తాళపత్రాలంటే తాటి ఆకులు కాదు.. అవి అరుదైన చెట్ల ఆకులని మీకు తెలుసా?

P Madhav Kumar

 


తాళపత్ర గ్రంథాల గురించి తెలిసే ఉంటుంది. కాగితం లేని సమయంలో జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసేవారు మన ఋషులు, మహర్షులు, పూర్వీకులు, కవులు.

పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వేదాల్లోనూ ఎన్నో ఆచారాలు, విశ్వాసాలు, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎలా అయితే ఉన్నదో.. అప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలే మాధ్యమాలుగా ఉండేవి. 

మనిషి నుంచి మనిషికి విలువైన, ముఖ్యమైన సమాచారాన్ని చేరేవేసేందుకు ఉపయోగించేవారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం సహా అనేక పురాతన గ్రంథాలన్నీ తాళపత్రాల్లోనే నిక్షిప్తం చేశారు. చాలా వరకూ తాళపత్ర గ్రంథాలు కనిపించకుండా పోయాయి.

ఉన్నవాటిలో ఇప్పటికీ ఆ పత్రాల మీద రాసిన అక్షరాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండే పత్రాలను తాటి చెట్ల నుంచి సేకరించేవారని అనుకుంటారు. 

కానీ నిజానికి అవి తాటి చెట్టు నుంచి సేకరించిన ఆకులు కాదు. తాళపత్రాలు చూడ్డానికి తాటి ఆకులతో చేసినట్టు కనిపిస్తాయి. చాలా మంది తాళపత్ర గ్రంథాలు అంటే తాటి ఆకులతో చేసినవే అని అనుకుంటారు. 

అయితే మీకు తెలుసా? తాళపత్రాలు తాటి ఆకులతో చేసినవి కాదని. అది తాటి చెట్టు కాదు. తాళపత్ర వృక్షం. శ్రీతాళం అనే చెట్టు పత్రాలను తాళపత్రాలుగా ఉపయోగించేవారు. 

ఈ పత్రాల మీదనే పూర్వం గ్రంథాలు రచించేవారు. వాటినే తాళపత్ర గ్రంథాలు అనేవారు. శ్రీతాళం చెట్ల ఆకులను సేకరించి, వాటిని ఎండబెట్టి.. క్రమపద్ధతిలో గుచ్చి తాళపత్రాలను సిద్ధం చేసేవారు.

శ్రీతాళం చెట్టు కూడా తాటి చెట్టు లానే ఉంటుంది. పువ్వు పూసి, కాయలు కాసాక చెట్టు చనిపోతుంది. అయితే ఈ చెట్లు పూర్తిగా అంతరించిపోయాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో ఎక్కువగా ఉండేవి. 

అయితే కాలక్రమేణా ఈ చెట్లు అంతరించిపోయాయి. కేరళలో కొన్ని చెట్లు ఉన్నట్లు సమాచారం. అయితే రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లాలోని నారాకోడూరు గ్రామంలో శ్రీతాళం చెట్టు ఉన్నట్లు గుర్తించారు వృక్ష శాస్త్ర నిపుణులు. 

అప్పటి వరకూ దాన్నొక తాటి చెట్టుగా చూసిన గ్రామస్తులు.. ఒక ప్రొఫెసర్ చెప్పడంతో తాళపత్ర వృక్షం అని తెలుసుకున్నారు. చెట్టు శిఖర భాగంలో పూలగుత్తులు రాలిపోవడం, కొద్ది రోజుల్లోనే అది పొడవుగా పెరిగి అందంగా కనిపించడం మొదలైంది.

ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోయి.. చెట్టు పూర్తిగా వాడిపోయింది. పూలగుత్తులు లేత పసుపు రంగులోకి మారాయి. ఆ తర్వాత ఆ చెట్టు కాయలు నేలరాలాయి. అయితే దాన్ని పరిశీలించిన స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు జన్యులోపం వల్ల అలా జరిగిందని చెప్పారు. 

అయితే తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ మాత్రం.. ఇది శ్రీతాళం చెట్టు అని గుర్తించారు. దీన్ని సిద్ధ వైద్యంలో కూడా ఉపయోగించేవారని వెల్లడించారు. 

అదండీ విషయం.. తాళపత్రాలు అనేవి తాటి చెట్ల ఆకులు కాదు.. శ్రీతాళం అనే చెట్టు యొక్క ఆకులు. ఈ ఆకులనే సేకరించి తాళపత్ర గ్రంథాలుగా చేసి.. జ్ఞాన సంపదను అక్షర రూపంలో మన పూర్వీకులు నిక్షిప్తం చేశారు. మరి దీని గురించి ఇంకా ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే నెటిజన్స్ తో పంచుకోండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat