⚜️ పంబా స్నానము - పితృకర్మలు ⚜️
మరుసటి దినము అరుణోదయమునకు మునుపుగా సకల అయ్యప్ప భక్తులు పంబానదిలో స్నానమాడి పితృకర్మలను పరిశుద్ధ హృదయులై చేసి వారి వారి యొక్క తావళమును చేరి , సద్య(సలిది) జరుపదలచి దానికై పాటించు సాంప్రదాయములను పాటించి కార్యక్రమం జరుపుదురు. వీరు ఒక్కొక్క కూటమిగా యుండియూ , ఆ కార్యక్రమములు జరుపుదురు. ఆ కూటమికి అధిపతిగా ఒకగురుస్వామి ఉందురు.
అతని యొక్క ఆనతి ప్రకారముగానే ఈ సద్య జరుగును. కొందరు గురుస్వాములు అవేమియూ పట్టించుకొనరు. వారు వారు , వారి వారి యొక్క ఇష్ట ప్రకారము చేసుకొననీ , అన్న భావముతో గురుస్వాములు అటూ , ఇటూ తిరుగుచూ కాలక్షేపము చేయుచుందురు. భోజన సమయమునకు మాత్రము ఎచ్చట నున్ననూ యథాస్థానమును చేరుకొందురు. అది తప్పు ఇది తప్పు చేసిన వన్నియూ తప్పులేనని చెప్పుచూ చేసిన వారిని భయపెట్టడమే గాక , ప్రాయశ్చిత్తము చేయించుటకు కూడా వెనుకాడరు. కొందరు
గురుస్వాములు అయ్యప్పస్వామి నాపై వ్రాలును అని అందురు. మరికొందరు నాకు అయ్యప్ప దర్శనమైనది అని అనుటయూ , అయ్యప్ప నాపై పూర్తి అనుగ్రహ కటాక్షములు
చూపించునూ అనియూ ఆత్మస్తుతి చేసికొనుచూ అధికార దర్పముతో , చిత్తశుద్ధి కలిగి మనోవాక్కాయ కర్మలా ఎదురుగా నిలబడి కోపతాపములు ప్రదర్శించుచూ , బెదిరించుచూ ఏవియేవియో వారి తప్పులను వెదకుచూ , నీవు ఈ నేరము చేసినావు అని లేనిపోని పరనిందలు పలుకుచున్న ఆ గురుస్వాములను చూచినప్పుడు అయ్యహో ! పాపం వీరు అనేకమార్లు స్వామి దర్శనము చేసియునూ , పలుమార్లు శబరి యాత్ర చేసియునూ అజ్ఞానులై తమ తమ చిత్త భ్రాంతులకు , మానసిక బలహీనతలకు గురియై అయ్యప్ప మమ్మల్ని పూనుచున్నాడని ఇట్లు వగచుచున్నారే.
వీరు ఎప్పుడు ఇంద్రియ మనశ్చిత్తములను నిగ్రహించి స్వామి సాక్షాత్కార అనుభూతిని పొందెదరు అని అనిపించును. మరికొందరు అట్లు చేయుచున్నప్పుడు చూచిన వీరు డంబాచారమునకు లేని భక్తిని ఉన్నట్లుగా నటించుచున్నారే. వీరికెట్టి ప్రాయశ్చిత్తము భగవంతుడు చేయును ? వీరి ప్రవర్తన ఎప్పుడు బాగుపడును ? అని అనిపించక మానదు. కావున గురుస్వాములారా ! సత్య శివ సుందరుడగు స్వామి యొక్క నిజమైన తత్త్వమును గ్రహించుడు.డంబాచరమునకు బోయి స్వామి ఆగ్రహమునకు గురికాకుడు. ముందు
మిమ్ములను మీరు ఉద్ధరించుకొని ఇతరుల నుద్ధరించుటకు ప్రయత్నించుడు. మన చేతులు మలినముగా నున్నచో ఎదుటివారికి శుద్ధ ప్రసాదము నందించగలమా ? ఎప్పుడో ఒకప్పుడు మన అపరిశుద్ధత బయట పడకమానదు. అప్పుడు మనము ఏమి వగచియూ లాభము ఉండదు. నేరస్తులను శిక్షించుటకునూ , సన్మార్గులను రక్షించుటకునూ ఆ అయ్యప్పే ఉన్నాడు. మనము సంస్కార పూరితులమై , వివేకులమై , సత్సంకల్ప నిరతులమై మన యథాశక్తి స్వామి భక్తులకు మార్గదర్శకులమై మనలను నమ్మి మన చేత మాల ధరించి యాత్ర చేయుచున్న మన శిష్యస్వాములకు అయ్యప్ప స్వామి యొక్క అవతార రహస్యములను తత్త్వజ్ఞానమును ఉపదేశించుచూ , సంతుష్టచిత్తుల గావించుచూ ఆ దుర్గమారణ్యమున మనకు సుపరిచితమైన ఆ దారిలో ఎట్టి కష్టనష్టములకు వారు గురికాకుండా , జాగ్రత్తగా వారిని తీసికెళ్ళి మరల తీసికొనివచ్చి ఆ యాత్రానందము , పుణ్య ఫలమూ వారితో పాటు మనమూ పొంది ధన్యులగుదుముగాక ! *(పై చెప్పబడిన రీతిలో ఎవరైననూ గురు స్వాములు తలంచుటయో , ప్రవర్తించుటయో చేసి యుండినచో అటువంటి గురుస్వాములు సదయతో క్షమించవలెను)* స్వామియే శరణం -
శరణమయ్యప్ప
గురుబ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ||
అని తన యొక్క గురువును స్మరించుచూ జీవనము గడుపు గురుస్వాములను....
ధనం బ్రహ్మ ధనం విష్ణుః ధనం దేవో మహేశ్వరః
ధనం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ధనమే నమః ||
అని జపియించుచూ ధనమును మాత్రము పూజించు గురుస్వాములనూ , (ఇరు
వర్గముల వారిని) ఆ స్వర్గము నందు (పంబయందు) చూచుట సాధ్యము.
🙏🌷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏