: తాడిమళ్ళ రాజగోపాల శతకము :
సీ. శ్రీకృష్ణు నెవ్వరు సేవించుచుందురో వైకుంఠపురమున వారు ఘనులు
కమలనాభుని జిత్తకమలంబులో నిల్పి వసుధలో మెలగెడువాడు రాజు
ధనము మెండుగ గూర్చు ధన్యులెందరునైన స్వామిభక్తులతోటి సాటిగారు
హరినామకీర్తన లతిభక్తి చేసినవారి దుష్కర్మముల్ వదలిపోను
తే. గలియుగమునం దొనర్చు నఘంబులెల్ల | బాసిపో గాక వెంబడి బడియు రావు
కల్లగాదయ్య శ్రీతాడిమళ్ళవాస | రాజగోపాల నీ పూజ తేజమయ్యె. 1
సీ. నాథుండు బహుమంది నాటకస్త్రీలతో గలిసియున్నాడని కబురువింటి
మగువలతోగూడి మఱచియున్నాడట రాధపై గృప యేల రాకపోయె
బిలిచి చిన్నప్పుడు ప్రీతిజేసినవాడె యతివరో యిపుడేల యలిగినాడు
నెలతరో నావల్ల నేరమేమున్నది మాటాడమని నీవు మందలించి
తే. గట్టిగా కృష్ణు నిప్పుడు బట్టి తెచ్చి | మనసుదీర్పవే యీవేళ మళ్ళిరావె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 2
సీ. నాథుని కస్తూరినామంబు గన్గొని కలికి యెవ్వతె వాని గౌగిలించె
దక్కుచు నా యింటి దగ్గర రాకుండ మాటున బెట్టిన మగువ యెవతె
ప్రియుని నా పనుల కొప్పించిన దెవ్వతె దానికి నా యుసుర్తగులుగాక
దోషమంచెన్నక దుడుకులాడెవ్వతె మన్నన రావించి మరులుకొల్పె
తే. దాని కోరిక లీడేర్చు దైవమిప్పు- | డెంత యాసక్తితోనున్న నింతె గదవె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 3
సీ. కౌస్తుభమణిహారకంకణంబుల జూచి రానియ్యదయ్యె నా రమణి యెవతి
నాసాగ్రమందున్న నవమౌక్తికము జూచి వలచిన దెవ్వతె నాడు వల్ల-
భుని హరిచందనము మేన నలదికొన్నది చూచి పరిమళగంధి యెవతె పక్కజేర్చె
శంఖచక్రములున్న పొంక మెవ్వతె చూచి బలవంతమున వాని భ్రమలు గొల్పె
తే. నతివ యెవ్వతె దారిలో నడ్డగించి | పొదల కనుగొనిపోయె నాదు వల్లభుని
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 4
సీ. సన్నజాజుల సొబగెన్ననేమిటికి నా పతి నన్ను విడనాడి పల్కనపుడు
రమణిరో కృష్ణుడు రాడాయెనని మది తళ్కు చీరయు గట్ట దలంపురాదు
వనితరో నా యేడువారాల సొమ్ముల బరిణె విప్పను నాకు భ్రాంతి లేదు
ఆభరణాలంకృతాంగినై యేనున్న ఫలమేమి కృష్ణుడు వలచిరాడు
తే. ఎన్ని సొగసులు గలిగిన నేమిఫలము | కలికి కృష్ణుడు వచ్చుట గాదె సొమ్ము
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 5
సీ. కృష్ణ నీతోడను గ్రీడింప మది గోరి పడతి రాధిక నన్ను బంపెనయ్య
జోడుగా నినుగూడి జూదమాడుటకు సోలుచు బ్రతిజాము చొక్కునయ్య
చందురుకాకకు సఖియ తాళగలేక యస్సురుస్సురు మనుచుండునయ్య
మదనుండు శరములు మానక వేయగ మగువ నీపై చింత మానదయ్య
తే. యనుచు బోధించి యీ మాటలన్ని చెప్పి | సొరిది కృష్ణుని దేవమ్మ సుందరాంగి
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 6
సీ. పద్మగర్భుని వ్రాత బరిహార మొనరింప వశమటే యెంతటివారికైన
బగతుడై యా బ్రహ్మ బలవంతమున నన్ను గుత్సితునకు నొనగూర్చెనమ్మ
వేషధారికి నేను వెలదినై యుండగ సుదతిరో సంసారసుఖమెఱుంగ
మును నీవీ రీతులనన్నియు జూచిన యప్పుడే కాదని చెప్పనైతి
తే. ననుచు నీవేళ నామాటలడిగి రా- | దలంచి రమ్మని నిను బిలిపించితింతె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 7
సీ. వ్రేపల్లెవాడలో గాపైన కృష్ణుని గూర్చిన నీకిత్తు గుండ్లపేరు
చెలియరో యీవేళ జెలికాని దెచ్చిన సఖియరో నా బన్నసరములిత్తు
వగకాని నీవేళ వదలక తెచ్చిన కలికిరో పౌజుల కమ్మలిత్తు
మొగమిచ్చి నాతోను ముచ్చటాడించిన ముత్యాలసరములు ముదిత యిత్తు
తే. నెన్ని సొమ్ములునైన నేనిత్తు నీకు | నా పతిని జూచినంతనె నయముమీఱ
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 8
సీ. సఖియరో నా పతి సంశయమ్ములు మాని రాడేమిసేయుదు రాజవదన
కోమలి నా మీద గోపమింతేలనే దన సిగ్గు దానేల దాచడాయె
నా యీడువారిలో నన్ను గుందించుట కూడదు తనకిది గుణముగాదు
యేమి సేయుదును నేనేలాగు నోర్తునే విరహవేదనచేత విసికినాను
తే. మదనబాణాగ్ని యేలాగు మానిపోను | చెలియ నా వెతలేమని చెప్పుకొందు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 9
సీ. పగతుడై మదనుండు బాణముల్సంధించి చురచురక్కున సేయజూచెనమ్మ
బాల యాతని వేడిబాణముల్ దాకక తప్పించుకొనగ నా తరముగాదు
యో సఖి నిమిషంబు నూరకుండనుగాదు వెడవిలుకాడు నా వెంటనంటి
జాముజామున లేపి లేమరో నా పైని తన శరంబులు చేర్చి దాకునమ్మ
తే. బుట్టి వెతలకు లోనయి యెట్టులుందు | మంచిపనిగాదు రమ్మని మందలించి
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 10
సీ. పసులగాపరియైన పద్మనాభుని కేను పడతినెట్లయితినే బాల్యమునను
ఉట్టి పెట్టిన వెన్న దుట్టగా మెక్కిన చోరునికేలనే సుదతినైతి
గడెగడెకును వేసగాడంచు దెలియక వెఱ్ఱిగొల్లనికేల వెలదినైతి
నవతారమూర్తి యంచాసనొందితికాని దైత్యసంహరుడంచు దలచనైతి
తే. నతివ యావేళ రుక్మిణీపతిని గాంచి | విసికియున్నది రమ్మని వేగిరంబ
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 11
సీ. కలికిరో నా పతి కరుణించి యీవేళ వచ్చి నా కౌగిట జొచ్చునేమొ
ఊహించి నీచేత నుత్తరంబంపిన ప్రేమతో రమ్మని పిలుచునేమొ యేను
జేసిన పూజ యిత్తరి ఒకవేళ దరుణి నాపయి భ్రాంతి గలుగునేమొ
సుదతి నా పల్కులు చోద్యమై తోచిన వడివడి నొకవేళ వచ్చునేమొ
తే. పడతిరో నాదు కౌగిట పంజరమున | జేర్పబొసగదె యెటులైన జెలిమికాని
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 12
సీ. బాగుగా శేషాహిపానుపుపై బవళించితినంచు గర్వింపదగునె
పంతగించుట గొల్లభామలయిండ్లలో బొంచియుండుట దన కంచితంబె
నాతిరో తనవంటి నాథుని నమ్మిన జింతతో బవళింపం జెల్లునటనె
గొల్లవానికి రాజుకూతురునియ్య మా తల్లిదండ్రులకిది ధర్మమగునె
తే. పసులగాపరి కీలాగు పడతిజేసి | కూర్చె గద నన్ను దైవంబు కుటిలబుద్ధి
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 13
సీ. సఖియరో యాతని సంప్రదాయంబెల్ల విను చెప్పెదను నీకు విశదముగను
దన తల్లిగుణములు దక్కించి చూచిన బుత్రుల గని చంపు పుణ్యశాలి
తన యక్కగుణములు దరమటే యెంచను నైదుగురికి రాణియైన గరిత
తన యన్నగుణములు దానె యెఱుంగును దున్నుక బ్రతికెడి దుక్కిముచ్చు
తే. ఇంత బహిరంగమాతని యింటిగుట్టు | కడకు దన కెట్టు సుగుణంబు గలుగునమ్మ
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 14
సీ. విరులు సరంబులు వింతగా సవరించి క్రొమ్ముడిలో జేర్చుకొన్నదనవె
జిగివన్నె బంగారుచీరలు రత్నాలు దాపిన రవికయు దాల్చెననవె
సఖియ పున్నమనాటి చందురుకన్నను మిన్నయై మెఱయుచున్నదనవె
నీమీద ప్రేమతోనిండార నేవేళ దైవము బ్రార్థించు తరుణి యనవే
తే. నీవు రాకున్న నిక నొక్కనిమిషమైన | నెలత యుసురులు తనువున నిల్వదనవె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 15
సీ. చెలియ నన్నీలాగు నలయింపగా నీకు లేస్సగా దనిమందలింపుమపుడు
అతివరో నన్నిటులారడి సేయుట దగదనిచెప్పు మాతనికినీవు
భయమేమి వానితో బరుషో కులకునై, ననిపుడేలరావని యెలమినడుగు
మతనికి గరుణరా నర్మిలి మాట్లాడియీ వేళ తోడి తెమ్మింతినీవు
తే. జాగు సేయక రాగదే జాములోన | నానవాలందుకొని వేగనతనికడకు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 16
సీ. తరుణి నా యధరామృతముగోరు నా పతికిప్పుడు విసము నేనెట్టులైతి
నతనికి నా నేస్త మతిదూరమేయుండ నెవ్వతె చేసెనో యెఱుగనైతి
మగువ చిన్నప్పటిమాటలో చోద్యముల్ గలుగు నాకెపుడని గర్వపడితి
బడతి నన్నందఱి పాటిగా నెంచక యెక్కువ లాలించు టెఱుగనైతి
తే. నలరువిల్తుని బారికి నప్పగించి | చెలియ నన్నిప్పుడీరీతి జేసినాడు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 17
సీ. అతనికి నేమేమి యానవాలంటివా వేణువు దనచేత బూనువాడు
రహినొప్ప శంఖచక్రంబులు గలవాడు సఖియ శ్రీవత్సలాంఛనమువాడు
కోమలి నవరత్నకుండలంబులవాడు కస్తూరితిలకము గలుగువాడు
నలినాక్షి స్త్రీలతో నవ్వుచుండెడువాడు కమనీయ జీమూతకాంతివాడు
తే. యిన్ని సొగసులు గలిగిన వన్నెకాడు | దెలిపి నా వర్తమానము దేటపఱచి
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 18
సీ. కమలాక్షి యడవిలో గాయు వెన్నెలరీతి నాతడు సరసము లాడడాయె
గూరిమి నాయొద్ద గూర్చున్నయపుడైన నింతి నాకొక్క ముద్దియ్యడాయె
బడతి నే రమ్మని బతిమాలినపుడైన నగరుగంధమ్ము మేనలదడాయె
నో రాధికా యని యూహించి యెపుడైన బ్రీతితో నన్ను తా బిల్వడాయె
తే. నరయ నా మది చింతచే నడలజేసె | మానితంబుగ గృష్ణుని మనసురాదు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 19
సీ. చెలగి నాతో జెల్మి సేయుచున్నప్పడు దూరపుజర్చకు దొడరనైతి నతివ
వాదము సేయడంచు దోచెనుగాని యిటు మాయకాడౌట యెఱుగనైతి
వేగమె కర్పూరవిడెము మెక్కితి గాని యతివ భోగాలు చే నందనైతి
భామ పూపాన్పుపై పవ్వళించితి కాని కూరిమితో వాని గూడనైతి
తే. వెలది నా వెతలెంతని విన్నవింతు | నతని దయరాదు నేనెంత యడరియున్న
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 20
సీ. చెంగల్వకొలనులో శృంగారముగ జలక్రీడ చేడియలతో నాడువాని
సిగ్గులేకను వారి చీరలన్నియు గొని తక్కక పొన్న మ్రానెక్కువాని
నెక్కడి చోరకుం డెత్తుకపోయెనో యనుచు వ్రేతల నలయించువాని
కొలనులో సిగ్గుచే గొంకెడు వనితల చలువలిచ్చెదనని వచ్చువాని
తే. బైట రండిత్తునని వారి భ్రమలఁ బెట్టి | హస్తములు రెండు నెత్తుడంచనెడువాని
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 21
సీ. లంచమియ్యకను రానంచు బొమ్మనువాని నప్పుడే యేమైన నడుగనైతి
మొలకనవ్వుల ముద్దుమోము జూచినయంత నాతని గుణము లే నరయనైతి
మా తల్లిదండ్రుల మాటలాలింపక కుటిలబుద్ధిని గూడి కోలుపోతి
వేగిరపడి నేను వేడుకొంటిని గాని సవతిపోరనుచు నే జడియనైతి
తే. కొమ్మ నా బుద్ధి కేమనుకొందునమ్మ | వలపు ఘనమాయె యోర్వ నా వశముగాదు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 22
సీ. విరహతాపంబాయె విభుడిటు రాడాయె మది తాల్మి లేదాయె మందయాన
వెన్నెలాతపమాయె విరిసరుల్ వెగటాయె నిదుర లేదాయెనే నీలవేణి హ-
ర్షంబు లేదాయె నాడికల్ ఘనమాయె నిద్దరి కెడమాయె నిందువదన
కలికి పెట్టినమందు తలకెక్కి యిపుడైనచేడె నా యిలు తొంగిచూడడాయె
తే. పగలు రేయును దానింట బండనాయె | నెలక నాపొందుమదిలోన నెన్నడాయె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 23
సీ. బాణజాలంబుల పాలు సేయగనేల కాముడా నీ రూపు కాలిపోను
చెవులు చిందరగొన జెలగి కూయగనేల కోకిల నీ యుల్లు గూలిపోను
ప్రళయాగ్నిరూపమై పట్టుగా విసరెడు పవనుడ నినుఁ ద్రాచుపాము మ్రింగ
వెన్నెల గురిపించి వేడి చూపగనేల చంద్రుడా నీ రూపు సమసిపోను
తే. వలచి వలపించి నా ప్రాణవల్లభుండు | రాడనుచు వీరలందఱు గూడికొనిరి
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 24
సీ. దశరథనందన ధాత్రీశయచ్యుత దైతేయహర మీకు దండమయ్య
గౌతమాంగనశాపకలుషంబు బాపిన ధర్మాత్మ హరి మీకు దండమయ్య
వనచరవందిత వారిధిబంధన దశకంఠసంహార దండమయ్య
గోపాలసేవిత గోపీమనోహర తాపసనుత మీకు దండమయ్య
తే. జానకీనాథ రాఘవచక్రహస్త | రఘుకులోత్తమ దశరథరామచంద్ర
................................. | రాజగోపాల రావయ్య రమణి గూడ. 25
సీ. చల్లగ వర్ధిల్లు సరససద్గుణమణి సౌభాగ్యమే నీకు సత్యభామ
యారోగ్యమే నీకు నతివ చక్కనిలేమ దీర్ఘాయువే నీకు తెరవ సుమతి
మంగళమే నీకు మహనీయగుణవతి సాఫల్యమే నీకు సరసిజాక్షి
శ్రీరస్తు నీకును శీతాంశుముఖమణి కల్యాణమే నీకు కంబుకంఠి
తే. నీవు కోరిన కోర్కెలు నిత్యముగను | సఫలమాయెను బోగదే సత్యభామ
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 26
సీ. ఏమిరా కృష్ణ నీకెంత గర్వంబురా పిలిచిన పలుకవు పిరికితనము
ఆలకాపరివాడ పతిభీతితనమైన గనిపెట్టి గోవుల గాయవలదె
చీకటియిండ్లలో బ్రాకులాడుచు వెన్నపాలు దావుట నీకు భయముగాదె
దూరి పొరుగిండ్లలో దొంగిలి దినకుండ చోరుడవై స్త్రీల జేరదగునే
తే. యింత చక్కనితనము నీ సంతసమున | గనెనె మీ తల్లి తన వరగర్భమునను
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 27
సీ. పసులగాపరియంచు బలుకులాడెదవేమి నా బిరుదెఱుగవా నాతి నీవు
కలికిరో నా నాభికమలమందున బ్రహ్మ చాతుర్ముఖంబుతో జననమాయె
పాలకడలిని బుట్టి పద్మాక్షి బెండ్లాడి మన్మథు గంటినే మగువ నాడు
ఆదికాలమునా డవతారమెత్తిన మత్స్యావతారము మహిమ వినవె
తే. యుగయుగంబుల పలువిధముగ జనించు- | వాడనని నీవెఱుంగవె వనిత పోవే
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 28
సీ. మత్స్యావతారమై మడుగులో జొచ్చియు జేపవై పుట్టుట జన్మమేమి
కుటిలబుద్ధిని నీవు కూర్మావతారమై తాబేలవైనది తప్పుగాదె
వరహావతారమై వాంఛ పడితివిగాని యతినీచమనుచు నెఱిగినావ
యావెన్క నారసింహావతారంబెత్తి మఱుగుజ్జువాడవై మల్లినావు
తే. వేషధారికి యా బ్రహ్మ వెఱ్ఱియగుచు | గూర్చినందుకు నేమనుకొందునింక
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 29
సీ. అర్జునుకోసమై యవతారమెత్తిన కృష్ణావతారంబు గుణము వినుము
వాయుపుత్రునితోడ వాదించి యర్జును డంపశయనము గట్టినట్టినప్పు-
డా విల్లుజెడకున్న నా క్షణంబునను దా గేరుచు హనుమంతు గూల్చినాడు
పదునొకండక్షోహిణి బలముల జంపించి యర్జును గాచితి నతివ నాడు
తే. ధరణిలోపల నా విల్లు విఱుగనీక | పట్టి బరువును నాపైని బెట్టుకొంటి
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 30
సీ. వాదించుచును నీవు వద్దను గూర్చుండి తగులాట బెట్టుట తగవుగాదు
వారు వీరనుకొన్న వట్టిమాటలగూర్చి చాడీలు చెప్పుట సమముగాదు
చిన్నవాడవుగాదు తన్నులాడించను బాల్యమా యిది నీకు బాగుగాదు
పదియేండ్లలోపల బాలుడవై యుండి గోవర్ధనాద్రిని గొడుగుగాను
తే. బట్టి గోగోపకుల వెతల్పెట్టినావు | సురవరుడు ఱాళ్ళవానను గురియు తరిని
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 31
సీ. అంబుజాక్షిరో వామనావతారుండనై బలిచక్రవర్తిని బాధలిడగ
బూని మూడడుగుల భూమి నే నడుగగ నతడు గైకొమ్మని యంబువోయ
భూమి నాకాశంబు బొత్తిగా గొలిచిన బాదద్వయంబయ్యె బడతి నాకు
మూడవ పాదంబు మోపు చోటేదన భీతిల్లి తన నెత్తి బెట్టుమనియె
తే. నంత నాతని నే బట్టి యడగదొక్కి | తిరిగి యవతారమున మల్లి దేలినాను
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 32
సీ. అవతారమెత్తుచు హతము సేయుటగాని గొనసాగనీయవు గొల్లబిరుదు
వంచించి మరి గొల్లవారల నందఱ చిక్కుబెట్టుచు నీవు చెలగినావు
బలిచక్రవర్తిని బంధించితివిగాని పాపమెఱుంగవు పడుచవగుచు
సుఖము నెరుంగగా సూటివౌదువెకాని బిరుదైన చక్కని పేరు గనవు
తే. మర్మమొచ్చిన యీలాగు మంచిఘనులు | సంహరించుట సరసమా సమరసమున
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 33
సీ. సూర్యవంశమునందు శూరుడై వెలసిన దశరథరాజుకు దనయుడైతి
గౌసల్య నన్నును గర్భంబులో మోసి గన్నది మరి దైవఘటనచేత
భరతశత్రుఘ్నులు పరగంగ లక్ష్మణు లనుజులు దొడ్డవా రవని గలరు
రహి లంకలోనున్న రావణాసురు గెల్వ రాజెవ్వడును లేడు రాజ్యమందు
తే. నందుకోసము నే వచ్చి యవతరించి | సిరుల వరలితి నిక వేయి జెప్పనేల
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 34
సీ. ఎనమండ్రు పట్టపుటింతుల విడనాడి నలినాక్ష విరహివైనావు గావ
పదియారువేల యా పడతులకోసమై నరకాసురుని గొట్టినావు గావ
భూపతివై పుట్టి బోరజొచ్చితిగాని యాద్యవతారమై యలరినావ
మకరిని చాటున మదమడంచితిగాని సమముగా జగడము సలిపినావ
తే. చోరుడై వచ్చి యీపాటి ధీరవరుల | గొట్టవచ్చునె పదికోట్ల గుంపులోన
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 35
సీ. జనకుడన్ బహుశాంతశాలి సముఖమ్మున విఱువరానట్టి విల్విరచినాను
యవనిపుత్రిక సీత నతివేగముగ నేను గెల్చుకొంటిని భూమికీర్తికొఱకు
జోడుగా భూపుత్రికూడ వేడుక లలరంగ నయ్యోధ్యాపురంబు జేరి
తల్లిదండ్రుల నన్నదమ్ముల మెలగుచు రారాజునైతి నో రమణి నేను
తే. సుదతి యీవేళ నన్నింత చుల్కచేసి | మాటలాడుట యిది నీకు మంచిదటనే
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 36
సీ. రహి లక్ష్మణుండను రాజును గాపిడి సీతను చెరసాల చేసివావు
మారీచుడని నీవు మర్మంబుగానక గాసిల్ల నమ్మున నేసినావు
హా లక్ష్మణా యని యా మృగంబటు గూయ వడిగ నీకోసమె వచ్చినాడు
రథమెక్కి యత్తరి రావణుం డరుదెంచి సీతను భీతిల్లజేసినాడు
తే. యింత నగుబాటువాఁడవు సంతసమునఁ | బ్రజ్ఞలాడెదు నాయొద్ద ప్రకటితముగ
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 37
సీ. తప్పక లక్ష్మణుఁ దడయక గాపిడి యేగి మృగమ్మును నేయుతరిని
హా లక్ష్మణా యని యా మృగమటు గూయ మగువకు దుఃఖమై మరిది నంపె
మారీచు మాటయే మా యన్న గాదని భావించి తమ్ముడు బాసచేసె
నాడగూడని మాటలాడగా దలపెట్ట వనితరో తమ్ముడు వచ్చినాడు
తే. రమ్యమైనట్టి ముల్లోకరక్షకుఁడగు | సుదతి దశరథరాజుకు సుతువుగాడె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 38
సీ. ధరణిలో గృష్ణావతారమెత్తిననాడు తల్లిమాటకు మేఱ దప్పినావు
ఆ తల్లి నిన్నెంతో యాసక్తి బెంపగా దుందుడుకై చాల దూకినావు
గద్దఱీవని తల్లి పెద్దరోటను గట్ట మద్దులఁ బడద్రోసి మళ్ళినావు
మగుడి యావెంటను మఱి బుద్ధరూపమై చెలుల వ్రతంబులఁ జెఱచినావు
తే. చెడ్డవాఁడవు నీచెంతఁ జేరరాదు | స్త్రీల నీలాగు సేయుట మేలుగాదు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 39
సీ. చెంగల్వకొలనిలో శృంగారసతులెల్ల జలక్రీడలాడిన జాడ గంటి
సిగ్గులేకను బట్టుచీరలన్నియు విప్పిపెట్టిన జాడ నేనట్టె గంటి మగువరో
యా చీరమడతలన్నియు గొని చెలియరో యా పొన్నచెట్ల నిడితి భామ
అందఱు గూడి బట్టబైలను నిల్చి ముమ్మారు మ్రొక్కిరి ముద్దుగాను
తే. తగనెఱుంగవె కృష్ణావతార మహిమ | యింతవాడని నా గుణ మెఱుగలేవె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 40
సీ. ఓలలాడుచునున్న స్త్రీలయొద్దకు బోయి సిగ్గుమాలిన పేర్మి జెప్పవలెను
తప్పక నీ దుష్టతనము నింపాయకాని పాయక యా పనుల్సేయదగునె
వావివర్తనలేక వరించుచును నీవు కోరిన మేనత్తను గూడదగునె
పాపమౌననకను బడఁతుల వంచించి చెయియూత లొదవింప జేయదగునె
తే. మొగ్గలంబాయె నీదగు మగతనంబు | సిగ్గులేకను నాతోడఁ జెప్పినపుడె
తగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య తేజముగను. 41
సీ. ఘనుడు సత్రాజిత్తుకన్య వేడుకతోను బెండ్లాడివచ్చిన బిరుదు వినవె
నీలాపనిందలు నిశ్చయంబుగఁ గొంత నా మీదఁ బల్క నే నాతియుతుఁడ
గానఁ జంద్రుడు పాలలో గనపడినట్లు జాడ కొంచముగంటి జాములోన
బడతి నేనొక భాద్రపదశుద్ధచౌతిని దనరంగ శశిబింబదర్శనంబు
తే. గాగ నా మార్గమున వచ్చి కలసి నాతో | సంపదల బొందియుండవె సత్యభామ
తరుణ నా యూరి పేర్విను తాడిమళ్ల | రాజగోపాలు డందురే రమణి నన్ను. 42
సీ. జగడ మన్యాయమై జాంబవంతుని గెల్చె కానుక దెచ్చిచ్చిగాదు బిరుదు
ఎంతమాత్రంబైన నీ యతిశయముచే మిక్కిలి మఱియేమి మేలులేదు
బాల్యమందున రామభద్రుండవై యుండి వెలయ వనమునకు వెళ్ళినావు
పదునాలుగేడులు పరగ దమ్ముడు నీవు నెలమి సీతతోఁ జరియించినావు
తే. గాన నీదు ప్రభావముఁ గానఁబడియె | మర్మమెఱిగితి నీ కీర్తిమహిమఁ గంటి
తగవులన్నియు మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 43
సీ. సుప్రసేనుఁడు మణి సూటిగా దాల్చుక వేటాడ నడవికి వెడలివచ్చి-
నంతట నొకసింహ మాతని వధియించి మణి గొంచుబోవ నమ్మార్గమునను
గని జాంబవంతుండు ఖండించి దానిని దనచేత బట్టుక దర్లిపోయె-
నంత సత్రాజిత్తు డనుజుఁడు రాకున్న శ్రీకృష్ణుండీ మాయ చేసెననుచు
తే. వనిత నామీద గట్టితే వట్టినింద | దెలిసి యావెన్క నామణి దెచ్చినానె
మా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. 44
సీ. శ్యామలవర్ణ నీకేమని యిచ్చునో జాంబవతిని నీకె జాగులేక
నీ శాంతవంతంబు నీ గుణంబెఱుగక పడతిని నీవెంట బంపినాడు
పేరిమి నిను తల్లి పెంచిన మొదలుగా నుగ్గుపాలు నెఱుంగ వొక్కనాడు
తలిదండ్రులొకచోట తపియించుచుండగా పెఱిగిన వెఱుగవు వెఱపులేక
తే. ఆతతాయివి నీవిటు లవతరించి | పూతనాయంతకుడవగు పుణ్యమూర్తి
దగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 45
సీ. మా తండ్రి దశరథమహరాజుగారికి భార్యలు ముగ్గురు పడతి వినవె
మువురిలో కైక యన్యాయమ్ముగ నను బరగ వనమునకును బంపదలచె
రథమెక్కి దశరథరాజుతో నా కైక వనములో మును రెండువరములడిగె
భరతుని సామాజ్యపట్టాభిషిక్తుగా నడవి శ్రీరాముల ననుపుటయును
తే. నిట్టి రెండువరమ్ములు బట్టియపుడు | వెలదిగోనన్ను నడవికి వెడలుమనిరి
నా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. 46
సీ. తండ్రిపంపున నీవు తగ వనంబున కేగి చేడెకైనను గల్లలాడదగునె
వనితతో వనవాసమొనరింప నత్తఱి చుప్పనాతికి ముక్కుచక్కజేయ
నా చుప్పనాతియు నన్నతో బోరాడి మారీచు బంపెను మాయజేసి
మారీచు మాయలు మది నెఱుంగక నీవు విల్లుచేతను బట్టి వెళ్ళినావు
తే. దనుజు దునుమాడి వచ్చుచో వనమునందు | సీత గానక మనలోన చింతపడేవె
తగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 47
సీ. లక్షశత్రులుగల లంకేశ్వరునితోడ జగడాని కెవ్వరు చాలగలరె
నెలతరో మఱి యారునెలలకు లేచెడి కుంభకర్ణు నెవరు గూల్పగలరె
మిన్నుననున్నట్టి యా మేఘనాథుని బట్టి యతివ యెవ్వరణచగలరె
జలధిలోపలను శిల్వల నొప్ప దేలించి వారిధిఁ గట్టించువారు గలరె
తే. నారి యెరుఁగవు రామావతార మహిమ | యింతవాడని నా గుణమెంచనేల
నా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. 48
సీ. నిర్మింపగలవాడు నీలుఁడుండఁగ గదా వారిధి బంధించి వచ్చినావు
బడలికచే నిద్ర భ్రమసియుండఁగ గదా కుంభకర్ణుని నేల గూల్చినావు
దైవగతికి దప్పు దనుజులనందఱ సంహరించను నీవు చాలినావు
యింతటివాఁడవై యింద్రజిత్తుని నాగపాశముచే జిక్కి బడలినావు
తే. నేనెరుఁగుదు నీదు మహాత్మ్యమిపుడు | నవ్వరే నిన్ను విన్నవారెవ్వరయిన
దగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 49
సీ. మగువరో కాళిందిమడువులోపల గ్రుంకి ఫణిగర్వ మే నెడబాపినాను
వనిత నరయబోయి వాలి నా క్షణమందు గురిబెట్టి దెబ్బను గూల్చినాను
వనజాక్షిరో ఱాళ్ళవానలు గురియగా బలుకొండ గొడుగుగా బట్టినాను
పశువులతో చిన్నిబాలుఁడనయియుండి గోవుల పాల్వెన్న గ్రోలినాను
తే. ముదితరో యిట్టి యవతారమూర్తినైన | నన్ను దూషింప నిది నీకు న్యాయమటనె
నా యూరి పేర్విను తాడిమళ్ల | రాజగోపాలుఁడందురే రమణి నన్ను. 50
సీ. చెలగుచు నీ వొక్క చెట్టుచాటుననుండి వాలిని నేయుట వరుస గాదు
ఊరక పడియున్న యురగంబుపై నీవు పాదంబు మోపుట ప్రజ్ఞ గాదు
వానకోసము నీవు వలి బట్టియుండగా బర్వతమెత్తుట బరువు గాదు
మందగొల్లలతోన బొందుగా మెలఁగుచు బాలన్ని గ్రోలుట లీల గాదు
తే. గాన నీయొక్క ప్రజ్ఞలు గట్టిపెట్టి | రాజసముతోడ నుండుడు తేజమలర
తగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 51
సీ. రాచకులముఁ బుట్టి రాజునై యుండగా రాజసముండదే రమణి నాకు
నతివరో యటుగాక యన్యులకెందైన రాజసంబబ్బునే రమణి వినవె
నాతిరో విను పదునాలులోకంబులు నోరన నా కుక్షి నుంచికొనుచు
జిన్నతనమ్మునఁ జిన్నెలుజూపిన నింతిరో నీవది యెఱుఁగవటవె
తే. యాడుదానవు గనుక నీ యర్థమెల్ల | దెలిసి తెలియనితనమెల్ల దేటపడియె
నా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. 52
సీ. చిన్నతనమ్మున జిన్నవాండ్రను గూడి బాగుగానుందువే పరమపురుష
యవతారమూర్తివం చలివేణులందరున్ భ్రాంతిచేతను నిన్ను బ్రస్తుతింప
నా లక్ష్మితోడుత నానందముగ గూడి పొందుగా నుంటివే సుందరాంగ
రమణులందఱు గూడి రవ్వలు బెట్టిన చెట్ల నెక్కుట నీకు చెల్లమగునె
తే. యౌర కృష్ణావతారము నతిశయంబు- | లింతయేకాని మఱి మిక్కిలి లేమిలేదు
తగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 53
సీ. కృష్ణావతారము గుణము నెంచగనేల మగువ నా యవతారమహిమ వినవె
రమణిరో మునులెల్ల రామావతారమం దాలింగనము సేయ నలరుచుండ
కోరిన వరములు కృష్ణావతారమునందు మీకబ్బెడునంచు బలుక
నా వరమునులు కృష్ణావతారంబున రమణులై కలసిరి క్రమముతోడ
తే. మగువరో నాదు అవతారమహిమలెల్ల | దెలియజెప్పితి నీకునుఁ దేటపడగ
నా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. 54
సీ. పాముమీఁదను జేరి సాము జేసినవాఁడవగుట సద్గుణమెట్లు వచ్చు నీకు
పాలీయవచ్చిన పడతి జంపినవాఁడ చెలులపై నెనరేల గలుగు నీకు
మేనమామను గంసు మీఱి త్రుంచినవాడ నెనరుమాటల నేమి నీకు ఘనత
పసులగాపరివాండ్ర పలుకులు వినువాడ భావజు రతి నేమి భ్రాంతి నీకు
తే. జూడు నీ మర్మమెన్నెద సొగసుగాను వాడవాడల నీ సాటివారిలోన
తగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. 55
సీ. పాముమీఁదను జేరి సాము జేసితివంటె విషమైన జంతువు విడువనగునె
పాలీయవచ్చిన పడతి జంపితివంటె దగవుమాలినయట్టి ధర్మమగునె
మేనమామను గంసు మీఱి ద్రుంచితివంటె దుష్టనిగ్రహము నదోషమగును
పసులగాపరివాండ్ర పలుకులు వినకుంటె లీలావినోదంపు కేళియగునె
తే. మిగుల తలపులు సేతురే మగువలెల్ల | గుట్టు బైటను వేసిన కొదవ కాదే
నా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. 56
సీ. నాదు మేలెఱింగించి నా ప్రాణవల్లభుఁ గూర్చి రక్షింపరే కొమ్మలార
ననువొందగా వాని న్యాయంపుపూటల దయబుట్ట నాడరే తరుణులార
కలికిపల్కుల వాని కాఠిన్యహృదయంబు గరుగంగ జేయరే కాంతలార
దయగల చెలులైన తఱిదీపు పుట్టించి వేగమాతని దేరె వెలదులార
తే. వేసరక మీరు నా మాట విన్నవించి | యబల తన నేమిజేసె నింకనుచు బలికి
వెలదు లెవ్వరైన ద్వారకానిలయుడైన | చిన్నికృష్ణుని దేరమ్మ చెలియలార. 57
సీ. పతి నన్ను గూర్చరే రతికరువు దీర్చరే మదితాప మార్చరే మగువలార
చాన మేలెంచరే జాగు చాలించరే నన్ను లాలించరే కన్యలార
కపటంబు వీడరే కరుణతో జూడరే కోరికల దీర్చరే కొమ్మలార
విభు దార్చి గావరే వేడుకల్ సేయరే యిదివేళ బ్రోవరే యింతులార
తే. మదనశతకోటిలావణ్యమహితుడైన | చిన్నికృష్ణుని దేరమ్మ చెలియలార
మన్మథుని గన్న శ్రీతాడిమళ్ళవాస | రాజగోపాల రావన్న రమణి గూడ. 58
సీ. కమలాక్ష నీతోడ రమియించుటకు వేగ ముదిత రమ్మనినీకు మ్రొక్కెనన్న
వెలది నీ భ్రాంతిపై విస్తరించిన యింత విరహాగ్నిజ్వాలల విసికెనన్న
మంచముపై బవళించి నిద్రింపక సుదతి నీ రాకను జూచునన్న
తడవాయె నెడఁబాసి నేగుచున్నానని పనిబూని నన్నిటు బంపెనన్న
తే. కమలనాభుండ నామీదఁ గరుణయుంచి | వేగ నిను రమ్మనుచు విన్నవించెనన్న
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 59
సీ. ఘనముగా నలివేణి కరుణించి యింతైన నా పలుకాలించి నేలవమ్మ
నాయందు బలికిన న్యాయంబుగా నిప్పు డతియసహ్యంబయ్యె నరసిచూడ
రాధయు రుక్మిణీరమణీయ నాతని రానివ్వరైరిగా రట్టుజేసి
సారసనేత్రుని శ్యామలాంగుని బలభద్రానుజుని నాదు ప్రాణసఖుని
తే. నెపుడు కనులార గనుగొందు నెపుడు వాని | జెలిమితో నాదు కౌగిటఁ జేర్చుకొందు
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 60
సీ. కమలాక్షిరో నన్ను గరుణింపుమని వేడ నమ్మరే నా పల్కు నమ్మలార
అదిగొ చంద్రోదయంబాయె నీకేలాగు విరహము సైరింతు వెలదులార
మానక క్రూరుడై మదనుండు శరముల వేయదొడంగెనే వెలదులార
పంచబాణుని కెంత పగగల్గి యుండెనో సాధించెనిప్పుడు సఖియలార
తే. కరుణతోడుత మీరింక గపటముడిగి | నన్ను మన్నించి నా ప్రాణనాథు కడకుఁ
త్వరితముగ నెమ్మి యీవేళ తాడిమళ్ళ | రాజగోపాలు దోడ్తేరె రమణులార. 61
సీ. ఉదయమునం బూర్వ మొగి నిద్ర మేల్కొని సదయుడ నిన్ను నే స్మరణసేతు
సూర్యోదయంబున సూటి నే దప్పక దైవముగా నిను దలతునెపుడు
నా స్వామి నన్నేల న్యాయంబు దప్పక కరుణతో బ్రోవుము కమలనయన
విరహవేదనచేత వేడెద నేనిట్లు పాలింపుమిక నన్ను పద్మనేత్ర
తే. నిత్యమును నిన్ను బ్రార్థింతు నీలవర్ణ | నాదు కోరిక లీడేర్చు నళిననాభ
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 62
సీ. మత్స్యావతార సన్మహితకచ్ఛపగాత్ర వరహరూపా నీకు వందనంబు
నారసింహా వామనశరీర జమదగ్నివరతనయా నీకు వందనంబు
రఘువంశతిలక యో రాజీవదళనేత్ర బలరామ నీకు నా వందనంబు
బౌద్ధావతారసంభావితా గజవరద కల్క్యవతార నా వందనంబు
తే. వందనము నీకు సతతము యిందిరేశ | నందనందన శ్రీధర కుందరదన
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 63
సీ. ఏలరా నే తాళజాలరా యిక జాలు చాలురా పంతంబు జలజనయన
యిందు రావైతి నేమందురా యే నాతిమందు తలకెక్కెనొ మదనజనక
యేమిరా యిటు వేరుసేతురా మరుబారి ద్రోతురా యెందైన దోయజాక్ష
వీడరా కపటంబు గూడరా నను దయ జూడరా యీవేళ సుందరాంగ
తే. యనుచు బెక్కువిధంబుల నార్తిజెందు | నతివ విడనాడగా నీకు సరసమగునె
తరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. 64
సీ. వైకుంఠవాసాయ వారిజనేత్రాయ ద్విజరాజసుముఖాయ తే నమోస్తు
జలధరదేహాయ శంఖచక్రధరాయ మానితభర్గాయ తే నమోస్తు
పాలితసుజనాయ భావజజనకాయ దీనార్తిహరణాయ తే నమోస్తు
సామజవరదాయ శాత్రవహరణాయ దేవకీతనయాయ తే నమోస్తు
తే. అని ప్రణామము లొనరించి యతని మదిని | గనికరము దోచునట్టుల గారవించి
తరుణ మిదియని తెలిపి శ్రీ తాడిమళ్ళ | రాజగోపాలుఁ దోడ్తేరె రమణులార. 65
తాడిమళ్ళ రాజగోపాల శతకము సంపూర్ణము.