భక్తమందార శతకము - Bhaktamandara Satakam

P Madhav Kumar

 


: భక్తమందార శతకము : 

శా. శ్రీసాకేతపురీవరంబున సునాసీరోపలస్థాపిత-
ప్రాసాదాంతర చంద్రకాంతమణియుక్పర్యంకభాగంబునన్
శ్రీసీతాసతిఁ గూడ వేడ్కలలరం గ్రీడించు మిమ్మెప్పుడున్
మా సన్మానసవీథిఁ గొల్చెదము రామా! భక్తమందారమా! 1

శా. అస్తోకామలకీర్తికామ! లసదుద్యన్నీరదశ్యామ! భూ
విస్తారప్రభుతాలలామ! త్రిజగత్ప్రఖ్యాతసన్నామ! ధీ-
రస్తుత్యోరుగుణాభిరామ! భుజసారస్ఫారపౌలస్త్యదు-
ర్మస్తస్తోమవిరామ! ధీమహిత! రామా! భక్తమందారమా! 2

మ. కదనప్రాంగణకార్తికేయ! విలసద్గాంగేయకౌశేయ! భా-
స్వదుదంచద్ఘననీలకాయ! త్రిజగత్సంరక్షణోపాయ! స-
మ్ముదితాశేషమరున్నికాయ! దివిషన్ముఖ్యాతిగేయా! గరు-
త్మదమేయాశ్వ! సుధీవిధేయగుణ! రామా! భక్తమందారమా! 3

మ. అకలంకాయతకీర్తి జాల! మహనీయాభీలశౌర్యస్ఫుర-
న్మకరాక్షాసురరావణప్రముఖ నానాదానవోత్తాలతూ-
లకరాళస్ఫుటవహ్నికీల! జయశీలా! సద్దయావాల! హే-
మకనచ్చేల! బుధానుపాల! రఘురామా! భక్తమందారమా! 4

మ. దురితధ్వాంతపతంగ! సంగరమహాదుర్వారగర్వాహితో-
త్కర సేనాకదళీమతంగ! లసదేకాంతాత్మపంకేజసం-
చరదుద్యన్మదభృంగ! పుంగవ ఘనశ్యామాంగ! సద్గంగ! క-
మ్రరమాలింగనసంగతాంగ! రఘురామా! భక్తమందారమా! 5

శా. దండం బీయదె నీకుఁ గైకొనుము దోర్దండాగ్రజాగ్రన్మహో-
దండోత్తాలవిశాల దివ్యతరకోదండాగ్రనిర్ముక్త స-
త్కాండవ్రాతవిఖండితాహితశిరఃకాండా! కనత్కుండలా!
మాండవ్యాది తపోధనప్రణుత! రామా! భక్తమందారమా! 6

శా. వింతల్‍గాఁ గడు మీకు సత్కృతులు గావింతున్ దుషారాద్రిజా-
కాంతాక్రాంతజటాంతరాళవిలుఠద్గంగాతరంగచ్ఛటో-
త్క్రాంతాత్యంత ఝళంఝళన్నినద రంగద్ధాటి మీఱంగ సా-
మంతా! సంతతశాంతిమంత! జయరామా! భక్తమందారమా! 7

మ. రకపుం గావ్యకళాకలాపరచనాప్రాగల్భ్యసంసిద్ధికై
ప్రకటప్రేమ భజింతు నీశ మకుటప్రస్ఫీతగంగాజలా-
ధికమాధుర్యకవిత్వధూర్వహన ధీదివ్యప్రభావాఢ్యఁ ది-
మ్మకవిశ్రేష్ఠు మదగ్రజున్ మదిని రామా! భక్తమందారమా! 8

మ. సకలాభీష్టఫలప్రదాయకుఁడవై చంచద్దయాశాలివై
ప్రకటస్నేహరసార్ద్రమానసుఁడవై భంగీకృతానేకపా-
తకఘోరామయశాత్రవోత్కరుడవై ధాత్రీసుతం గూడి మా-
మక చిత్తాబ్జమునన్ వసించు మొగి, రామా! భక్తమందారమా! 9

మ. మణిపుంఖాంకితకంకపత్రచయ సమ్యగ్దివ్యతూణద్వయం-
బణుమధ్యంబునఁ దళ్కు గుల్క ఖలదైత్యానీకహృద్భేదకృ-
ద్ధణనీయోగ్రకఠోరకార్ముకము చేతంబూని నా వెంట ల-
క్ష్మణుడు న్నీవును నంటి త్రిమ్మరుము రామా! భక్తమందారమా! 10

మ. పలుమాఱున్ భవదీయకావ్యరచనాప్రాగల్భ్య మొప్పార ని-
న్గొలుతున్ మామక మానసాబ్జమున బొంకుల్ గావు నీ వెచ్చటం
గలలోనం బొడకట్ట విట్టి వగ బాగా! మేల్! బళా! శ్యామకో-
మలవిభ్రాజితమందరావయవ! రామా! భక్తమందారమా! 11

మ. రఘువంశాంబుధిపూర్ణచంద్ర! విలసద్రాజన్యదేవేంద్ర! నా
యఘసంఘంబులఁ బాఱఁద్రోలి భవదీయామేయకారుణ్యదృ-
ష్టి ఘనప్రక్రియఁ జూచి యేలుకొనుమా! సేవింతు నత్యంతమున్
మఘవప్రస్తుతసద్గుణాభరణ! రామా! భక్తమందారమా! 12

మ. గణుతింతున్ భవదీయ సద్గుణకథల్ కౌతూహలం బొప్పఁగాఁ
బ్రణుతింతున్ సచరాచరాదిక మహాబ్రహ్మాండభాండచ్ఛటా-
గణితప్రాణిజనాంతరాత్మవని వేడ్కన్ సంతతంబున్ నభో-
మణివంశాంబుధిశీతభాను! రఘురామా! భక్తమందారమా! 13

మ. సారాసారవిచార! ధీరజనతాసంరక్షణాధార! స-
త్కారుణ్యాకరమూర్తివంచు నెద నత్యంతంబు మీ దివ్యశృం-
గారాగారపదారవిందములు వేడ్కన్ గొల్తు నన్ బ్రోవుమీ
మారీచప్రమదప్రహారశర! రామా! భక్తమందారమా! 14

మ. మిహికాంశూపమసుందరాననముతో మేలీను కందోయితో
నహిజిద్రత్నవినీలవిగ్రహముతో నంచత్కిరీటంబుతో
విహగాధీశ్వరు నెక్కి నా యెదుటికిన్ విచ్చేయవే యో పితా-
మహసుత్రామముఖామరప్రణుత! రామా! భక్తమందారమా! 15

శా. కంజాతప్రభవాండభాండచయరంగచ్చేతనాచేతనా-
ళిం జెన్నారఁగఁ బ్రోదిసేతువని హాళిన్ ధీజనుల్ దెల్ప హృత్
కంజాతంబున మిమ్ము గొల్తు నను వేడ్కన్ వేగ రక్షింపుమీ
మంజుశ్రీకరుణాకటాక్షమున రామా! భక్తమందారమా! 16

మ. తళుకుం బంగరుకామ గుబ్బగొడు గందంబొప్ప శత్రుఘ్నుఁడ-
ర్మలి బట్టన్ భరతుండు చామరము గూర్మి న్వీవఁగా లక్ష్మణుం-
డలదుం దూపుల విల్లు డాల్పఁ గపిసేనాధీశ్వరుల్ గొల్వ ని-
ర్మలలీలం గొలువుండు నిన్ దలఁతు రామా! భక్తమందారమా! 17

శా. నిక్కంబారయఁ దావకాంఘ్రివిలసన్నీరేరుహద్వంద్వమే
దిక్కెల్లప్పుడు మాకటంచు మదినెంతే వేడ్క భావించెదన్
జిక్కుల్ పన్నక నమ్మికిచ్చి సరగం జేపట్టి రక్షింపు స-
మ్యక్కారుణ్యకటాక్షవీక్ష నను రామా! భక్తమందారమా! 18

మ. అతసీపుష్పసమానకోమలవినీలాంగున్ సముద్యన్మహో-
న్నతకోదండనిషంగగంగు బలవన్నక్తంచరాఖర్వప-
ర్వతజీమూతతురంగుఁ గింకరజనవ్రాతావనాత్యంతర-
మ్యతరాపాంగుని నిన్ భజింతు మది రామా! భక్తమందారమా! 19

శా. ఆర్తత్రాణపరాయణుండవని నిన్నత్యంతమున్ సజ్జను-
ల్గీర్తింపన్ విని తావకీన పదనాళీకద్వయంబాత్మ వి-
స్ఫూర్తిం జెందఁగ నెంతు నెల్లపుడు నన్బోషింపుమీ సత్కృపన్
మార్తాండద్విజరాజసన్నయన! రామా! భక్తమందారమా! 20

మ. మదనాగాశ్వశతాంగ కాంచనకనన్మాణిక్యభూషా మృగీ
మదదివ్యాంబరచామరధ్వజ లసన్మంజూషికాందోళికా-
మృదుతల్పార్థసమృద్ధిగల్గి పిదప న్నీ సన్నిధిం జేరు నిన్
మదిలో నెప్పుడు గొల్చు మానవుఁడు రామా! భక్తమందారమా! 21

శా. శ్రీకంఠాంబుజసంభవేంద్రరవిశోచిష్కేశముఖ్యామరా-
నీకంబుల్ గడుభక్తి నిన్ గొలిచి పూన్కిన్ ధన్యులైనారు నేఁ-
డాకాంక్షన్ భజియింతు మేమఱక చిత్తానంద మొందింపుమా
మాకుం బ్రాపును దాపు నీవగుచు రామా! భక్తమందారమా! 22

మ. కరిరా, జార్జున, పుండరీక, శుక, గంగానందన వ్యాసులున్
పరమాధీశ, బలీంద్ర, మారుతసుతుల్, సంప్రీతి సద్భక్తి మీ
పరమాంఘ్రిద్వయచింతనాభిరతిమైఁ బ్రాపించిరౌ సద్గతిన్
స్మరకోటిప్రతిమానరూపయుత రామా! భక్తమందారమా! 23

మ. అహితార్తుల్ వెడఁబాయు లేము లెడలున్ వ్యాధుల్ దొలంగు న్నవ-
గ్రహదోషంబులు శాంతిఁ బొందుఁ గలుషవ్రాతంబు జాఱున్ శుభా-
వహమౌ తావక దివ్యనామ మెలమిన్ వాక్రుచ్చినన్ ధాత్రిపై
మహితోద్దండతరప్రతాపగుణ! రామా! భక్తమందారమా! 24

మ. గర్గాగస్త్య వసిష్ఠశుక మార్కండేయగాధేయు లం-
తర్గాఢాధికశత్రుశిక్షణకళాధౌరేయతాబుద్ధి సం-
సర్గప్రక్రియ మిమ్ముఁ గొల్తురుగదా క్ష్మాకన్యకోరోజస-
న్మార్గస్ఫాయదురఃకవాటతట! రామా! భక్తమందారమా! 25

మ. అకలంకాయతభోగభాగ్యదము నిత్యానందసంధానహే-
తుక మాభీలతరాఘమేఘఘనవాతూలంబు ముక్తిప్రదా-
యక మత్యంతపవిత్ర మెంచ నిల నాహా! తారకబ్రహ్మ నా-
మకమంత్రంబు భళీ! భవన్మహిమ! రామా! భక్తమందారమా! 26

మ. ఇనుఁ డద్దంబగు నగ్ని నీరగు భుజగేంద్రుండు పూదండయౌ
వనధుల్ పల్వలపంక్తులే జలధరాధ్వం బిల్లెయౌ రాజయో-
గనిరూఢస్థితిఁ దావకీన పదయుగ్మం బెల్లకాలంబు ప్రే-
మ నెదం బూని భజించు ధన్యులకు రామా! భక్తమందారమా! 27

మ. ముదమొప్పార నిరంతరంబు బలవన్మోక్షప్రదామేయభా-
స్వదుదలచ్ఛవదంఘ్రితామరససేవాసక్తచిత్తంబు దు-
ర్మదులం జేరునే పారిజాతసుమనోమత్తద్విరేఫంబు దా
మదనోర్వీజము చెంతకుం జనునె రామా! భక్తమందారమా! 28

శా. ఖండించున్ బహుజన్మసంచితచలద్గాఢోగ్రదోషావలిం
జండప్రక్రియ శైలజావినుతభాస్వచ్చారుదివ్యన్మహో-
ద్దండశ్రీ భవదీయనామ మిలమీఁదన్ భూతభేతాళకూ-
ష్మాండవ్రాతఘనాఘనశ్వనన రామా! భక్తమందారమా! 29

శా. సారాసారకృపాకటాక్షమున నిచ్చల్ భూర్భువస్వః త్రిలో-
కారూఢాఖిలజంతుజాలముల నెయ్యం బొప్పఁగాఁ బ్రోచు ని-
న్నారాధించి సుఖింపలేక శిలలం బ్రార్థింతురెంతే నప-
స్మారభ్రాంతిమదాత్మమూఢు లిల రామా! భక్తమందారమా! 30

మ. సరసీజాతభవాభవామరుల్ చర్చింప మీ మాయ గా-
నరటంచున్ సతతంబు ప్రాఁజదువులు న్నానాపురాణంబులున్
సరసప్రక్రియఁ జాటుచుండఁగఁ బిశాచప్రాయు లెంతేని సో-
మరిపోతుల్ నరులెట్లు గాంచెదరు? రామా! భక్తమందారమా! 31

శా. ధర్మంబంచు నధర్మమంచుఁ గడుమిథ్యాలీల లేపారఁగా
నిర్మాణం బొనరించి ప్రాణులను నిర్నిద్రప్రభావంబులన్
బేర్మిం జెందఁగఁ జేసి యంత్రకుగతిన్ బిట్టూరకే త్రిప్పు నీ
మర్మం బెవ్వ రెఱుంగఁగాఁ గలరు? రామా! భక్తమందారమా! 32

మ. వ్రతముల్ పట్టిన దేవభూసురగురువ్రాతంబులం గొల్చినం
గ్రతుతంత్రంబులు దానధర్మము లపారంబౌనటుల్ చేసినన్
శతవర్షంబులు గంగలో మునిఁగినన్ సంధిల్లునే ముక్తి దు-
ర్మతికిం దావక భక్తి గల్గమిని ? రామా! భక్తమందారమా! 33

శా. సందేహింపక కొంచకెప్పుడు హృదబ్జాతంబులో భక్తి నీ
యందంబై తగుమూర్తి నిల్పికొని యత్యాసక్తి సేవించువాఁ
డొందుం గుప్పున వాంఛితార్థములు బాగొప్పారు వందారు స-
న్మందారంబవు గావె నీ వరయ, రామా! భక్తమందారమా! 34

మ. అరిషడ్వర్గముఁ బాఱఁద్రోలి సకలవ్యామోహముల్ వీడి సు-
స్థిరయోగాంతరదృష్టి మీ చరణముల్ సేవించు పుణ్యాత్మకుల్
వరవైకుంఠపురాంతరాళమున భాస్వల్లీలలన్ ముక్తి తా-
మరసాక్షీరతికేలిఁ జొక్కుదురు రామా! భక్తమందారమా! 35

మ. ఉదయార్కాంశువికస్వరాంబుజరమాయుక్తంబులై యొప్పు నీ
పదముల్ ధ్యానము చేసి ముక్తియువతిం బ్రాపింపఁగా లేక దు-
ర్మదవృత్తిన్ బశుమాంస మగ్ని దనరారన్ వేల్చుఁగా దేవతా
మదిరాక్షీసురతేచ్ఛ, భూసురుఁడు రామా! భక్తమందారమా! 36

శా. ప్రాణివ్యూహలలాటభాగముల లీలాలోలచిత్తంబునన్
పాణీకోకిలవాణినాథుఁడు లిఖింపంబొల్చు భాగ్యాక్షర-
శ్రేణిం బెంపఁ గరంబె యెవ్వరికి సంసిద్ధంబు స్వారాట్ఛిరో-
మాణిక్యస్ఫురదంఘ్రితామరస రామా! భక్తమందారమా! 37

మ. నిను సేవింపని పాపకర్ములకు వాణీనాథగోరాజవా-
హనసుత్రామముఖామరప్రవర వాచాగోచరంబై సనా-
తనమై ముక్తి రమాసమేతమగు నీ ధామంబు సిద్ధించునే
మనురాడ్వంశసుధాబ్ధిసోమ! రామా! భక్తమందారమా! 38

మ. మొదలంజేసిన పుణ్యపాపములు సన్మోదాతిఖేదంబులై
యదన న్వచ్చి భుజింపఁ బాలుపడు నాహా! యెవ్వరి న్వేఁడిన
న్వదలంజాల వవెన్నిచందములఁ దా వారింపఁ జింతించినన్
మదనారాతికినైనఁ దథ్యమిది రామా! భక్తమందారమా! 39

శా. ఇందందున్ సుఖమీయఁజాలని మహాహేయార్థసంసారఘో-
రాంధూబృందనిబద్ధులై సతతమన్యాయప్రచారంబులన్
గ్రిందున్మీఁదును గానకెంతయును రక్తిన్ ధాత్రి వర్తింతురౌ
మందుల్ సుందరమందహాసముఖ రామా! భక్తమందారమా! 40

మ. అమరశ్రేష్ఠుని వారువంబునకు దూండ్లాహార మీశానమౌ-
ళి మహాభోగికి గాలిమేఁత, నిను హాళిన్మోయు మాద్యద్విహం-
గమలోకేంద్రున కెల్లఁ బుర్వుగమియే బోనంబు ప్రారబ్ధక-
ర్మ మవశ్యంబ భుజింప కెట్లు చను ? రామా! భక్తమందారమా! 41

మ. నరుఁడెల్లప్పుడు నాజవంజవభరానమ్రాత్ముఁడై యున్నఁగా-
ని రహస్యంబుగ నీ పదద్వయము ధ్యానింపన్ వలెన్ భక్తితో
బరమానందసుధాసారనుభవలిప్సాబుద్ధియై నుర్విఁ గు-
మ్మరిపుర్వుం బలెఁ బంకదూరగతి రామా! భక్తమందారమా! 42

శా. దానం బాభరణంబు హస్తమునకు దద్‍జ్ఞానికి న్నీపద-
ధ్యానం బాభరణంబు భూసురున కత్యంతంబ గంగానదీ-
స్నానం బాభరణంబు భూతలమునన్ నాడెంపుటిల్లాలికిన్
మానం బాభరణంబు తథ్యమిది రామా! భక్తమందారమా! 43

మ. అదన న్వేఁడిన యాచకప్రతతి కీయంగావలెన్ రొక్కమిం-
పొదవన్ మీ కథలాలకింపవలె మేనుప్పొంగ గంగామహా-
నదిలో స్నానము లాచరింపవలె హీనప్రక్రియ న్మాని స-
మ్మదచిత్తంబున మర్త్యుఁడెల్లపుడు రామా! భక్తమందారమా! 44

శా. ఉద్యానాదిక సప్తసంతతుల బాగొప్పార నిల్పన్ వలెన్
సద్యోదానమునన్ బుధాళి కెపుడున్ సంప్రీతి సల్పన్ వలెన్
ప్రోద్యద్విద్యలు సంగ్రహింపవలె నిత్యోత్సాహియై మర్త్యుఁ డో
మాద్యద్దానవకాననజ్వలన! రామా! భక్తమందారమా! 45

మ. నిను భక్తిన్ భజియించినన్ గురువుల న్నిత్యంబు సేవించినన్
ధనవంతుండయి గర్వదూరుఁడగుచున్ ధర్మంబు గావించినన్
జనతామోదకపద్ధతి న్మెలఁగినన్ జారుండు గాకుండినన్
మనుజుం డారయ దేవుఁ డిమ్మహిని రామా! భక్తమందారమా! 46

శా. అన్యాయంబు దొఱంగి యెల్లరకు నత్యానంద మింపొంద సౌ-
జన్యప్రక్రియ నేల యేలునతఁడున్ శాస్త్రానుసారంబుగాఁ
గన్యాదానము సేయు నాతఁడును వేడ్కన్ భూసురున్ బిల్చి స-
న్మాన్యం బిచ్చినవాడు ధన్యుడిల రామా! భక్తమందారమా! 47

మ. చెఱువున్ సూనుఁడుఁ దోటయుం గృతియు నిక్షేపంబునుం దేవమం-
దిరమున్ విప్రవివాహమున్ జగతి నెంతే వేడ్క గావించుచున్
నిరతంబున్ భవదీయపాదవిలసన్నీరేరుహద్వంద్వ సం-
స్మరణం బూనెడువాఁడు ముక్తుఁడగు రామా! భక్తమందారమా! 48

శా. ఆకాంక్షన్ గృహదాసికాసురతలీలాసక్తి వర్తించినన్
లోకస్తుత్యచరిత్ర! సత్కులవధూలోలుండు గాకుండినన్
కోకాప్తాస్తమయోదయంబుల యెడన్ గూర్కూనినన్ మర్త్యుపై
మా కారుణ్యకటాక్ష మూన దిల రామా! భక్తమందారమా! 49

మ. గణుతింపంగ నరాధముల్ సుకవికిం గాసీనివాఁడున్ దయా-
గుణ మొక్కింతయు లేనివాఁడు నొరుపై గొండెంబు గావించువాఁ
డణుమధ్యన్ సతిఁ బాసి దాసిపొం దాసించువాఁ డుర్వి బ్రా-
హ్మణవిత్తంబు హరించువాఁ డరయ రామా! భక్తమందారమా! 50

మ. వృషలీభర్తయు దేవలుండు నటుఁడున్ వేదాభిశస్తుండు మా-
హిషికుం డగ్నిద కుండగోళకులునున్ హింసాపరస్వాంతుడున్
విషదుండుం గొఱగాఁడు పంక్తి కెపుడుర్విన్ భక్తసంఘాతక-
ల్మషమత్తద్విరదౌఘ పంచముఖరామా! భక్తమందారమా! 51

మ. అగసాలిన్ దిలఘాతకున్ యవనునిన్ వ్యాపారి దాసున్ విటున్
జగతీనాథుని వేటకాని గణికన్ జండాలునిన్ జోరునిన్
బ్రెగడం గోమటి జూదరిన్ బుధజనుల్ పెన్రొక్కమర్పింప న-
మ్మఁగ రాదెంతయుఁ దథ్య మిద్ధరణి రామా! భక్తమందారమా! 52

మ. అలుకన్ మిక్కిలి సాహసంబు ఘనమన్యాయప్రచారంబునుం
జలముం దట్టము కామమెక్కుడు మహాజాలంబు శీలంబహో
తలపైఁ జేయిడి బాసచేసిన యథార్థం బుర్విపైఁ బుష్పకో-
మలుల న్నమ్మఁగరాదు పూరుషులు రామా! భక్తమందారమా! 53

మ. కుకవుల్ కూళలు కొంటెతొత్తుకొడుకుల్ కొండీలు కోనారులుం
దకతైతత్తలవారు పాచకులు జూదంబాడువారు న్మహిం
బ్రకటంబై సిరిగాంచిరీ కలియుగప్రామాణ్య మాశ్చర్య మో
మకరాక్షాసురగర్వసంహరణ రామా! భక్తమందారమా! 54

మ. కలికాలంబున వైద్యలక్షణపరీక్షాశూన్యమూఢావనీ-
తలనాథుల్ బలుమోటకాఁపుదొరలున్ దట్టంబుగా బిల్చి మం-
దుల వేయింప భుజించి క్రొవ్వి కడువైద్యుల్ గారె సిగ్గేది? త-
మ్మళులన్ నంబులు క్షౌరకాంత్యజులు రామా! భక్తమందారమా! 55

శా. దీనత్వంబునఁ గూడులేక చెడి యెంతే భైక్ష్యముల్ గొంచు ల-
జ్జానామంబులు లేకయుంబు బలురాజన్యుండు చేపట్టి దా
నానావస్తువులిచ్చి వైభవమిడన్ న్యాయజ్ఞుఁడై వాఁడిలన్
మానం జాలునె తొంటినీచగతి రామా! భక్తమందారమా! 56

శా. ఎన్నం గార్ధభ ముత్తమాశ్వమగునే; హీనుండు దాతృత్వసం-
పన్నుండౌనె; ఖలుండు పుణ్యుఁడగునే; పల్గాకి సాధౌనె; క-
ల్జున్నౌనే; మహిషంబ హస్తి యగునే; జోరీగ దేఁటౌనెటుల్
మన్నుం బిల్లి మృగేంద్రమౌనె భువి రామా! భక్తమందారమా! 57

మ. బలిభిక్షన్ దయఁ బెట్టఁబూనిన మహాపాపాత్మకుల్ భూమిలో-
పలఁ గోట్యర్బుదసంఖ్యయైనఁ ద్రిజగత్ప్రఖ్యాతదానవచ్ఛటా-
కలనావర్తితపుణ్యమూర్తియగునే గాటంబుగాఁ బర్వు దో-
మలు వేయైన మదద్విపంబగునె రామా! భక్తమందారమా! 58

మ. ధరలోనన్ సుకవిప్రణీతబలవద్ధాటీనిరాఘాటభా-
స్వర సత్కావ్యకథాసుధారసపరీక్షాదీక్ష విద్వన్మహా-
పురుషశ్రేష్ఠున కబ్బు పామరునకే పోల్కిన్ లభించున్ సదా
మరుదాత్మోద్భవసేవితాంఘ్రి నల! రామా! భక్తమందారమా! 59

శా. పద్యంబేల పిసిండి? కీప్సితము దీర్పన్ లేని జేజేకు నై-
వేద్యంబేల? పదార్థచోరునకు నుర్విన్ వేదవేదాంతస-
ద్విద్యాభ్యాసకబుద్ధియేల? మది భావింపంగ నెల్లప్పుడున్
మద్యం బానెడువానికేల సుధ? రామా! భక్తమందారమా! 60

మ. ముకురంబేటికి గ్రుడ్డివానికి జనామోదానుసంధానరూ-
పకళాకౌశలకామినీసురతలిప్సాబుద్ధి ధాత్రి న్నపుం-
సకతం గుందెడువానికేమిటికి మీసంబేమిటికిన్ లోభికిన్
మకుటంబేమిటికి మర్కటంబునకు రామా! భక్తమందారమా! 61

మ. కుజనున్ ధర్మతనూజుఁడంచు నతిమూర్ఖున్ భోజరాజంచు ఘో-
రజరాభారకురూపకారిని రమారామాకుమారుండటం-
చు జడత్వంబున వేఁడి కాకవులు కాసుం గానరెన్నంగ సా-
మజరాజోగ్రవిపద్దశాపహర! రామా! భక్తమందారమా! 62

మ. చలదశ్వత్థతరుప్రవాళమనుచున్ సారంగహేరంబటం-
చలరుం దింటెనపూవటంచు ముకురంబంచున్ భ్రమన్ సజ్జనుల్
కళలూరంగ రమించుచున్ వదల రేకాలంబు ముగ్ధాంగనా-
మలమూత్రాకరమారమందిరము రామా! భక్తమందారమా! 63

మ. సుదతీపీనపయోధరద్వయముపై సొంపొందు నెమ్మోముపై
మదనాగారముపైఁ గపోలములపై మధ్యప్రదేశంబుపై
రదనావాసంబుపయి న్నితంబముపయిన్ రాజిల్లు నెంతేని దు-
ర్మదవృత్తిన్ ఖలుచిత్త మిద్ధరణి రామా! భక్తమందారమా! 64

మ. రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠసంసారఘో-
రసముద్రాంతరమగ్నులై దరికిఁ జేరన్ లేక విభ్రాంతిచేఁ
బసులం గాచిన మోటకొయ్యదొరలం బ్రార్థింతురెంతేని దే-
మసగాదే యిది యెంచి చూచినను రామా! భక్తమందారమా! 65

మ. సరసుం డాతఁడు పెద్ద యాతఁడు మహాసౌందర్యవంతుం డతం
డరిహృద్భీకరశౌర్యధుర్యుఁ డతఁ డుద్యద్దానకర్ణుం డతం
డురుగోత్రోద్భవుఁ డాత డెవ్వడిల నుద్యోగార్థసంపన్నుఁడౌ
మరుదీశోపలనీలమూర్తి ధర! రామా! భక్తమందారమా! 66

శా. విత్తంబొత్తుగఁ గూర్చి మానవుఁడు దుర్వృత్తిం బ్రవర్తించి యు-
వ్వెత్తుం దేహమెఱుంగలేక తిరుగున్ హేలాగతిన్ బత్తిఁ దాఁ
జిత్తాంబ్జంబున మిమ్ముఁ గొల్వఁ డెపు డిస్సీ యెంత పాపంబొకో
మత్తారాతినిశాటసంహరణ! రామా! భక్తమందారమా! 67

మ. శమ మావంతయుఁ బూననొల్లఁడు గరిష్ఠజ్ఞానవిద్యావిశే-
షము గోరంతయు నాత్మలోఁ దలఁపఁ డాచారప్రచారంబు ధ-
ర్మము వీసంబును జేయఁజాలఁడు గదా మందుండు పెన్ రొక్కపున్
మమతన్ దేహమెఱుంగలేక ధర రామా! భక్తమందారమా! 68

మ. భువిలో లోభులు కూడఁబెట్టిన ధనంబున్ బందికాం డ్రూడిగల్
బవినీలున్ దరిబేసులున్ దొరలొగిన్ బచ్చుల్ నటీదాసికా-
యువతుల్ గుంటెనకత్తెలున్ గొనుదు రోహో! యెట్టి కర్మంబొ! హై-
మవతిసన్నుతదివ్యనామ! రఘురామా! భక్తమందారమా! 69

మ. సిరులెంతేనియు నిక్కువంబనుచు దుశ్శీలన్ మదిన్ నమ్మి ని-
ర్భరగర్వంబున మీఁదు చూతు రహహా! భావంబుతో నెంచినం
గరికర్ణాంతము లంబుబుద్బుదతతుల్ ఖద్యోతకీటప్రభల్
మరుదగ్రార్పితదీపమాలికలు! రామా! భక్తమందారమా! 70

మ. ఇటు రా రమ్మని పిల్చి గౌరవముగా హేమాంబరాందోళికా-
కటకప్రాకటభూషణాదు లిడి వేడ్కన్ ఱేఁడు ప్రార్థింప వి-
స్ఫుటభంగిం దగు కావ్యకన్య నిడనొప్పున్ గానిచో నుర్వి కో-
మటి మేనర్కమె బల్మిఁ గట్టఁగను? రామా! భక్తమందారమా! 71

మ. తనకుం బద్యము లల్లి సత్కవులు నిత్యంబుం బ్రసంగింపఁగా
విని యొత్తుల్ దిను దాసరిం బలె బయల్వీక్షించుచుం గానియై-
న నొసంగన్ మదిలోఁ దలంపని మదాంధక్షోణిపాలుం డిలన్
మను మార్గంబు గ్రహింపఁగాఁ గలడె రామా! భక్తమందారమా! 72

శా. ధాటీపాటవచాటుకావ్యరచనోద్యద్ధోరణీసారణీ-
వాటీకోద్గతి సత్కవీశ్వరుఁడు నిత్యంబుం దమున్ వేఁడఁగా
వీటీఘోటకహాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుద్ధిచే
మాటే బంగరు నేటి రాజులకు రామా! భక్తమందారమా! 73

మ. పలుమాఱుం ద్విజరాజు లొక్కటఁ దముం బాధింతురంచున్ విషా-
నలఘోరాననము ల్ముండుంచుకొని కానన్ రాక దుర్గస్థలం-
బుల వర్తించుచు బుస్సురందు రిల నాభోగేశు లెందైననున్
మలఁకల్మాని చరింపఁగాఁ గలరె? రామా! భక్తమందారమా! 74

మ. గడియల్ రెండిక సైచి రా వెనుక రా కాసంతసేపుండి రా
విడిదింటం గడె సేద దీర్చుకొని రా వేగంబె బోసేసి రా
యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుం డీగతిన్
మడఁత ల్వల్కుచుఁ ద్రిప్పుఁ గాసిడక! రామా! భక్తమందారమా! 75

మ. బలరాజన్యుఁడు ధూర్తకాకవిఁ గనం గంపించి విత్తంబు దా-
నలఘుప్రక్రియ నిచ్చు సత్కవివరున్ హాస్యంబు గావించు నౌ
నిల బర్బూరము గాలివానఁ బడుఁగా కింతైనఁ గంపించునే
మలయోర్వీధరమారుతంబునకు రామా! భక్తమందారమా! 76

శా. కాయస్థు ల్గణికాజనంబులు తురుష్కశ్రేణులున్ దుష్టదా-
సేయుల్ వైద్యులునుం బురోహితులు దాసీభూతముల్ గాయకుల్
బోయల్ గొందఱు లోభిభూవరు ధనంబున్ సంతతంబున్ మహా-
మాయాజాలము పన్ని లాగుదురు రామా! భక్తమందారమా! 77

శా. శ్రీలక్ష్మీ మదయుక్తుఁడై నృపుఁడు వాసిం బేర్చు భూదేవునిం
గేలింబెట్టి తదీయకోపమహిమన్ గీడొంచు నెట్లన్న ది-
క్ఖేలత్కీర్తి త్రిశంకుం డల్క నలశక్తిం బల్కి తద్వాగ్గతిన్
మాలండై చెడిపోవడోట మును, రామా! భక్తమందారమా! 78

మ. లసదుద్యజ్జ్వలభవ్యదివ్యకవితాలంకారవిద్యావిశే-
షసమాటోపవిజృంభమాణకవిరాట్సంక్రందనుం ద్రిప్పిత్రి-
ప్పి సమీచానతఁ బ్రోవకుండు నృపతుల్ పెంపేది నిర్భాగ్యులై
మసియై పోవరే తత్క్రుధాగ్ని నిల రామా! భక్తమందారమా! 79

మ. రసికత్వంబును దానధర్మగుణముం బ్రత్యర్థిశిక్షాకళా-
భ్యసనప్రౌఢిమ సాధుబంధుజనతాత్యంతావనోపాయలా-
లసచిత్తంబును దృప్తియుం గొఁఱత వాలాయంబు దానెంచఁ దా-
మసమే మిక్కిలి దుర్నరేంద్రులకు రామా! భక్తమందారమా! 80

మ. ఖలభూనాథుఁడు నిచ్చనిచ్చ జనులన్ గారించి విత్తంబు మి-
క్కిలిగా గూరిచి పుట్టలో నిఱికి వేఁగింపంగ నుద్దండతం
బలవన్మ్లేచ్ఛులు పొంది లావనుచు లే బాధితురౌ పెట్టి జెఱ్ఱిఁజీ-
మలు చీకాకుగఁ జేయు చందముగ రామా! భక్తమందారమా! 81

మ. అతికష్టం బొనరించి భూమిజనుఁ డత్యాసక్తి విత్తంబు వి-
స్తృతభంగిం గడియింపఁగా నెఱిఁగి ధాత్రీకాంతు లుద్దండప-
ద్ధతి వానిం గొనిపోయి కొట్టి మిగులం దండించి యా సొమ్ము స-
మ్మతిఁ గైకొండ్రు మఱెంత నిర్దయులొ రామా! భక్తమందారమా! 82

శా. దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీ పద-
ధ్యానంబున్ గడులొచ్చు సత్యవచనవ్యాపారముల్ సున్న సు-
జ్ఞానం బెంతయు నా స్తి సాధుజనసన్మానేచ్ఛ లేదెన్న నీ
క్ష్మానాథాధమకోటి కేది గతి రామా! భక్తమందారమా! 83

మ. తనువుల్ నిక్కములంచు నెంచుకొని యత్యంతదుర్మార్గవ-
ర్తనులై నిర్దయమీఱ భూమిప్రజలం దండించి విత్తంబు లా-
ర్జవము ల్సేయుచు గొందులం దొదిగి నిచ్చల్గానరాకుంద్రు ఛీ!
మనుజాధీశుల కేఁటి ధర్మములు రామా! భక్తమందారమా! 84

మ. మురుగుల్ ప్రోగులు నుంగరాల్సరిపిణీ ల్ముక్తామణిహారముల్
తురంగంబు ల్గరు లందబులు భటస్తోమంబులున్ రాజ్యమున్
స్థిరమంచున్ మది నమ్మి పాపములు వే సేతు ర్మదోన్మత్తపా-
మరభూవిష్టపదుష్టనాయకులు రామా! భక్తమందారమా! 85

మ. మకరోగ్రక్రకచాగ్రజాగ్రదురుసమ్యక్ఛాతదంష్ట్రాక్షత
ప్రకటాంఘ్రిద్వయనిర్గళద్రుధిరధారాపూరఘోరవ్యధా-
చకితుండై మొఱసేయ నగ్గజపతిన్ సంప్రీతి రక్షింపవే
మకుటీభూతశశాంకచాపహర! రామా! భక్తమందారమా! 86

మ. అగవిద్వేషణుఁ గూడి వేడుక నహల్యాదేవి గ్రీడింపఁగా
భగవంతుండగు గౌతముండు గని కోపస్ఫూర్తి శాపింప నీ
జగతిం ఱాపడి తాపమొందగ పదాబ్జప్రస్ఫురద్ధూళిచే
మగువం జేసితి వెంత వింత యది రామా! భక్తమందారమా! 87

మ. అమరేంద్రాది సమస్తదేవభయదాహంకారహుంకార దు-
ర్దదబాహాబలసింహనాద పటుకోదండోగ్రబాణచ్ఛటా-
సమజాగ్రత్ఖరదూషణాసురుల భాస్వద్దండకారణ్యసీ-
మ మును ల్మలని మెచ్చఁ ద్రుంచితివి రామా! భక్తమందారమా! 88

శా. నే నీ బంటను నీవు నా దొర విదే నిక్కంబటంచు న్మదిన్
నానాభంగుల నమ్మి కొల్చితినె యెన్నాళ్ళాయె జీతంబు కా-
సైన న్నేఁటి కొసంగవైతి భళి యాహా! లెస్స! బాగాయెగా!
మౌనీంద్రాశయపద్మషట్చరణ! రామా! భక్తమందారమా! 89

మ. బలదేవుం డతినీచవృ త్తిని సురాపానంబు గావింపఁగా
జలజాతాస్త్రుఁడు మానినీపురుషలజ్జాత్యాగముల్ సేయఁగా
చలమారంగ నలక్ష్మి సజ్జనుల నిచ్చల పట్టి బాధింపఁగా
మలపం జాల విదే వివేక మిల? రామా! భక్తమందారమా! 90

మ. అదిరా! పిల్చినఁ బల్కవేటికి? బరాకా చాలు నింకేలఁగాఁ
గదరా! మిక్కిలి వేఁడి వేసరిలు బాగా? నీకు శ్రీజానకీ-
మదిరాక్షీ శరణంబులాన! నను బ్రేమన్ ద్రోవరా వేడ్క శ్రీ-
మదుదంచత్ర్పభుతాగుణప్రథిత! రామా! భక్తమందారమా! 91

శా. వందిం బోలి భవత్కథావళులనే వర్ణింతు నత్యంత మీ
చందం బొందఁగఁ గొందలం బుడిపి నిచ్చల్లచ్చి హెచ్చంగ నీ
వందందుం దిరుగంగబోక దయ నాయందుండు మెల్లప్పుడున్
మందప్రక్రియ మాని పూనికను రామా! భక్తమందారమా! 92

మ. అకటా! తావక కావ్యభవ్యరచనావ్యాపారలీలావిలో-
లకసత్స్వాంతుఁడనైన నా పయిని నీ లక్ష్మీకటాక్షామృతం
బొకవేళం జనుదేర దేమి? దయలేదో యోగిహృత్పద్మస-
న్మకరందాసవపానకృద్భ్రమర! రామా! భక్తమందారమా! 93

మ. నతమర్త్యవ్రజవాంఛితార్థఫలదానశ్రీవిరాజన్మహో-
న్నతమందారమవంచు ధీరజను లానందంబునం దెల్ప నే
వ్రతచర్య న్నినువేఁడి వేసరితి ప్రోవన్ రావిదే నీకు స-
మ్మతమా! తెల్పుము తేటతెల్లముగ రామా! భక్తమందారమా! 94

మ. పదపద్యంబు లొనర్చి నీకొసగనో ప్రాజ్ఞుల్ నుతింపగ మీ
పదపద్మంబులు భక్తితోడ మదిలో భావింపనో? యేమిటం
గొదవే దేఁటికి జాగుచేసెదవ ? కోర్కులు దీర్పు వేవేగ! శా-
మదరాతిక్షణదాచరప్రమద! రామా! భక్తమందారమా! 95

మ. క్రతువుల్ సేసెదనంటినా బహుపదార్థంబిల్లె! సంధ్యాజప-
వ్రతముల్ సేసెదనంటినా దొరలఁ గొల్వంగావలెం గూటికై
ధృతి నిన్వేడెదనంటినా నిలువ దొక్కింతైనగానీ దయా-
మతి నన్నేగతిఁ బ్రోచెదో యెఁఱుగ రామా! భక్తమందారమా! 96

మ. తగునా పావన తావకీన పదధ్యాననిష్ఠాగరి
ష్ఠగతిన్ వర్తిలు మాకు నిప్పు డతికష్టప్రాప్తిఁ గావించి బల్
పగవానిన్ బలెఁ జూడఁగాఁ గటకటా! పాపంపు గాదోటు! జి-
హ్మగసమ్రాట్కరకంకణప్రణుత! రామా! భక్తమందారమా! 97

మ. నిను నా దైవముగా భజించుటకు నే నిత్యంబుఁ గావించు స-
జ్జనతాకర్ణరసాయనప్రకటభాస్వత్ సోములే సాక్షి నీ
వనుకంప న్ననుఁ బ్రోచుచుండుటకు నీ యైశ్వర్యమె సాక్షి నీ
మనసు న్నా మనసు న్నెఱుఁగు నిది రామా! భక్తమందారమా! 98

మ. జయమొప్పార నిను న్మదీయహృదయాబ్జాతంబునం గొల్తు నే-
రములెల్లన్ క్షమచేసి ప్రోతువనుచున్ రాఁగం జనన్ నీదు చి-
త్తము నా భాగ్య మదెట్టిదో యెఱుగ తథ్యం బిద్ధసంగ్రామధా-
మమహాకాయవిరామశాతశర! రామా! భక్తమందారమా! 99

మ. జయ! నారాయణ! భక్తవత్సల! హరే! శౌరే! జగన్నాయకా
జయ! సీతాహృదయేశ! శేషశయనా! శశ్వద్దయాసాగరా!
జయ! పీతాంబర! రామచంద్ర! జలదశ్యామాంగ! విష్ణో! నిరా-
మయ! లీలామనుజావతారధర! రామా! భక్తమందారమా! 100

మ. సరసప్రస్తుత కూచిమంచికులభాస్వద్వార్ధిరాకాసుధా-
కరుఁడన్ గంగనమంత్రినందనుఁడ! రంగత్తిమ్మభూమండలే-
శ్వరపర్యార్పిత “బేబదల్” బిరుదవిస్ఫాయజ్జగన్నాథనా
మ రసజ్ఞుండను బ్రోవు మెప్డు నను రామా! భక్తమందారమా! 101

సంపూర్ణము.
రచించినవారు - కూచిమంచి జగన్నాథకవి

కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat