*లౌకిక తత్వం - 3*
ప్రలోభము మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారేటట్లు చేయగలదు.
ప్రలోభము ఎదుటి వారిని పతనం చేయడమే గాక తనను కూడా పతనం చేయగలదు.
బాధలు గల మానవుడు సలసలకాగే పొంగు నీటితో సమానము. చల్లని నీటితో వేడి నీటి పొంగును తగ్గించినట్లు బాధలు గల మానవునికి అమృతాన్నిచ్చే చల్లని మాటలతో బాధలను తగ్గించవచ్చు.
కష్టాలలో క్రుంగుచున్నావని , కనిపించేదంత కటిక చీకటి అని భ్రమపడకు , సహనముతో పోరాడి కటిక చీకటి తెరలు ప్రక్కకు తొలగించుకో. ఎటు చూచిన వెలుగు రేఖలు అగుపించగలవు.
అంధకారాన్ని చెరపి , ప్రవర్తనను నేర్పించి విజ్ఞానాన్ని పెంచేదే విద్య.
అనురాగం అనుబంధాన్ని పెంచినట్లు , ఆధ్యాత్మికం శుభాలను పెంచగలదు.
గాలి వలన మంట పెరిగినట్లు ధనం వలన అహంకారం ఎక్కువ కాగలదు.
నెరవేరని కోరిక మానని పుండులాంటిది. మానని పుండు ఎంత బాధపెట్టగలదో , నెరవేరని కోరిక అంతే బాధపెట్టగలదు.
ఆసరా మనిషి ఉన్నతిని పెంపొందించడమే కాకుండా వెలుగును కూడా చూపగలదు.
రౌద్రము మండే మంటలాంటిది. మండే మంటను చల్లని నీరు ఆర్పినట్లు రౌద్రమును కమ్మని మాటలతో తగ్గించవచ్చు.
ఆశలు ఎక్కువయ్యే కొలది అడ్డదారులు మంచిదారులుగా అగుపించగలదు.
వృక్షాలు అడవికి అందము. పిల్లలు ఇంటికి అందము.
మనశ్శాంతి లేని గృహము ఎండిన పొలము లాంటిది.
అణకువ అణువణువు అమృతాన్ని నింపగలదు.
నిజమైన జ్ఞానికి కష్టాలు అమృతమైతే , సుఖాలు పాషాణం వంటివంటారు.
జీవితము కొందరికి వినోదము - మరికొందరికి విషాదము.
గురువులేని విద్య , గడపలేని గృహం లాంటిది.
దైవ సంపన్నులకు ఈ విశ్వములో సాటి అయినది ఏదియు లేదు.
కండ బలం కన్న కలం బలము మిన్న.
ఓర్వలేని తనము ఓటి కుండతో సమానము.
స్వచ్ఛమైన నీరు పరిశుభ్రంగా వున్నట్లు స్వచ్ఛమైన మానవుని మాటలు కూడా పరిశుభ్రంగా వుండగలవు.
దాస్యము చేయించుకొనేవారు దయ దాక్షిణ్యాలు చూపరు.
అంతులేని కోర్కెలు అంతానికి మూలము.
ఆత్మ విశ్వాసము లేని వారు అవిటివారితో సమానము.
మంచి ఆలోచనలు మనిషి జీవితాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ఉన్నత స్థానాన్ని చూపగలవు.
కయ్యానికి కాలు దువ్వకు , కన్నీరు కార్చకు.
కలుషిత జీవితము చీడ పట్టిన వృక్షము లాంటిది.
మర్మంలేని మనిషి మనస్సులో మానవత్వము నిండుగా నుండును.
అహంకారముతో విర్రవీగే వారు , లేదని వాపోయేవారు ఇతరుల నేరములెంచువారు దైవసన్నిధి ప్రవేశానికి అనర్హులు.
అనుకున్నది సాధించాలంటే ఆలోచనకు తోడు మంచి అవగాహన ఉండాలి.
మనోధైర్యము కోల్పోకు. మానసిక జాడ్యాన్ని పెంచుకోకు.
నీచులతో సహవాసము , నిప్పుతో చెలగాటము. కష్టాలకు సరితూగని మానవులు కాటికి పోయిన వారితో సమానము.
ధనము , పదవి ఉన్నంత మాత్రాన ఆనందం లభిస్తుందని అనుకోవడం అవివేకము. మనము చేసే మంచి పనుల వల్లనే నిజమైన ఆనందము లభించగలదు.
ఆత్మవిశ్వాసము కోల్పోయిన వారు విరిగి పడిపోయిన వృక్షము వంటి వారు.
అల్పులు తమ విన్యాసాలే గొప్పవనియు , అవే ఆనంద మనియు అనుకొంటుంటారు.
అలవాట్లు ప్రారంభంలో సాలిగూల్లవలె అల్లుకొని ఉండి తరువాత ఇనుప గొలుసులుగా మారతాయి.
కాలమే ఉత్తమ గురువు ప్రపంచమే ఉత్తమ గ్రంథం.