మిగిలిన దేవతామూర్తులతో పోలిస్తే శ్రీ అయ్యప్పస్వామివారు యోగాసనంలో కూర్చుని, చిన్ముద్ర ధారియై భక్తులకు అభయమిస్తుంటారు. అయ్యప్పస్వామి వారి మోకాళ్ల చుట్టూ ఒక బంధనం ఉంటుంది. దాన్ని ‘పట్టు బంధనం’ అంటారు. పందళ రాజు వద్ద పన్నెండు సంవత్సరములు పెరిగిన శ్రీ మణికంఠుడు తాను హరిహరసుతుడనని, ధర్మాన్ని శాసించుట కోసం ఆవిర్భవించానన్న సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు. మహిషిని వధించిన తర్వాత శబరిమల ఆలయంలో చిన్ముద్ర దాల్చి యోగాసన పద్ధతిలో జ్ఞాన పీఠముపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు. శబరిగిరిపై ఆలయం కట్టించి, స్వామి ఆభరణములను మోసుకుంటూ పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు. తండ్రి అయిన పందళరాజు రాకను గుర్తించిన స్వామివారు యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు. అంతట పందళరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో శ్రీస్వామివారి మోకాళ్లకు ఆ వస్త్రం చుట్టి బంధిస్తారు. తాను ఇక్కడ అయ్యప్పస్వామిని ఏ విధంగానైతే చూసి తరించిపోయానో అదేవిధంగా మిగిలిన భక్తులు ఇదే రూపంలో స్వామివారిని చూసి తరించిపోవాలని అయ్యప్పస్వామిని ప్రార్థించగా, ఆయన అనుగ్రహించారట. అలా కట్టి ఉన్నదానిని పట్టు బంధం అంటారు. దీన్ని శివకేశవులను ఐక్య పరిచిన బంధమని కూడా అంటారు.
సేకరణ:-
🌾#శుభమస్తు🌾
లోకాసమస్తా సుఖినోభవంతు