సుందరీమణి శతకము - Sundarimani Satakamu

P Madhav Kumar

 


: సుందరీమణిశతకము : 

ఉ. శ్రీలలరంగఁ జంద్రకళ చెల్వున లేనునునవ్వువెన్నెలల్
గీలుకొనంగ నంగజశిలీముఖరీతిఁ జెలంగుచున్న నీ
లీల కనుంగొనంగ నవలీల నఖండసమస్తభూతలం -
బేలినకన్న సౌఖ్యమని యెంతుఁ జుమా మది సుందరీమణీ! 1

చ. నినుఁ దొలునాఁటికూటమిని నేరుపుఁతో జెలులెల్ల మెల్లమె-
ల్లనె పడకింటిలోని కొకలాగునఁ దెచ్చిననాఁటి సిగ్గుతో
నెనసిన యోరచూపులిఁక నేమననాఁటను గల్వదండలో
యన వెలుఁగొందె నేఁటి కెదనంటిన ముల్కులు సుందరీమణీ! 2

ఉ. ముసిముసినవ్వుతోఁ జిగురుమోవి కదల్పుచుఁ జన్నుదోయి నె-
న్నొసలు చమర్చఁగా ననుఁ గనుంగొని నానమరల్చు జూపులఁ-
య్యసమశరుండు మున్ను యెదనంటఁగ గ్రుచ్చి పెగల్చు పూవునా-
రసములనంగఁ దోఁచఁగ దరంబులె యోర్వఁగ సుందరీమణీ! 3

చ. సరసములాడు నేర్పు కనుసైగలు సేసెడు నేర్పు నా మనం-
బెఱిఁగెడు నేర్పు నెమ్మది నొకించుక గోపము సేయు నేర్పు క్ర-
మ్మఱ మురిపెంబుతోడ బ్రతిమాలెడు నేర్పు మనోజకేళిలోఁ
గరఁగెడు నేర్పు నీకె తగుఁగాదె తలంపఁగ సుందరీమణీ! 4

ఉ. పాపటదీర్చి నెన్నొసటిపై నునుపై యసియాడు చేయుచు-
క్కాపయిఁ గూర్చి గుబ్బలనొయారపు జాఱుపయంట చేర్చి వాల్
జూపుల నాదు మానసము చూఱఁగొనన్ సొగసైన రత్నపుం
దీపములాగ నా యెదుర నిల్చుట యెన్నడొ సుందరీమణీ! 5

ఉ. క్రొమ్ముడివీడ గబ్బిచనుగుబ్బల పేరులు చింద నత్తుము-
త్యమ్ము చలింపఁ గేలు కడియమ్ముల చప్పుడు లుప్పతిల్ల లేఁ
జెమ్మట మేను గ్రమ్మ మగఁసేతలు సేయుచు మోవితేనె తే-
తెమ్మని చెక్కు గొట్టుదువె, దిట్టతనమ్మున సుందరీమణీ! 6

చ. పదకటకంబు ఘళ్లురనఁ బైకిఁ జివాలున వ్రాలి గుబ్బలుం
గదుములు కట్ట ఱొమ్మదిమి గంటుగవాతెఱ నొక్కి మైగగు-
ర్పొదవఁగఁ బయ్యెఁదం జెమటలొత్తుచుఁ గేరుచుఁ గ్రిందుమీదుగాఁ
బొదువుచు నీవె నన్ గవయు పోడుములెన్నఁడు సుందరీమణీ! 7

చ. అలిగినవేళనైన మొగమారసి నవ్వక మానలేవు కౌఁ-
గిలి వదలంగలేవు తమిగీల్కొనఁగా నిదురించునప్పుడుం
గలయికనైన నే నలయఁగా గని పైకొన కోర్వలేవు, నీ
చెలిమి దలంచి, యే కరణిఁ జెందెద ధైర్యము సుందరీమణీ! 8

చ. తళుకుల దొంతి! పూవిలుతుదంతి! కడాని శలాక! కెంపురా-
మొలక! మెఱుంగుఁదీవ! నునుముత్తెమ! చక్కఁదనాలకుప్ప! యొ-
ప్పులగని! ముద్దుగుమ్మ! యని పొంగుచు నే వెయినోళ్లచేత నీ
చెలువము మెచ్చికొందుఁ దమి చిత్తములోపల సుందరీమణీ! 9

చ. మును కనుఱెప్ప వేయు క్షణమున్ యుగరీతిని దోఁచునట్టి నే
నిను నెడఁబాయఁ బ్రాణములు నిల్చె, నిదేమని కొంతసేపు నె-
మ్మనమునఁ జింత చేసి వినుమా పరికించితి నంతలోనె నీ
ఘనమధురాధరామృతము కారణమౌనని సుందరీమణీ! 10

ఉ. బంగరుతీఁగెవంటి మెయి పట్టెఁడు గుబ్బలు, చేరెఁ డేసి క-
న్నుంగలువల్ కనన్ మినుమినుక్కను కౌన్ బలుమేల్‍పిఱుందు జం-
కుం గళలుల్లసిల్ల నిటకున్ సిరిచుక్క యనంగ వచ్చి మా
ముంగల నిల్చుటెన్నఁడొకొ ముచ్చట దీరఁగ సుందరీమణీ! 11

చ. తమ మధురత్వసంపదగదా యిది దొంగిలెనంచు మోద న-
య్యమృతపుబిందువోయనఁగ నందమునం దగు ముక్కునత్తుము-
త్యము నునుమోవి మాటికిని దాకుచునుండఁగఁ బూరుషాయిత-
క్రమమున నుండు నిన్ దలఁపఁగాఁ గరఁగున్ మది సుందరీమణీ! 12

చ. చెలఁగుచు మీఱి నీదు నునుజెక్కులు గోరుల నొక్కకున్న మె-
చ్చులుగల నీదు మోవి చవిచూడకయుండిన నీదు పల్కులూ-
హలఁ గొనకున్న నీ తళుకు లందము నీ గుజరాతికెంపు లీ
చిలుకలు నేల నే గణన సేతునె వీనిని, సుందరీమణీ! 13

చ. అలుక యిదేమిరా! వెగటులాడకురా! దయతోడ జూడరా!
పలుక విదేలరా! గడుసు పల్కులెఱుంగని చిన్నదానరా!
చెలిమిఁ దలంపరా! మనవి చేకొనరా వినరా మనోహరా!
చెలువుఁడ యన్న నీ నెనరు చిత్తము వాయదు సుందరీమణీ! 14

చ. తల లొకయింత యెత్తి నునుదళ్కులుపై వెదజల్లి గొంటుపోఁ
కలవలెనుండి బంతులయి గట్టితనంబున కౌళ్లుగట్టి చెం-
తల నెఱనిండె నాంతరసుధాకలశంబులఁ గేరు నీ కుచం-
బులఁ బవళించి, నేఁ దనివి పొందుట యెన్నఁడొ సుందరీమణీ! 15


చ. రతిఁ జిగురాకువంటి యధరంబు చుఱుక్కునఁ బంటనొక్కి సీ-
త్కృతి యొనరించి, బొమ్మముడి దేరఁగ నోరగఁజూచి, నీకు నీ
గతి నొనరించనేర్తునని, గంటుగ నా నునుమోవి నొక్కి నొ-
చ్చితివే యటంచుఁ గేలఁ బరిశీలన చేతువె సుందరీమణీ! 16

చ. చెలఁగి కికాకిక న్నగుచుఁ జిల్కలమంచముమీఁదఁ గేరుచున్
గులుకుమెఱుంగుగబ్బిచనుగుబ్బ లురమ్మునఁ గూర్చి రేపవల్
తెలియక యుండువేళ సుదతీ! నిను నన్నెడబాపినట్టి యా
నలువకుఁ బూజ లేదుగద! నాఁటికి నేటికి, సుందరీమణీ! 17

చ. చిలుకలకొల్కి! నీ నగవుచిల్కెడు నెమ్మొగ మొక్కమాఱు క-
న్నులఁ గనుఁగొన్ననాఁడు మదనుండు ననుం గరుణించుగాక! యో
చెలి, నినుఁ బాసి వ్యర్థగతిఁ జెందిననాఁ డకటా! మరుండు కే-
వలమతి కర్కశాస్త్రముల వంచును నొంచును సుందరీమణీ! 18

ఉ. కాటుకకంటి నిగ్గులెసఁగం బొసఁగంగను నీ కటాక్షమై
నాటెను ఱొమ్ము తాళఁగలనా లలనా? యిదిగాక కప్రపున్
వీటి యొసంగుచుం బికిలిపిట్ట వగం, గవ గన్ననాటి నీ
కూటము లెన్న గుండె కరఁగుఁన్ జరగున్ ధృతి సుందరీమణీ! 19

చ. సొలయక నీవు పౌరుషముఁ జూపుచుఁ గంతురణం బొనర్ప నే-
నలకలు గోళదువ్వి, తెలనాకుల చుట్టలొసంగి, తాని పు-
వ్వుల సురటీల వీవ, నునుపుంగవు నల్లన బిగ్గఁబట్టి, నీవు యిం-
పులఁ బరిచర్య సేఁత దలపోయుదొ లేదొకొ సుందరీమణీ! 20

ఉ. మించు ధర న్నటించె లత మేదినిపైఁ జరియించె నేమొకో
యంచుఁ దలంచుచున్న తరి నచ్చపుబంగరుబొమ్మరీతి మ-
త్కాంచనసౌధసన్నిధిని గాంచి మదీయతపఃఫలంబె కా-
నెంచెద నన్ను నమ్మము రతీశుని సాక్షిగ సుందరీమణీ! 21

ఉ. చక్కెరబొమ్మ! నీ మొగము చక్కదనంబు పిఱుందునంద మా
చెక్కుల చెక్కు పల్వరుస చెల్వము నూరుల తీరు లయ్యరే!
యెక్కడఁజూడ నీవె కృప నించుక చూడకయున్న మానునే,
చక్కెరవింటిదంట సుమసాయక మేయక? సుందరీమణీ! 22

ఉ. నేటికి నిండె నా తపము నిక్కమటంచు సుఖించి యుంటి, స-
య్యాటల నాటపాటల నొయారపుదేటల ముద్దుమాటలన్
గూటమి నేలు నిన్నుఁ గని కోమలి! నిన్నెడబాసి యుంటి నీ-
నాఁటికి నేది మున్నెడ నొనర్చితినో యిట సుందరీమణీ! 23

చ. బహుతరలజ్జఁ గన్ను లొక పాళముగా ముకుళించి, నీ యురో-
రుహముల నీవిపైఁ గరసరోజములుంచి, తొడల్ బిగించ నే
రహి వలువెల్లఁ బాపఁగఁ బిరాలునఁ దొల్తటికూటమిన్ స్వయం-
గ్రహణ మొనర్చినట్టి యుపకారిణి వౌదువె సుందరీమణీ! 24

ఉ. అందెల నాదు చొప్పణఁచి, యల్లన మెల్లన వచ్చి కేళికా-
మందిరశయ్య నిద్ర గనుమాడ్కి వసించిన నాదు చెక్కులిం-
పొందఁగ ముద్దు పెట్టుకొనుచుండఁగ నేఁ జిఱునవ్వు నవ్వ, ల-
జ్జం దగు నిన్ను గేళి నెకసక్కెము చేయుదు సుందరీమణీ! 25

చ. ఎటులిఁకఁ దెల్లవాఱె సెలవీయర నీదు కరంబు నాదు సం-
దిట నిడినావు నా పదము నీ పదమున్ మెలవైచి తేమొకో
చిటిపొటిచేత చేసెదవె! సిగ్గుల చేటిపు డేమటంచుఁ గౌఁ-
గిటఁ బతిమాలు నిన్ బలిమిఁ గేళి యొనర్తును సుందరీమణీ! 31

ఉ. చెమ్మటనంటు ముంగురులు చిందిన కస్తురిబొట్టు నిద్దురం
గ్రమ్మెడు కన్నులున్ జెదరు కాటుకయున్ నెలవంకలున్ వినో-
దమ్మగు తళ్కుఁజెక్కులు రదక్షతలక్షితమైన మోవిచే
నిమ్మగు నీ మొగంబు గనుటెన్నఁడు ప్రొద్దున సుందరీమణీ! 32

ఉ. వాడిన మోముతోఁ దొగరువాతెఱఁ బలుగెంపుగుంపుతో
వీడిన కొప్పుతో సొలపువింతలతో ననుఁ బాసిఁపోవఁ గా-
ళ్లాడనియట్లు తొట్రువడు నందపు నెన్నడతోడఁ బ్రొద్దునన్
వేడుకఁ గేళిమందిరము వెల్వడుచుందువు సుందరీమణీ! 33

ఉ. సోయగ ముప్పతిల్ల ననుఁ జూచి కిసాలున నవ్వి లేచి, రా-
రా! యని కౌగిలింపుచుఁ బిరాలున శయ్యకు వ్రాలి గుబ్బలన్
నా యురమాని మోవి రదనంబున నొక్కుచుఁ జొక్కిచొక్కి యూ-
హూ! యని సైఁగ నన్ బలుకకుండ నదల్తువె సుందరీమణీ! 34

ఉ. పాయఁగలేని మోహమున బంతులవంటి కుచద్వయంబు చే-
దోయి నమర్చి, కేళితమి తోరపుఁ గామశతాంగచక్రపుం
జాయలపైకి దొర్లి నను శయ్యకు వ్రాల్చి పరాకటంచు వీ-
రాయితలీల మెచ్చుగొను నద్భుతశీలవె సుందరీమణీ! 35

ఉ. మించెడు వేడ్కఁ బైకొని రమించెడుచోఁ గటిమీఁద వేణి న-
ర్తించుట యొప్పు రాచిలుకతేజిమనోజుఁడు చౌపటాలి ద్రొ-
క్కించుచుఁ జిత్రభంగి దుమికింపుచు నీలకశాహతిం దుటా-
యించిన లాగు నా సొగసు లెన్నఁగ శక్యమే, సుందరీమణీ! 36

ఉ. మోహముమీఱఁ బంచశరుమోహర మొగ్గినవేళఁ గుల్కు నీ
సాహస మేమనన్ బయికిఁ జంగున దాఁటి చెలంగి కేళిలో
నీ హొనరెల్ల నేర్పఱుపు నేర్పరి వౌదువు విస్ఫురద్వరా-
రోహ యటన్న పేరు దగు రూఢిగ నీయెడ సుందరీమణీ! 37

చ. అలితతి మ్రోఁతకున్ శుకపికావళి కూఁతకు మంటమారిపూ-
విలుతుని కత్తికోతఁకు నవీనసమీరకుమారు నేఁతకున్
బొలుపుఁగ జంద్రు పెళ్లుడుకపోఁతకుఁ క్రొవ్విరిమల్లె పూతఁకున్
జలనమునొంది గుండె ఝలుఝల్లుమనెం గదె సుందరీమణీ! 38

చ. జడ కటి సంచరింప, బురుసాపనిచీరె పయిన్ మెఱుంగుపా-
వడ తళుకుల్ నటింప, బిగివట్రువగుబ్బల రత్నహారముల్
తడఁబడి సందడింప, మరుతంత్రము లందియ లుగ్గడింపఁగాఁ,
బడకకు వచ్చు నీ సొబగు భావముఁ బాయదు సుందరీమణీ! 39

చ. కొదమమిటారి చన్నుఁగవ గోరుల పోటు మెఱుంగు వాతెఱన్
గుదిరిన పచ్చికాటుకనుఁ గోనల నిద్దురపాటు చెమ్మటల్
కదలెడు మేనునీటు పదకంజములన్ దడఁబాటు, జారుప-
య్యెఁద యెదమాటు, నీవు పడకిల్ వెడలం దగు సుందరీమణీ! 40

ఉ. నీ కడకంటి చూపు, బలునిద్దపు నీ చనుదోయి ప్రాపు, నన్
బైకొను కోపు, నీ జిలుగుబంగరు మై నునుతాపు, నీ సుధా-
స్తోక రదాంశుకంబు చవి చూపు, దయామతి దాపు, నీవే నన్
జేకొను కోపు లేక గడెసేపు రుచించదు సుందరీమణీ! 41

చ. చిలుకహుమావజీరు విరిసింగిణిఁగూర్చిన కొత్తవింత పూ-
జిలుకవు నా పయిం గరుణ చిల్క విదేమి మెఱుంగురత్నపుం
బలుకవు, కప్పురంబులిక పల్కవిదేమి యటంచు నిన్న నే-
నలిగినవేళ వేఁడుకొను టాత్మఁ దలంపవె సుందరీమణీ! 42

ఉ. కోపము మానవే, నెనరుగూర్చిన చల్లనిచూపువెన్నెలల్
నాపయిఁ జల్లవే చలము నాయమె బిగ్గఱఁ గౌఁగిలింపవే
యో పువుఁబోఁడి! యో రమణి! యో చెలి! నీ యధరామృతంబునం
దాపము దీర్చవే యనుచుఁ దద్దయుఁ బల్కుదు సుందరీమణీ! 43

చ. అతులితచిత్రవస్తుసముదంచితదర్పణనూత్నకాంతి న-
ప్రతిమపుఁ గేళిసౌధమున బంగరుసౌధపుఁ జప్పరంపు మేల్
రతనపుఁ గోళ్లమంచమున రంజిలు పూసలసెజ్జయందు నేఁ
గుతుకముమీఱ నిన్నుఁ గవగూడుట యెన్నడొ సుందరీమణీ! 44

ఉ. ఇంచుక నొక్కనాఁడు పడకింట సమున్నతదర్పణాప్తి నై-
జాంచితమూర్తిఁ గన్గొని పరాంగనలౌ యని యల్గిపోవ వా-
రించుచు నీడఁజూచి బెదరేవని నవ్వుచు మోము ద్రిప్పి నీ-
క్షించుమనన్ గ్రహించి దయ సేతువుగా నను సుందరీమణీ! 45

చ. పలుచనిమేనితోఁ జిలుకపల్కులతోఁ జిఱునవ్వుమోముతో
కులుకుకడానిడాల్‍పొగరుగుబ్బలతో నసియాడుకౌనుతో
బలువుపిఱుందుతోఁ దరుణపల్లవజిచ్చరణద్వయంబుతో
తమము చెంత నిల్చి పరితాపము దీర్పవె సుందరీమణీ! 46

చ. కిలకిల నవ్వు నవ్వి, గిలిగింతలు వింతలు చేసిచేసి, గు-
బ్బల నెద గ్రుమ్మిక్రుమ్మి, నునుపల్మొనవాతెఱ నొక్కినొక్కి, రా-
చిలుకహుమావజీరు విలసిల్లు లడాయి బడాయి చూపు నిన్
దలఁచిన గుండెలో దిగులు దైవమెఱుంగును సుందరీమణీ! 47

చ. కొదమమిటారిచన్నుఁగవ గొప్పపిఱుందు మెఱుంగుఁజెక్కు లొ-
ప్పిదమగు కన్ను లబ్బురపుఁ బెన్నెఱు లొప్ప వయఃప్రపూర్ణమై
మదనునిదంతిలాగు నను మక్కువ దక్కఁ బెనంగుచుండు నిన్
వదలఁకయున్న నబ్బు వహవా సహవాసము సుందరీమణీ! 48

చ. గడి యెడబాసి చిత్రఫలకంబున నా నునుచూపు వ్రాసి న-
ల్గడలును జూచి మోహమున కన్నులనద్దుక చన్నుదోయిపై
నిడికొని జంకుకొంకునెడ నేఁ గనుగొందు పిఱుందపొంచి బ-
ల్వెడవిలుకాఁడు కత్తి ఝళిపించెను కోయను సుందరీమణీ! 49

చ. చనుగవ మున్ను నొక్కుదునొ చక్కని చెక్కిలి ముద్దుగొందునో
మును నునుమోవి గ్రోలుదునొ? తొల్తఁ గవుంగిట జేర్చుకొందునో
యని యనురాగమొంది మనసారగ నువ్విళులూరుచుండఁగాఁ
దనువులు రెండు నొక్కటగఁ దార్కొనఁజేతువె సుందరీమణీ! 50

ఉ. చిత్తము రంజిలంగ నల చిత్తజుపట్టపుదంతివై ???
వత్తువు వచ్చి చిత్రితమ??? యిబ్బడి నుండెడు నన్ను కేళిలో
మెత్తువొ మెచ్చి నా సొలపు మేన్ వెదదీరగ మోవినానకన్
బిత్తువొ, నీ ఋణంబు లిక యెన్నడు దీర్తును సుందరీమణీ! 51

ఉ. మంతనమంచు వచ్చి పలుమారు కపోలము చుంబనంబు గా-
వింతువె పువ్వుదండ మెడవేసెదనంచు నురంబునందు నా-
టింతువె చన్మొ... ... ... ... ... ... ... ... రదంబు మోవి సం-
ధింతువె నీ వినోదము నుతింపగ శక్యమే సుందరిమణీ! 52

ఉ. ... ... ... ... వత్తు నలివేణి దయన్ ... ... మ్మటంచు మో-
హమ్మున కౌఁగలించుకొన నక్కున జేర్చి ... ... .. ... ... ...
... ... ... సిల్లుగతి కన్నుల నశ్రులు కమ్మ ... ... ... ... ... ...
... ... .. ... ... ... ... ... ... దైన్యము లెంచుదు సుందరీమణీ! 53

చ. కనకపుబొమ్మ నిన్ను కను కన్నులు కన్నులు, నీదు చాతురీ-
వినయవచోగతుల్ వినెడు వీనులు వీనులు, నీ తనూలతం
బెనగెడు మేను మేను, తమి నిన్నెపుడున్ మరుకేళిలోన రం-
జన మొనరించకాఁ గలుగు జన్మము జన్మము సుందరీమణీ! 54

చ. కులుకుచుఁ గేళిసౌధమునకున్ వెస నీ వరుదెంచి, నాదు క-
న్నులు వడిమూయ నే నిను గనుంగొను లాగు మోము గు-
బ్బలు వళులుల్కవేసి పిరుదు పల్మరు నంటుచు నీవె లాగినన్
భళిభళి! యంచు నవ్వుదువు పక్కను పైఁబడి సుందరీమణీ! 55

చ. మదనుఁడు డాసెఁ బూవిలుతు మర్మములంటఁగ నేసె నక్కటా
హృదయము దూసె దానిపయి నిందుఁడు వెన్నెలఁ గాసెఁ గోకిలల్
చెదరక కూసెఁ జిల్క రొఁద చేసె నళుల్ వడి మ్రోసె నెట్టులో-
ర్చెద విధి నిన్ను నన్నెడలఁజేసె దురాత్మత సుందరీమణీ! 56

ఉ. హా తరళాక్షి! హా రమణి! హా చెలి! నీవును నేను మేడలోఁ
గౌతుకమందు నున్‍హవుసు ఖానపు వారము చింద మల్లికా-
నూతనశయ్యపై మరువినోదములొందు మజా దలంచితే
రాతిరి కంటికిన్ నిదురరాదిక నెట్లొకొ సుందరీమణీ! 57

ఉ. ముద్దులగుమ్మ! నీ కులుకు ముద్దుమొగం బిటువంటిదంచు నే-
నద్దముఁ జూచుకొందు కమలాఖ్యఫలంబులు చేతనుంతు నీ
నిద్దపుఁ జంటిపోలికని నీ యధరోపమమంచుఁ గొందు నం-
చద్దయఁ దీయమామిడిరసం బొకగ్రుక్కెడు సుందరీమణీ! 58

ఉ. దీపములున్ మతాబులును దివ్వటులున్ కొరవియున్ శశాంకుడున్
దీపితులై వెలింగినను నీమెయి వెన్నెల నీ యొయారపుం
జూపు మెఱుంగు తామరల సొంపును గన్గొనకున్నఁ జిత్తవి-
క్షేపమునొంది రేపగలు చీకటియౌఁ గదె సుందరీమణీ! 59

ఉ. మారెడు బంటసోయగము మారెను నీ చనుగుబ్బదోయిపై
గోరెడు బంటనొక్కి మదిఁ గోరెడు నీ నునుమోవి గ్రోల నో-
రూరెడు నేమిసేతు మరుఁ డూరట జెందకయుండు; మీఁది మ-
న్నారెడు పూవు మోదినను నారెడు బెట్టెదు సుందరీమణీ! 60

ఉ. భావము పల్లవింపఁ బువుబానుపుపై వసియించి వేడుకన్
నీవును నేను ముచ్చటలు నేరుపుమీఱఁగ నాడుకొంచు నెం-
తో వగమీఱ మించుతమితో నెపుడుంటిమొ యా దినంబులిం-
కేవిధి వచ్చునో తెలియదే మది కిప్పుడు సుందరీమణీ! 61

ఉ. కాంతుని తీవ్రబాణముల కాకకుఁ దాళగలేక నీవె నే-
నింత తపింప నేపయిన నింపగు కల్పన జేసె బ్రహ్మ క-
ల్పాంతసహస్రకల్పనములయ్య ... ... లక్కటక్కటా
యెంతని యోర్తు ... ... లేదు నేమి యొనర్తును సుందరీమణీ! 62

ఉ. ఎన్నఁడు నిన్ను గన్గొనుదు నెన్నఁడు కౌగిటఁ జేర్చుకొందు నిం-
కెన్నఁడు ముచ్చటాడి సుఖియించెద నెన్నఁడు వేడ్క మించెదన్
క్రొన్నలరారు మేకపయి క్రొన్ననవిల్తునికేళి దేల య-
భ్యున్నతలీల నే తనివినొందుట యెన్నడు? సుందరీమణీ! 63

ఉ. నీ కటిపెంపుచేత ధరణీతలమున్ వశమయ్యె కోమలీ
నీ కుచకుంభయుగ్మమున నిర్జితమయ్యె సురాలయం బహో
చేకొనఁగల్గె నీదు జడచే నహిధామము నిన్నుఁ గూడి ము-
ల్లోకము లేలినట్లు మదిలో ముదమందుదు సుందరీమణీ! 64

ఉ. ఓ తరళాక్షి! మంచుతరలూఁతగఁ బొక్కిలి కందుకంబు నెం-
తో తమి నంతరించి చెలువొందెడు నీ వలిగబ్బిగుబ్బ చ-
క్రాతి ... ... నఖాగ్రమున రాయిడి చేసి చెలంగి డాసి చే-
చేతనె పుచ్చుకొందు కద, చిత్తజు ప్రాపున సుందరీమణీ! 65

ఉ. అంగన నన్నుఁ గూడి చతురంగములాడఁగ నోరఁజూపు క-
న్నుంగవ నీటుపొంగెడు చనుంగవ నీటుమెఱుంగు చక్కటిన్
సంగతినుంచు హస్తజలజాతము నీటఁ దలంచుకొన్న న-
న్నంగజుఁ డీరుబారుగ సుమాసిని వ్రేసెడు సుందరీమణీ! 66

ఉ. పంతము మీఱ నీదు చనుబంతుల ప్రాపున లెక్కసేయఁ గొం-
డంతటి కార్యమైన భవదంచితసాంద్రకటాక్షయుక్తి కే
కంతుని బాణపంక్తి నట కట్లను గట్టుదు నీదు పల్కు వి-
న్నంతనె యింద్రుఁడైన గణనా యనుకొందును సుందరీమణీ! 67

చ. వెలదిరొ! కొంతసిగ్గు విడివీడని కాలమునందుఁ గేళి నే
చెలఁగుచుఁ బూరుషాయితము చేయుమటన్న నెఱుంగనంచు లోఁ
గులుకుచునున్న బాహువులు గొబ్బునఁ జేకొని పైకి లాగి, చె-
క్కిలి గిలిగింతగొల్పి యుబికించుట యెంతును సుందరీమణీ! 68

చ. చెలఁగుచు జాఫరారసపుఁ జిమ్మనగ్రోవులఁ జిమ్ములాట డా-
ల్కలరతనాలమేడగదులం గడు దాఁగుడుమూతలాట వే-
డ్కలఁ దగు గంజిఫాట, సొగటాల్ చదరంగములాట మున్నుగా
నలరెడు నన్ని చోద్యములు నాడుదుమో తమి సుందరీమణీ! 69

చ. కపురపుఁ దావి గుబ్బలను గల్పగుళుచ్ఛములిచ్చి, మాటలో
నపరిమితామృతం బొసఁగి యబ్బురపున్ సురతాప్తి గూర్చి సౌ-
ఖ్యపురతి సొంపుగొల్పు నిను నక్కడనే కనుఱెప్ప వేయ కె-
ల్లపుడును జూడకుండ నహహా! విధి చేసెను సుందరీమణీ! 70

చ. చిలుకకు నాదు పేర విలసిల్లెడు పద్యము చెప్పుచుండ నా
యలుకుడుగాగ నూరకె విహారము చేసెడు రీతినుండఁగా
చెలియలు సైఁగలున్ బరిహసించిన కోపపుఁజూపుచేత బొ-
మ్మలముడి యొప్పు శేషరతి మారధనుర్గతి సుందరీమణీ! 71

ఉ. నీ జగజంపుఁ జూపులును నీ చనుగుబ్బలు నీ మహోరు లెం-
తో జత మీఱ నన్నును నెదుర్కొనునో యన గప్పురంపు నీ-
రాజనదీపిక ల్కనకరాజతకుంభము లంటిబోదియల్
రాజిలు ద్వారమార్గమున రాఁ గనుటెన్నడు సుందరీమణీ! 72

ఉ. హారములల్లనన్ గుచములందుఁ జరింపగ వచ్చునట్టి యొ-
య్యారము నోరచూపుల యొయారము నవ్వుచుఁ జెంతనిల్చు నొ-
య్యారము శయ్య చెందెడు నొయారము కేళికిఁ దార్పఁగల్గు నొ-
య్యారము నాదు మానసమునం దెడబాయవు సుందరీమణీ! 73

ఉ. కాంచనగంధి రాచిలుకకైవడి నీ వల దొండపండు మె-
ప్పించెడు వేళ నిన్ను మరపింపఁగ నే నల చిల్కచేతఁ ది-
ట్టించిన దానిపైఁ బ్రతిఘటించి తొలంగఁగ జేయ దొండపం-
డంచును మోవినొక్కి పరిహాసమొనర్తును సుందరీమణీ! 74

ఉ. మాటలు తేనెజాలు చనుమట్టులు బంగరుబొంగరాలు కన్
తేటలు గండుమీలు నును నెమ్మెయి మించుల నేలు వాహవా
కూటమి నేలు మేలుగల కోపుల లీల దలంచుకొన్న హా
పూటకుఁ గోటివేలు పడిపోవుచునున్నవి సుందరీమణీ! 75

ఉ. హారములొత్తునంచుఁ బరిహార మొనర్చి కవుంగిలించి వ్యా-
హారముదంబునన్ రతివిహారము సల్పి మనోజబాధ సం-
హారము చేసి, నాదు వ్యవహారము నిల్వకయున్న నిద్ర వ్యా-
హారము గాంతునే నను మహారముఁడందురె సుందరీమణీ! 76

ఉ. బోటిరొ వానచే వెడలిపోవఁగలే కొకనాఁడటుండి యే-
ర్పాటుగ నిద్రవోవ నెఱపయ్యెద దీపము త్రెంచి వచ్చి, స-
య్యాటలు మాటలున్ బెనఁకులాటలు సీత్కృతు లేమి లేక నన్
గూటమి నేలుటల్ దలచుకొందువొ లేదొకొ సుందరీమణీ! 77

చ. అనుపమమైన వేళ సకలాభరణంబులు దాల్చి బేజుమా-
లొనరిచి మానికంపుటొరను౦చిన మారుకటారివంటి నిన్
గనుఁగవ నిండ నేను గనఁగా వెఱతుం గదె దృష్టి తాఁకునో
యని యిక నెన్నఁడేను మనసారఁగ జూచెద సుందరీమణీ! 78

ఉ. వేడిమి మాను చంద్ర! నిను వేఁడెదఁ జల్లనిరాజ వీవు నీ
వాడను నే నటంచు బహువారము దూరిన నీ మొగంబునున్
జూడక యేఁచుచుండె జడ చొప్పడ నల్లుము నీదు కొప్పుచే
వీడదె రాహువం చడలి వెల్వడు దెన్నఁడు సుందరీమణీ! 79

ఉ. తమ్ముల నెమ్మొగమ్ము నును దళ్కుఁ జనుంగవచే నశోకగు-
చ్ఛమ్ముల మావిలేఁజిగురుఁ జక్కనివాతెఱ చేత మల్లెలున్
నెమ్మెయి తావిఁ గన్నుఁగవ నీటునఁ గల్వల గెల్చినావు క్రొ-
త్తమ్ము లెటుండివచ్చె మరుఁ డాచక వ్రేసెడు సుందరీమణీ! 80

చ. నునుమునిపంటఁ గ్రొంబెదవి నొక్కి యనంగునికేళి నీదు మై
పెనఁగొని నొక్కి క్రిక్కిరిసి పెక్కువ నెక్కువ పిక్కటిల్లఁ జ-
క్కని చనుగుబ్బలంటి బిగికౌఁగిటఁ జిక్కిననాఁడె జన్మమె-
త్తిన ఫలమబ్బె నేమయిన దిట్టము మాకిక సుందరీమణీ! 81

చ. కమలదళాక్షి నీవొకప్రకారముగాఁ బొలయల్కచే ముఖా-
బ్జము వెడసేయ నే నెనరుపల్కులు పల్కి, పయంట లాగి హ-
స్తము గదియించిన న్వడి విదల్చి ససీత్కృతితో నురోజమ-
ధ్యమమున నాదు చే యిఱికెనన్న హసింతువు సుందరీమణీ! 82

చ. నను నల నవ్వుటాలకయినన్ బొలయల్కల జేసియైననున్
నను గలలోననై నను క్షణం బెడబాయకజాలవంచు నో
వనజదళాక్షి నీకొఱకె వంతలనొందెద వెట్టులోర్తువే
నునుచలిగాలి వేడికి మనోజుని దాఁడికి సుందరీమణీ! 83

ఉ. నీ కడకంటిచే హరిణి నీ కనుసైగలఁ జిత్రరేఖయున్
నీ కళ చేత హేమగతి నీ లలితోరుల కాంతి రంభ నీ
శ్రీకరబాలలీల శశిరేఖయు నీరసవృత్తిఁ జెందుటన్
నీ కెనరారు దేవతరుణీమణులయినను సుందరీమణీ! 84

ఉ. భామిని నిన్న రే నిదుర పట్టక పట్టక పట్టినంతలో
కామునికేళిలో మనము కౌతుకమంది పెనంగులాడి యే-
మేమొ వినోదముల్ సలుప, నెక్కడి పాపపుకోడి కూసెనో
స్వామికటాక్ష మట్లలరె స్వప్నమునందును, సుందరీమణీ! 85

చ. నెల పయనం బటన్న విని నీవడలొందుదువంచు నింతలో
నెలతరొ వత్తునంచు వెస నిన్నొక సమ్మతి చేసివచ్చి క్రొ-
న్నెలలకు వేఁడివెన్నెలకు నిద్దపుఁ బూవిలుకాని కాఱుచి-
న్నెలలకుఁ దాళలేనయితి నీవెటులోర్తువె సుందరీమణీ! 86

ఉ. నీ జటపై జవాదిపస నిద్దపు నెమ్మెయిఁ గుల్క దావకో-
రోజమృగీమదాంకితపు ఱొమ్ముదుడై తగ నీదు కన్నులన్
రాజిలు కాటుకంటు నధరంబు వెలింగెడు నన్నుఁ జూచి యా-
లీజనులెల్ల నవ్వ, దరిలేని ముదంబగు సుందరీమణీ! 87

చ. అలరులశయ్యఁ బండి, మనమవ్వలిమోములు చేసి యల్కచే
పలుకక యుండి యొండొరులఁ బల్మరుచూడక యుండఁ జూచుచో
నెలమి నొకింత సేపటికి నిద్దరిచూపులుఁ దారసిల్లినన్
కిలకిలనే కవుంగిళులఁ గేరుచునుందువు సుందరీమణీ! 88

ఉ. వింతగ నన్ను నీవు బదివేలవిధంబుల నవ్వులాట కొ-
ట్టింతువు మాటల న్నెదఘటింతువు చన్గవ యల్కసేయ న-
వ్వింతువు పల్కుఁ గప్పురపు వీడె మొసంగి మనోజరాజ్య మే-
లింతువు నీ గతుల్ పొగడలేము గదే మది సుందరీమణీ! 89

చ. తొలఁగక చెంతనున్న ననుఁ దొంగిలి రెప్పలఁ జూచిచూడన-
ట్టులు వగగుల్కియుండెడు గడున్ బయనం బరుగంగ వేఁగి వి-
చ్చలవిడి సౌధవీథిపయి చాయలఁ జూచెద వోరగంటనే
పొలమున వెళ్లు నీ బెళుకుఁబొంకపుఁ జూపులు సుందరీమణీ! 90

చ. నను నెడబాసి యుండిన దినంబుల లెక్కలఁ గొంతసేపు, నా
మునుపటి కేళిలో మెలఁగి ముచ్చటలాడుట కొంతసేపు, నా
కనుగుణమైన వస్తువుల నంపెడు సందడిఁ గొంతసేపు, నొ-
య్యన పవలెల్ల నోర్చి నిశియం దెటులోర్తువొ సుందరీమణీ! 91

చ. పెనిమిటి కాంచలేఁడనియుఁ బిల్చినఁ బల్కవటంచుఁ దోడి జ-
వ్వను లెకసక్కెమాడ నొకవైఖరిఁ బల్కుచు నొంటి బాగులే-
దని వెత నిద్రయోగిరమునందక కుందుచు నూపిరెల్ల ము-
క్కుననిడి యుంటివంచు విని గుండెలు నిల్వవు సుందరీమణీ! 92

చ. రతి మును గేలిసోలి నడురాతిరి మేల్కని నేను నిన్ బునా-
రతమతిఁ గౌఁగిలించినఁ బిరాలున నవ్వలికేఁగి రాక య-
ద్భుతపడి నేను బిల్వ విని ప్రొద్దిక నెంతని పల్కి సిగ్గుతో
ఋతుమతివౌట తెల్పకయె యేర్పడఁ దెల్పుదు సుందరీమణీ! 93

చ. పటుగతిఁ బూవుబంతి చనుబంతులపై గురిచేసి వ్రేయగా
తటుకున నొడ్డి పుచ్చుకొని తక్కుచు నీ పనికేమి తాళుమం-
చిటునటు చూచిచూచి వలయింపుచు నవ్వుచు మూఁడునాళ్లు ము-
చ్చటలనె తెల్లవాఱఁ బలుసందడి నుందువు సుందరీమణీ! 94

చ. గొదగొని మోవులానుచును గొంకక నేఁ బయికొందునంచు మైఁ
బొదలి పెనంగులాడి చలవొంది వచించఁగరాని చేష్టలన్
మదనుని కేళిలో మెలఁగు నాలవనాఁటి గతుల్ తలంచితే
హృదయము జల్లుజల్లుమను నెంతని యోర్చెద సుందరీమణీ! 95

ఉ. ఏ గతినోర్తునే జలరుహేక్షణ! నే క్షణమైనఁ బాయగా
లేఁ గదవే సువర్ణకదళీసదళీనకరోరుయుగ్మ య-
య్యో గురిదప్పకుండ మరుఁ డుల్లము జల్లెడతూంట్లు చేసెనే
యో గజయాన! యో రమణి! యో జగదద్భుతసుందరీమణీ! 96

ఉ. కన్నియ యిప్పుడేల కడకట్ట ప్రయాణము దీర్చివచ్చి నిన్
గన్నులఁ జూచి సంతసిలఁగల్గెడు పోఁడిమి పట్టినంతలో
నెన్నిదినంబు లుంటివని యెంతయుఁ గోపముమాని బిగ్గఱన్
నన్నుఁ గవుంగలించుకొని నా వెత దీర్పవె సుందరీమణీ! 97

చ. కురులకుఁ గృష్ణభావమును గుబ్బల కచ్యుతరీతి కర్ణవై-
ఖరికల శ్రీవరప్రతిభ కౌనునకున్ హరిమంగళాకృతుల్
కరముఁ జెలంగు నీకు; కలకాలము నిన్ను దలంచఁ బాయు దు-
ష్కరపరితాపమెల్ల నవసారసలోచన సుందరీమణీ! 98

చ. అలికులవేణి నీ కొరకు నన్నలఁ దమ్ములఁ బాసి వస్తి నీ
కులుకుమిటారిగబ్బిచనుగుబ్బల నొత్తుచుఁ గౌఁగిలించవే
కలికిరొ నీకు గుండె బలుకట్టిఁడి దైవము రాయి చేసెనే
చెలియరొ నీకు నా యుసురు చెందక మానునె సుందరీమణీ! 99

ఉ. తే వదనస్య చంద్రరుచిధిక్కరణప్రతిభాస్తు; తే దృశో-
భావభవోత్పలాంబురుహబాణకదంబజయోస్తు సంతతం
తే వచనస్య కోకిలతతిప్రవరాయసకృద్విధోస్తటం-
చే వినుతింతు నీకు శుభమీయఁగ దేవుని సుందరీమణీ! 100

సంపూర్ణము.
 
రచించినవారు - గోగులపాటి కూర్మనాథకవి
 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat