⚜️ కర్పూర గుండము ⚜️
అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టి తీర్థయాత్రకు సన్నద్ధులు అయినప్పుడే కర్పూరము ధారాళముగా సేకరించుకొని పోవుదురు. దారి మధ్యమున శబరిగిరి క్షేత్రమును చేరువరకూ ప్రతిదినమూ ప్రాతః సంధ్యా సమయములందు ఇరుముడి కట్టుకు దీపారాధనలు జరుపుటకునూ (స్వామివారికి కర్పూర దీపము మిక్కిలి ఇష్టమైన ఆరాధన)
దారిలోని ఆలయములలో వెలిగించుటకునూ ఉపయోగించినది పోగా మిగిలిన కర్పూరమును స్వామివారి సన్నిధానము నందు గల (బలిరాయికి ప్రక్కనయున్న కర్పూర
గుండము నందు వేసెదరు. మూడు నాలుగు దినములు రాత్రి పగలనక భక్తాదులు వేయు కర్పూరముతోనే ఈ హోమగుండము జాజ్వలమానముగా వెలుగును. అచ్చట వెలిగించబడు కర్పూరము యొక్క తూకమును ,
దాని యొక్క విలువనూ ఎంత యుండునను అది ఇంతవరకు ఊహించుటకు కూడా ఎవరికైననూ సాధ్యమయినదా ? అన్నది సంశయమే. ఇట్టి మనోహర దృశ్యమును మన కంటితో చూచుటకునూ , మనము పరమానంద భరితులమై పోవుటకునూ ఈ శబరిగిరి యాత్ర యొక్కటియే మనకు వీలు కలిగించుచున్నది. ఎప్పుడు ఇలాగే సత్ సంఘము వారితో స్నేహము చేయుట యునూ , పరమానంద చిత్తులమై జీవితమున జీవించుటకునూ మనము
పాటుపడ వలయును. దానికి ఏమిటి మార్గము ? మన స్వస్థలములకు వెళ్ళిననూ ఈ దృశ్యములను మరువక సదా మదిలో తలంచుచూ చిత్తశుద్ధితో వెళ్ళివచ్చిన ఈ యాత్రా కాలమును గుర్తుంచుకొని సదాచార తత్పరుడగుటయే దానికి మార్గము. అట్లు స్వామివారిని మనస్సునందే నిరంతరమూ ధ్యానించుచూ , తమ స్వస్థలము నుండియే ప్రతిదినమూ శబరిగిరి యాత్రకు వెళ్ళి మరలివచ్చు చున్నట్లు భావించుకొనెడి మహాభక్తులు ఎందరో గలరు. వారందరికీ నా వినయపూర్వక పాదాభివందనములు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🥀🙏