శ్రీమహా విష్ణువు మరో పేరే పాండురంగ విఠలుడు, విఠోబా.

P Madhav Kumar

 ప౦డరీపురం…*

         *పాండురంగ విఠలుడు*

విఠలుడి మందిరాలు మన ప్రాంతంలో తక్కువైనా, మహారాష్ట్రలో ఈ స్వామి మందిరాలు, భక్తులు ఎక్కువ.  వీటిలో ముఖ్యమైనది పండరీపురంలోని పాండురంగడి మందిరం.   


తెలుగువారిలో ఎక్కువమందికి పాండురంగవిఠలుని చరిత్ర తెలిసింది. భారత దేశంలో శ్రీకృష్ణుడు అనేక రూపాలలో ప్రసిద్ధి చెందిన ధామాలు ఎన్నో వున్నాయి.   ఉదాహరణకు తూర్పున పూరీ, పడమరలో ద్వారక, ఉత్తరాన మధుర, బృందావనం, బదరీ, దక్షిణాన ఉడిపి, గురువాయూర్, పండరీపురం ప్రఖ్యాతి చెందినవి.  పండరీపురం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము...


శ్రీ విఠలుని మందిరం 

నగర మధ్య భాగంలో వుంటుంది ఇది.  వసతి కొంచెం దూరంగా తీసుకున్నవాళ్ళకి, నడవలేకపోతే ఆటో సౌకర్యం వున్నది.  మనిషికి 10 రూ. లు తీసుకుంటారు.  ప్రతి రోజూ రద్దీగానే వుండే ఈ ఆలయంలో రద్దీ తక్కువ వున్న సమయంలో నేరుగా గర్భగుడిలోకి వెళ్ళవచ్చు,  లేకపోతే 

2, 3 అంతస్తులు ఎక్కి, దిగాల్సి వుంటుంది.  మంచి పూల దండలు తీసుకెళ్తే స్వామికి, అమ్మవార్లకు అలంకరిస్తారు. విఠలుని గర్బగుడిముందువున్న మండపంలో వెండి రేకు తాపడం చేసిన స్తంబం ఒకటి వుంటుంది.  భక్తులు దీనిని కౌగలించుకుని నమస్కారం చేస్తారు.  భగవంతుని కౌగలించుకున్నట్లు, ఆయన ఆశీర్వదించినట్లు భావిస్తారు.  ఈ స్తంబము దగ్గరే పురందరదాసు భజనలు చేస్తూ నుంచునేవాడట.  అందుకే దీనిని పురందరదాసు స్తంబము అనికూడా అంటారు.  


గర్భాలయంలో ఎత్తయిన వేదిక మీద, దాదాపు 3 అడుగుల ఎత్తు పాండురంగని విగ్రహం  రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని భక్తులకు అభయమివ్వటానికే వున్నానన్నట్లు వుంటాడు.   ఇక్కడ పాండురంగడితో సహా అన్ని దేవతా మూర్తుల పాదాలమీద మన శిరస్సు పెట్టి ప్రణామం చెయ్యవచ్చు.


పాండురంగడు రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని, ఇటుక మీద నుంచుని దర్శనమిస్తాడు.  ఆ ఇటుక గురించి తెలసుకోవాలంటే పుండరీకుని కధ తెలుసుకోవాల్సిందే.  నడుముమీద పెట్టుకున్న ఆయన ఎడమ చేతిలో శంఖముంటుందిగానీ, వస్త్రాలంకరణలో అది మనకు కనబడదు. స్వామి దర్శనమైన తర్వాత వేరు వేరు ఉపాలయాల్లో వున్న రుక్మిణి, సత్యభామ, రాధాదేవిల దర్శనం చేసుకోవచ్చు.  అతి విశాలమైన ఈ ఆలయంలో అనేక ఉపాలయాల్లో కాలభైరవుడు, సూర్యనారాయణుడు, దత్తాత్రేయుడు, ఏక ముఖ దత్తాత్రేయుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వరస్వామి వగైరా దేవతలని దర్శించవచ్చు.


పుండరీకుని కధ:

పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధంచెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు  దీర్ఘకాలం యుధ్ధంచేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు.  శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు.  నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనంకావటం జరిగాయి.  

ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు.

పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు.  


కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు.  


పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.


ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు.  పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు.  


భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు.  పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు.  


విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు.  విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.

పుండరీకుడేకాదు … ఇక్కడ స్వామిని కొలిచి, స్వామితో ఆడి, పాడి, సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో. వారిలో కొందరు ..  శ్రీరామానుజాచార్యులు,శ్రీ మధ్వాచార్యులు, జ్ఞానేశ్వర మహారాజ్, జనాబాయి, నామదేవుడు, గోరా కుంభారుడు, సక్కుబాయి, తుకారాం, సమర్ధ రామదాసు, పురందరదాసు మొదలగువారు ఎందరో.  జగద్గురువు శ్రీ శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి  పాండురంగాష్టకం రచించారు.✍️```

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat