*ఉత్తరానక్షత్ర వ్రతం*
ఏటేటా ఫాల్గుణమాసం , పౌర్ణమి తిధి , ఉత్తరా నక్షత్రం (పంగుణి ఉత్తరం) నాడు శ్రీ అయ్యప్పస్వామివారి జన్మదినం జరుపుతారు. ఆ దినం శబరిమలలో అష్టాదశ సోపానములపై కొలువైఉన్న శ్రీ అయ్యప్పస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం మరియు పూజలు ఆరాధనలు వైభవముగా జరుపుతారు. ఆ దినమే శ్రీ అయ్యప్ప స్వామి శబరిమల నుండి తన ఆవిర్భావ స్థలమగు పంబకు దిగివచ్చి స్నానమాడుతారు. ఈ ఉత్సవాన్నే పంబా ఆరాట్టు అందురు. అంతేగాక ప్రతి కృతికానక్షత్ర దినాలలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఉపవాసవ్రతమున్నట్లే తమిళనాడులో పలుప్రాంతాలలో భక్తులనేకులు అనాదిగా ఉత్తరానక్షత్ర వ్రతాలు చేసే ఆచారమున్నదని తెలుస్తున్నది. దీని కల్యాణవ్రతము అనియు అందురు. ఉత్తరా నక్షత్ర దినాన స్కంధ పురాణము లోని శ్రీమహాశాస్తావారి అవతారము (అసురకాండ - 13వ అధ్యాయము)ను పారాయణము చేయవచ్చునని పలుమార్లు శబరిమల యాత్ర చేసిన బ్రహ్మశ్రీ ఆండివాడార్ గురుస్వామిగారు *శ్రీశాస్తామహాత్యం* అను తమిళమాస పత్రికలో సెలవిచ్చియున్నారు. ఈ వ్రతమాచరించడానికి మాలధారణ చేయనవసరం లేదు. ఈ వ్రతాన్ని ఏ వయసులోనున్న స్త్రీ , పురుషులైన చేయవచ్చును. ఆ శబరిగిరినాథునిపై విశ్వాసముంచి వ్రతం చేయడమే ముఖ్యం. ఇలా ప్రతిమాసం ఉత్తరా నక్షత్ర దినాన పగలంతా ఉపవాసముండి , శ్రీశాస్తావారి దివ్యఅవతార ఘట్టమును పారాయణ చేసినచో సకాల వివాహం , పుత్రసంతాన ప్రాప్తి , జీవిత సుఖశాంతులు మున్నగు కోర్కెలను కోరినంతగా ఆస్వామివారు అనుగ్రహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ వ్రతాన్ని అనుష్టించిన భక్తులనేకులు సత్ఫలితాలు పొందిన గాథలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా శ్రీస్వామి అయ్యప్ప ఆలయాలలో ప్రతిమాసం ఉత్తరా నక్షత్ర పూజలు నిర్వహించినచో ఈ వ్రతాచరణకు మరింత ప్రచారం లభించి మరింత భక్తులు ధన్యులవుతారు. ఇది కేవలం భక్తులకు మాత్రమే కాక ఆయా దేవాలయాలలో కొలువైఉన్న మూర్తిమంతానికి కూడా చైతన్యాభివృద్ధి కలుగజేస్తుందనటం అతిశయోక్తి కాదు. భక్తులెల్లరు ఈ కళ్యాణ వ్రతమాచరించి స్వామి అనుగ్రహము పొందెదరు. గాక , స్వామిశరణం.