: కాంతాలలామ శతకము :
సీ. శ్రీకరంబగు నీదు చిన్నారి నెమ్మోము | సొగసు నేఁ బలుమారుఁ జూచిచూచి
అందమైనట్టి నీ యలరుఁ గెమ్మోవిని | పలుగంటు సేయంగఁ దలఁచితలఁచి
తళతళలీను నీ కులుకుగుబ్బల గోరు- | లుంచఁగా నాదు చే యొగ్గియొగ్గి
పచ్చవిల్కానిసామ్రాజ్య మేలినయట్లు | చేరి నిన్ గలయఁగాఁ గోరికోరి
గీ. మారుబారికిఁ జిక్కి నెమ్మదిని జొక్కి | నీకుఁ దక్కితిఁ గదవె నా నెనరు దెలిసి
గారవింపుము దయయుంచి కీరవాణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 1
సీ. పదివన్నెబంగారువంటి నీ మైనిగ్గు | జిలిబిలిమాటల పలుకుజగ్గు
బిగువైన గబ్బిసిబ్బెపుగుబ్బల బెడంగు | నెరకప్పు మీఱు ముంగురులరంగు
ఘమ్ముఘమ్ముమటంచుఁ గ్రమ్ము మైనెత్తావి | మొనపంటిగంటి కెమ్మోవికావి
తళుకైన చెక్కుటద్దంబుల యందంబు | నెరజారుపయ్యంట యారజంబు
గీ. తోఁచుటే గాని మఱి యేమి తోఁచలేదు | రేయుఁబవలును మదనునిమాయ యేమొ
వలపుఁ జెందుట కొఱగాదు నలువకైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 2
సీ. ఇంతైన నీ మాట కెదురాడకను నేను | నాతి! నీ మనసు రా నడవలేదొ?
అలిగిన వేళల బలిమిగా వేడుచు | నీ యానఁ బాగాల నియ్యలేదొ?
వలపువడ్డికిఁ బాఱ వద్దఁ జేరినవేళఁ | దెలిసి చెంతకుఁ జేరఁనీయలేదొ?
కనుల నే యింతిని గనుఁగొన్న నీ సాటి | యగునొకో యని నిన్నుఁ బొగడలేదొ?
గీ. మమత దెలియనిదాని చందమున నిటుల | వేఱుసేయంగ నాయమా కీరవాణి!
హరిహరీ! యీ గుణంబు మర్యాద గాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 3
సీ. హాయిగా నొక్కమాటాడకున్నావేమి? | చెలియరో! ముత్తెముల్ చిందునటవె?
నెనరుగా నాదు మోమున మోముఁ జేర్చినఁ | దరుణి! నీ వాసికిఁ దక్కువటవె?
చెలువుగా గబ్బిగుబ్బల ఱొమ్ముఁ గ్రుమ్మిన | ముదిత! నీ వన్నెకుఁ గొదువ యటవె?
జతగూడి దొంతరరతుల నన్నేలినఁ | గలికి! నీ జాతికిఁ గడమ యటవె?
గీ. పలుకుమిఁక నీదు మదిలోని భావమెల్ల | నేలనే మది దాచేవు లోలనేత్ర!
వలచినానని యెంచేవొ తెలిసెఁ దెలిసెఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 4
సీ. ముదితరో! నీ ముద్దుమోముఁ దప్పక చూచి | ముద్దిడ గమకించి మోము వంతు
మగువరో! నీదు క్రొంజిగిమోవిఁ గనుఁగొని | యానఁగఁ దమకించి యౌడుఁ గఱతుఁ
జెలియ! నీ గబ్బిగుబ్బల కాంతిఁ బరికించి | చెనకి పట్టఁగ నెంచి చే మడంతుఁ
గలికి! నిన్ రతికేళిఁ గలయ నా మదిఁ గోరి | యొకటియుఁ దోఁచక యుస్సురందు
గీ. నిటుల వలచినవానిపై నించుకైనఁ | గరుణయుంచవు బలుదోసకారి మరుని
పాలుచేసెదవో యింత జాలమేల? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 5
సీ. నా సామి నీవని నమ్మియున్నా నని | చిన్నెల వలపించి కొన్నినాళ్లు
మన నేస్తములకు సమంబు లేదనిపింతు | వన్నెకాడా! యని కొన్నినాళ్లు
మేను నీ సొమ్మని మెఱమెచ్చుకాడంచుఁ | గోరికల్ గల్పించి కొన్నినాళ్లు
నీదాన నేనని నిశ్చయింపుమటంచు | నెన్నరాని విధానఁ గొన్నినాళ్లు
గీ. నాస పుట్టించి యిటుల యహర్నిశంబు | మనసుమర్మ మెఱుంగక మారుబారి
పాలుసేయుట నాయమా పద్మనేత్ర? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 6
సీ. ఒకనాఁటివలెనె యిచ్చకపుమాటలచేత | దుద్దు వెట్టెదవేమె తోయజాక్షి!
ఒకనాఁటివలెనె తప్పుపచారములు చేసి | ప్రొద్దు పుచ్చెదవేమె పూవుఁబోఁడి!
ఒకనాఁటివలెనె నన్నొరగాఁ గనుఁగొని | జాగు చేసెదవేమె జలజగంధి!
ఒకనాఁటివలెనె యూరక బాళి పుట్టించి | దక్కించెదవదేమె తక్కులాఁడి!
గీ. చాలుఁ జాలించు జూదాలు మేలుమేలు | మేలుదాన వటంచు నీ మేలు నమ్మి
కోరినదె తక్కువయ్యెఁగాఁ గోమలాంగి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 7
సీ. మేలుదాన వటంచుఁ జాల నమ్మితిఁగాని | దోసకారి వటంచుఁ దోఁచదయ్యె
దయదాన వంచుఁ జిత్తమున నెంచితిఁ గాని | నీ చుల్కఁదన మింత తోఁచదయ్యె
నాదరింతు వటంచు ననుసరించితిఁ గాని | ద్రోహబుద్ధి వటంచుఁ దోఁచదయ్యె
మమతదాన వటంచు మది నెంచితిని గాని | తొలుతనే నీ మట్టు తోఁచదయ్యె
గీ. నిలను మగవారు బలిమిగా వలచిరేని | యగడు గావించి యేఁచుట యాఁడువారి
కపటవంచన నీవల్లఁ గంటిఁగంటిఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 8
సీ. బాళిచే నిన్నుఁ దప్పక చూచుచో ఱెప్ప- | పాటుపై నెంతో కోపంబుఁ దాల్తు
అతివ! నీతో ముచ్చటాడువేళలఁ బ్రొద్దుఁ | గడుపు సోమార్కులఁ గంటగింతుఁ
గలకంఠి! నిను బిగికౌఁగిట జేర్చుచోఁ | దారహారంబులఁ దప్పులెంతు
నెమ్మెలాడి! నీదు క్రొమ్మోవి యానుచో | ముక్కముక్కరపైని మోడి సేతు
గీ. నిట్టి నా బాళి తెలియక యీ వితాన | జాల్‍జబాబులు చేసెదు చంద్రవదన!
బలుమహాసామివైనావు నలువకైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 9
సీ. బలురంగు చెంగావిపావడ సవరించి | సరిగంచుచీర కుచ్చెలు బిగించి
తులలేని కులుకుగుబ్బల సౌరు మీఱంగ | నెఱజాఱు పైఁట వేమఱుఁ జెలంగఁ
జొక్కమౌ జవ్వాదిచుక్క ముద్దులుగుల్క | జీనిచక్కెరమోవి తేనెలొల్క
యలరి ఘల్లని జిగియందియల్ మ్రోయంగ | నొఱపైన వింతవైఖరి చెలంగ
గీ. నీవు నా ముందఱను వచ్చి నిలిచినటులఁ | దోఁచుటే కాని మఱి యేమి తోఁచలేదు
తెలియఁబల్కిన నా బాళి తెలిసికొనవు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 10
సీ. వలపింపరో చెలుల్ పిలవరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాఁడి?
పిలిపింపరే చెలుల్ పిలువరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాఁడి?
దక్కలేదో చెలు ల్దక్కరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాఁడి?
వేఁడుకోరో చెలుల్ వేఁడరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాడి?
గీ. బాళిఁ జెందిన మగవారిపట్లఁ జెలులు | చుల్కఁగా నెంతురఁటె యిట్లు జలజనేత్ర!
అయ్యయో! ఇంత యన్యాయమౌనె నీకుఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 11
సీ. ఏలనే నే తాళజాలనే యిఁకఁ జాలుఁ- | జాలునే కోపంబు జలజగంధి!
వాదఁటే నెనరింత లేదఁటే మాటాడ- | రాదఁటే నాతోడ రాజవదన!
వద్దటే నా చెల్మి వద్దటే నేరంబు | కద్దటే నాపైని ముద్దుగుమ్మ!
మానవే యెంతటిదానవే కౌఁగిటఁ | బూనవే యీవేళఁ బూవుఁబోఁడి!
గీ. పూవుఁగోలలచే గాసిఁ బొందఁజాల | మాటిమాటికి నాపట్ల మర్మమేల
ఏలనే బాల! యిఁక నిట్టి జాలమేల | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 12
సీ. ఒఱపైన ముద్దుక్రొమ్మెఱుఁగు కస్తురిచుక్క | ఘుమఘుమతావులు గ్రుమ్మరింపఁ
బదివన్నెబంగారుపౌఁజుల కమ్మలు | మెఱుఁగుఁజక్కుల కాంతి మెఱయుచుండ
రైక క్రిక్కిరిసి యారజపు సిబ్బెపుగుబ్బ | లరజాఱు పైఁటలో హౌసు మీఱ
జిగికావి గల్గు క్రొంజిగురాకుమోవిపైఁ | దెలిడాలు నవ్వు వెన్నెలలు గాయ
గీ. సొలపుతో నీవు నాయొద్ద నిలిచినపుడె | యఖిలసామ్రాజ్యవైభవం బలరినట్లు
తోఁచుచున్నది మదిలోనఁ దోయజాక్షి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 13
సీ. గజనిమ్మపండులఁ గాన్కలిచ్చెద గాని | కులుకుగుబ్బల ఱొమ్ముఁ గ్రుమ్మరాదె?
కపురంపుఁ బల్కులు కాన్కలిచ్చెదఁ గాని | యొఱపుఁజెక్కిలి నొక్క నొసఁగరాదె?
కండచక్కెర నీకుఁ గాన్కయిచ్చెదఁ గాని | యింతి! మోవిని నాననీయరాదె?
కావలసినవెల్లఁ గాన్కలిచ్చెదఁ గాని | ప్రేమతో నొక ముద్దు పెట్టరాదె?
గీ. యిద్దఱికి బాళి సమమైన నింపు గలుగుఁ | గాక మగవాఁడు బలిమిగాఁ గాచి వలచి
వచ్చినంతనె చులకనౌ వనితలకును | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 14
సీ. నిమిషమాత్రంబైన నిద్దురయే రాదు | నిలిచినచో మది నిలువనీదు
అన్నంబు నోటికింతైనను రుచి కాదు | పొలఁతిరో క్షణమైనఁ బ్రొద్దుపోదు
మాటాడ సైఁచదు మానవే యీ వాదు | తుదమొద లిట్లని తోఁచనీదు
జాగొనరించుట బాగఁటే యిఁకమీఁద | సారెకు నీకిది మేరఁగాదు
గీ. రామరామ! యిఁకేమందు రాతిగుండె- | దాన వనుచును మనసున నే నెఱుంగ
నైనఁ గానిమ్ము నినుఁ జూచినంత మనసు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 15
సీ. కలకంఠకంఠి! చక్కనివార లిల లేరొ, | బలిమిగా వేడినఁ దెలిసికొనరొ?
కమలాక్షి! నీవలె గర్వించి యున్నారొ, | మేలుసెందుట లెంచి యేలుకొనరొ?
పిలిచిన పలుకులు విని వద్దకును రారొ, | కూడి వీడరొ వీడి కూడుకొనరొ?
తగురీతి నెపుడైన దయ సేయకున్నారొ, | తొలుతటి నెనరైనఁ దలఁచుకొనరొ?
గీ. చాలు నీవంటి నిర్దయురాలి నేను | గనియు వినియును గాన జగంబులోన
నింక సైరింప దరమౌనె యిట్టులైనఁ? | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 16
సీ. వనిత! నీ మోముఁ జూచినవేళ యెట్టిదో | మఱి యే చెలిం జూడ మనసురాదు
వనజాక్షి! నీవు పల్కినవేళ యెట్టిదో | యెవ్వరితోఁ బల్క నింపుగాదు
చెలియ! నీ నెనరు చేసినవేళ యెట్టిదో | మఱచి యుండెదమన్న మఱపురాదు
తెఱవ! నీతోడఁ బొందినవేళ యెట్టిదో | వద్ద నిన్ జూడక ప్రొద్దుపోదు
గీ. కటకటా! యింత భ్రమ గలఁ గమలభవుఁడు | వ్రాసినాఁడేమొ నిన్ను దూఱంగ మాకు
న్యాయమౌనఁటె వినవె యన్యాయకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 17
సీ. వలచి పెనంగినవారిలో నావలె | బలిమిగా వేఁడినవారు లేరు
చెలిమి చేసినయట్టి చెలులలో నీవలె | వంచన యొనరించువారు లేరు
సారె మాలిమిసేయు సతిపతుల్ మనవలె | వాదులాడుచునున్నవారు లేరు
కోరి చెల్మి యొనర్చువారిలో నిటువలె | బగఁబట్టి సాధించువారు లేరు
గీ. కలికి! నీయందె యిన్నియుఁ గంటి నేడు | నీదు మది నాదు భాగ్యంబు నేఁటికైన
గారవింపుము దయయుంచి కీరవాణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 18
సీ. సొలపుఁ జూపుల నిన్నుఁ జూచినంతనె చాలు | నఖిలసౌభాగ్యంబు లబ్బినట్లు
హాయిగా నొక్కమాటాడినంతనె చాలు | ఘనవైభవస్ఫూర్తి గలిగినట్లు
ప్రేమతో నొకముద్దు వెట్టినంతనె చాలు | మఱి యింద్రభోగంబు దొరికినట్లు
చెలిమిగా నొకసారి కలసినంతనె చాలు | నలరు బ్రహ్మానంద మబ్బినట్లు
గీ. చెలియ! వినుమని యిట్లు నేఁ బలికినాను | మరుని బారిని ద్రోయక మమత మీఱ
గారవింపుము బిగువు బంగారుగాను | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 19
సీ. తరుణిరో! కడు దృష్టి దాఁకునో యని యెంచి | సొలసి నిన్ దప్పక చూడ వెఱతు
వనిత! నీ నెమ్మేను వసివాడునో యని | కొంచక నినుఁ గౌఁగిలించ వెఱతుఁ
గలికి! నీ నెమ్మోవి గసిగందునో యని | మిక్కిలి మొనపంట నొక్క వెఱతుఁ
బడఁతిరో! నీవెంత బడలుదువో యని | బలిమి గాటపురతుల్ సలుప వెఱతు
గీ. తరుణి! నా బాళి తెలియనిదానివలెను | జాగొనర్చెదవేలనే నీ గుణంబు
లింకఁ జాలింపు నను దయ నేలికొనుము | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 20
సీ. వలపు లిద్దఱికి దైవము కటాక్షంబుచే | నొనగూడెననుచుఁ బల్కిన వితంబు
వలచి వేమాఱు నీ వద్దికి వచ్చెద | నలుగవద్దనుచు నీవనిన మాట
నేను నీదాననై నెఱనమ్మియుండఁగా | సంశయమేల యంచనిన మేలు
మన కిద్దఱకు నెనరొనఁగూడునే యిట్లు- | నని నీవు కడు మెచ్చుకొనిన వింత
గీ. మఱచి యేమియు మును గుఱుతెఱుఁగనట్టు | లెవరికో వచ్చినట్లేమి యెఱుఁగనట్లు
నన్ను దయఁజూడవేమి యన్యాయకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 21
సీ. దయ మీఱఁగాను జెంతకుఁ జేరఁగాఁ దీసి | చెలిమి రంజిల్ల మచ్చికలు సేసి
గమకించి యంతరంగము మెచ్చ మాటాడి | మక్కువఁ జేర రమ్మనుచుఁ బిలిచి
వలసిన కోర్కు లవ్వారిగా మదిఁ గోరి | వచ్చిన యపుడెల్ల వద్ద జేరి
సరిలేని రతుల నిచ్చలుఁ జాల నుబ్బించి | కపురంపుఁదాని బాగాలొసంగి
గీ. యెందు కిటువలె మనసిచ్చి యిప్పుడేమి | మనసు దెలియనివిధమున నెనరు దాఁచి
మోసపుచ్చుట న్యాయమా, దోషకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 22
సీ. మాపురేపని వట్టి మాయలు చేసి న- | న్నలయింప న్యాయమా కులుకులాడి!
కాని పోపొమ్మని లేని మాటలు పల్కి | జాగొనరింతురా చంద్రవదన!
పదరవద్దని నీవు మొదట నమ్మికలిచ్చి | మఱచి యున్నావేమి మందయాన!
నీదాన నేనని నిక్కమౌ దయవలెఁ | బొద్దు వోనిత్తురా ముద్దుగుమ్మ!
గీ. ఎందుకిటువలె నేఁచెద వెమ్మెలాఁడి! నీకు ఫలమేమి పల్కవే నేఁటికైనఁ
గౌఁగిటఁ గదించి యేలవే కంబుకంఠి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 23
సీ. పున్నమచందురుఁ బోలు నీ నెమ్మోము | సొలయక తప్పక చూచిచూచి
అందమైనట్టి నీ మందయానంబును | బలుమాఱు మదిలోనఁ దలఁచితలఁచి
జిలిబిలి తేనెలు చిందు నీ పలుకుల | తక్కులకును చాల సొక్కిసొక్కి
నలినాక్షి! నీ చిఱునవ్వు వెన్నెలదీవి | యేవేళ మదిలోన నెంచియెంచి
గీ. తిరిగి వేసారి వేసారి మరునిబారి | ఖిన్నుఁడైనంత నా యుసురున్న ఫలము
నీకు నిఁకమీఁదఁ దెలియును నీరజాక్షి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 24
సీ. సొక్కుమ్రొక్కులు వింతచూపులు కొసరులు | సయిగలు ప్రేమలు దయలు పెంపు
సన్నలు ముద్దులు చిన్నెలు వేసాలు | పరియాచకంబులు బంధగతులు
చిఱుమమకారముల్ దురుసు పైసరములు | దొంతరముద్దులు వింత వగలు
పావురాపల్కులు మోవికాటులు ప్రక్క | యణఁకువ మెలకువల్ గొణుగు తిట్లు
గీ. నమరఁగా జంటజక్కవలట్ల మనము | కౌఁగి లెడఁబాయకను వేడ్కగాను రతులఁ
గూడుటెన్నఁడు పలుకవే కోమలాంగి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 25
సీ. ఎవుడు వత్తువొ యంచు నెదురెదురే చూచి | తలవాకిలిల్లుగా నిలిచినిలిచి
యింతలో నెమ్మోము కొంత తప్పక చూచి | పొగడుచు నవ్వుచుఁ బొంగిపొంగి
తిరిగి నీ నెమ్మోము దృష్టి తాఁకునటంచుఁ | బలుమాఱుఁ జూడఁగ నలికియలికి
చూపు వెంబడి నిన్ను సుదతిరో! కానక | డెందంబులో దిగులొందియొంది
గీ. ఏమి సేయుదు దైవమా! యీ విధమునఁ | గొమ్మ దయ తప్పునో యని సొమ్మసిల్లి
యలసి సొలసితి నసురుసురైతి నయయొ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 26
సీ. ఏ మాటలాడిన నేమి వచ్చునో యంచు | వేమాఱు మదిలోన వెఱపుతోను
వెఱుపు నింకేటికిఁ దరుణి రమ్మనెనని | తగురీతియగు దిట్టతనముతోను
మనపట్ల చెలియకు మనసు కద్దందునా | మోసమేమని కొంత యాసతోను
బలిమిగా వేడినఁ జులకన యౌనని | కొద్దికొద్దిగ నంతపద్దుతోను
గీ. వెఱచి వెఱవక యాశించి మెఱవడిగను | నిన్నె మదిఁ గోరికోరి నే నిటులఁ జాల
మోసపోతిని కటకటా దోసకారి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 27
సీ. మోము తప్పక నీవు ముదితరో చూచినఁ | జూపుతోఁబడి నన్నుఁ జూచిచూచి
చూచిన హాయిచే నీ చకోరాక్షికి | బాళి కద్దని చాల బ్రమసి బ్రమసి
బాళి కల్గెనటంచు బలిమిఁ జేసినయంత | మోసమౌనని చింత ముఁనిగి మునిఁగి
చింతింపఁ బనియేమి యింతి నా సొమ్మని | యాసచే యోజనఁ జేసి చేసి
గీ. కలికి బూరుగుమానును గాచినట్టి | చిలుక విధమైతి నేను నీ చిత్తమింక
నాదు భాగ్యంబు చల మిఁకమీఁద వలదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 28
సీ. ముదితరో! నీదు కెమ్మోవి యానకయున్నఁ | జీనిచక్కెరయైనఁ జేఁదుదోచు
ముద్దుగుమ్మరో! నీదు మోముఁ జూడకయున్న | జుక్కలరాయనిఁ జూడఁబోను
కులుకులాడిరో! నీదు పలుకులు వినకున్న | నేమియుఁ జెవులకు నింపుగాదు
పణఁతి! నీ గబ్బిగుబ్బలను నొక్కకయున్న | గరములుండుట వృథగాఁ దలంతు
గీ. నిట్టి నా బాళి దెలియక యీ వితాన | రమణిరో! నీదు నెమ్మది రాయిచేసి
యేల నన్ని టు వేఁచెద వెమ్మెలాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 29
సీ. సుదతిరో! నినుఁ జూచి సొక్కి యుండితిఁ గాని | హాయి మీఱగ ముచ్చటాడనైతి
మోముఁ గన్గొని చాల మురియుచుంటిని గాన | ప్రేమతో నొక ముద్దు పెట్టనైతి
నలరుమోవి యొకింత యాని సోలితిఁ గాని | చక్కఁగా మొనపంట నొక్కనైతి
ముమ్మరంబగు నాస సొమ్మసిల్లితిఁ గాని | కళలంటి హాయిగాఁ గలయనైతి
గీ. గలికి! మదనుని మాయయౌఁ గాక నీదు | మోముఁ జూచిన వేళయో రామ రామ!
ఇంత మోహంబు గలదఁటే యెవరికైనఁ? | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 30
సీ. అన్యాయకారి నిన్నాశించినది మొదల్ | నిజముగాఁ గంటికి నిదురరాదు
దోసకారీ! నిన్నుఁ దొడరి కన్నది మొద- | లన్నంబు జిహ్వకు హాయి లేదు
పాతకి! నీతోడఁ బల్కినయది మొద- | లెవరితోఁ బల్కఁగా నితవు గాదు
ద్రోహి! నీ నమ్మిక లూహించినది మొదల్ | నిలిచినచోటనే నిలువనీదు
గీ. కటకటా! ఇంత భ్రమఁ జెందఁగా నొనర్చి | యేల వడిదుళ్ళఁ బెట్టెద వింకనైనఁ
గలదు లేదని పల్కుము కంబుకంఠి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 31
సీ. పొరుగూరికిని బోయి మఱలి మా యింటికి | నెపుడు వత్తువొ పల్కు మెమ్మెకాఁడ!
అధిగతాలస్యత నచట నుండితివేని | నేనెట్లు సైరింతు నీటుకాఁడ!
ఇన్నాళ్ళకును వత్తు నిదియు నిశ్చయమంచు | వాఁడి నమ్మికలిమ్ము వన్నెకాఁడ!
కన్నీటిజడిచేత నెన్నాళ్ళు తాళుదు | నతివేగిరముగ రమ్మందగాఁడ!
గీ. అనుచు నీ బాళి మనసులో నంతఁ దలఁచి | యెట్లు మఱతును మఱపురా దించుకైన
బాళిఁ జెందితి నిను నమ్మి బేలనైతిఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 32
సీ. వనిత! సాంకేతికమునకు వత్తువొ యంచు | నాచుక రేయెల్లఁ గాచికాచి
ఏల రాలేదో యా యెలనాగ యంచని | సొలయక దిక్కులు చూచిచూచి
ఈ వేళకును రానిదేమొకో యని యుండ | లేక దిగ్గుమటంచు లేచిలేచి
గల్లుగల్లున నదె కలికి వచ్చెనటంచు | నాసచే నిసుమంత యాచియాచి
గీ. యంత నరుణోదయంబైనయపుడు గుండె | జల్లుజల్లని పలుమాఱు తల్లడిల్లి
సొక్కి సోలుట యా దైవ మొక్కఁ డెఱుఁగుఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 33
సీ. రవకుట్టుపని జంటిరైక క్రిక్కిరియంగ | బెళుకుసిబ్బెంపు గుబ్బలు వెలుంగఁ
దావిచక్కెరమోవి ఠీవి ముద్దులు గుల్కఁ | దియ్యనిపలుకులఁ దేనె లొలుక
నొయ్యనొయ్యన జిల్గుపయ్యెద యరజాఱ | సొగసు నెమ్మోమున నగవు దేర
రంగుమెట్టెలరవల్ కంగుకంగని మ్రోయ | మదిలోని యాస వేమఱుఁ జెలంగ
గీ. కలికిరో! నీవు కన్నులఁ గట్టినట్లు | రేయుఁబవలును దోఁచు నింకే యుపాయ-
మునను నీ మేలు మఱతునే వనజగంధి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 34
సీ. నా సామి యీ మేను నీ సొమ్ము నిజముగా | నిది నమ్మఁదగునందు నెమ్మెకాఁడ!
ఎచ్చట నున్న నీ యింతి నే నంచని | నెమ్మదిగా నుండు నెమ్మెకాఁడ!
నీకిష్టమగు కాంత నెనసినయప్పుడు | మమ్మెంతువేమి నీ వెమ్మెకాఁడ!
నీవంటి రసికుని నేస్తంబు మదిలోన | నెట్లు నే మఱతురా యెమ్మెకాఁడ!
గీ. కరుణ మఱవకుమని నన్నుఁ గౌఁగిలించి | మోవి యానుచు దొంతర ముద్దులిడుట
మఱపువచ్చునె వేయుజన్మములకైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 35
సీ. చాన! నీవెంత వంచన చేసినం గాని | నిను నేను విడనాడ నేర్తునటవె?
రమణి! నీవెంత నిరాకరించినఁ గాని | మదిలోన నీ మేలు మఱతునటవె?
అతివ! నీవెంత నన్నలయించినం గాని | యొక గడె నినుఁ జూడ కోర్తునటవె?
తరుణి! నీవెంత దందన లొనర్చినఁ గాని | యిఁక నిన్నుఁ బాసి సహింతునటవె?
గీ. ఎన్ని జన్మములెత్తిన హితవు గాను | మగువరో! నీ వొనర్చిన మచ్చికలను
మఱచెద నటన్న నింతైన మఱపు రాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 36
సీ. బాస లీయక చెల్మిచేసినయప్పుడే | కలకొద్ది నీ జాడ తెలిసెఁదెలిసె
వద్దనె యుండ కవ్వలి కేఁగునప్పుడే | తొయ్యలి నీ జాడ దోఁచెఁదోఁచె
దవ్వులనుండి దందనఁ జేసినప్పుడే | కలికి నీ తంటలు గంటిఁగంటిఁ
జీటిమాటికి మోడి సేయుచున్నప్పుడే | కొద్దిగఁ గపటంబు కద్దుకద్దు
గీ. చాలుచాలింకఁ బలుమాటలేల తొలుత | దూర మెంచక వలచినదారి తెలిసి-
తెలియని వితాన లోనైతిఁ గులుకులాడి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 37
సీ. వలపనే దెటువంటి వస్తువో యని యుంటి | బాలరో! యిన్ని దినాలనుండి
మరులనే దేరీతిఁ బరఁగునో యని యుంటి | నిజముగాఁ దెలియక నేఁటివఱకు
మోహమనే దెట్లు మొనయునో యని యుంటి | నాతిరో! నేఁ జిన్న నాఁటనుండి
ఆస యనేదేమి చేసునో యని యుంటి | వనజాక్షి! జన్మ మొందినది మొదలు
గీ. వనితరో! యిట్టి నావంటివాని కిపుడు | వలపు నొలయించి యలయంచి సొలపు మించ
నెందుకే చెలి! మీ దోసమేల నీకుఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 38
సీ. రేయెల్ల నిద్దురలేక యుండుటకును | గలకంఠి! నా కనులు సాక్షి
మరుకాఁకచే స్రుక్కి కఱఁగిన యందుకు | దరలాయతాక్షి! నా తనువు సాక్షి
మరులు తాళఁగలేక పొరలినయందుకు | బడఁతి! నేఁ బవళించు పాన్పు సాక్షి
ఒంటిగా నినుఁ బాసి యోర్చినయందుకు | నీ వగ వలయించు నీవె సాక్షి
గీ. వలపుచే ముందు తోఁచక బలిమిగాను | నిన్ను మఱి వేడుకొనుటకు నేనె సాక్షి
సాక్షు లిఁక వేయునేటికి సారసాక్షి? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 39
సీ. ఆటలకైన నీ వలిగియుండితివేని | గుండె జల్లని కొట్టుకొను నదేమొ?
పరిహాసమునకైనఁ బలుకకుండితివేని | మిన్ను పైఁబడినట్టు లుండునేమొ?
ఊరకయైన మోమోర చేసితివేని | మించిన మది తల్లడించునేమొ?
నవ్వులకైనను నొవ్వనాడితివేని | జెల్లఁబో మై సొమ్మసిల్లునేమొ?
గీ. ఇంతి వలపని సొలపని యెఱుఁగనట్టి | నన్ను వలవైచి దక్కించి యిన్ని వెతల
కిమ్ము చేసితి వా మాట లింకనేల? | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 40
సీ. వారి వీరి వితాన నూరక యుండక | చెలియ! నీ మోముఁ జూచినదె తప్పు
మనకేల యని యెంచి మాటల నిల్వక | లేమ! నీ తోడఁ బల్కినదె తప్పు
వరులయ ట్లందంద పరికించి మెలఁగక | ననబోఁడి! నిన్నుఁ జేరినదె తప్పు
తగురీతిగా దవ్వుదవ్వుల మెలఁగక | లేమ! నిన్ రతుల నేలినదె తప్పు
గీ. తప్పు లీరీతి నుండఁగాఁ దరుణి! నాదు | తప్పులు గణింపవలెనన్నఁ దక్కువేమి?
ధాత వ్రాసిన వ్రాతకే తప్పు గలదె! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 41
సీ. ఎప్పటిరీతిగా హితవుగ మాటాడ- | విదియేమి కపటమే యెమ్మెలాఁడి?
సరసఁ జేరినవేళఁ జల్లఁగా ననుఁ జూడ- | వెవ్వరిబోధనే యెమ్మెలాఁడి?
చనువీయకయె నన్ను జాడఁ జేసెద విప్పు- | డెవ్వరిపై బాళి యెమ్మెలాఁడి?
దవ్వులనుండి దందన లొనర్చెదవేమి | యీ గుణం బేడదే యెమ్మెలాడి?
గీ. తొలుత వలవేసి దక్కింపవలసి మదిని | వలపు గలిగినరీతిగాఁ జెలిమి చేసి
దక్కెనని నన్ను నేఁచేవు తక్కులాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 42
సీ. నినుఁ బాసి నిముసంబు నేఁ దాళనందువే | చాన నేఁడా బాళి కానదేమి?
అరగడె రాకున్న నపుడె రప్పింతువే | కలికి! నేఁడా జాడ గానదేమి?
సరసంబులకుఁ బ్రొద్దు చాలలేదందువే | కాంత! నేఁడా మాట కానదేమి?
కనుఱెప్ప వెట్టక ననుఁ జూచుచుందువే | గరిత! నేఁడా ప్రేమ కానదేమి?
గీ. ఎవనిపై బాళి జనియించె నిట్లు సేయ | నెవఁడు నినుఁ గాంచె నీ మోహ మెచట
మించె నింక దాచక పలుకవే యెమ్మెలాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 43
సీ. పదియాఱుకళల నింపొదవు పున్నమనాఁడు | మించి చందురుఁ డుదయించినట్లు
తొలిజన్మమునఁ జేయు ఫలము రూపముఁ దాల్పు | హాయిగా బ్రత్యక్షమైనయట్లు
చెందరాని ప్రయాసఁ జెందియు నెందునా | దొరకని పెన్నిధి దొరికినట్లు
వెల యింత యంతని కొలఁది వెట్టగరాని | యనుపమంబగు రత్నమబ్బినట్లు
గీ. నిన్నుఁ జూచినయప్పుడే నెమ్మనమున | నెంచుకొనియుందు నటువంటి నెనరుఁ బాసి
మారుబారికిఁ ద్రోఁచెదో నీరజాక్షి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 44
సీ. గబ్బిగుబ్బ లురంబుఁ గదియ నానింపుచు | హెచ్చి కౌగిటఁ గదియించు వింత
తనువు జల్లుమనంగఁ దమక ముప్పొంగఁగాఁ | జెక్కిలి కొనగోట నొక్కు వింత
కసిదీర మొనపంట గంటి సేయుచు మోవి | నిండార నాని యానించు వింత
తమి యగ్గలంబుగాఁ దలిరువిల్తునికేళి | యింపు మీఱఁగ దనియించు వింత
గీ. నీకుఁ దగుఁ గాక మఱి వేఱు నెలఁతలకును | గలుగ నేర్చునె నీవంటి కంబుకంఠి
చెలిమి గల్గుట తొలిజన్మఫలము సుమ్మి, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 45
సీ. సామి రారా యను నీ ముద్దుమాటల | పిలిచిన నెఱహాయిఁ దలఁచి తలఁచి
నిమిషంబు రాకున్న నెలఁతలచే నన్ను | బలిమి రప్పించుటఁ దలఁచి తలఁచి
యేవేళ నా రాక కెదురెదురె చూచి | నిలచి కోరెడు బాళిఁ దలఁచి తలఁచి
యరనిముషంబు నే నలుక గా నుండిఁన | బలుమాఱు వేఁడుటఁ దలఁచి తలఁచి
గీ. చెలియరో నిన్న నీవు నా చెంతలేక | యున్న నే ప్రొద్దుఁ బుచ్చితి నొకవితాన
నేడు కన్నులు చల్లగా నిన్నుఁ గంటి, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 46
సీ. తనివిఁ జెందదదేమొ తరుణిరో! నీ మోవి | పానకంబెంతయు నానుచున్న
గసటు పుట్టదదేమొ కలికిరో! నీతోడఁ | గూడి రేపగలు మాటాడుచున్న
వెగటుఁ జెందదదేమో వెలఁది నీ చెక్కిలి | నెన్ని మారులు ముద్దులిచ్చుచున్న
బ్రొడ్డు చాలదదేమొ పొలఁతిరో! నినుఁ జేరి | పలుమారు మరుకేళిఁ గలయుచున్న
గీ. నీదు మొగమోటమియొ లేక నీరజాస్త్రు | మాయయొ యెఱుంగరాదిది తోయజాక్షి
యింత మాలిమి సేయరా దెవరికైనఁ, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 47
సీ. కలలోననైన నిన్గలవరించుటె కాని | తొయ్యలి మఱియేమి తోఁచలేదు
మాటమాటకు నీదు మాటలాడుటె కాని | యితరంబు పలుకుట కింపుగాదు
తలఁచుటన్నియు నీదు సొలపు చిన్నెలె గాని | మఱియేమి తలఁపంగ మనసురాదు
చూచుటెల్లను నిన్నుఁ జూడఁగోరుటె గాని | చూడ్కులు మఱియొండు చూడనీవు
గీ. కటకటా! యింత బ్రమయించు కారణమున | కేమి వల వేసితో గదే యిందువదన!
నీకుఁ దక్కితి సొక్కితి నిజముగాను, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 48
సీ. హాయిగా నీ మోవి యాని సొక్కకయున్న | జిహ్వకు ఫలమేమి చిగుఱుఁబోణి!
కటకటా నిన్నుఁ గౌఁగిట గదింపకయున్నఁ | దనువుకు ఫలమేమి దంతిగమన!
అందమౌ నీ మాట లాలకింపకయున్నఁ | జెవులకు ఫలమేమి చిన్నెలాడి!
సొంపు దేరెడు నీదు కులుకుఁ జూడకయున్న | జూడ్కికి ఫలమేమి సుందరాంగి!
గీ. ఐన నీవంటి చెలిఁ నవనిలోన | మగువరో! యిది మదనుని మంత్రమొక్కొ
కాక యీ వింత గలదె యే లోకమందు? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 49
సీ. పలుమాఱు ముద్దులు గులుకు నీ నెమ్మోము | సొలపులు చక్కఁగాఁ జూడనైతి,
నందంద తేనెలు చిందు నీ కెమ్మోవి | హాయిగాఁ గసి దీఱ నాననైతి,
జిరుతసిబ్బెపు మిణ్కుచెణుకులఁ బొదలు నీ | నునుచనుల్ తనివార నొక్కనైతి,
మదికి బ్రహ్మానంద మొదవించు నీతోడ | నెనసి కోరిక తీరఁ బెసఁగనైతిఁ,
గీ. గటకటా! ఇట్టి ననుఁ జూచి కరుణ లేక | యెవ్వరే పగ సాధించి యించువిల్తు
బారిఁ ద్రోసెదరో యేమి పలుకుమింకఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 50
సీ. నిమిష మాత్రంబైన నిన్నుఁ జూడకయున్న | మనసోర్చి నే తాళననఁగలేదొ?
ఒకవేళ నేనొకించుక కోపగించిన | వేమఱు బలిమిగా వేఁడలేదొ?
మన నేస్తమునకు సమానంబు లేదని | యప్పటప్పటికి నీ వనగఁ లేదొ?
ఎవరైన నామాట నిసుమంత దూఱినఁ | గెరలి వారలఁ గోపగించలేదొ?
గీ. అట్టి నీ చిత్తమునకు నేఁ డలుక దోఁచి | గారవించక నీ వృథా నేర మెంచి
యీ విధంబున నేఁచ నే నెట్టులోర్తు, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 51
సీ. ఎడఁబాయవంచు నిన్నిచ్చగించితిఁ గాని | పలుకకుందువటంచుఁ దలఁపనైతి
వలపు దాఁచవటంచుఁ జెలిమిచేసితిఁ గాని | యలుక సేతువటంచుఁ దెలియనైతి
విడనాడవంచు నే విశ్వసించితిఁ గాని | వంచన గావించుటెంచనైతి
నెనరుదాన వటంచు నెఱ నమ్మితిని గాని | యెంచి నీ గుణము భావించనైతి
గీ. దూరమెంచక నా సరివారిలోన | ఆరుదూఱైతి నిన్నిఁక దూఱనేల
నన్ను నేననుకోవలె నళినగంధి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 52
సీ. అలుక సేతురు గాని యతివరో! నీవలెఁ | బలుమాఱు నలిగెడి పడఁతి గలదె?
చలమొనర్తురు గాని జలజాక్షి నీవలెఁ | బగ వట్టి సాధించు మగువ గలదె?
నేరమెంతురు గాని నెలఁతరో నీవలెఁ | బలుచనగాఁ జూచు చెలువ గలదె?
పలుకకుందురు గాని భామరో! నీవలె | మిన్నక విడనాడు మెలఁత గలదె?
గీ. నీదు కపటంబు తెలియక నేను వలచి | కోరి చేరినయందు కీ దారి నన్ను
మాటిమాటికి నేఁచెదో మంజువాణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 53
సీ. పలుమాఱుఁ బిలిచినఁ జలము సాధింపుచు | నూరక మాటాడకుండుటేమి?
ఎదుట నిల్చినఁ గాని యెంతయు దయ లేక | నేఁచఁగఁ జురచురఁ జూచుటేమి?
బలిమిగా నేనెంత ప్రార్థించినం గాని | చెలియరో! మోమోర సేయుటేమి?
చేర రమ్మని నేను సారెసారెకుఁ బిల్వఁ | జూడఁజూడఁగ విడనాడుటేమి?
గీ. ఇంత నిర్దయురాల వంచించుకైన | మొదటఁ దోఁచక నే వృథా మోసపోతి
నింక నీ మాట లేటికే యిందువదన? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 54
సీ. చలపట్టి యెవరెంత చాడి చెప్పినఁ గాని | చెలియరో! దయ మఱచెదవు సుమ్మి
ఏ వేడుకలయందు నీవు నెమ్మది సొక్కి | చెలియరో! దయ మఱచెదవు సుమ్మి
తగు చిన్ననాఁటినేస్తము గదా యిది యంచుఁ | జెలియరో! దయ మఱచెదవు సుమ్మి
నేరక నేఁ జేయు నేరంబులఁ దలంచి | చెలియరో! దయ మఱచెదవు సుమ్మి
గీ. మనసు మర్మంబులిచ్చి ప్రేమంబు హెచ్చి | చెలిమి చేసిన దయ మఱచెదవు సుమ్మి
మరలి నే వచ్చునందాఁక మందయాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 55
సీ. కినుకచే నిన్నుఁ గన్గొనక యుండెదనన్న | నువిదరో! నా చూడ్కు లుండనీవు
పద్దుచే నీతోడఁ బలుకకుండెదనన్నఁ | జెలియ! నా పలుకులు నిలువనీవు
బిగువుచే నీ మాట వినక యుండెదనన్న | నింతి! నా చెవులందు కియ్యకొనదు
కలఁకచే నిను మదిఁ దలఁపకుండెదనన్న | నెలఁతరో! నా యెద నిలువనీదు
గీ. ఇంత భ్రమ పుట్టఁగాఁ జేయ నించువింటి- | దంట యొనరించు మటుమాయతంటలకును
బాల! నీ వలలోఁ జిక్కి బేలనైతిఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 56
సీ. ఇన్నాళ్ళలోన నేనెందఱు చెలలతో | నతిదయ మీఱ మాటాడలేదు
మాటలాడుట గాక మనసు మర్మములిచ్చి | చెలిమితో మచ్చిక సేయలేదు
మచ్చికల్ గావించి మనసార రేపవల్ | వీడని కౌఁగిళ్ళఁ గూడలేదు
కౌఁగిటి నెనసి నిక్కపుదయ మీఱంగఁ | దలిరువిల్తునికేళిఁ దనియలేదు
గీ. హాయి నీవలె వలనేసి యాసగొల్పి | నన్నుఁ దక్కించుకొన్నట్టి వన్నెలాడి
నెందుఁ గాననే చాన! నే నిట్టులైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 57
సీ. మోహనాంగిరొ! నీదు మోముఁ జూడకయున్న | నిముసంబు యుగమయ్యె నేమిసేతు?
మదిరాక్షి! నీతోను మాటలాడకయున్న | నెదఁ బట్టినట్లయ్యె నేమినేతుఁ?
జిగురుఁబోణిరొ! నీదు చెంతఁ జేరకయున్న | నెదయు నింపుగా దేమిసేతుఁ?
గాంతామణిరొ! నిన్నుఁ గలసి కూడకయున్న | నితరంబు దోఁచ దింకేమిసేతు?
గీ. నింత వలచుట తగునఁటే యిందువదన! | తొలుత నీతోడ మతిలేక చెలిమిఁ జేసి
యలరువిల్కాని బాళి పాలైతిఁ గదవె | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 58
సీ. ఊరక యుండక వారిజాక్షిరొ! నీదు | సొలపులు చిన్నెలు చూడనేల?
చూచినంతయుఁ గాక శుకవాణి! నీ చెంతఁ | జేర నెమ్మదిలోనఁ గోరనేల?
కోరినంతయె కాక కొమ్మరో! యిరువుర | మతిదయ మీఱ మాటాడనేల?
మాటలాడుట గాక మగువరో! నీతోడ | హాయిమీరఁగఁ జెల్మి సేయనేల?
గీ. కంతుఁ డీరీతి నొనరించి పంతగించి | విరహమునఁ గుందఁగాఁ జేసె వేయునేల?
ధాత వ్రాసిన వ్రాతకు దప్పుగలదె? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 59
సీ. నీదు చొక్కపుమాట నీదు చల్లనిపాట | నీ వింతసయ్యా ట నీదు తేట
నీదు యొయారంబు నీదు గంభీరంబు | నీదు తిన్నఁదనంబు నీదు గుణము
నీ యొయారపుఁజూపు నీ వింతతరితీపు | నీదు చక్కనిరూపు నీదు వైపు
నీ నడకలబెళ్కు నీదు గుబ్బలతళ్కు | నీదు చిలుకపల్కు నీదు కుల్కు
గీ. నిలను నీవలెఁ జెలులకుఁ గలిగెనేని | నిన్నె మదిలోన నాసించి నెనరుమించి
మోసపోదునె నేనిట్లు దోసకారి? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 60
సీ. వలవు రెట్టించి నే బలిమిగా వేఁడుట | తలఁతువో తలఁచవో కులుకులాడి!
ఆసించి నిన్ను నే ననుసరించుట నీకుఁ | దోఁచునో తోఁచదో తోయజాక్షి!
బాళి నిలుపలేక బలువెత సెందుట | తెలుతువో తెలియవో కంబుకంఠి!
అందరిలో వృథా యారుదూరైనది | యెంతువో యెంచవో యిగురుఁబోణి!
గీ. కటకటా! యింత యన్యాయకారివనుచు | నింత తోఁచక నిన్ను నే నిచ్చగించి
మోసపోయితి నయ్యయో దోసకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 61
సీ. పలుమాఱు వట్టిమాటలను బ్రేలించేవు | తీరునా విరహాగ్ని దీనిచేత?
మనసీయ కొకజాడ మాటగాఁ బలికేవు | మానునా మరుబాళి దానిచేత?
నలయించి వింతచిన్నెలను దేలించేవు | హితమని తోచునా యిందుచేతఁ?
గపటవృత్తికిఁ జొచ్చి కాంక్ష వెచ్చించేపు | హాయి చేకూరునా యందుచేత?
గీ. నన్ని దెలిసియుఁ దెలియనియట్లు నీవు | జాగు సేయుచునున్నావు నీ గుణంబు
తోఁచియును దోఁచకుండెడి దోసమొక్కొ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 62
సీ. నీరజాక్షిరొ! యరనిముసమే యుగమాయెఁ | జిలుకల పలుకులు ములుకులాయెఁ
బలుమాఱు మదిలోనఁ గలఁక యగ్గలమాయె | వెలఁది! పూవులతావి వేండ్రమాయె
నందరిలో వృథా యాడికల్ ఘనమాయె | యోచనలేమియుఁ దోఁచవాయె
జెలికాండ్రలోన మిక్కిలి యారుదూరాయె | వెలఁది! నీ గుణములు వింతలాయె
గీ. నురమునను దూయ మరుఁ డురుశరము లేయఁ | దోడు కోయిల గూయఁ జందురుఁడు గాయ
హరిహరీ హరి యననాయె మరుని మాయ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 63
సీ. ఇదె యిదె యనుచు నన్నేఁచెదవే కాని | హాయిగా నొక్కమాటాడవేమి?
రేపుమాపని బాళి రేఁచెదవే గాని | హితవుగా నీ మనసీయవేమి?
యారుదూరొనరించి యలయించెదే కాని | యించుకైనను కరుణించవేమి?
తగవు మీఱఁగ వట్టివగలు చేసెదు కాని | బిగికౌగిలింతలఁ బెనఁగవేమి?
గీ. ఎంత కన్నడ లెంతటి జంతతనము లెంత | జాలము లెంతటి వింతచిన్నె
లౌనె నీవంటి జాణ యెందైనఁ గలదె! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 64
సీ. కన్నాతలాగించి కౌఁగిట బిగియించి | మోము మోమునఁ జేర్చి ముద్దులిచ్చి
తొడతొడయును గ్రుమ్మి యెడసూయకయె నెమ్మి | కులుకు గుబ్బలఁ గ్రుమ్మి గోటఁ జిమ్మి
తోరమౌ కసిఁబూని తోఁపునూకులనాని | సరిమోపులాని వైఖరులఁబూని
యెదురొత్తులొత్తి పన్నిదపుఁ బైసరమెత్తి | కంతుని మదహస్తికరణి హత్తి
గీ. ప్రక్కమార్పులఁ దేలించి బాళిమించి దక్కదక్కించి | వింతవింతగ రమించి
గారవించుము వేగమె కరుణయుంచి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 65
సీ. ఎంతైన నీ మాట నెదురాడకయ నేను | నాతి! నీ మనసురా నడవలేదొ?
అలిగినవేళ నిన్ బలిమిమై వేఁడుచు | నొయ్యనఁ దాంబూల మియ్యలేదొ?
వలపు మీఱఁగ వాదు సలిపినవేళను | నెయ్యముతోఁ జేరఁదీయలేదొ?
కన్నులు విచ్చి నిన్గనుఁగొని నీ సాటి | మగువలు లేరని పొగడలేదొ?
గీ. మమత దెలియనిదాని చందమున నిట్లు | వేఱుసేయంగ నౌనఁటే కీరవాణి!
అరయ కిటు వేఁచ నీకు మర్యాదగాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 66
సీ. హాయిగా నొక్కమాటాడినంతనె చాలు | చెలియరో! ముత్యముల్ చిందునటవె?
మొనసి నీ మోమున మోము చేర్చినయంత | తరుణి! నీ వాసికి తగ్గునటవె?
బలిమిగా గుబ్బిగుబ్బల నాననిచ్చిన | ముదిత! నీ వన్నెకు మోసమటవె?
జతగూడి దొంతరరతుల దేలినయంత | కలికి! నీ జాతికిఁ గడమ యటవె?
గీ. పలుకవే నీదు గోర్కె నీ భావమెల్ల | నేలనే యింత దాఁచెదు లోలనేత్ర,
వలసినాఁడని యేఁచెదు తెలిసి తెలిసి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 67
సీ. ముదితరో! నీ ముద్దుమోముఁ దప్పక చూచి | ముద్దిడ గమకించి మోము వంచి
మగువరో! నీదు క్రొంజిగిమోవిఁ గనుఁగొని | యానంగఁ దమకించి యంత వెఱచి
పడఁతి! నీ గబ్బిగుబ్బలఠీవి పరికించి | కడఁగి పట్టఁగ నెంచి కరముఁ దిగిచి
కలికి! నిన్ రతికేళి గలయ నెమ్మదిఁ గోరి | యొకటియుఁ దోఁచక యుస్సురంచు
గీ. నిటుల వలఁచినవానిపై నీ వితాన | కరుణ యుంచకయే దోసకారి! మరుని
పాలు గావించెదవొ యింత జాలమేల | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 68
సీ. నా సామిగా నిన్నె నమ్మియున్నానని | చిన్నెలు పచరించి కొన్నినాళ్ళు
నీదాన నేనని నిక్కమెంచు మటంచుఁ | గూర్చి ప్రియంబునఁ గొన్నినాళ్ళు
మన నేస్తమునకు సమంబులే దరసిన | వన్నెకాడ వటంచుఁ గొన్నినాళ్ళు
మేను నీ సొమ్మని మెఱమెచ్చు లాడించి | కోరిక హెచ్చించి కొన్నినాళ్ళు
గీ. లాస పుట్టింప నిట్టు లహర్నిశంబు | మనసు మర్మ మెఱుంగక మరులుకొంటి
మాయ హత్తించి యేతుఁరా తోయజాక్షి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 69
సీ. ఒకనాఁటివలెనె యిచ్చకపు మాటలచేత | మందుఁ బెట్టెదవేమె మందయాన!
ఒకనాఁటివలె వట్టి యుపచారములు చేసి | ప్రొద్దుపుచ్చెదవేమె ముద్దుగుమ్మ!
ఒకనాఁటివలెనె నన్నొరుని గాఁగను జూచి | జాగుచేసెదవేమె చంద్రవదన!
ఒకనాఁటివలెనె నాకొక బాళిఁ బుట్టించి | దక్కి దక్కవదేమె తక్కులాఁడి!
గీ. చాలు చాలించు నిఁక జాలు చాలు మేలు- | దాన వంచును నెమ్మదిలోన మిగులఁ
కోరినది తక్కులాయెగాఁ గోమలాంగి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 70
సీ. మేలుదాన వటంచుఁ జాల నమ్మితిఁ గాని | దోసకారివటంచుఁ దోఁచదాయె
నీ చెల్మి సతమని తోఁచి యుండితిఁ గాని | తొలుత నేనిట్లౌట దోఁచదాయె
మమతదాన వటంచు మదిని నమ్మితిఁ గాని | యేఁచుదానవటంచుఁ దోఁచదాయె
నాదరింతు వటంచు ననుసరించితిఁ గాని | ద్రోహబుద్ధి వటంచుఁ దోఁచదాయె
గీ. నిలను మగవారు బలిమిగా వలచిరేని | యసదు గావించి యేఁచెడు నాఁడువారి
కపటమెల్లను నీవల్లఁ గంటిఁ గంటి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 71
సీ. సొగసు నీరజము నెమ్మొగమును గావించి | కలువరేకులు నేర్చి కనులొనర్చి
మురువైన తలిరుతో మోవి సొంపొనరించి | పలుకు లమృతముతోఁ బదనుఁజేసి
కులుకుబంగరుగిండ్లు గుబ్బలు గైసేసి | యరఁటులతోఁ దొడ లందపఱిచి
పద్మరాగములతోఁ బదముల నొనరించి | మేనెల్ల బంగారుతోను బొదివి
గీ. తమ్మిరాచూలి నీ నెమ్మనమ్ము చట్టు | రాతిఁ జేసెనొ కాని పురాతనమున
గారవించవె వేగమె కలువకంటి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 72
సీ. చొక్కంపు నీ ముద్దుచక్కెరకెమ్మోవి | యొఱుపు గావించి నోరూరియూరి
మినుకు నిబ్బెపుపొడల్ గనుపట్టు నీ చనుల్ | మాటికిఁ బెనుగోట మీటిమీటి
పలుచనైనట్టి నీ పాల్గారు చెక్కులు | నొక్కంగఁ గరముల నొగ్గియొగ్గి
మురువైనయట్టి నీ మోమున నా మోము | తనివి దీరఁగఁ బూన్పఁ దలఁచితలఁచి
గీ. కోరికలు వడ్డికిని బాఱఁ గొంకు దీరి | యెపుడు పైకొందునో యని యెంచియెంచి
యున్న ననుఁ బ్రోవు మింక నే నోర్వగలనె? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 73
సీ. అవనిలో మొగపుట్టు వగుచుఁ బుట్టగరాదు | పుట్టిన రసికుఁడై పొదలరాదు
పొదలిన నొక్కతె పొందు గోరగరాదు | గోరిన బాళిచేఁ గొసరరాదు
కొసరిన దయలేని కూటమి గారాదు | కూటమి గలిగినఁ గొంకరాదు
కొంకు గల్గిననేమి కూడి వీడఁగరాదు | వీడిన మది విడనాడరాదు
గీ. వలఁచి వలపించుకొనునట్టివారు లేరొ | యైన నీ గుండె రాతితో నబ్జభవుఁడు
చేసినాఁడేమొ హరిహరీ దోసకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 74
సీ. ముద్దాడితే నిన్ను మోహమెల్లను దీరు | ముదిత! నీ మోమున మోము నిల్పి
గదియఁ బట్టిన నాదు కలఁక యెల్లను తీరు | కలికి! నీ సిబ్బెపుగబ్బిచనులు
కౌఁగిలించిన నాదు కాఁక యెల్లను దీరు | పూని నీ మేను నా మేను జేర్చి
కూడి యేలినఁగదా కోర్కులెల్లను దీరు | నెనరున పైకొని నిన్నుఁ గలసి
గీ. యతివ! యిటువంటి మాటలే యనుదినంబు | బలుకుచును ప్రొద్దుపుచ్చిన తులువమరుని
రాపు నెటువలె నోర్తు పరాకు వలదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 75
సీ. మనసు రంజిల్లఁగా నెనరుచే నొకసారి | మొగమెత్తి చూడవే ముద్దుగుమ్మ!
వీనులవిందుగా వినియెద చల్లగా | మాఱుమాటాడవే మందగమన!
కోపించుమదనుని తాపమారును గాని | మోవి నానెద నిమ్ము మోహనాంగి!
కోరినకోర్కి చేకూరంగ నీవేళ | బిగికౌఁగిలీయవే చిగురుఁబోణి!
గీ. యెంత నిర్దయురాలవే యీ విధమున | చలము చేయుట న్యాయమా చంద్రవదన!
యానఁబెట్టి గదా యింత మోసపోతి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 76
సీ. పూర్ణచంద్రుని నేను బూజించినందుకు | సొగసైన నీ మోముఁ జూడఁగలిగె
నతనుబంట్లకుఁ జిగురాకు నిచ్చుకతాన | సుదతిరో! నీ మోవిఁ జూడగల్గెఁ
జిలుకలకును శిక్షఁ జెప్పి పెంచితి గాన | లేమ! నీ పలుకు లాలింపఁగలిగె
వెన్నెలబైట పూవిల్తుఁ గొల్చుటచేత | మెలఁత! నీ చిఱునవ్వు మెచ్చఁగలిగె
గీ. నన్ని యిటవలెఁ జేకూడినందు కిపుడు | బాలరో! నిన్ను మరుకేళి నేలవలదె?
ఏలనే జాగుచేసెదు లోలనేత్ర! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 77
సీ. వలచితినని యెంచి వడిసుళ్ళఁ బెట్టెదు | మర్యాదయటె నీకు మందగమన!
బలిమిఁ గోరితినంచుఁ జులుకగాఁ జూచెదు | న్యాయమటె నీకుఁ దోయజాక్షి!
వేఁడవేఁడఁగ నన్ను వేఱుగాఁ జూచెదు | ఘనమటే నీకు బంగారుబొమ్మ!
యనుసరించెదనంచు ననుఁ జౌక జేసెదు | తగుదునటే నీకిది చిగురుఁబోఁడి!
గీ. ఇంత యైందనఁ గలదటే యెమ్మెలాఁడి! | మర్మ మెఱుఁగనిదానవె మంజువాణి!
వలదు వలదిఁకఁ జాల్చాలుఁ గులుకులాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 78
సీ. బలులేమిచే సిగ్గుపడియెడువానికి | దుర్గాధిపత్యంబు దొరకినట్లు
అరుచిచే వెతఁ జెందునట్లైనవానికి | నమృతరసాయనం బబ్బినట్లు
కలనైన నొకరూక గాననివానికి | కలితకాంచనరాశి గలిగినట్లు
ఘనచింత యను వార్ధి మునిఁగినవానికి | మదికి బ్రహ్మానంద మొదవినటుల
గీ. నతివ! నీవంటి చెలి గుబ్బలంటి మోవి- | యాని కౌఁగిట గదియించి యతనుకేళి
గలియుటే చాలు నీ వింకఁ గాదటన్న | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 79
సీ. మనసు దాఁచక నీవు మాటాడనెంచిన | నతిన! నీ గుణము మాటాడనియదొ
దయఁ జూడ నామీఁదఁ దలఁచినంతనె నీదు | దందనంబును దయఁ దలఁచనీదొ
ఇంచుక కనికరం బుంచఁజూచిన నీదు | వంచన కనికరం బుంచనీదొ
నెనరుసేయఁగఁ బూనుకొనిన నీ కపటంబు | హాయిగా నెనరిందు సేయనీదొ
గీ. ఇట్టి గుణములు దందన లిట్టి హెచ్చు | వంచనయుఁ గపటంబును వసుధలోన
నిందువదనరో! యెవ్వరియందుఁ గాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 80
సీ. బాళి నిల్పఁగలేక పలుమాఱు వేడితే | దక్కువ లెంచేవు తలిరుబోడి!
మరుబారి కోర్వక మనవి గావించితే | వంచనఁ జేసేవు వన్నెలాడి!
వలపుమించిన నేను బలిమి ప్రార్థించితే | జులుకఁగాఁ జూచేవు కులుకులాడి!
మనసుఁ బట్టగలేక మఱిమఱి వేఁడితే | జౌకఁగాఁ దలచేవు చంద్రవదన!
గీ. యందులకు నేమి యెటువలెనైనఁ గాని | కినుక నొనరింతురా నీవె నెనరుసేసి
నన్నుఁ గైకొమ్ము నీవని నమ్మినాఁడ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 81
సీ. నేరిచి నడిచిన నేరక నడిచిన | గరుణించి సోఁకోర్చి గావఁగలవు
మన్ననఁ జేసిన మర్మంబు దాఁచిన | వినుము వెయ్యేల నా ఘనత నీవె
నేరంబు లెంచిన నెనరు గావించిన | యెటులైనఁ గీర్తి వహింపఁగలవు
మిత్రతనైన నమిత్రత్వముననైన | మఱియు నా తాపంబు మాన్పఁగలవు
గీ. మనసులోపలఁ గలయట్టి మర్మమంత- | యును నిజమ్ముగఁ బలికితిఁ గినుక మాని
నన్నుఁ గరుణించి యేలుమో వన్నెలాఁడి, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 82
సీ. నను కనుంగొనఁగానె మనసులో దయయుంచి | నా నేస్తమాలించినావు గనుక
బలిమిగా నీ వద్ది చెలికాండ్ల నంపించి | నను బిల్వంగా నంపినావు గనుక
చెంతఁ జేరకమున్నె సుంత భేదము లేక | నీవె మచ్చికఁ జేసినావు గనుక
తగు చిన్ననాఁటి నేస్తంబు చందానను | నయముగా లాలించినావు గనుక
గీ. నెట్లు నీ మేలు మఱతు నేనింక నిన్ను | నిమిష మెడఁబాయఁగాజాల నేను దొలుతఁ
యేల మాలిమిఁ జేసితి వీ వితాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 83
సీ. వేళ గాదనక యేవేళ నే వచ్చిన | హితవుగా నీ మనసిచ్చు మేలు
నలిగి యుండినవేళ బలుమచ్చికలు సేసి | వేడుక నను గారవించు మేలు
నెవరెంత నా నేస్త మెడఁబాపఁ దలఁచిన | నందుల కొప్పనియట్టి మేలు
నరనిమిషంబు నే సరసఁ జేరకయున్న | నప్పుడే రప్పించునట్టి మేలు
గీ. మఱచెదనటన్న వేయుజన్మములకైన | మఱవఁగూడదు నీదగు మచ్చికలకుఁ
జాలఁ జొక్కితిఁ దక్కితి సారసాక్షి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 84
సీ. నీవంటి నెరజాణ నెనరు గావలెనంచు | నెన్నాళ్లో మదిలోన నెంచియెంచి
వనజాక్షి! నీతోడ మనవి సెప్పుఁడటంచు | వేమాఱుఁ జెలుల నే వేఁడుకొంటి
కనులపండువుగ నే నినుఁ గనుంగొనఁ గోరి | మొనసి దైవములకు మొక్కుకొంటి
రమణిరో! నిన్ను నే రతులఁ గూడుటకునై | వేవిధమ్ముల నిన్ను నే వేఁడుకొంటి
గీ. నట్టి నామీఁద జాలి యొక్కింతలేక | దినము రేపనుచున్నావు ఘనమ నీకు
గాసిఁ బెట్టకు మయ్యయో దోసకారి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 85
సీ. మాటపట్టులఁ గొంతమట్టుగాఁ బోనీక | సరసంబులకు నేల సరసుకొంటి
మనసు నిల్పక వృథా మరులు కొన్నది గాక | భావమేటికి బయల్ పఱుచుకొంటిఁ
బదరి భావము బయల్ పఱుచుకొన్నది గాక | వేమాఱు నేనేల వేఁడుకొంటి
గీ. దెలిసెనా మరుఁ డింతకుం దెచ్చెఁ గాని | మోసపోదువు లేకున్న దోసకారి!
యించువిల్తుండు సాక్షి యీ యెన్నికలకు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 86
సీ. క్షణము సేపటు జబ్బు కౌఁగిలింతలె కాని | లెస్సగా బిగి కౌఁగిలించలేదు
సవసవలుగను ముచ్చటల నాడుటె కాని | యాస దీరఁగ మాటలాడలేదు
మున్నొంటిపాటున ముద్దులుంచుటె గాని | యక్కఱచే మోవి నానలేదు
దినదినమ్ముల మతు లెనయుటొక్కటె కాని | తగిన వేడుక రతి దనియలేదు
గీ. బడలి నేనిట్లు వేఁడినఁ బంతగించి | రాపుఁ జేసెదు కొమ్మ! నీ ప్రాపు నమ్మి
చెంతఁ జేరినవాఁడ నా చింతఁ దీర్చు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 87
సీ. ఎన్నెన్ని కోరిక లెన్నితినో యన్ని | తడయక నీవీ విధంబుఁ జేసి
ఎన్నెన్ని ముచ్చట లెన్నితినో యన్ని | వెలయించు మనసెల్ల విఱుగఁ జేసి
ఎన్నెన్ని సరసోక్తు లెన్నితినో యన్ని | పలుమాఱు విరిపాన్పు పాలు సేసి
ఎన్నెన్ని యోచన లెన్నితినో యన్ని | చేకూర కునికిఁ జీకాకు సేసి
గీ. మదికొదవఁ జేసి మనసు వేమఱుగఁ జేసి | నీదు వలపును నెనరును నెగడఁజేసి-
తకట! నీవెంత చేసిన యంతయౌనె | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 88
సీ. ఉండుండీ మనసులో నూరక చింతించి | చింతించి యంతలోఁ జిన్నవోదు
చిన్నవోయి యొకింత చెచ్చెరఁ దెలిపొంది | తెలివివేళల నిన్నుఁ దలఁచుకొందుఁ
దలఁచినంతనె మేను పులకలింతలు చేసెఁ | బులకించి దిక్కులు కలయఁ గందు
కలయఁ గన్గొని బయల్ కౌఁగిలింపఁగ నెంతు | నెంచి నిరాశ క్షమించుకొందు
గీ. ఎటుల సైరింతు మోహమింకె ట్లడంతు | తాపమెటు దీర్తు నెన్నాళ్ళు తల్లడింతు
ఎవ్వరికి విన్నవింతు నే రవ్వకెత్తి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 89
సీ. సామ్రాజ్య మేలిన చందంబుగాఁ దోఁచు | సుదతి! నీ దయ మీఁద సోకినంత
నఖిలంబు కైవసమైనట్లుగాఁ దోచుఁ | జెలి! నీవు ననుఁ జేరఁ బిలిచినంత
పట్టాభిషేక మా పగిది నా మదిఁ దోఁచు | సొలపు క్రీగంట నన్ జూచినంత
నతివ! నన్ రక్షించినట్టి మచ్చిక దోఁచు | ననవిల్తుకేళిఁ గైకొనినయంత
గీ. ఇట్టి మోహంబు నింక నేనెటుల సైతు | ఎచ్చటను దాతు విరహాగ్ని నెటులఁ ద్రోతు
నయ్యయో! నీకు కరుణ యింతైన రాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 90
సీ. నిలచిన దిక్కున నిల్వనీయదు గుండె | జల్లని వేమాఱుఁ దల్లడిల్లు
మాటలాడెదనన్న మాటాడనీయదు | తనువునఁ బ్రాణముల్ తత్తరించు
నిదురపోయెదనన్న నిదుర కంటికి రాదు | మరుతాపమున మేను మఱుఁగుచుండు
నన్నపానంబుల నాశించబోయినఁ | చెలియ! నా జిహ్వకు జేఁదు దోఁచు
గీ. తరుణి! నీ బాళి హెచ్చ నింతటికిఁ దెచ్చె | శివములందఁగఁ జేయునా చిగురుటాకు-
బాకుఁ గలవాని ననవలెఁగాక నింకఁ, | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 91
సీ. ఎంత కార్యంబైన నేను గల్గఁగ నీకుఁ | జింత యేలనటంచుఁ జెప్పలేదొ?
తనువులు రెండుమాత్రము గాని యిద్దఱి | ప్రాణంబు లొకటని పల్కలేదొ?
నా జీవమును గల్గునందాక నే నిన్ను | బాయనంచును ప్రేమఁ బల్కలేదొ?
యొకరెంతఁ చెప్పిన యొగ్గుదునని మదిఁ | దలఁపకుమని నీవు పలుకలేదొ?
గీ. అన్ని మఱచియుఁ గడపట నన్ను బళిర! | పాపమనక మనోవ్యధ పాలుచేసి
మిన్నకున్నావు నీకిది మేలె చెలియ! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 92
సీ. ధేనుకబంధంబు దేలించునట్టి నీ | మెలకువల్ వేమఱుఁ దలఁచితలఁచి
కూడి బంధంబునఁ గోరి రమింపఁగ | సొంపులు పెక్కులు చూచిచూచి
పరఁగుఁ బద్మాసనబంధంబులను నన్నుఁ | గళలంటి పెనఁగుట కాచికాచి
యొక పాద మొనరు బంధంబుల | నేలి మనోధర్మ మెంచియెంచి
గీ. యెన్ని యెట్లని తాళుదు నేమిసేతు | నీకు దయవచ్చునో రాదొ నెనరు మీఱ
నిదియు వివరంబులని పల్కుమిపుడు నాతో | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 93
సీ. సన్నసైగలను ముచ్చటలాడుటె కాని | హాయిగా సరసంబు లాడలేదు
రహి నప్పుడపుడు మర్యాదలెంచుటె కాని | పావురముల్ పలుకు పలుకలేదు
కెమ్మోవిఁ జూచి గ్రుక్కిళ్ళు మ్రింగుటె కాని | యాసదీరఁగ నొక్కి యానలేదు
కనికని మిగుల నక్కఱల నుండుటె గాని | పెక్కువింతలుగాను పెనఁగలేదు
గీ. తిన్నఁదనమున నిట్లోర్చి యున్నవాఁడ | నీవు సర్వజ్ఞురాలవు నీకుఁ దెలియ-
నట్టి రీతులు నాచేతనౌనె పలుక? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 94
సీ. నీకు నాకును గాని లోకులందెవరైనఁ | జేరి యీ మక్కువల్ సేయగలరె?
హాయి నుండిన నేమి యాప్తీకరించుక | విడనాడుటలు లేక వెలయఁగలరె?
వెలసిరేనియు వింతవింతలుగా రతి- | బంధంబులను గూడి ప్రబలఁగలరె?
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
గీ. యటుల మన మిద్దఱుండుట నవనిజనులు | వీను లలరఁగ బలుకుట వినఁగలేదొ?
యది నిజంబుగ నొనరించు మబ్జనేత్ర! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 95
సీ. పంతమేలనె భామ! పగవాఁడనా నేను? | మనసు మర్మము దాచు మతమదేమి?
చింతతో నుండఁగాఁ జేసిన పనియేమి? | మాటలాడక యుండు మార్గమేమి?
వంచబాణునికేళిఁ బాయు కారణమేమి? | సంతోష మెడసిన జాడ యేమి?
యన్నపానీయమ్ము లంటని విధమేమి? | కనలుచుండెడి క్రూరకర్మమేమి?
గీ. చెలియ! నా మది మోహంబు సెప్ప నరుదు | దనరు మమతయు విడనాడఁదగునె నీకు?
చూడు నామీఁద దయయుంచి సుందరాంగి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 96
సీ. నీ చక్కఁదనమును నీదు నొయ్యారంబు | నీ మందగమనంబు నీదు సొంపు
నీ తిన్నఁదనమును నీదు శాంతగుణంబు | నీ వితరణమును నీదు రచన
నీ యౌవనంబును నీదు జాణతనంబు | నీ నెనరును నీటు నీదు వగలు
నీ బెళ్కు నీ తళ్కు నీ చక్కఁదనమును | నీ పల్కుప్రియమును నీదు నయము
గీ. నన్ని మదినెంచ నా తరమానె నీదు | దయకుఁ బాత్రుఁడ నన్నికఁ దప్పఁ జూచి
యిన్నిదినములవలెనె నీ వేఁచుచున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 97
సీ. రాకుమారుఁడ నంచు రాజసంబున నేను | చెలఁగి నీ సేవలు సేయలేదొ?
నేర్పుకాఁడ నటంచు నేర్పరితనమున | నీవు నేర్పిన బుద్ధి నేర్చలేదొ?
రాజసింహుఁడ నంచు రసికత్వ మెంచియు | నింతి! నీ రసికత్వ మెంచలేదొ?
భాగ్యవంతుఁడ నంచుఁ బటువిజృంభణవృత్తి | నాతి! నీకును దగ్గి నడవలేదొ?
గీ. పలుకుపలుకుకు నే మాఱు పలుకలేదొ | వేఁడినంతనె నే నిన్ను వేఁడలేదొ
కటకటా! నన్ను నతివేగఁ గలయకున్న, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 98
సీ. మగువ! నిన్నే కాని మనసులో వేఱొక్క | తెరవఁ దలంప భూదేవి యాన
యతివ! నిన్నే కాని యాసలో వేఱొక్క | వనితఁ గోరను నభోవాణి యాన
సుదతి! నిన్నే కాని చూడను వేఱొక్క | పడఁతిని భారతీభర్త యాన
పొలఁతి! నిన్నే కాని పూనిక వేఱొక్క | కలికి నెంచను రమాకాంతు నాన
గీ. యబల! శివునాన నేఁ గోర నన్యసతుల | నొప్పుకొనుమింక నితర మేనొక్క టెఱుఁగ
భావమందైనఁ దప్ప నీ పదము లాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 99
సీ. సుందరాంగి వటంచుఁ జూచుచుందును గాని | శృంగారవతులఁ జూచినది లేదు
నీదు చక్కనిమోవి నిక్కి చూచుటె కాని | పగడంపులంతఁ జూడ బాళి లేదు
నీ గబ్బిగుబ్బల నిలిచి చూచుటే కాని | పుట్లచెండ్లను బూన బుద్ధి రాదు
నీ మోముకళలన్ని ప్రేమఁ జూచుటే కాని | చందమామను జూడ సైఁచలేదు
గీ. కొమ్మ! నీ పొందునే నమ్మి కొదువ లేని- | వాఁడ ననుకొంటి నీకింత మోడి దగునె
కాంత! నీతోడ రతికేళిఁ గలయకున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 100
సీ. నీకుఁ దక్కితి నంచు నీవిట్టు లేఁచేవు | మది యింకఁ దాళదే మందయాన!
నా యౌవనముఁ జూచి నవలఁబోవఁ డటంచు | మోడి వహించేవు ముద్దుగుమ్మ!
చెప్పినమాటలు చేకొని నిను నంచుఁ | గపటంబు లెంచేవు కంబుకంఠి!
రసికత్వ మెంచియు రవ్వఁ గావించేవు | పసివాఁడనా నేను పద్మగంధి!
గీ. నీ వొసంగిన బాసలు నిక్క మనుచు | నమ్మియుంటిని నిన్నాళ్ళు నమ్మనింక
జాలుఁ జాలును నినుఁ గోరి చంద్రవదన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 101
సీ. నీవంటి జవరాలి నేఁ గోరినందుకు | ఫలమేమి గంటినే పద్మగంధి!
నిన్ను నే బతిమాలి యెన్ని యున్నందుకు | నే వాసి వచ్చెనే యెమ్మెలాడి!
వనిత! నీ స్నేహంబు వలచియున్నందుకు | నే రాజ్యమేలితి నిగురుఁబోణి!
పడతి! నిన్నెద నమ్మి పరఁగినందున | నే సుఖంబందితి నిందువదన!
గీ. వట్టి నేరంబులెన్నెదు వట్టి ప్రియము | వట్టిమాటలు సర్వదా వాంఛదీఱ
యిట్టి వేదనలందుచు నిచటనున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 102
సీ. మదనాగ్నిఁ బడియున్న మనసీయవైతివి | కలికి నీ మది నెంత గట్టితనమె
శరణంచు మొక్కినఁ గరుణించవైతివి | కోమలి! నీ కెంత గుంభితంబె
జాలిగొన్నప్పుడు పాలించవైతివి | వనిత నీ కెంత కువాదమొక్కొ
రతికేళికై వేఁడ రమ్మనవై తివి | రామ! నీ కెంత చట్రాయితనమె
గీ. పలుకు మాటల నమృత మంగిళుల విషము | నునుచుకొనుటెల్లఁ గని యింక నోర్వరాదు
తెరవ! కారాని కలఁగని తెలియకున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 103
సీ. అనుమాటలకు ప్రియ మగ్గలంబై రాదు | వగకానిపై వల్లెవాటు చెఱుఁగు
బిగఁబట్టి తానెంత బెగ్గిలిపడి లేచి | పడఁతిఁ బువ్వులపాన్పుపైకిఁ దిగిచి
కూర్చుండ నియమించి గొబ్బునఁ గర్పూర | వీడెం బొసంగి యివ్వేళనంత
మోము మోమునఁ చేర్చి ముద్దాడి కెమ్మోవి | మొనపంట నొక్కి ఱొమ్మునఁ గడంగి
గీ. గుబ్బచన్నులు కసిదీరఁ గుమ్మి సొంపు | పరఁగు మరుకేళి చౌసీతిబంధములను
నేలి సోలించి లాలించు నీలవేణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 104
సీ. వగకాఁడ! యింతలో మిగులమాటల నెన్ని | తేకువల్ గురియించ నీకు దగునె?
భ్రమకాఁడ! యింతలో బావినీళ్ళన్నియు | వెల్లువఁ బోవ నీ వెంచఁదగునె?
చెలికాఁడ! నీవేలు చిత్తజు రాజ్యంబు | నొకరు నేలుదురంచు నుండఁదగునె?
లయకాఁడ! దుర్గముల్ పరుల చేతికి నబ్బు- | నంచు నీ మదిలోన నెంచఁదగునె?
గీ. యనుచు నన్నను మాటలు నాత్మ మఱఁచి | యాటపాటల తేటల నన్ని వగల
జాణతనమున మానిన సకియ! నేఁడు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 105
సీ. ఈ వింతరచనల నీ సంతసంబుల | నీ ముద్దుపలుకుల నీదు బెళుకు
నీ వన్నెచిన్నెల నీ విలాసంబుల | నీ కుల్కుతనముల నీదు విధము
నీ మంచితనముల నీ మధురోక్తుల | నీ జాణతనముల నీదు గతుల
నీ ఘనయుక్తుల నీ దేహకాంతుల | నీ సరసోక్తుల నీదు రతుల
గీ. నేలుచును నన్ను రక్షించు మేలు గలుగ- | వచ్చె నీ దయ నామీఁద వాంఛ దీఱె
నిటుల నీతోడఁ గూడక యిచటనుండఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 106
సీ. వలవు రెట్టించి నే బలిమిగా వేఁడుట | తలఁతువో తలపవో కులుకులాడి!
ఆసించి నన్ను నే ననుసరించుటలెల్ల | తోఁచునో తోఁచదో తోయజాక్షి!
బాళి నిల్పఁగలేక బలువెతల్ చెందుట | తెలుతువో తెలియవో కలువకంటి!
యందఱిలో వృథా యారుదూఱైనది | యెంతువో యెంచవో యిందువదన!
గీ. కటకటా! యింత యన్యాయకారి వనుచు | నెమ్మనంబున దోఁచక నిన్ను వలఁచి
మోసపోయితి నయ్యయ్య దోసకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! 107
కాంతాలలామ శతకము సంపూర్ణము.
రచించినవారు - నృసింహాచార్య