూరుకు చెందిన ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది. పంచ పాడవులైదుగురు ఐదు ఆలయాలు నిర్మించారని ప్రతీతి. అవి: తిరుచిత్తట్ట మహావిష్ణు ఆలయం – యుధిష్టిరుడు; పులియూర్ మహావిష్ణు ఆలయం – భీముడు; అరన్ మూల- అర్జునుడు; తిరువాన్ వండూరు – నకులుడు; త్రికొడిథనమ్ – సహదేవుడు.
ప్రతిసంవత్సరం శబరిమలకు అయ్యప్పస్వామి తిరువాభరణాలు తీసుకొని వెళ్ళేటప్పుడు తప్పక చేసే మజిలీలలో ఇది ఒకటి. ట్రావన్కూర్ మహారాజు అయ్యప్పన్ కిచ్చిన ’తంగ అంగీ’ ఇక్కడే భద్రపరచబడి ప్రతి ఏడు మండల కాలం లో శబరిమలకు చేరుతుంది. నాలుగు ద్వారాలకు పైన నాలుగు గోపురాలున్నాయి. పంపాతీరానికి తూర్పు ద్వారం నుంచి 18 మెట్లు, ఉత్తర ద్వారం నుంచి 57 మెట్లున్నాయి. ఇక్కడున్న చిత్రాలు 18 శ. కు చెందినవి.
ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు, కేరళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం పగలు 4- 11 దాకా, సాయంకాలం 5-8 దాకా తెరిచి ఉంటుంది.