బలిని పాతాళానికి తొక్కిన త్రివిక్రమ రూపం మహోన్నతం - ఆ ఆలయాలు మన దేశంలో రెండే రెండు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు!

P Madhav Kumar

 వామనాలయం.....!



ఇంతింతై వటుడింతై.. ఆకాశమంతై.. మూడడుగులు కోరి.. ముజ్జగాలకూ మేలు చేసిన స్వామి వామనుడు.


 బలిని పాతాళానికి తొక్కిన త్రివిక్రమ రూపం మహోన్నతం. ఆ అపురూప మూర్తి కొలువుదీరిన ఆలయాలు మన దేశంలో రెండే రెండు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు!


అందులో ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని తెలిస్తే.. ఆనందం కలగక తప్పదు!! మరొకటి కేరళలోని ఎర్నాకులంలో ఉంది.


ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో త్రివిక్రమ స్వామి ఆలయం ఉంది.


🌿అపురూప శిల్పసంపదతో అలరారు స్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తుండే స్వామివిగ్రహం గోధుమ వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది.


చోళరాజుల్లో పదోవాడైన విష్ణువర్ధన మహారాజు ఓ సారి ఈ ప్రాంతానికి విహారానికి వచ్చాడట.


ఇక్కడి కోనేటిలో తివిక్రమ స్వామి విగ్రహం ఉండటం గమనించి..

చుట్టూ మంటపం నిర్మింపజేశాడట.


 తర్వాత రాజరాజనరేంద్రుడి కాలంలో ఆలయం, మంటపాలు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.


ఆలయంలో అడుగడుగునా ఆనాటి కళావైభవం దర్శనమిస్తుంది.

మూలవిరాట్టుకు ఉత్తర దిశలో భూదేవి, దక్షిణాన శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలున్నాయి.


సమీపంలో 12 మంది అళ్వారుల విగ్రహాలుంటాయి.

ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా దర్శనమిస్తాయి.


గర్భాలయం వెలుపలి గోడలపై రామాయణ గాథ, భాగవత ఘట్టాలు, దశావతారాలు, వినాయకుడు తదితర దేవతా విగ్రహాలు కనిపిస్తాయి.


ఆలయ పరిసరాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రశాంతతనూ చేకూరుస్తాయి.


 శ్రీకృష్ణాష్టమి, వామన జయంతి, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


ప్రతి శనివారం విష్ణు సహస్రనామార్చన, ఏకాదశి సందర్భంగా తిరుమంజనం సేవ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.


ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి చెరుకూరు 19 కి.మీ. దూరంలో ఉంటుంది. గుంటూరు జిల్లా బాపట్ల నుంచీ అంతే దూరంలో ఉంటుంది.


 రెండు ప్రాంతాల నుంచి చెరుకూరుకు బస్సు సౌకర్యం ఉంది. చీరాల, బాపట్ల రైల్వేస్టేషన్‌లలో దిగి చెరుకూరు చేరుకోవచ్చు.


బలిని పాతాళానికి తొక్కిన తర్వాత.. దేవతలు వామనుడిని స్తుతించారు. త్రివిక్రమ రూపాన్ని ఎప్పటికీ దర్శించుకునే వరమివ్వమని కోరుకున్నారు.


దానికి సమ్మతించిన వామనస్వామి ఇక్కడ వెలిశారని చెబుతారు. బలిని చరపట్టినందున ఈ ప్రాంతాన్ని చరయూరుగా కాలక్రమంలో చెరుకూరుగా పిలుస్తున్నారు ...


స్వస్తి ...


ఓం నమో నారాయణాయ

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat