తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయం ప్రత్యేకత | Yadagirigutta Temple in Telangana

P Madhav Kumar

 

నరసింహ స్వామి ఆలయాలు ఎన్నో ఉండగా తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం?

ఒక కూడలిలో నుంచొని యాదగిరి అని పిలిస్తే ఒకరి కన్నా ఎక్కువ మంది పలికితే మీరు తెలంగాణలో ఉన్నట్టే.

తెలంగాణలో ఏడవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు నృసింహ ఆరాధన బాగా వర్ధిల్లింది. ఫలితంగా ఇక్కడ 176 నృసింహ క్షేత్రాలు ఉన్నాయి[1]. ఆ తరువాత కాకతీయుల కాలంలో మిగతా దేవతారాధన పెరిగినా తదనంతరం బహమనీ సుల్తానుల నుండి వరస పరమత రాజుల పోషణలో ఇక్కడి నృసింహ క్షేత్రాలు కొత్తవి ఏవి ఉనికిలోకి రాలేదు. ఇలాంటి స్థితిలో యాదగిరి గుట్ట ఎందుకు అంత ప్రత్యేకం?

సంపూర్ణ వైష్ణవ క్షేత్రంగా మారక ముందు, జైనుల కాలం నుండి కూడా యాదగిరి గుట్ట ప్రముఖ యాత్రా స్థలంగా ఉంటూ వచ్చింది. అయితే భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం దక్షిణ భారత దేశంలో మధ్యలో ఉన్నప్పటికీ రోడ్డు రైల్వే సౌకర్యం అంతగా లేకపోవడం వల్ల క్రమేపీ రోడ్డు మార్గంలో వెళ్లగలిగే దగ్గరి ప్రాంతాల వారికి మాత్రమే ఇక్కడి యాత్రా స్థలాలు పరిమితం అయ్యాయి.

జైన వైద్యుడు అగ్గలయ్య[2] పేరు మీద ఈ క్షేత్రంలో ఆరోగ్యం బాగవుతుంది అన్న నమ్మకం కొన్ని వందల ఏళ్లుగా ఉంది. దగ్గర్లోనే సైదాపురంలో[3] 1140 ప్రాంతపు శాసన స్తంభంలో అగ్గలయ్య సేవలకు గ్రామాలను ఇచ్చినట్టు ఉన్నది. ఒకప్పుడు అనారోగ్యంతో అగ్గలయ్య కోసం వచ్చే భక్తులు యాదగిరి గుట్టలో మొక్కుకునేవారు. కాలక్రమేణా యాదగిరి గుట్ట ప్రమాదాల బారిన పడి ఆరోగ్యం పాడవకుండా చేసే వాహనపూజలకి ప్రసిధ్ధి చెందడం జరిగింది. తదుపరి మెల్లిగా పూర్తి వైష్ణవ క్షేత్రంగా మారింది. ఈ అగ్గలయ్య ముని పేరు మీద హనుమకొండ దగ్గర అగ్గలయ్య గుట్ట కూడా ఉన్నది. హైదరాబాదు నుండి హనుమకొండ వరకు ఉన్న బెల్ట్ మొత్తం జైన ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు అన్ని నృసింహ క్షేత్రాలకు ప్రాచీన జైన వారసత్వం ఉండటం విశేషం. జైనం తరువాత వెంటనే వచ్చింది నృసింహ ఆరాధన కాబట్టి అంత వింత కూడా కాదేమో.

నిజాం కాలంలో కూడా ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుండి భక్తులు వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే నైజాం రాజ్యంలో హిందూ దేవాలయాల మీద, జాతరల మీద ప్రతి చిన్న దానికి పన్నులు భారీగా ఉండేవని కొన్ని నైజాం ప్రభుత్వ రికార్డుల్లో లభ్యం అవుతోంది. ఎంతగా అంటే గుండంలో స్నానం చేసి బయటికి వస్తే అక్కడ కూడా అణా పైసా అనధికారికంగా సమర్పించుకోవాలి. ఆ పన్నులు బాగా వచ్చే ప్రసిద్ధ క్షేత్రాలకు మాత్రం రాజుల అండలు లభించాయి. ఆ రోజుల్లోనే నిజాం రాజు యాదగిరిగుట్టకు 80,000 రూపాయలు ఏటా విరాళంగా ఇస్తూ పోషిస్తూ ఉండే అంటే అర్థం చేసుకోవచ్చు. తిరిగి భక్తుల నుండి అంత కన్నా ఎక్కువే వసూలు అవుతుంది కాబట్టి. దాని ఫలితమే ప్రతిదానికీ టికెట్టు. అయినా అదేమీ ఈ ఒక్క గుడికే పరిమితం కాదు కదా. దేశం అంతటా ఇప్పుడు అలాగే ఉంది.

ఈ ఆదాయం అంతా హైదరాబాదు అభివృద్ధి మీద పెట్టుబడి పెట్టడం జరిగేది. ఇప్పుడు అదంతా అప్రస్తుతం.

తెలంగాణ ఊళ్ళలో యాదగిరి గుట్ట మీద జోల పాటలు, పెళ్లి పాటలు, బతుకమ్మ పాటలు (పాతవి) ఉన్నాయి. యాదగిరీంద్ర శతకం పేరుతో 1840 లో నల్గొండకు చెందిన తిరువాయిపాటి వెంకటకవి ఒక శతకం రాసినట్టు లభ్యమైంది[4].ఇంకా పలువురు రాసినట్టు తెలుస్తున్నది. రోజువారీ జీవితంలో అప్పట్లో సగటు తెలంగాణ వాసికి తిరుపతికి జీవిత కాలంలో ఒకసారి వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది. యాదగిరి గుట్టతో సహా కొన్ని నృసింహ క్షేత్రాలు, తెలంగాణ నిండా ఉన్న ప్రాచీన రామాలయాలు, వేములవాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న మొక్కులకు ప్రధాన దేవతలు ఇక్కడ. తెలంగాణలో మిగతా తెలుగు ప్రాంతాల్లో లేని ఒక ప్రత్యేకత యాదగిరి, యాదయ్య, యాదమ్మ అనే పేర్లు. కులాలకు అతీతంగా ప్రతి కుటుంబంలో ప్రతి తరంలో కనీసం ఒక్క పేరు అయినా ఉంటుంది. ఈ ప్రాంతంలో తిరుపతి, వెంకట అన్న పేర్ల కన్నా యాదగిరి, యాదయ్య పేర్లు ఎక్కువ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ఎంకన్న అంటే గణపతి.

తెలంగాణ ఉద్యమం అనంతరం యాదగిరి గుట్ట తిరుపతికి పోటీ అని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రతి దేశానికి, జాతికి, రాష్ట్రానికి తమకి మిగిలిన చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం నిలుపుకునే, పునరుద్ధరించుకునే హక్కు ఉంటుంది. కానీ ప్రతిదీ పోటీ కోణంలో చూస్తే జాతి వైరం తప్ప ఏమీ మిగలదు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat