ప్ర : షోడశోపచారాలతో భగవదర్చన చేస్తున్నప్పుడు, సాధారణంగా మనం.. " ప్రీత్యర్ధం - ఛత్రం అచ్ఛాదయామి, చామరంవీజయామి, గజాన్ ఆరోహయామి.... " వగైరాలు చెబుతుంటాం కదా! ఏ పెద్ద పెద్ద దేవాలయాలలోనో పీఠాలలోనో అన్ని ఉపచారాలు జరుగుతాయి. కానీ మనం నిత్యం ఇంట్లో అర్చన చేస్తే, కేవలం ఇవి వాచికంగానే మిగులుతాయి. కానీ అస్సలు జరగవు కదా! అలాంటప్పుడు భగవంతునికి మనం ఏమీ చేయకుండా చేస్తున్నట్లు అభినయిస్తాం. మరి మనకు అసత్యదోషం ఉండదా?
జ : మనం పూజకు ముందే "యావచ్ఛక్తి" అంటాం. అంటే "శక్తికొలది" అని అర్థం. బాహ్యపూజ చేయడం అవసరమే. కానీ అందులోనూ భావన ప్రధానం. రోజూ రత్నాభరణాలు, వస్త్రయుగ్మాలు సమర్పించలేని వాళ్ళు ఆ ఉపచారాలకు బదులుగా అక్షతలనో, కుసుమాలనో సమర్పిస్తున్నారు కదా! అంటే - భావనాపరంగా భగవంతునికి అందజేయడమే. అదే విధంగా ఛత్రం, చామర, అశ్వారోహణాది ఉపచారాలు కూడా భావనాపరంగా - అంటే భావిస్తూ - ఆచరించాలి. భగవంతుడు భావదర్శి - భావవేద్యుడు. ఆ కారణం చేత వాచికంగా చెప్పినా, ఆ వాచికానికి భావన ఉంటుంది గనుక, అది అసత్య దోషం కాదు. మనం ఇవ్వకుండా ఇచ్చేశాం అనుకున్నట్లే భగవంతుడూ, మన వరాల్ని 'తీర్చేసినట్టు' అనుకోమనడు. ఎందుకంటే - మనమిచ్చేది భగవంతునికి అవసరం కావు. మన ప్రేమనూ,భక్తినీ వ్యక్తీకరించడానికి సాధనాలు మాత్రమే. కానీ భగవంతుడు మనకు ఇవ్వాల్సినవి- మనకు అవసరమైనవి, మనమడిగినవి. ఈ కారణం చేత భావాన్ని మిళతం చేసిన బాహ్యపూజకు ఫలితం లభిస్తుంది.