కాశీ అన్నపూర్ణేశ్వరీ దేవీ

P Madhav Kumar


కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కోడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.


కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు. కాశీ నగర మహాత్మ్యాన్ని తెలిపే కథ ఒకటి దేవీభాగవతం పదకొండో స్కంధంలో కనిపిస్తుంది.


కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.


పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.


అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది.

ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది.


ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది.

అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.

ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది.


రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.

ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.

పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు.

పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు.


బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.


వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు.

 అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు.


 మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.

యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.


ప్రదక్షిణ ఫలితమే

అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు.


గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి .


కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండ, విశ్వనాధ, అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం , చెయ్యండి . . .


ఓం నమః శివాయై చ నమః శివాయ

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat