చక్కట్లదండ శతకము - Chakkatladanda Satakamu

P Madhav Kumar

 


: చక్కట్లదండ (లౌకికనీతిమాలిక) :

సీ. సిరికిఱొమ్మిచ్చి మచ్చికసేయు నిచ్చలు - వెన్నుండు దా వేల్పువేలుపయిన
మిన్నేటిచెలి నెత్తిమీద బెట్టుక మ్రోచు - ముక్కంటి జేజేల ముదుకయయిన
పలుకువెలది నోటబట్టి ముచ్చటలాడు - బెమ్మ దాదెరగంటి పెద్దయయిన
కలువకంటులగద్దె గదలనీ కాడింత్రు - దెసరేండ్లు బాసవాల్దిట్టలయిన  
గీ. కస్తి రానీక నిల్లాండ్ర గాచువారి - యింట సేమంబు దరుగక యుంట నిజము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 1

సీ. బంగారుబొమ్మకు రంగు బూయగనేల - పేడబొమ్మకు బూయ గూడుగాక
పాసెంబునకు నూరుఁబద్ద నంజగనేల - చోడంబలిని నంజ గూడుగాక
పెద్దమఱ్ఱికి గాలిబెట్టు బెట్టగనేల - మేడిమ్రోకకు బెట్ట గూడుగాక
వెండిగిన్నెకు జింతపండు పుల్కాపేల - వాడ నిత్తడి కిడ గూడుగాక  
గీ. వాసిగలవారి కింకొక్క వాసితోడు - వల దలంతికి నెపుడు గావలయుగాక
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 2

సీ. కోతి దాఁజెట్టెక్కి కూసినంతనె క్రింది - కొదమసింగము వాసి కొరతవడునె
లంజ రాయని మెప్పురా మరుల్కొల్పిన - నిల్లాలి మరియాద చెల్లకున్నె
పుల్లేరు దానెంత పొరలివచ్చిన బెద్ద - కొల్లేటి కడుపు దా గొదవయగునె
ప్రాఁచితీగెలు చాల పయిబారి పెరిగిన - మద్దిమ్రానికి లావు కొద్దియగునె  
గీ. క్రించుమానిసి తానెంత గింజుకొన్న - మంచివాని పొగడ్తలు మాన్పలేడు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 3

సీ. కాన్పుఁగత్తె యెరుంగుగాక యెన్నటికైన - గొడ్డురా లెరుఁగునా బిడ్డకుట్టు
గండుదేటి యెరుంగుగాక యెన్నటికైన - చిరుకప్ప యెరుఁగునా విరులతావి
కలమానిసి యెరుంగుగాక యెన్నటికైన - పట్టుపుర్వెరుఁగునా బట్టసొంపు
కాపుబిడ్డ యెరుంగుగాక యెన్నటికైన - పిడుకెరుంగునె పాలతొడుకుపాడి  
గీ. ఎరుకగలవా రెరుంగుదు రెద్దియేని - యెరుకమాలినవారి కెట్లెరుకపడును
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 4

సీ. తాటిబెల్లము వెన్నతోటి గల్పినమాత్ర - పారుబంతులకు ణ్ణేరమగునె
గులకరాతికిఁ బైడి కుప్పె బెట్టిన మాత్ర - కాసులదండ మేల్పూస యగునె
చెట్టగాడ్దెకు జీను గట్టితీర్చినమాత్ర - రౌతెక్క ననిలో నరబ్బి యగునె
కారుదున్నకు గొల్సుఁ గట్టినమాత్ర - అంబారిగట్ట రాహుత్తి యగునె  
గీ. కొంచెగానికి బొంకము ల్కూర్చినంత - గొప్పవారలతో సరిగొల్పవశమె
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 5

సీ. ఉసిరికాయనుఁ దేనె నూరఁబెట్టుదురు గా - కుల్లిపాయనుఁ బెట్టనొల్ల డొకడు
కమ్మనూనెనుఁ గచోరమ్మిడి కాతురు - పేరాముదము లోనబెట్ట డొకడు
క్రొత్తచీరెల గేదగులు సేర్తురేగాని - గోచిప్రాఁతలఁ జేర్చకోర డొకడు
తగుతలాటము స్వారిదండె బెట్టునుగాని - దంపనాగఁటి కిడఁదలచఁ డొకడు  
గీ. మేటులగు వారికేగాక మేల్మిపొత్తు - కొలదివారికి రాదెంత కొట్టుకొన్న
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 6

సీ. ముత్యాలసరిఫణీ ముసలమ్మతలకేల - కలికిమిఠారి వేనలికి గాక
అద్దాలకిటికి తాటాకు గుడ్సెకునేల - బెడఁగైన రచ్చచావడికిఁ గాక
బలుసీమశాలు వుప్పరి నెత్తిపయినేల - మేటినేర్పరి మేనిమీదఁ గాక
తాటిపట్టెకును ముతాకి జెక్కగనేల - గణితంపుఁ టేకు చెక్కలకె గాక  
గీ. విలువమాలిన వానికి విలువలేల - విలువగల మేటివలఁతుల కలరుఁ గాక
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 7

సీ. పడిసెంబు బట్టిన పాదుషా మీఁగడ - చీదునా చీమిడిఁ జీదుగాక
జవరాలికిని యుబ్బ దవిలినా పన్నీరు - బుట్టునా చెమ్మట బుట్టుగాక
చెరుకుతోటకుఁ బుప్పి పెరిగెనా కలకండ - రాలునా నులుపిప్పి రాలుగాక
బూతపిల్లికి ముడ్డిపుచ్చెనా జవ్వాజి - కట్టునా చెడుచీము కట్టుగాక  
గీ. ఎట్టివానికినైనను జెట్టదొడమి - చెట్టబుట్టించుఁగాని మేల్చేయ దెన్న
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 8

సీ. ఇసుక దాసరికాఁడ యిడకఁ యెల్లెడఁ బ్రాకు - మంచినేలను మల్లె బెంచవలయు
గువ్వ రాళ్ళూర కడ్గులనంటుఁ బొలముల - గని బాటువడి రవ గాంచవలయు
పిల్లికూనలు తామె యిల్లిల్లు గ్రుమ్మరు - వేమంది పులికూన వెదుకవలయు
కొరమాలి నాళువల్‌ కొలఁకు లన్నిటనుండు - కళకు ముత్తెపుజిప్ప కడలి దొరకు  
గీ. కొంచెగాండ్రెల్ల తావుల గొదువపడరు - గొప్పవారుందు రరుదుగాఁ గొన్నియెడల
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 9

సీ. గుడిసెఁ గట్టిన లంజెకొడుకెంత జదివిన - తండ్రిపేరునుఁ జెప్ప దడివికొనఁడె
సాహెబుమెడ రెండు జందెప్రోవులు వైవ - సందెముక్కను నయిజాన్త యనడె
పిల్లకుక్కను దెచ్చి పల్లకిపై బెట్ట - ఆరతిచ్చిన దివ్వె లార్పబోదె
ఊబవానికి నొక్క యువిదను ముడి బెట్ట - నగరు పెండిలినాడు నగవుగాదె  
గీ. తగనివానికి నొక దొడ్డతనముగూర్ప - నగడు పడుటయెకాని పోదలతిదనము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 10

సీ. ఆలి లోపలి యింట నడచిపెట్టంగానె - కూళగండడు రాచకొమరుడగునె
దుడ్డుగోలను బట్టి దున్ననెక్కంగానె - మాలండు పెతరులవేలుపగునె
గొల్ల గుడ్డల దోచి కొమ్మపైకూర్చున్న - కాటితెక్కలి తమ్మికంటి యగునె
తగ వేదిగండని తలమీద నెక్కిన గ - య్యాలి మిన్నేటికన్నె యగునె  
గీ. చేతనయినట్టి యొక చెట్టచేత జేసి - చవుకమానిసి బలునకు సాటియగునె
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 11

సీ. గొరియమందల గాచు గొల్లనమ్మిన కుక్క - వలికి గాచుకయుండు వదురు నక్క
యేటనీళ్ళకు నాస యిడు రాచయేనుగు - మురిగిన జలదారి కరుగు బంది
పెనిమిటిమాట చొప్పున బోవునిల్లాలు - తుంటరీండ్రను గొల్చు తులువ లంజె
రాచకోటల మెప్పురా గాచు జెగజెట్టి - సందుగొందుల రేయిజరుగు దొంగ  
గీ. మంచివారల నడవడు ల్మంచిచోట - చెడ్డవారల నడవడు ల్చెడ్డచోట
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 12

సీ. గుర్రంబుడెక్కెను గోసి రెండొనరింప - పుర్రెపై గొమ్ములు పుట్టబోవు
కందమ్రోకను దలకిందుగా బ్రాతిన - కాడమీదను గాయ గాయబోదు
కొండమ్రుచ్చును దోకగోసి - యింటనె పెంప ఆనువెఱిన మాటలాడబోదు
పటికరాతిని సానబట్టించి తెచ్చిన - నుక్కుపోగర దెబ్బ కోర్వలేదు  
గీ. పుట్టుసారయ యెట్టిఱ కట్టెనిలచు - పెట్టుసారలు వారల చెట్టకొరకె
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 13

సీ. గంజికూటికి నుప్పుగల్లు సంగాతంబు - పాలపొంగలికిని బంచదార
తంబాకు సారాయితడువుచే గాటెక్కు - కమ్మవీడ్యమునకు గప్పురంబు
నిప్పట్టునకు మంచినీళ్ళతో నేస్తంబు - బూందిమిఠాయి కింపొందు నేయి
వరిగకూటికి లేతగురుగాకు బొరికూర - వరిబువ్వకును మంచివరుగు లిగురు  
గీ. నీటు నీటునుఁ గూడియే మేటి యగును - నీచు నీచునుఁ గూడియే నిచ్చ బొలయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 14

సీ. తేనె గూర్చిన యీగ తిని చచ్చునోలేదొ - తెగదావి జుమ్మంచు దేటి తిరుగు
నిట్టబారిన మున్గ నిలుచునో నిలువదో - గుజ్జుమామిడిమ్రాను గొమలు సాగు
సాగుచేయని నేల చవుడెక్కి చెడిపోవు - పెడగట్ట దున్నిన మడియ పండు
బలిసివీగిన మావు పారునో పారదో - పయిగోవటంగనా పారు గాక  
గీ. పిసినిగొట్టుతనంబును బేరజంబు - సోమరితనంబు మేనివేరాము దగవు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 15

సీ. గున్నమామిడి లేజిగురు మేయు గోయెల - గొప్పరక్కెస పండ్లుగొరకు గాకి
ఏనుంగు తలనెత్తురే క్రోలు సింగంబు - పీతబొక్కల మూతిబెట్టు నక్క
నును దమ్మితూడులం దిని రాయంచ - చేపజెల్లల మట్టుసేయు మనుగొంగ
పడగలెత్తిన నాగుబాముల దిను నెమ్మి - చచ్చిన పసుల కాసవడు బందు  
గీ. చాలినాతడు మేటికర్జంబు సేయు - పంద నిచ్చలును మెతక పనులు సేయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 16

సీ. దూబరదిండి పొత్తున వేయిమాడలు - పొదుపరి చేతి డబ్బునకు లోటు
వదురుబోతాడెడి పదివేలమాటలు - చదువరి యొకమాట సాటిగావు
గుడిసెవేటిడిన పెట్టెడు సొమ్ముబంగార - మిల్లాలి మెడతాళి కీడుగాదు
చండిపోతొక హరుసాలు చేసినపని - పనివాని యరజాము పనికి లొంగు  
గీ. చెడుగు దానెంత పొడుగైన నడిగియుండు - మంచి కొంచెంబె యైనను మించియుండు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 17

సీ. కన్నపుగత్తి దొంగల యక్కరకె కాక - పనికివచ్చునె మేటి బవరములకు
తాటాకురేక కల్ద్రాగుటకే కాక - పాటింతురే జారుపాసె మాన
ఇనపమేకులు గొయ్య నెనయించుటకె గాక - కదియగొట్టుదురె బంగార మదుక
పోతువేటలు మారిజాతరలకె కాక - జరుగునే తిరునాళ్ళసామి మ్రోల  
గీ. క్రించు గ్రించులకే కాక మించు మెపుడు - మేడి పనులకుఁ గొఱగాడు సూడి దనరి
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 18

సీ. ములుదోటకూఱకాడలు మాడ్చి కయికొండ్రు - పెరుగుతోటాకిడి పెంచి తింద్రు
నత్తగుల్లలను సున్నముజేసి యిడుకొండ్రు - ఆణిముత్యము దాల్తురఱ్ఱుదండ
పులిజంపి గోళ్ళుత్రోళులు వాడుకొందురు - ఏనుగు వాదర ... కేర్పరింత్రు
కాకిరెక్కలు గడగట్టి బీతార్తురు - చిలుక బంజరమున నిలిపికొండ్రు  
గీ. చెడుగుమంచుల కొక్కచో విడిదియైన - పనుల బొసగించునెడ జేయు పనులు వేరు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 19

సీ. బంగారుపుల్లతో బండ్లు దోము నెవండు - వేపపుల్లను దోమి విడుచు గాక
కమ్మనినేతితో గాళ్ళు గడ్గు నెవండు - కడవలో నీటితో గడుగు గాక
కురివేరితో జుట్టకుదురు గట్టు నెవండు - వరిగడ్డితో గట్టి వాడు గాక
రతనాలతో మూస లతికించు నెవ్వాడు - సుద్దగడ్డల జేయ జూచు గాక  
గీ. కొంచెపాటుల నగునట్టి కొరలు విలువ - మంచియున్నట్టి వానిచే మెలపబడవు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 20

సీ. కాడుగాచుక యుండు తోడేలునకు గాలు - కుంటైన దోమంగగోరు నెవడు
సిగ్గుమాలిన గాలిచెడిపెకు గీల్గంటు - వీడిపోయిన ముడ్చువా డెవండు
చెట్లజుట్టెడు కొండచిలువ నోటను బెద్ద - యెమ్ము జిక్కిన బోవరెమ్ము నెవడు
గచ్చరుప్పలకు బై పెచ్చూడి పోయిన - పేడ బూయగబోవువా డెవండు  
గీ. కొరకుమాలినవారల గొడవ యడప - గనికరము మీరగా సమకట్ట డొకడు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 21

సీ. కురియక కురియక కురిసెనా మొయివారి - యెడవాన పొలమెల్ల యెద్దుకన్ను
కాయక కాయక కాచెనా తగబూచి - గున్నమామిడికొమ్మ కోటివేలు
ఇవ్వక ఇవ్వక ఇచ్చెనా తెగబారి - నిలువ జేసినవాడు నిలువు దోపు
దాటక దాటక దాటెనా దరిమీరి - పెరిగిన మున్నీరు ఫీరుఫారు  
గీ. కాకకాక యొకప్పుడు గలిగినట్టి - కర్జములు వింతలయి పొడకట్టుచుండు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 22

సీ. బాపనయ్యల జుట్టుబట్టి యీడ్చిన కాపు - వెన్నుమీదను దన్ను వెట్టి మాల
అత్తగారినిఁ గాఱులాడి కొట్టిన రాఁగ - గొంతు బట్టి పిసుకుఁ గొడుకు నాలు
లొజ్జు నౌకర్లఁ గాల్చుక తిన్న పయివాడు - సరదారు చేతిలోఁ జచ్చువాఁడె
జాలి లేకనుఁ గప్పఁ జంపఁ జూచిన యెల్క - పడుఁ గాక యొక్కప్డు పామునోట  
గీ. గడిమిఁ జూచుక సాదుల నడఁచు వారి - గడిమి యెక్కువ గలవార లడఁచుచుంద్రు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 23

సీ. గంతఁ దీసిననైన గంగిరెద్దు పొలాన - మెడద్రిప్పు డోలు చవ్వడులు విన్న
విసము బిండిననైన బెనుబాము బుస్సని - కాటందు నెద్దేని గంట బడిన
ఆటనేర్చిన సాని పీటపై గూర్చున్న - నడుగార్చు మద్దెల సడిని విన్న
వేట బాఱిన కుక్క రాట గట్టినగాని - వఱవ జూచును గాటి పంది గన్న  
గీ. బాగుగా నొక్క డలవాటు పడిన పనిని - మఱువ డాపనిమానిన తఱులనయిన
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 24

సీ. ఓరుపింతయులేక యుడుకు పీరయి మండు - లుచ్ఛాకు సాదుపల్కులు ములుకులు
పున్నెంబు గానక పొరుగు మిండల కేడ్చు - లమిడికి మగని చల్లాట తీట
బుద్ధిలే కాటల బ్రొద్దు బుచ్చెడు కుఱ్ఱ - బడవాకు వఱపడి వ్రాత కోత
చేటుపోటెరుగక చెరలాడు బోకిరీ - బేహాకు బెద్దల పేళ్ళు తేళ్ళు  
గీ. దారి మంచిది కాని పింజారులకును - తిన్నదన మబ్బునది కలగన్న వితము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 25

సీ. వెఱ్ఱిగొల్లల మ్రోల వీణె బాడిన బంబ - నాదు తోడను సాటి రాదటండ్రు
కాటి రెడ్లకు హోళిగలు బెట్ట జిట్టారి - కల యట్లతో సరి గావటండ్రు
వెట్టిమాలకు సన్నబట్ట గప్పగ నిడ్డ - ముతక కంబడి కంటె మెతక యనును
ఒడ్డె యెడ్డెకు నత్తరుడికలో నిచ్చిన - చేపనూనియ పాటి సేయ దనును  
గీ. కొంచెగా డెప్డు గొప్పను గొలది సేయు - కొలదియగుదాని గొప్పగా దలచుచుండు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 26

సీ. తగువులో నాయంబు దప్పకున్నే చాటు - లంచాల కాసించు లత్తుకోరు
పెండ్లాము బలువెతల్‌ పెట్టకున్నే లంజె - మంచాల కాసించు మంకుబడవ
కాపు పేదరికంబు గనకీడ్వడే పుట్ట - కుంచాల కాసించు గుండగొయ్యి
గేస్తు లోగిటిమేలు కీళ్ళారయునె తేర - కంచాల సాసించు గాలిగ్రుడ్డు  
గీ. తగవు పున్నెంబు దలచునే తప్పు పనుల - కెప్పుడును ఱెప్పదప్పని మొప్పెకూళ
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 27

సీ. తుమ్మెద జేరెనా కమ్మతావుల నాను - చీడపురుగు చేరి చెరచు దమ్మి
చిట్టూద మొలచెనా చెలువు దప్పదు నేల - బిట్టల్లి మొలచి పోగొట్టు బైరు
చక్కెర గలసెనా మిక్కిలి చవిగొల్పు - చవుడు గలసి చేదు సలుపు నీటి
పచ్చకప్రము చొఱబారెనా కాకార్చు - గండ్రయిసుము సొచ్చి కలచు గన్ను  
గీ. మంచి పొత్తైన నెందేని మంచిగాంచు - చెడుగు దలపడి కొరగాని చెయ్వు సేయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 28

సీ. చీమ కానుపు ప్రొద్దు జెప్ప నేర్చు నెవండు - చామ కానుపు జెప్ప జాలు గాక
పిణుజు కాల్బందంబు బెట్ట నేర్చు నెవండు - కణుజు కాళ్ళకు బెట్ట గలుగు గాక
నత్తచే గుగ్గిళ్ళు నమలించు నెవ్వాడు - గిత్తచే నమలింప నెత్తు గాక
మేడిచెట్టున నుయ్యెలాడించు నెవ్వాడు - తాడి చెట్టున నిల్పువాడు గాక  
గీ. క్రించువారల కెప్పుడు మించువారి - చెలిమి గలుగదు మించువారలకె గాక
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 29

సీ. అల్లారు ముద్దుగా నాడించు పసిబిడ్డ - మెడమీద గూర్చుండి యొడలు చెఱచు
నేయి ముద్దయు బెట్టి నెయ్య మిచ్చిన పిల్లి - ఉట్లపై కెగసి పాలొలక బోయు
పంచదారను మేపి పలుకనేర్చిన చిల్క - ముద్దు బెట్టగబోవ మూతి గఱచు
కమ్మని గుగ్గిళ్ళు గంపనిండగ బెట్టి - గట్ల మేపెడి యెద్దు కర్ర గొఱుకు  
గీ. ఎరుక మాలిన వారల కెంత మేలు - గూరిచిన దాని దెలియంగ లేరు సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 30

సీ. వేదురెత్తిన కుక్క వేటకై కొని పోవ - కట్టి పెంచిన వాని కాలు గఱచు
కుళ్ళు గుమ్మడికాయ కూర వండుక తిన - నింటివాని కడుపుమంట బుట్టు
తిట్టుబోతగు నాలి దీండ్రంబు గొని పోవ - కట్టుకొన్నాతని బెట్టు జెఱచు
కారుబారని సీతు కవులు దీసిన పంట - కాపు దీరువ దండుగలనె ముంచు  
గీ. చెడ్డ సాదన గయికోలు చేసినట్టి - వాని కెప్పుడు బెడదలే వచ్చుచుండు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 31

సీ. సరదారులకు లంజె బొరి దార్చు బేషరమ్‌ - ధగిడీలు తగుదురే తగవుదీర్ప
కల్లుసారా మస్తుగా ద్రావునట్టి పుం - డాకోరు దొరయె బడా కచేరి
తెన్ను గానక గడ్డిదిని పాడి దప్పు జ - టాకోరు సర్కారు నౌకరగునె
చేరు గొండల నొద్ద జేర్చి పాటించు జు - వ్వాకోరు మంచి హోదాకు దగునె  
గీ. ప్రజల సేమంబు నరసిన పబువులెల్ల - జబ్బువారల గొప్ప దర్జాల నిడరు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 32

సీ. కొట్టిలేపిన కోడిగూసిన మాత్రాన - నద్దమరేయెట్లు పొద్దుబొడుచు
బిడ్డలాటలకు గొబ్బిళ్ళిడ్డ మాత్ర వే - సవినెట్లువచ్చును సంకురాత్రి
చీకటింటను దివ్వెజేర్చినంతనె పట్ట - పగలింట నెట్లు జొప్పడును సందె
పెరటిలో చెట్లెల్ల పురుగుచే మోడైన - రహివానకారాకు రాలుపగునె  
గీ. ఎద్దియెప్పుడు గాదగు నద్దియప్పు - డొదవు మనమెంత జేసిన నొండుకాదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 33

సీ. పెద్దలందరుగూడి పెండ్లిసేయగబూన - జోగిసన్నాసికి జుట్టె యెరుపు
మున్నీట దోరణమ్ములుకట్ట సమకట్ట - వెదురుగుంజలు బ్రాత గుదురె కరవు
మినపగారెలు వండగను బెట్టజిల్లికి - కేలులేనమ్మకు వ్రేలె కొదువ
సాతాని రామానుజయ్య జంగముసేయ - బిలువబోవంగొనె పేరె తప్పు  
గీ. క్రొత్తపని యొక్కటొనరింప గోరెదేని - క్రొత్తలొక మరికొన్నిటి గూర్పవలయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 34

సీ. ఇచ్చలేనల్లున కెంతయొడ్డించిన - నీలకూరకు నుప్పు చాలదనును
ఈసుబట్టిన యత్తనేలాగు బొగడిన - ఎగతాళి మాటలకేమి యనును
తనివిదీరని గూళ తలయెత్తు బోసిన - జుట్టుమిగిలెనేని కొట్టుకొనును
తగవు మాలిన మొప్పె దప్పుపై బెట్టిన - తప్పుజూచినవాని దన్నుమనును  
గీ. తగినవారికి మేల్చేయదగును గాని - తగనివారద్ది చేతురు తారుమారు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 35

సీ. కలుద్రావి పాలన్న కల్లరీని బడాయి - కట్టలేమే యొక్కగడియలోన
పెరిగిన కడుపులో బిల్లయో బల్లయో - తెలియలేమే రెండునెలలలోన
ఏటినీళ్ళుగ దోచు నెండమావుల జాడ - యగుపడదే నాల్గడుగులలోన
తెరగ్రుడ్డి పెండ్లికూతురి మేనిపొంకంబు - పట్టలేమే తలఁబ్రాలతరిని  
గీ. మంచికానిది కొన్నాళ్ళు మరగియున్న - తుదకు నొక్కప్డు నిక్కంబు దోచకున్నె
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 36

సీ. తరితప్పి పెట్టు విత్తనమెంత మంచిదై - నను బాగుపడునని నమ్మరాదు
ముదుసలి కట్టుకొన్నది పైడిబొమ్మయై - నను వలపిడునని నమ్మరాదు
పడుచుసన్నాసెంత వడిగల నేర్పరై - నను బాళిబడడని నమ్మరాదు
కడుపూప యెంతటి కాపుదీర్చినదియై - నను దియ్యనగునని నమ్మరాదు  
గీ. ఎప్పుడెయ్యది చేసిన నెసగునప్డు - తగును గావింపగాదేని తప్పినడుచు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 37

సీ. ఈడిగాతని సారె యాడింప బూన్చిన - గల్లుబుడ్లను వాని కడను విడుచు
ఱంకులాడికిని బేఱంటంబు సెప్పిన - గోరచూపుల మగవారి దనుపు
కొంటె బాతాఖాని గొప్ప కొల్వున నుంప - ఏలినవాని సొమ్మింట జేర్చు
గొఱ్ఱెకాపరి గొల్ల గొడ్డుకాపరి జేయ - పాలు పిండుచు గాలు పట్టి యెత్తు  
గీ. ఎద్ది యెవ్వడు పనుపడు నద్దిసేయ - నొద్దికగు నొండు సేయంగ నోర్వడెందు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 38

సీ. కన్నముల్వైచు దొంగలకు బక్కా దగా - కోరు పంచాయతీదారు సుమ్ము
తెగమండిపడు నగ్గిదేవరకును మంట - గాలిదేవర చెలికాడు సుమ్ము
మాల మాదిగ తందనాల జాత్రకు బంబ - దాసరి మేటిసర్దారు సుమ్ము
మగువ నేడ్పించెడి మగనికి గయ్యాళి - గట్టువాయగు తల్లిపట్టు సుమ్ము  
గీ. కీడు సలిపెడి వారికి గీడు సలుపు - వారలే తోడు మరి లాతివారు కారు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 39

సీ. ప్రాతి పెట్టిన సొమ్ము పయికి లాగినగాని - మారదు బంగారు మాడలయిన
కడుపులో దెవులు నేర్పడగ జాటినగాని - కుదరనేరదు రాచ కొమరుడయిన
గాదెలో సరకు లంగడిని బెట్టినగాని - మనవారు కొనరెంత మంచివయిన
మొదవు చంటను బాలు ప్రిదికి దీసినగాని - పనిజేయదది యెట్టి పాడిదైన  
గీ. నలుగుఱెఱిగిన వానికే చెలువమెందు - జాటుగా నున్నవానికి దీటులేదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 40

సీ. మొఱయ లేనంతనె మెఱుగైన బంగారు - కంచుకంటెను గ్రించుగాదు సుమ్ము
మెదుకు లేనంతనే మేలైన బాపండు - కాపు కంటెను లోపుగాడు సుమ్ము
కైపు లేనంతనే కడుతావి జవ్వాజి - కాచుకంటెను నీచుగాదు సుమ్ము
కడు వీగనంతనే కమ్మని కొతిమెర - గాదకంటెను బీదగాదు సుమ్ము  
గీ. విలువ వంగడమునుబట్టి కలుగుగాని - అందముల చందములబట్టి పొందబోదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 41

సీ. తేలు కుట్టినవాని మేలైన పల్లకీ - మీద నెక్కించిన బాదలేదె
సంచి బోయినవాని నంచఱెక్కల పాన్పు - పై బండబెట్టిన బాదలేదె
ముక్కు గత్తిని గోసి ముద్దరాల్చెక్కిళ్ళు - మీద ముద్దిడుచున్న బాదలేదె
పదిమడుంగుల బర్వు పైనెత్తి పైమేడ - మీద నెక్కించిన బాదలేదె  
గీ. కస్తి లేనప్పుడింపగు కుస్తరింపు - కస్తికల తఱి మదికింపుగాదు సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 42

సీ. దవనంపు మొలక నెత్తావి గూర్పనె కాని - తగునే తరిగివండ నిగుఱుగూర
కమ్మనావుల పాలు కాఁచి త్రాగనె కాని - తగునే కడవ దొల్పి తానమాడ
చదువరి మాట ఱచ్చల జెల్లునే కాని - తగునె గామి ఖసాయి తగవు దీర్ప
ఇల్లాలు జాణైన నిలు దీర్పనగుగాని - తగునే ఫిరంగీల జగడమాడ  
గీ. ఎవరినే యక్కరను గూర్తురెల్ల వారు - వారినా యక్కరను గూర్పవలయు సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 43

సీ. కుందేటికిని లేడి కొమ్ములు రెండిడ్డ - మోర యోరగ జేసి పొడువగలదె
బోసికి దుప్పికొమ్మున బండ్లమర్చిన - గట్టి సెన్గలు కఱకఱ నమలునె
గొడ్డురాలికి జంక బిడ్డ నొక్కనిబిడ్డ - గొనగొన పాల్చేపి కుడుపగలదె
మఱుగుజ్జువానికి మఱ్ఱుగాళ్ళు కట్టిన - నొప్పుగా మడచి కూర్చుండగలడె  
గీ. తనకు లేనట్టి యందంబు దాల్చుకొన్న - దాన గలిగెడి కర్జమింతయును లేదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 44

సీ. ఏనుగు నెక్కగానే కాడు బలురేడు - పజల కస్తుల నెడబాప వలయు
మేకను జంపగానే గాడు సోమాసి - బాపలతనివి దీర్పంగ వలయు
ఎగసి తఖ్తెక్కగానే కాడు తీర్పరి - అందఱి నొకటిగా నరయ వలయు
ఈటె చేపట్టగానే కాడు పోటరి - పులిమీద మార్కొని పొడువ వలయు  
గీ. జాణనని పూనినంతనే జాణగాడు - ఏర్పడిన పని నెరవేర్చి నేర్పరియగు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 45

సీ. తల్లి పొట్టిదియైన బిల్లదా బొడుగైన - ఆ తల్లి కాపిల్ల యమ్మ గాదు
బాపండు బడుగైన గాపందగాడైన - కాపు బాపని మ్రొక్కు గాంచలేడు
కత్తి చిన్నదియైన గాయ పెద్దదియైన- కాయ కత్తిని బట్టి కోయలేదు
పుత్తడి సేరైన నిత్తడి మణుగైన - పుత్తడిత్తడి గుత్త కెత్త నగునె  
గీ. తక్కువొక్క వితాన దానెక్కుడైన - నిక్కమున కెప్డు దక్కువ తక్కువయగు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 46

సీ. సానితో నిచ్చ ముచ్చటలాడు విటగాడు - గుడిసెవేటును కూడు కోడె దూరు
గొడ్డునంజుడు నెత్తికొనిపోయెడి గొడారి - పనికిమాలిన దెత్తు పాకిఁ దిట్టు
తగునంచు గంజాయిదమ్ముగొట్టు పిసాసి - కల్లు ద్రావెడి దోసకారి దెప్పు
ఏటేటి దివసాలకేగు బాపడు పాడె - దాల్చు బాపని నెగతాళిసేయు  
గీ. తప్పుగలవారు తమతప్పులొప్పనుచు - తలచి యొగ్గింత్రు దమకంటె దప్పులాండ్ర
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 47

సీ. వానమిక్కిలియైన వరదంగలారవు - వరపు మిక్కిలియైన కరవు బెడద
పొడవువానికి నెత్తిబొప్పుల పెనుబాద - పొట్టివానికి నీళ్ళపట్టు గొడవ
ఉప్పెక్కువగు దోసెపప్పచ్చిఁ దిన గోడు - చప్పిడి దినగ వాచవికి నిడుమ
బడబడ వాగిన వదురుబోతను దూరు - అరుదు బల్కిన మూగయనెడి కొదువ  
గీ. ఎప్పటికినేని మిక్కిలి మెప్పుపొందు - తప్పదందున నొకకీడు దాపరించు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 48

సీ. తేలఁబండిన పండు తియ్యగానే యుండు - వగరెక్కదే కోయ బచ్చికాయ
ముఱగ దున్నిన దమ్ము విరుగబండును సుమ్ము - కలయగట్టదు చాలగట్టినేల
మెదిగిన బియ్యము మెదుకు గమ్మదనమ్ము - చేబియ్యపోరెమ్ము సేగిసుమ్ము
ముదిరిన చింతమ్రానది చేవయెక్కును - లేతమొలక వ్రాలుఁ జేత ద్రుంప  
గీ. పనులగడిదేరినట్టి నేర్పరునె కాక - కొరవడినవారు పూనిరా చెరుపు గల్గు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 49

సీ. కుక్కనెక్కి సవారుగొట్టచేర్చిన కోతి - గుఱ్ఱమెక్కి సవారు గొట్టగలదె
ఈళ్ళజిక్కగ బట్టివెళ్ళించు నీర్పెన - లేళ్ళమందల నప్పళించగలదె
చేరునుఁ గట్టగూర్చిన చిన్నదారంబు - తేరునుఁబట్టి రాదీయగలదె
ఎద్దుమీదను కట్ట నేర్పరించిన గలత - ఏనుగువీపు తట్టెనయగలదె  
గీ. ఏదియెంతటి కొనగూడు నెప్పుడేని - దానినంతటి కొనగూర్పదగును సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 50

సీ. ప్రొద్దుబొడవంగానె పోవు జుక్కలదీటు - ప్రొద్దుగ్రుంకినవెన్క దద్దమెరయు
బడిపంతులెదుట గుర్రఁడు కాల్గదల్పడు - పంతులు చాటైన బంతులాడు
కడలిపోటైన వెన్కకు బట్టి చనునేరు - పాటైనచో జొచ్చి పారుచుండు
అత్తగారున్ననాళ్ళరవనేరదు కోడ - లాదటజూపు గయ్యాళితనము  
గీ. తనకుహెచ్చిన వారలెందాక నుందు - రంతదనుకఁ దనమెప్పు లడగియుండు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 51

సీ. నెలదప్పినంతనె నిసువు పుట్టగబోదు - నిండ దొమ్మిదినెల లుండవలయు
వరినాటినంతనె వడ్లురాలవు పంట - కళ్ళాల దనుకనుఁ గాయవలయు
ప్రోయి నిప్పిడగానె బోనంబు రాలేదు - వార్చి డించినదాక నోర్చవలయు
మ్రానుగొట్టంగానె మద్దెలకాలేదు - తొలచి మూసినదాక నిలువవలయు  
గీ. ఎప్పుడెయ్యది కాదగు నప్పుడగును - గాని పూనినతోడనే కాదుసుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 52

సీ. క్రొవ్విన జెల్ల నిక్కుచు నీళ్ళమిడిసిన - గట్టుపైఁ బడుఁ బెద్దగ్రద్దనోట
పోతరించిన పాము పుట్టెక్కి తలయెత్త - గ్రక్కున గడదేరు గరుడినోట
పొగరుకొన్న పొటేలు తెగి మందబాసిన - వీలు జిక్కు దోడేలుబారి
గుంజబట్టిన నల్లి కోడెక్కి నిలిచిన - గాసిచెందును సొంతగాని చేత  
గీ. కన్నుగానక నెళవులు గదలి మిట్టి - పడినవారికి నిక్కంబు గొడవ వచ్చు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 53

సీ. బోనకత్తెకు దిస్టిబూది బెట్టిన నెంత - వచ్చు నంతియ రాణివాసమునకు
కడలికిఁ దియ్యనీర్కట్టి పెట్టిన నెంత - వచ్చు నంతియ మిన్నువాక కెన్న
ఆస హెచ్చినవాని కరువదిచ్చిన నెంత - వచ్చు నంతియ రాయబారికెన్న
మరుగుదొడ్డికి నెర్రమన్ను బూసిన నెంత - వచ్చు నంతియ పాలగచ్చుగదికి  
గీ. మొద్దునెప్పుడు తప్పులు దిద్దలేము - తప్పులెరుగనివాని దిద్దంగనేల
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 54

సీ. వేసాలపేఁడికి మీసాలమర్చిన - మూతి బిగియబట్టి మొత్తుకొనును
గమిడిబర్రెకు గుడ్డ గంగడోల్కట్టిన - చీదరించుక పట్టి చించివైచు
కోడితోకకు నొక్క కుంచెగట్టించిన - నెగయనేరక నేల బొగిలిపడును
తుట్టెపుర్వున కొక్క త్రోలుపడగ బెట్ట - దలయెత్తనేరక దన్నుకొనును  
గీ. ఒకరివలె నుండవలెనని యొకటిసేయ - నకట నదియొక్క పెనుబాదయగును సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 55

సీ. వరివెన్నువిడిచి కొబ్బరికాయ కాసించు - చిలుకేమి దిను ముక్కుచెడుట గాక
గాద బోవిడిచి దిగ్గన నగ్గిపై బడు - మిడుతేమి దిను మంటబడుట కాక
బుట్ల గింజలుమాని బోనులో బడు పంది - కొక్కేమి దిను లోనజిక్కు గాక
చిఱిచేపలను మాని యెరపుర్వునకు బోవు - మీనేమి దిను వ్రయ్యలౌను గాక  
గీ. తినుచునున్నది విడిచి యింకనొక పెద్ద - తిండి కాసించు పోవునతండు చెడును
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 56

సీ. బోసికుక్కకు దొడ్డ ముడుసెమ్ము దొరికిన - గొరుకనేరదు పాసి యుఱకలేదు
ముసలాతనికి నొక్క ముద్దరాల్దొరికిన - కూడనేరడు పొత్తు వీడలేడు
తిమ్మన చేనొక్క తెంకాయ దొరికిన - కొట్టలేదు విడిచి పెట్టలేదు
కచ్చసానికి బాట కచ్చెరి దొరికిన - పాడనులేదు మాటాడలేదు  
గీ. తినఁగలిగిఁనట్టివారికి దియ్యగూర - లేనివారికి విడువంగలేని యేడ్పు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 57

సీ. తన యింటి దివ్వె చేతను బట్ట గాలదే - తన యాలు పడచిన దప్పుగాదె
తాను దీర్పరియైన దగపేద వచ్చునే - తాను ద్రావిన కల్లు పానకంబె
తన కోడి వెన్కదీసిన గెల్పు గల్గునే - తన మేనికంపు నెత్తావి యగునె
తన వెండ్రుకలు గట్ట దంబుర మ్రోగునే - తా బెట్టుకొను పట్టు తప్పనగునె  
గీ. ఎన్నటికినైన పెరల యందేది యెగ్గు - తనకు దానిన యెగ్గుగా దలపవలయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 58

సీ. పొరుగువారికి మేలు పొందరాదంటివా - ఇరుగువారికి నీవ పొరుగువాడు
ఇరుగువారికి మేలు హెచ్చరాదంటివా - పొరుగువారికి నీవ యిరుగువాడు
ఇరుగుబొరుగును మేలెనయరాదంటివా - యిరుగుబొర్గున కీవ యిరుగుబొరుగు
ఇరుగుబొరుగు నీవు నెనయరాదంటివా - ఇంక నెవ్వరికి మేలెనయవచ్చు  
గీ. ఎల్లరకు మేలుగోరుట చెల్లు గాని - తనకు మేల్పెరలకు గీడు దలపరాదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 59

సీ. తాత గట్టిన నూయి తప్పదెన్నటికని- యుప్పునీళ్ళను ద్రావు మొప్పె గలడె
పెద్దలందరు గూడి పెండ్లి చేసిరటంచు - జెడిపె బెండ్లామును జెంద గలడె
కట్టుబోతులు వాడ గలరు పెక్కండ్రని - వలికి బెండిలిసేయువాడు గలడె
బాపల దీవనల్‌ బమ్మ దీవనలని - తన యాలి నెరవిచ్చు చెనటి గలడె  
గీ. కానరానట్టి యొక బల్మి కలదటంచు - కనులకును దోచు గీడెదుర్కొన గలండె
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 60

సీ. ఎలుక లల్లరిచేసి చెలఱేగినంతనే - పెణకచూరున నిప్పుబెట్టు నెవడు
పంటకాలువ లోతుబారె దాటుటకంచు - కట్టల్కతో నెండగట్టు నెవడు
జలుబు చేసిన జీదజాలనటంచును - ముక్కు గోసికొనెడి మొప్పె యెవడు
పసిపాపలకు జంటిపాలు చాలవటంచు - మేలైన యాలి బోద్రోలు నెవడు  
గీ. కొద్ది జబ్బొండు గలదని గొప్పదాని - మొదలు చెడగొట్టుకొనువాడు మొదలె చెడును
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 61

సీ. పాలు మంచివియైన బాసెంబు మంచిది - గాలి మంచిదియైన గాఱు మంచి
పోగు మంచిదియైన బుట్టంబు మంచిది - పొదుగు మంచిదియైన మొదవు మంచి
బసిడి మంచిదియైన బట్టెడ మంచిది - నీరు మంచిదియైన నేరు మంచి
మాట మంచిదియైన మరియాద మంచిది - యీటె మంచిదియైన బోటు మంచి  
గీ. మంచిగోరిన వాడెప్డు మంచిదైన - పని యొనర్పక యూఱ కేర్పడదు మంచి
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 62

సీ. తన కొంప దక్కనందరి కొంపలురలంగ - చెడుగు మానిసికోరు జిల్లిపిడుగు
తన పైరు తడిసి యందరి పైరులెండంగ - చెనటి వా డాసించు జెదురుమబ్బు
తన యింటనుండి యందరి యింటలేకుండ - తుంటరి తలపెట్టు గుంటిలచ్చి
తన మేలె చూచి యందరి మేల్కనక యుండ - కొంటె యారయు మెల్లకంటివేల్పు  
గీ. ఎల్లరకు మేలుగోరుట చెల్లుగాని - తనకె కావలెననుకొన్న దరమె పడయ
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 63

సీ. కప్పగంబము చేరి కౌగలించిన గూట - ములు లేనిదే బిడ్డ కలుగబోదు
గాముగంగకు మీదు గట్టినంతనె తిండి - తినకున్న నాకలి తీరబోదు
పడమటి దెసనుండి బల్లి పల్కంగానె - దొర జూడనిదె కొల్వు దొరకబోదు
చందురుండును బ్రొద్దు చాలి యుండంగానె - పడుచునాడక పెండ్లి నడవబోదు  
గీ. సామిగొల్చిన సగినము ల్చక్కనైన - తనదు పూనిక లేనిదే పనులు గావు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 64

సీ. పాలు పిండెడి గొల్లవాని జూడంగానె - పంచడిల్లదె మంచి పాడి మొదవు
కాసు విడుచు నీటుకాని జూడంగానె - కన్నులార్పదె వెలవన్నెకత్తె
మేసి వచ్చిన తల్లిమేక జూడంగానె - చిట్టడికూయవే చిరుత బొదులు
మదికి నింపగు చందమామ చూడంగానె - పొంగాఱదే మిన్నుముట్టి కడలి  
గీ. తనకు మేల్చేయు వారల గనిన - నొక్క డుబ్బి చెలరేగనట్లుగా కున్నలేదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 65

సీ. మొలక పాటున నడ్డి మలచికట్టిన గాని - తడబొంగు పల్లకీదండె గాదు
లేత పాటున జివ్వి పాత్రగట్టిన గాని - మండ చక్కని యంటుమావి కాదు
దూడ పాటున ద్రిప్పి యాడనేర్పిన గాని - ఎద్దు పన్నిన గంగిరెద్దు కాదు
నారు పాటున దీసి నాటిపెంచిన గాని - దుక్కి మూసిన వరిదుబ్బు గాదు  
గీ. పాటుపడి నేర్వవలె జిన్ననాటనుండి - కాని యెడ నెందునను జాణగాడు సుమ్మి
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 66

సీ. కాళ్ళు బోయినవాడు కాళ్ళకై తిరుపతి - గట్టెక్కబోయిన గదలుటెట్లు
కనులు బోయినవాడు కనులకై తా గండ - జోతి జూడగబోవ జూచుటెట్లు
చెవులు బోయినవాడు చెవులకై సుద్దులు - వినగబోయిన జేరి వినుటయెట్లు
మాట బోయినవాడు మాటకై మంతరాల్‌ - చదువబోయిన బట్టి చదువుటెట్లు  
గీ. కానరానట్టి మేలొండు కలదటంచు - కాని పనిసేయగా సమకట్ట దగదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 67

సీ. పట్టజాలము నీళ్ళు పాలలో గలసిన - తెలియమే పెరుగులో గలసినపుడు
కనలేము కపురంబు గాలితో గలసిన - నెరుగమే దివ్వెతో బెరసినపుడు
పొడకట్టలేము పుప్పొడి నేల గలసిన - కానమే పూవుతో గలసినపుడు
ఎరుగలేము కనాడ దరబారు గలసిన - చీలదే పూరితో జేరినపుడు  
గీ. ఒక్కడొక్కని గలసిన జక్కనదుకు - నతడె వేరొండు గలసిన నదుకడెపుడు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 68

సీ. పొట్లకాయకు రాయి గట్టుట తిన్నగా - బెరుగుటకే కాని విరుగ గాదు
పసిడిరేకుల కుప్పు ముసరి కాల్చుట వన్నె - పెరుగుటకే కాని తరుగ గాదు
చదివెడి వానికి జబుకుదెబ్బలు బుద్ధి - వచ్చుటకేకాని నొచ్చ గాదు
జక్కిపిల్లకు గాళ్ళు నొక్కుట జక్కగా - జరుగుటకే కాని విరుగ గాదు  
గీ. తొలుత నొక్కింత బాదగా దోచియున్న - మంచికై చేయు పనిని మన్నించవలయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 69

సీ. జొన్నకూటిని దిన్నయన్న కంటెను లావె - సన్న బియ్యము దిన్నయన్న బలిమి
దస్తు మస్తగు జమీదారాస కెక్కుడే - నాటి బువ్వడగు సన్నాసియాస
నడుము గట్టిన బోయి నడకకు మిక్కిలే - యందలం బెక్కిన యతని పరుగు
పుట్టువడుగు సేయునట్టి పాటున కంటె - పలువురాండ్రగు గేస్తు సలుపు పాటు  
గీ. మంచి చెడ్డల కానవాళ్ళెంచి చూడ - కలిమి పేదరికంబులు గావు సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 70

సీ. చేదస్తమున నేళ్ళు చెల్లిన బాపండు - పెద్ద చెర్వున జల్లు బేడనీళ్ళు
కలవాడనని కన్ను గానని మతకరి - నెదురైన బాపని జదియగొట్టు
కడుపు గట్టుక మూట గట్టు పిసినిగొట్టు - గవ్వబోయిన పూట బువ్వమాను
మరులెక్కి యొడలు తిమ్మిరిగొన్న తుంటరి - వరుసవావుల బెద్దవాక గలుపు  
గీ. మంచి చెడ్డల నరయక మదికి దోచి - నట్టి యొకపట్టు బట్టుట చెట్ట సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 71

సీ. నారు బోసినవాడు నీరు దా జల్లడే - బఱ్ఱె దెచ్చినవాడు పలుపు దేడె
చెలమ ద్రవ్వినవాడు చేదు ద్రాడుంచడే - యెడ్లను గొన్నవాడేరు కొనడె
గుడిసె గట్టినవాడు తడక దా గట్టడే - పిల్ల బెంచినవాడు పెట్టె గొనడె
ఊరుగాయిడెడివా డుప్పు దా బడయడె - జిగిజక్కి కొనువాడు జీను గొనడె  
గీ. గొప్పలగు నట్టివాని గైకోలు సేసి - కొదువ సేయునె వలసిన కొంచెములను
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 72

సీ. గచ్చాకు పుచ్చాకు కలిపి నూరినయుండ - మంచిమందై తెగు ల్మాన్పజాలు
చెడుచెట్టు పడుచెట్టు చేరి క్రమ్మిన పట్టు - లడవిమై కలప లేవడుల దీర్చు
చిరుగవ్వ మరుగవ్వ చేర్చిపెట్టిన ప్రోగు - కూరాకు లేనట్టి కొఱత దీర్చు
తడచువ్వ మడచువ్వ తడకగా గట్టిన - గుక్క గుడిసెదూరు కొదువ దీర్చు  
గీ. పలు దినుసులందు నది కొంచెపాటిదైన - నక్కఱకురాని దొక్కటియైన లేదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 73

సీ. నెఱసిన ముసలమ్మ నెఱులు జవ్వనమున - దుమ్మెద ఱెక్కలతోటి సాటి
ఉడికి ముద్దైన గుమ్మడిపండు మున్ను పా - దుననున్నపుడు కుండతోటి సాటి
చిలికి గుల్లై వంటచెఱకు జేసిన చేవ - తొలుత మ్రాకున నుక్కుతోటి సాటి
పగిలి పెంకై నేలబడిన చిళ్ళప నంటి - పాటున జట్రాతితోటి సాటి  
గీ. కలిమి బలుములు సతములు కావుసుమ్ము - కాఱుమాఱిన కొలదిని మాఱుచుండు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 74

సీ. పెద్దకెంపొక్కటి పెంటలో దొరికిన - విలువ తగ్గదు దానివెలుగు పోదు
కమ్మ గుమ్మడిపండు కంచెలో కాసిన - చక్కదనము బోదు చవియు బోదు
మల్లెపూవులు మాలపల్లెలో పూసిన - ఠీవి తగ్గదు కమ్మతావి బోదు
గొప్ప నెమలిగ్రుడ్డు కోడి దా పొదిగిన - చిన్నె మాఱదు కుంచెవన్నె పోదు  
గీ. వాసిగల వంగసము గలవాని కెపుడు - చోటు మాఱిన మాఱునే సొంపు బెంపు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 75

సీ. అచ్చి ఱచ్చలకెక్కునని బుచ్చి పెండ్లాడ - బుచ్చి మిండలవెంట బోవ మరుగు
తోటాకు పసరంచు దోసకాయను తిన్న - దోసకాయది జల్బుచేసి విడుచు
కోడూరు బురదని మేడూరు బోయిన - మేడూరులో జాస్తి మెట్ట శిస్తు
జక్కిదాణా కోడి స్వారెక్క పూనిన - బోయి బత్తెములకే పోవు గడన  
గీ. కొంచెమిబ్బంది కలదని క్రొత్త బూని - ప్రాత విడిచిననది దాని తాతయగును
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 76

సీ. మాఱ్చజాలక నేల మంటిలో బ్రాతిన - రూక కంటెను బుచ్చుపోక హెచ్చు
కట్టజాలక మూలబెట్టెలో దాచిన - చీరకంటెను గోగునార బాగు
అన్నెంబు పున్నెంబు నరయజాలక పెంచు - మేనుకంటెను ద్రోలుజీను మేలు
మోహరించిన జోదుమూక జూచిన బారు - రౌతు కంటెను దున్నపోతు మిన్న  
గీ. కలిగి యున్నది నలుగురు గాంచి మెచ్చ - నక్కఱకురాని దున్న లేనట్టె సుమ్ము
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 77

సీ. కఱచిన వేసి కాల్గఱచు వాడుండునే - కాక ఱాకును డబ్బు గట్టుగాక
దోచిన దొంగ యిల్దోచు వాడుండునే - ఱచ్చలో ఫిర్యాదు దెచ్చుగాక
కుట్టిన తేల్కొండి కుట్టు వాడుండునే - గచ్చగందము రాచి కాచుగాక
పట్టిన దెయ్యంబు బట్టు వాడుండునే - గాలి బూదిడి యాన గట్టుగాక  
గీ. చెడుగుచేసిన పని జేయ జెరుపుబోదు - చేయవలసిన పని జేయ జెందుమేలు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 78

సీ. కొమ్ముకోతిని నెరుంగుదునన్నవాడు రెం - డన్న నేమవి పదాఱన్న నేమి
తనతల్లి గొడ్డురాలని వాడది పెద్ద - దన్ననే మైదేండ్లదన్న నేమి
పనస పూచెనని చెప్పినవాడు వేరున - నన్ననే మాకులనన్న నేమి
యినుము బంగరు జేతుననిన వా డఱగాంచి - యన్న నేమది కాచకన్న నేమి  
గీ. దబ్బరల బన్నుగడసేయు ధగిడి కొడుకు - దొక్కదబ్బర చాలదే తక్కు విడువ
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 79

సీ. ఏగాని సొఱబుఱ్ఱ కాగానె రచ్చల - గాణ బాడగ వీణెకాయ గాదె
అడవిలో బెరిగినదైనంతనే మద్ది - కొయ్య రాగద్దియకోళ్ళు గాదె
యడుసులో బెరిగిన యంతనే నెత్తమ్మి - దేవేరికెంగేల దివియ రాదె
పులిమేయు మెకముతోకలనున్న సీవిరి - రాయల వింజామరమ్ము గాదె  
గీ. మొదల దానెంత కొలదియై యొదవి యున్న - నక్కరకువచ్చు పనిబట్టి యెక్కుడగును
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 80

సీ. తోడుపాటున కెద్దు దున్నుకోనిచ్చిన - మొగముమాడుపు కాపు ముట్టెజూచు
పున్నెంబునకు గాపు పుట్టెడాళ్ళిచ్చిన - ఆసదీరని బాప డడ్డజూచు
కనికరానకు నత్త గారెబూరెలు బెట్ట - కొంటెకోడలు పుట్టినింటికంపు
పరువుకై కోడలు పడి యూడిగముసేయ - గట్టువాయత్త కాళ్గడుగుమనును  
గీ. తనివిగల వారికిని జేయుపనులు సెల్లు - తనివి లేనట్టివారికి దగదు సేయ
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 81

సీ. రాని కన్నడబాస పూని మాటాడబో - భేకు జెప్పగబోయి సాకు జెప్పు
తెలియని వాని మద్దెలగొట్ట బెట్టిన - నంటుబోనము కుడినదికి మొత్తు
అలవాటులేని సాములు సేయజన గత్తి - మొనచేత బట్టుక మొదల బొడుచు
ఎరుగనివాడు తానేరు బన్నగబోయి - దుంపకాడిని వైచి తుదను దున్ను  
గీ. అబ్బెసములేని పనులు సేయంగరాదు - చేసెనేనియు దప్పులు సేయకున్నె
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 82

సీ. పనస వంకరయైన దొనలు పుల్లనగావు - చెరుకు వంకరయైన జేదుగాదు
యేళ్ళు వంకరయైన నీళ్ళు కారెక్కవు - మెరుపు వంకరయైన మెరుగు బోదు
మడి వంకరైన జామలు పొల్లుగాబోవు - పూవు వంకరయైన దావిబోదు
కుడుము వంకరయైన గడుపులో నొచ్చదు - వెండి వంకరయైన విలువజెడదు  
గీ. వంకరలకేమి గొనమె కావలయుగాక - యెంచి చూచిన వంకర యెందులేదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 83

సీ. కాపులందరు గూడి గంగజాతర జేయ - దొలగునే సివమాడు తొత్తుకొలువు
పదుగు రూరను లంచపంచాలు బెట్టంగ - తప్పునే చాటుచందాల పోటు
సాటివారలు వెట్టిచాకిరీ కొడబడ్డ - దీరునే వినక సర్కారుహుకుము
వాడలో వారెల్ల వలస బోయిననెట్టు - లెత్తుపోవున బుట్ట నెత్తిబెట్ట  
గీ. నలుగురేగిన దారినే నడువుమంద్రు - మంచిదో కాదొయది యేరు నెంచలేరు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 84

సీ. కల్లందరికి నొక్కకంపె కొట్టునుగాని - కంపు త్రావెడివాని కింపుసుమ్ము
నల్లమందెన్న నందరికి జేదెకాని - మందు మ్రింగెడివాడు మానలేడు
గంజాయి యేరికి గైపొక్కటియె కాని - కయిపు గొట్టెడువాని గలచలేదు
చెడిపె పొందేరికి జెరుపు తెచ్చును గాని - చెడిపె నుంచినవాడు విడువలేడు  
గీ. చెడ్డచెడ్డయె మంచిమంచియె దలంప - వాని యందిచ్చ యలవాటువలన బెరుగు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 85

సీ. నల్లికోసరము మంచంబు దెబ్బలుపడు - కురుపుకోసరము త్రోలు గోయబడును
పగవానికయి కోట బగులగొట్టబడు - బలుమీలకయి చెర్వు కలచబడును
పొడపామునకు బెద్దపొదలు గొట్టంబడు - కడ్డిజీరకు బైడి కరుగబడును
చెదలపుట్టకు గోడ జదియగొట్టబడు - మురికికై బుట్టంబు మొత్తబడును  
గీ. చెడుగుతో బొత్తు తప్పక చెరుపె తెచ్చు - మంచితనమున దామెంత మించియున్న
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 86

సీ. చినుకుగారని మబ్బు చెరగులన్నియు గ్రమ్ము - పూతబూయని మావి పొలము నిండు
దారబిండని బర్రె తవుడు తట్టెడు మేయు - కొండ్ర దున్నని దున్న కొమ్ము పొడుగు
వలపులేని వెలంది వగలు వడ్డికి బారు - ఏలలేని మగని బాళి మెండు
తెగులుదాకిన లంజె మొగము మిసిమి హెచ్చు - కొలముతక్కువ రాయి తళుకు లెస్స  
గీ. చెట్టవారికి గలయట్టి మిట్టిపాటు - మంచివారికి గానరా దెంచిచూడ
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 87

సీ. స్వారెక్కు సన్నాసి సాని నుంచిననేమి - తొడగు లంగీలను దొడిగెనేమి
జందెమూడ్చిన గేస్తు సార ద్రాగిననేమి - తెల్లుల్లి నీరుల్లి దిన్ననేమి
చెడిన బమ్మాసారి సిగను బెంచిననేమి - మొల్లలు మల్లెలు ముడిచెనేమి
తనివిలేని తపసి దారి గొట్టిననేమి - పులుల నెలుంగుల బొడిచెనేమి  
గీ. చెడ్డపని యొక్కటేచాలు జెరుపునకును - గడమపనులెల్ల దానికెక్కుడులు గావు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 88

సీ. కొంచెగానికి లచ్చి కూడివచ్చినదేని - గొడుగు దేతెమ్మను నడిమిరేయి
కొంటెమ్రుక్కళి గొప్ప కొలువులో బెట్టిన - అందలంబున మేను గందుననును
పనికిమాలిన కూళ బడిపెద్ద జేసిన - బసివాండ్ర దనకాళ్ళ బిసుకుమనును
చెలువెరుంగని మోట సింగారమబ్బిన - నరకాళ్ళజమురు నత్తరువునగరు  
గీ. అలతికిని గొప్పతన మొక్కటబ్బెనేని - అదరిపా టక్కరకుమాలినంత జూపు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 89

సీ. గుడి బట్టి దిగమ్రింగు గొప్పదెయ్యానకు - గుడి తలుపెన్న నప్పడము గాదె
కడలి దోయిట బట్టు గండ్రదేవరకెల్ల - చెరువులు నెగయ తుంపురులు గావె
పెద్దకొండల బట్టి పెకలించు దిట్టకు - చరియలందరి రాలు మొరము గాదె
గొప్పయోడలను లోగొని కొట్టు మీలకు - చలపతెప్పలు జంతికలును గావె  
గీ. అలవికానట్టిపని సేయు వలతులకును - కొలదిపని యొకపని యని తలచరాదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 90

సీ. నోట నాల్గింగిలీష్‌ముక్కలు నేర్చి ఫూల్‌ - గూసు నాన్సెన్సు యూగోవె యనును
అలతి యైదారూళ్ళు కమలుదారీ చేసి - ఖబరుదార్‌ బాత్‌నకొ కాన్‌పక డనును
మొద్దొక పల్లెకు మున్సఫీ సేయుచు - గాడ్దెకొడుక పన్నుకట్టు మనును
చండి యొక్కముఠాకు సముతుదారాయెనా - కొంటెబడవ రయితు గొట్టు మనును  
గీ. చదువు చదివిన హోదాలు చక్కబడిన - నోటిపట్టము గలవారి కేటిపాటి
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 91

సీ. ముషిణికాయను గాకి ముట్టకుండగ గుడ్డ - కట్టకట్టిన నేమి కలుగునందు
పిల్లకాకిని గూట బెట్టి యోరెము బెట్టి - యక్కక్కయన నేమి యబ్బునందు
పొట్టేలునకు వాగె బెట్టి గట్టిగ బట్టి - కదనునేర్పిన నేమి యొదవునందు
పడుపు బానిసతొత్తు మెడను బంగరుతాలి - బొట్టుగట్టిన నేమి పొసగునందు  
గీ. తగనివారల నొక మంచిదారి బెట్ట - గలుగు కర్జం బొకింతైన గానరాదు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 92

సీ. వ్రాతకరణమెప్డు వ్రాయుచు గూర్చుండ - మేతకర్ణము దిను రైతుసొమ్ము
మంతరాల్చెప్పుచు మల్లుబొట్లుండగ - నేగాని దిగమ్రింగు నెల్లుబొట్లు
కూచమ్మ కుండలో గూర్చిబెట్టుచునుండ - మాచమ్మ తాజేరి మాయజేయు
కంపునోరగు మామ గడియించుచుండగా - మంచినోరల్లుడు మట్టపరచు  
గీ. పాటుపడువారలొక్క రప్పాటువలన - కడుపు నిండించుకొనుచుండ్రు కడమవారు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 93

సీ. తాడిక్రిందను బాలు ద్రావినప్పటికేని - కల్లు ద్రావినవానిగ దలంత్రు
వలికి లోసున్నంపు బట్టి బెట్టిననేమి - పీనుంగుకాడుగా బేరుకొండ్రు
మరుగుదొడ్డికి జాటు మాటాడబోయిన - రెండువ్రేళ్ళకునయి యుండు నండ్రు
సానియింటికి సందెజాము పోచిళ్ళకు - బోయిన దగులాటమాయె నండ్రు  
గీ. కానిచోట సలుపు మంచి కర్జమేని - కానిపనిగా దలంపక మానరెందు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 94

సీ. అలిగెజాండరు చాల బలిమి వాడంటిమా - గుజినిమామూదెంత గొప్పవాడు
గుజినిమామూదెంత గొప్పవాడంటిమా - ఔరంగజీబెంత పేరివాడు
ఔరంగజీబెంత పేరివాడంటిమా - ఫ్రాంసుబుస్సీ యెంతపని యొనర్చె
ఫ్రాంసుబుస్సీ యెంతపనివాడటంటిమా - యింగిరీజలను క్లయివెంతవాడు  
గీ. కలిమిగలవారు పెక్కండ్రు కలరు పుడమి - నొకరనిన వారికంటె మరొకరు గలరు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 95

సీ. తెలియునే యీనేల తిరుగునం చైరోపి - యనుల గొబర్నికసునకు మున్ను
ఒకదానినొకటి యీడ్చుకొను పోడిమియున్న - దని చదివిరె న్యూటనునకు మున్ను
ఎరుగుదురే తపాల్‌ మెరుగు వేగిరమున - నడచునంచును హూకునకును మున్ను
కనుగొనిరే త్రెడ్డుగాలి లేకనె యోడ - చనునంచు జేమ్సువాటునకు మున్ను  
గీ. తెలిసినది తక్కలేదని తలఁచరాదు - క్రొత్తలింకను దెలియగాఁ గోరవలయు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 96

సీ. నిండియున్న పనంటి నిలిచి తాలిమి యుండ - వెలితికుండ తొళుక్కు తొళుకు మనదె
అన్ని బెట్టిన విస్త రణగిమణగి యుండ - నేమిబెట్టని విస్త రెగిరిపడును
తెలివి నిండినవారు థీస్టులై యొప్పంగ - మిడిమిడి చదువరుల్సుడి యెథీస్ట్లు
గవరనర్‌ జనరలు కరుచిచ్చి పనిగొన్న - విల్లేజి మునసఫు వెట్టిగొనును  
గీ. ఎక్కుడగు గొంచెగాండ్రకే యెగిరిపాటు - అణగియుందురు నెరజాణలైనవారు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 97

సీ. గెలుపుసాలిది మంచిగెలుపు నిచ్చుచునుండ - వానకారది యడ్డువచ్చునొక్కొ
మింటినెల కడింది మేలె సేయుచునుండ - వన్నెతగ్గెడినాళ్ళ వాసిచెడునె
పడగదాల్చెడి రోజు పట్టి మేల్సేయగా - పుడమిబుట్టిన యొక్కడడచగలడె
జేజేలవెజ్జులు చేరి ప్రోచుచునుండ - చెలగిన తేలేమి సేయగలదు  
గీ. మొత్తమున మంచి దా దలయెత్తి యుండ - చిన్ని దొసగులు పడియేమి సేయగలవు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 98

సీ. విక్టోరియారాణి వెలసి యేలుటబట్టి - యిండియా పొగడిక యెక్కువాయె
పండ్లతోటలు దొడ్డపంటపైరుల బట్టి - మద్రాసు ప్రెసిడెన్సి మంచిదాయె
తియ్యజక్కెర వంటి తెలుగునుబట్టి గో - దావరి డిస్ట్రిక్టు ఠీవిగాంచె
మేలైన పనితివాచీల నేతనుబట్టి - యేలూరు పెద్దపేరెక్కనాయె  
గీ. యేదయిన నొక్కవిన్నాణ మెనయకున్న - నెవ్వడేనియు నెన్నికకెక్కలేడు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 99

సీ. గెలు పిండియానాడ గెలు పింగిలీష్‌మాట - గెలుపు వేలుపుబాస గెలుపు తెలుగు
గెలుపు స్టీమరులార గెలుపు రైల్రోడ్లార - గెలుపు హైస్కూళ్ళార గెలుపు సైన్స
గెలుపు కాలువలార గెలుపు సోద్దెపుటాన - కట్టలారా టెలిగ్రాఫులార
గెలుపు డార్విన్‌థీరి గెలుపు థియాసఫి - గెలుపు నేషనలుకాంగ్రెస్స నీకు  
గీ. గెలుపు విక్టోరియారాణి గెలుపు గెలుపు - గెలుపు గెలుపని పలుకుటె గెలుపు మనకు
అని పలుకు దాసురాముడి ట్లచ్చ తెనుగు - కబ్బ మందమునిండఁ జక్కట్లదండ 100

చక్కట్లదండ ముగిసెను.

రచించినవారు - దాసు శ్రీరాములు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat