అమృత బిందువులు - 14 ఆలోచనా తత్వం - 6

P Madhav Kumar


*ఆలోచనా తత్వం - 6*

వైద్యుని వద్ద , న్యాయవాదివద్ద అసత్యమాడనేకూడదు ! అది మనకే హాని.


చింతపండును , ఉప్పును చేతిలోకి అందుకోనేకూడదు ! అది శత్రువర్ధనం.


నీటితో ముగ్గులు వేయనేకూడదు ! అది అరిష్టదాయకం. 


బాధ్యతను గుర్తించక హక్కును గూర్చి అడగనేకూడదు ! అది భావ్యం కాదు.


తనకుమాలిన దానము చేయనేకూడదు! పిదప కష్టపడవలసి వచ్చును.


ఎంతకోపముండినను శాపనార్థాలు పెట్టనేకూడదు ! అది మార్చలేని దగును.


కంటికి కనపించినవన్నియు నిజమని నమ్మనేకూడదు ! అది అవివేకం.


ఆప్యాయంగా పలకరించేవారిని అవమాన పరచనేకూడదు !


వేదశాస్త్ర వచనములను ఉల్లంఘించనేకూడదు ! అదియే పెద్దల మాట.


ఆపదలో యుండు వానికి సాయపడుటకు వెనుకాడనేకూడదు !


చేసినతప్పును ఒప్పుకొనుటకు సిగ్గుపడనేకూడదు ! అదియే సంస్కారం. 


అధికారియని అందరిని బెదరించనేకూడదు ! అది అధికార దుర్వినియోగం.


సిరిసంపదలతో ఇతరుల స్థితిగతుల కొలవనేకూడదు ! అది అహంభావం.


ఆకలిలేని వారిని భోజనం చేసితీరాలని బలవంతముచేయనే కూడదు !


ఆడంబరానికై ఆహారపదార్థాలను వృధా చేయనేకూడదు ! అది అన్యాయం.


తెల్లనివన్ని పాలు అని అనుకోనేకూడదు ! అది అమాయకత్వం


నల్లనివన్ని నీరుఅనే నిర్ణయానికి రానేకూడదు ! అది అవివేకం.


ఎవరోతోడు వస్తారని ఎదురుచూసి మోసపోనేకూడదు ! అది చవటతనం. 


చెవిటివాని చెవిలో శంఖం ఊదనేకూడదు ! అది నిష్ ప్రయోజనము.


సర్కారు పన్నులు కట్టక యుండనేకూడదు ! అది మోసమగును. 


న్యాయము తెలియదని చెప్పనేకూడదు ! అది దోషమగును.


చట్టము తెలుసుకొనక యుండనేకూడదు ! అది శిక్షార్హం.


ధర్మం తప్పి ప్రవర్తించనేకూడదు ! అదియే కర్తవ్యం.


అమాయకత్వమును ప్రదర్శించనేకూడదు ! అది అవివేక లక్షణం. 


అజ్ఞానాంధకారములో మునిగిపోనేకూడదు ! అది దారితప్పించును.


అహంకారమునకు వాహనమై యండనేకూడదు ! అది దారిమళ్లించును.


దురలవాట్లకు బానిసై పోనేకూడదు (అది పతనానికి నాంది. 


సంస్కార హీనుడై ప్రవర్తించనేకూడదు ! అది కుసంస్కారమగును.


ఆశ్రయించిన వారిని కాపాడుటకు వెనుకాడనేకూడదు ! అది స్వధర్మం. 


ఏ వేళలోనైన , ఎన్నికష్టాలొచ్చినా... దైవనమ్మకాన్ని మాత్రం కోల్పోనే కూడదు ! అది మన కష్టాలకు పరిహారం కానేకాదు.


ఇలవేల్పుకు మించిన దైవము లేదందురు. కావున ఇలవేల్పుకే తొలిపూజ. 


హరిహరులకు భేద మెంచనేకూడదు ! అది మోక్షానికి అడ్డుకోలగును.


పరమతదేవతలను దూషించరాదు ! సర్వదేవతలు సమమే.


ఇతరుల నేరాలను వ్రేలెత్తి చూపనేకూడదు ! తక్కిన మూడు వ్రేళ్ళు నిన్ను చూపుచున్నదను సంగతిని మరచిపోనేకూడదు.


పరభాషల యందు అయిష్టత చూపనేకూడదు ! అన్ని భాషలు సమమే.


పరోపకారం చేయుటకు వెనకాడనేకూడదు ! అది మన ఆదర్శ ధర్మమగును.


పంతాలకు , పట్టింపులకు పోనే కూడదు ! అది ధననష్టాని కలిగించును. 


పనికిరాని పనులను ఎప్పుడూ చేయనేకూడదు ! అది కాలవ్యయమగును.


ఎవ్వరినీ పరిహాసమాడనేకూడదు. తదుపరి అది మనకే హానికరం.


మగ సరసమాడనే కూడదు ! అది అనర్థానికి దారితీయును.


తెలియని విషయాన్ని గూర్చి వాదులాడనేకూడదు ! అది అపాయకరం.


ఏవిషయాన్ని మరచిపోయానని చెప్పనే కూడదు ! అది మందబుద్ధి కలవారి లక్షణం.  విజ్ఞులు ఏవిషయాన్ని మరచిపోరు.


చపల చిత్తంతో ఏపనియు చేయనేకూడదు ! అది కుటిల సంస్కారం.


అంతట భగవంతుడుండి వీక్షిస్తున్నాడన్నది మరవనేకూడదు ! ఇది నిజం.


మట్టిగుఱ్ఱం యెక్కి నదిని దాటే ప్రయత్నం చేయనేకూడదు ! అది అవివేకం. 


అల్పులను నమ్మి మనపనిని అప్పగించనేకూడదు ! అది పనిచేటగును. 


కాలం విలువ తెలియక కాలక్షేపం చేయనేకూడదు ! అది అవివేక లక్షణం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat