⚜️ స్వామి వారికి నెయ్యాభిషేకము ⚜️
స్వామివారి యొక్క సన్నిధానము చేరిన భక్తాదులు చాలామంది ఆ దినమే నెయ్యాభిషేకము చేయించవలసిన యున్న సాంప్రదాయమును అందరూ పాటింతురు. వారి వారి యొక్క ఇరుముడులు నుండి నెయ్యి ఉన్న టెంకాయను తీసి పగులగొట్టి ఒక పరిశుభ్రమైన పాత్ర యందు పోసి దేవస్వం (దేవస్థానము అను పదమును అక్కడ దేవస్వం అందురు. మనమూ అట్లే పిలిచెదము) ఆఫీసు యందు చూపించి దానికి కావలసిన పైకము చెల్లించి రసీదు పొంది అభిషేకము కొరకై ఆలయములోనికి ప్రవేశించి సన్నిధిలో యుండువారికి ఇచ్చెదరు. దానిని శాంతిక్కారన్ (పూజారి) తీసికొని భగవంతునికి అభిషేకము చేసి అందులో కొంచెము నెయ్యి తీసికొని మిగిలిన దానిని ఆ పాత్రలో యుంచి తీసికొని వచ్చినవారికి ఇచ్చెదరు. తదుపరి ఒక్కొక్కరు వారి వారి మొక్కుబడి ప్రకారము వారి వారి శక్తి కొలది ఆరాధనలు జరుపుదురు. కొందరు అయ్యప్ప స్వాములు అభిషేకమునకు కొనిపోవు నెయ్యిని మండపమునకు సమీపమున ఏర్పరచబడి యున్న రాతితొట్టెలో నెయ్ దోనెలో పొసెదరు. ఆ ప్రకారము చేయుటకు దేవస్వమునకు డబ్బు చెల్లించవలసిన అవశ్యము లేదు. స్వామిపై నెయ్యిని అభిషేకము
చేయించవలసిన అవశ్యము లేదు. స్వామిపై నెయ్యిని అభిషేకము చేయించవలెనంటే మాత్రము డబ్బు కట్టాలి. వారి వారి దగ్గర ఉన్న నెయ్యి అందరూ రాతి తొట్టిలో పోసిన పిదప అందులో నుంచి కొంత నెయ్యిని ప్రసాదముగా స్వీకరించి ఇంటికి కొనిపోయెదురు. ఈ విధముగా ఆ రాతితొట్టిలో మిగిలిన నెయ్యితోనూ , భక్తుల వద్ద అభిషేకము వేళ తీయబడు ఆజ్యముతోనూ అరవణ పాయసము , అప్పములు మొదలగు విశేష ప్రసాదములు తయారుచేసెదరు. కొందరు నియమమునకు అతీతమైన రీతిలో విపరీత ఫలేచ్ఛతో చిన్న చిన్న పాత్రలు గొనిపోయి మనుష్యుల వత్తిడిలో దూరి ఆ తొట్టినుంచి నెయ్యి సేకరించెదరు. ఆ ప్రవృత్తి సమంజసము కాదు ప్రసాదముగా తలచి కాస్త తీయడములో తప్పులేదు. కానీ రెండు , మూడు వీశల వరకూ అపహరించి గొనిపోయి తమ స్వస్థానమునకు తెచ్చుకొని భద్రపరచుకొని ఆహార పదార్థములలో కలుపుకొని భుజింతురు. ఈ ప్రవృత్తి మంచిది కాదని ఈ అత్యాశ దురాశయై దుఃఖమునకు దారి తీయగలదని పెద్దలు చెప్పుదురు. ఇలా చేయు
స్వాములు తమ ప్రవర్తన మార్చుకొన వలెను. ధార్మికమైన ప్రవర్తనలకు పుట్టినిల్లే శబరిగిరియని తలచి మెలగవలయును. అభిషేకము చేసిన నెయ్యిని కొందరు స్వాములు దేవస్వం ఆఫీసు నందు డబ్బు చెల్లించి తీసికొని పోయి భద్రపరిచెదరు. ఎలా
తీసికొని పోయిననూ దానిని భక్తి , శ్రద్ధ , విశ్వాసములతో , స్వామివారికి అభిషేకించిన అమూల్య ప్రసాదమన్న తలంపుతో పరిశుభ్రముగా యుంచి తామూ పరిశుభ్రులై సేవించినచో పలు రోగములు , చర్మవ్యాధులు కూడా నివారణ అగును. అలా సేవించినందున పలు రోగములు నివారణ యైనట్లు చెప్పియున్నారని పళమస్వాములు
తెలిపియున్నారు. అలాగే అచ్చటి మిగిలిన ప్రసాదములకు కూడా (అప్పము , అరవణ పాయసము , పంచామృతము , పసుపుపొడి , భస్మము , చందనము మొదలగునవి) ఎంతో మహత్మ్యము కలదు. కానీ నిరీశ్వర వాదులకునూ , అవిశ్వాసులకునూ దీని యొక్క గుణము కనిపించదు , లభించదు , దేనికైనా శ్రద్ధా , భక్తి విశ్వాసములు అవసరము.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏