అధికమాసం అంటే? అధికమాసంలో ఏం చెయ్యాలి?

P Madhav Kumar

 అధికమాసం అంటే....


మరి కొద్ది రోజులలో ఆషాఢమాసం ముగుస్తోంది. అనంతరం లక్ష్మీప్రదమైన శ్రావణమాసం ప్రవేశిస్తుంది. ఈసారి రెండు శ్రావణమాసాలు రాబోతున్నాయి.


 వాటిలో మొదటిది అధికమాసం (ఈ నెల 18 నుంచి). ఇంతకీ ‘అధికమాసం’ అంటే ఏమిటి? అధిక శ్రావణంలో శుభకార్యాలు చేయవచ్చా? ఇలా ఎన్నో ప్రశ్నలు సహజంగానే ఎదురవుతాయి.

జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలగణన సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్కకట్టే కాలమానాన్ని ‘సౌరమానం’ అనీ, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొనే సంవత్సర గణనాన్ని ‘చాంద్రమానం’ అనీ అంటారు.

 చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో ఏడాదికి 354 రోజులు. సౌరమానంలో ఏడాదికి 365 రోజులు. అంటే సౌరమానానికీ, చాంద్రమానానికీ మధ్య ఏడాదిలో 11 రోజుల తేడా ఏర్పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని సరి చెయ్యడానికి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దానినే ‘అధికమాసం’ అంటారు.


అధికమాసంలో ఏం చెయ్యాలి?

అధికమాసాలలో శుభకార్యాలను ఆచరించడం నిషిద్ధమని శాస్త్రాలు తెలియజేశాయి. దీని ప్రకారం వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితరాలను ఈ మాసంలో చేయకూడదు. 

పితృకార్యాలను కూడా అధికమాసంలో కాకుండా నిజమాసంలోనే జరపాలి. కానీ అధికమాసానికి తనదైన విశిష్టత ఉంది. మహా విష్ణువుకు ఇది ప్రత్యేకమైన నెల. కాబట్టి దీనికి ‘పురుషోత్తమ మాసం’ అనే పేరును ఆయన ప్రసాదించాడనీ, ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడనీ పురాణాలు చెబుతున్నాయి.


అధికమాస మహిమ గురించి మహా విష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు... ‘‘పురుషోత్తమమాసంలో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు, జప, హోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్య కర్మలు ఆచరించనివారి జీవితాల్లో కష్ట నష్టాలు ఎదురవుతాయి. 

అధికమాసంలో శుక్ల పక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి రోజునైనా కనీసం పుణ్య కార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది’’ అని ఆయన చెప్పినట్టు పౌరాణిక కథ ఒకటి ఉంది.

కాబట్టి అధికమాసంలో దైవారాధనలు, పితృఆరాధన, పూజలు, దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన పలితాలు లభిస్తాయి. ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన, విష్ణుసహస్రనామ పఠనం, ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు, దీక్షల వల్ల రెట్టింపు ఫలాలు పొందవచ్చన్నది పెద్దల మాట.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat