ఎంత పాపాత్ములకైనా చివరి క్షణంలో దైవపూజ, దైవనామ స్మరణ చేస్తే అతడికి మోక్షం లభిస్తుంది - అని అంటారు. నిజమేనా?

P Madhav Kumar

 ధర్మసందేహాలు-సమ

ప్ర: ఎంత పాపాత్ములకైనా చివరి క్షణంలో దైవపూజ, దైవనామ స్మరణ చేస్తే అతడికి మోక్షం లభిస్తుంది - అని అంటారు. అజామిళుడు, గుణనిధి, వంటివారి కథలు కూడా అందుకు సాక్ష్యాలుగా చెప్తారు. అంటే చివరిలో భగవంతుని స్మరిస్తే పాపాలన్నీ పోతాయి గనుక, 'ఇంక ఎన్నిపాపాలైనా చేసి, ఆఖర్న దైవస్మరణ చేద్దామనుకొంటే' చాలు కదా! ఏమిటి ఈ వైపరీత్యం? ఇది మరీ అన్యాయమే కదా!

జ: ఈ 'చాలు కదా' అనే ఊహే వైపరీత్యం, అన్యాయం.

అసలు ఆ కథలను పరిశీలించి చూస్తే ఈ సందేహమే కలగదు. చివరిలో భగవన్నామ స్మరణ చేసే వానికి మోక్షానికి కావలసిన అవకాశం లభిస్తుంది. అంతేకానీ, వెంటనే, నేరుగా మోక్షం కాదు. ప్రభావవంతమైన భగవత్ స్మరణ కారణంగా తరువాతి జన్మలలో వివేకం ఏర్పడి, మరి పాపాచరణ జోలికి పోకుండా, క్రమంగా సత్కర్మాచరణతో ఉత్తమజ్ఞానాన్ని సంపాదించి క్రమంగా కైవల్యం పొందుతాడు. ఆ జన్మలలో గతజన్మ పాపాలను కష్టాల రూపంలో అనుభవించక తప్పదు. లేదా - తపస్సుతో ఆ పాపాలను క్షయం చేసుకుంటాడు.

అజామిళుడి కథలో అది మరణం కాదు. మరణానికి ముందరి సంధి అవస్థ వంటిది. ఆ క్షణంలో- సూక్ష్మ ప్రపంచంలో జరిగిన యమదూతల, విష్ణుదూతల సంభాషణ సన్నివేశం అతడికి గోచరించింది. ఎంతటి పాపాత్ముడికైనా, ఆఖరి నిముషంలో భగవన్నామం స్ఫురించడమనే యోగం లభించాలంటే ఏదో గొప్ప పుణ్య విశేషం అతడి ప్రారబ్ధంలో ఉండి ఉండాలి. అందుకే ఎన్ని పాపాలు చేసినా, వాటిని తొలగించుకొనే అవకాశం దొరికే పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం అజామిళుడికి ఉంది. అందులోనూ, మొదట్లో అతడూ యోగ్యుడే. తరువాత పతితుడయ్యాడు. చివరి అవస్థలో జరిగే మానసిక ఉద్రేకాలకు బలం ఎక్కువ. ఆ బలంతో కూడిన నామస్మరణ తప్పక ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావంచేత అతడికి విష్ణు దూతల దర్శనం లభించింది. వారి సంభాషణని గ్రహించాక, తిరిగి అతడు యధాప్రకారం జీవితంలోనే ఉన్నాడు. వెంటనే మరణించలేదు.

సూక్ష్మ ప్రపంచ దర్శనం తరువాత అతడిలో మార్పు కలిగి మళ్ళీ శుద్ధుడై, భగవన్మయ చిత్తంతో సాధనచేసి మోక్షం పొందాడు.

ఆ విధంగా భగవన్నామస్మరణ అతనికి సహకరించింది.

అదే విధంగా గుణనిధి కథ. అతడు కూడా చివరి క్షణంలో శివరాత్రినాడు అనుకోకుండా చేసిన ఉపవాస, జాగరణల ఫలంగా, శివసన్నిధిని దీపం వెలిగించిన కారణంగా- తరువాత ఉత్తమ జన్మలు పొందాడు. నేరుగా, వెంటనే శివసన్నిధి రాలేదు. ఆ జన్మలలో గత జన్మల కర్మక్షయం జరిగి, అంత్యకాల శివపూజా ఫలంగా లభించిన పుణ్య సంస్కారంతో పాపాచరణ జోలికి పోకుండా - క్రమంగా చివరకు తపస్వియై శివసాక్షాత్కారాన్ని లభింపజేసుకున్నాడు.

ఇవి గమనించాలి. ఎంత పాపాత్మునికైనా భగవత్స్మరణ పాపనాశనానికి ఉపయోగిస్తుంది అనేది మనకు లభించిన ఒక అభయం. ఒక భరోసా. మనం బాగుపడడానికి పరమాత్మ ఎప్పటికీ అవకాశాన్నిస్తాడు అని దాని అంతరార్థం. ఇది గ్రహించక , “ఎప్పుడో చివర్లో భగవంతుణ్ణి స్మరిస్తే సరి- అందుకే ఇప్పుడంతా పాపాలు చేద్దాం అనుకొనే వారికి, చివర్లో భగవత్ స్మరణ లభించదు.

పురాణ కథల పూర్వాపరాలను పరిశీలిస్తే, సమస్యలకు అక్కడే పరిష్కారం లభిస్తుంది. అయితే అందుకు తగిన శ్రద్ధ, వివేకం ఉండాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat