భగవంతుడు అవతరిస్తాడా?
ఇటువంటి విషయాలలో శాస్త్రాలే మనకు ప్రమాణం.ధర్మం నశించి,అధర్మం ప్రబలుతున్నప్పుడు
తాను మనుష్యరూపంలో అవతరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుంటానని శ్రీకృష్ణభగవానుల గీతలో తెలిపాడు. అవతార తత్వానికి మనకు పరమప్రమాణం ఇదే. నిజానికి మాటలకూ, ఆలోచనలకూ పరమాత్మ యొక్క స్వభావం అందనిది. అటువంటి అవ్యక్తుడూ, అచింత్యుడూ అయిన పరమాత్ముడు తన మాయాశక్తి సహాయంతో మనవలెనే దేహధారియై భూమిపై అవతరిస్తాడు. అతనికి అసాధ్యమనేది లేదు. అతనికీ మనకూ ఉన్న వ్యత్యాసం ఇంతే మనం ముందు చేసుకున్న ప్రారబ్దకర్మ ప్రభావం చేత పుడతాము. శరీరాన్ని ధరించి, మాయ యొక్క వశంలో జీవిస్తాము. అందుచేతనే ఇన్ని కష్టాలు మనకు వాటిల్లుతూ ఉంటాయి.
భగవంతుడు సర్వస్వతంత్రుడు. మాయను తన చెప్పుచేతలో ఉంచుకోగలడు. తన సంకల్పశక్తి చేత శరీరాన్ని గ్రహిస్తాడు. దేశాధ్యక్షుని చుట్టి పోలీసులుంటారు. అతని కనుసన్నలలో మెలగుతూ
అతణ్ణి సేవిస్తూ ఉంటారు. అలాగే దొంగను చుట్టి కూడా పోలీసులుంటారు. అలా వారిద్దరికీ మధ్య పోలీసులుండడానికి ఎంత వ్యత్యాసముందో మనకూ భగవదవతారాలకూ అంత తేడా ఉంది!
ఏ దేశంలోనైనా కానివ్వండి, ఏ కాలంలోనైనా కానివ్వండి, ధర్మం పతనం చెందినప్పుడు, అధర్మం వృదధి అయినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. కనుక అవతారాలు ఈ దేశంలో, ఈ కాలంలో వస్తారని కానీ, ఇంతమందే వస్తారని కానీ నియమం లేదు.
రచన: స్వామి హర్షానంద