ధర్మసందేహాలు-సమాధానం
🌷🌷🌷🌷
*ప్ర* : *యుగాంతంలో అన్నీ నశించిపోతాయనీ, అంతా జలమయమైపోతుందనీ పురాణాలలో చెప్తారు కదా! మరి త్రేతాయుగం నాటి ఆనవాళ్ళు, ద్వాపరయుగం నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయంటారు కదా! మరి ఆ యుగాలు అంతమయ్యాక అవి ఎందుకు* *నశించలేదు? ఆ అయోధ్య, మధుర, ద్వారక... వంటివి ఎలా మిగిలాయి* ?
జ : యుగాంతంలో అంతా నశించిపోవడం, జలమయమవడం జరగదు. పురాణాల్లో అటువంటి వర్ణన కల్పాంతానికి సంబంధించినది. ఒక కల్పంలో ప్రారంభమైన సృష్టి కల్పం చివరి వరకు ఉంటుంది. మధ్యలో కొన్ని చిన్నచిన్న మార్పులు జరుగుతాయి. మనకి అవి పెద్దగా అనిపించినా, కల్పాంతంతో పోల్చితే చిన్నదే. ఒక కల్పంలో ఎన్నో యుగాలు జరుగుతాయి. యుగసంధిలో కొన్ని పరిణామాలు సంభవిస్తాయి. రూపురేఖలు మారుతాయి. అంతేగానీ, సృష్టి అంతా నశించి, జలమయం కాదు. సంవత్సరం గడిచి మరో సంవత్సరంలోకి వెళ్ళినట్లుగానే, యుగం నుండి యుగంలోకి ప్రవేశిస్తాం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిసి ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. ఇటువంటి మన్వంతరాలు 14 జరిగితే ఒక కల్పం. ఇది బ్రహ్మ యొక్క ఒక పగలు. ఆ పగటి అంతంలో సృష్టి అంతా లయిస్తుంది. తిరిగి కల్పంలో మునుపటి కల్పపు బీజాలు సృష్టిగా వ్యక్తమవుతాయి. ఈ కారణం చేత ఒక కల్పంలో ఒక యుగంలో జరిగిన ఆనవాళ్ళు తరువాతి యుగాలలో లభ్యమవడం ఆశ్చర్యమేమి కాదు.
🌷🌷🌷🌷