నవతిరుపతులలో మొదటిది - శ్రీ వైకుంఠం.

P Madhav Kumar

 

🕉 శ్రీవైకుంఠం 🕉

@ప్రధాన దైవం:వైకుంఠనాథ పెరుమాళ్ (కళ్ళపిరాన్)

@ప్రధాన దేవత : వైకుంఠవల్లి

@ పుష్కరిణి : పృథు తీర్థము, తామ్రపర్ణీనది

@ విమానం : చంద్ర విమానము


🛎 నవతిరుపతులలో మొదటిది 

శ్రీ వైకుంఠం.

ఈ క్షేత్రం తిరునల్వేలి కి 28 కి.మీ. దూరంలో ఉంది.ఈ క్షేత్రం పవిత్ర తామ్రపర్ణి నదికి ఉత్తరంగా ఉంటుంది. 


🛎ఇక్కడొక విశేషం గమనించాలి. తమిళనాడు లోని వైష్ణవ దివ్యదేశ క్షేత్రాల ముందు "తిరు" అనే గౌరవ వాచకం ఉంటుంది.  అలా కాకుండా శ్రీ తో ఆరంభమయ్యే  దివ్య దేశాలు రెండే ! 

ఒకటి శ్రీ వైకుంఠం కాగా రెండవది శ్రీ విల్లిపుత్తూరు. 


🛎స్థల పురాణం : 

👉జలప్రళయానికి పునఃసృష్టికి మధ్య ఉన్న సంధి కాలంలో సృష్టికర్త విశ్రమించారట. యోగనిద్రలో ఉన్న ఆయన వద్ద నుండి "సోమకుడు"  అనే అసురుడు వేదాలను అపహరించాడట. మేలుకొని విషయం తెలుసుకొన్న విధాత శ్రీ మహవిష్ణువు తప్ప అన్యులు కాపాడలేరని భావించారట. ఆయన అనుగ్రహం కొరకు భూలోకం లోని పావన తమిరపారాణి (తామ్రపర్ణి ) నదీతీరం లో తపస్సు చేశారట. దర్శనమిచ్చిన శ్రీమహావిష్ణువు మత్య్స రూపం దాల్చి రాక్షసుని అంతం చేసి సృష్టికి మూలమైన వేదాలను హంసవాహనునికి ఇక్కడ అందించారట. 

👉చతుర్ముఖ బ్రహ్మదేవుడి కోరికపై శ్రీమన్నారాయణుడు శ్రీ వేంకటేశ్వరుని రూపంలో ఆ క్షేత్రంలో వెలిశాడు.

 ఆ మూల విగ్రహాన్ని బ్రహ్మ దేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడు.

తన కలశంలోని గంగాజలంతో స్వామికి అభిషేకం చేసినందున ఈ క్షేత్రాన్ని "కలశతీర్థం" అని కూడ పిలుస్తారు.

 

👉కాలం ఎవరి కోసం ఆగదుకదా! విశ్వకర్మ కట్టిన ఆలయం కనుమరగైనది. స్వామి చుట్టూ పుట్టలు పుట్టాయి. నిత్యం రాజుగారి పశువుల మంద మేతకు ఈ ప్రాంతానికి వచ్చేవట. వాటిలోని ఒక ఆవు ఈ పుట్టల వద్దకు వెళ్లి ధారగా క్షీరాన్ని తన పొదుగు నుంచి వదిలేదట. 

అది గమనించిన గోపాలకుడు పాండ్యరాజు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు.

ఆ పుట్టలలో ఏదో మహత్యం ఉండి ఉంటుంది అని గ్రహించిన రాజు జాగ్రత్తగా తవ్వించగా నీలమేఘ శ్యాముడైన 

శ్రీ వైకుంఠనాధుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చారట.ఆనందపరవశుడైన పాండ్యుడు పునః ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించారట. గోవు చేసిన పాలాభిషేకం కారణంగా దర్శనం ఇచ్చారు కనుక స్వామిని "పాలపాండ్యన్" అని పిలుస్తారు. అర్చనామూర్తికి ప్రతి నిత్యం పాలతోనే అభిషేకం చేస్తారు.


👉శ్రీ దేవి, భూదేవి సమేతంగా పూజలందుకొనే ఉత్సవమూర్తిని "కాలాపిరన్ లేదా చోరనాధన్ " అని పిలుస్తారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. 


👉శ్రీ కాలాపిరన్  ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే పాండ్యరాజు భోగలాలసుడై  ప్రజాసంక్షేమం పట్టించుకొనేవాడు కాదట.దానితో రాజ్యంలో అరాచకం, అవినీతి, అక్రమాలు, దొంగతనాలు పెరిగిపోయాయట.

 "కాలదోషకుడు" అనే వాడు పెద్ద దొంగల ముఠాకు నాయకుడు. రాజ్యంలో జరిగే అధికశాతం దొంగతనాలు ఈ ముఠా సభ్యులే  చేసేవారట. దొంగ అయినా కాలదోషకుడు శ్రీ వైకుంఠనాధుని భక్తుడు. చోరీ చేయడానికి ముందు స్వామికి పూజలు చేసి తన కార్యం సఫలమైతే సగభాగం లక్షీనాధునికి సమర్పించుకొంటానని మొక్కుకొనేవాడట. అదే విధంగా లభించిన దానిలో అర్థభాగం ఇచ్చేవాడట. అలా కాలం సాగిపోతున్నది. పెరుమాళ్ కాలదోషకునికి,  రాజు కి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనది అని తలంచి తన మాయను ప్రసరింప చేశారట.

దాని వలన కాలదోషకుని మదిలో అహం పెరిగి రాజుగారి ఖజానాని దోచుకోడానికి పధకం రచించాడట. అదృష్టం తారుమారవడంతో ముఠా సభ్యులు అందరూ రాజ భటులకు దొరికిపోయారట. కాలదోషకుడు ఒక్కడూ తప్పించుకొని దిక్కు తోచక శ్రీ వైకుంఠనాధుని శరణుకోరాడట.

స్వామి ఒక ముదుసలి రూపంలో దొంగల నాయకునికి అభయమిచ్చి తాను అతని వేషంలో రాచకొలువుకు వెళ్ళారట. తన దాకా వస్తే గానీ తెలియదన్నట్లుగా ఖజానా చోరీ విషయాన్ని పరువు సమస్యగా తీసుకొన్న రాజు ఆగ్రహంతో "ఎవరు నువ్వు? "అని ప్రశ్నించాడట. నవ్వి

 " నా పేరు కాలాపిరన్. ఊరు " శ్రీ వైకుంఠం." అని బదులిచ్చారట.

"దొంగతనం నేరమని తెలియదా! " అన్నాడట పాండ్యుడు. సూటిగా రాజు వంక చూస్తూ "మరి నువ్వు చేస్తున్నది ఏమిటి ?" అని ఎదురు ప్రశ్నించారట దొంగ రూపంలో ఉన్నపెరుమాళ్.  

ఆయన చూపులకు, ప్రశ్నకు తన తప్పులను తెలుసుకొన్న రాజు కైమోడ్చాడట.  నిజరూప దర్శనమిచ్చి  జనరంజకంగా పాలించమని ఆదేశించారట. జరిగింది తెలుసుకొన్న కాలదోషకుడు నాటితో దొంగతనాలు మానేసి శ్రీ వైకుంఠనాధుని సేవ చేస్తూ ముక్తి పొందాడట. తన పేరు కాలాపిరన్ అని స్వామి స్వయంగా చెప్పినందున ఉత్సవ మూర్తిని అదే పేరుతో పిలవసాగారు.


👉ఇక్కడ జరుగు ప్రత్యెక సూర్యాభిషేకం :

స్వామి వారికి రోజూ క్షీరాభిషేకం జరుగుతుంది అని తెలుసుకొన్నాము కదా! అది కాకుండా మరో అభిషేకం కూడా జరుగుతుంది. అది సంవత్సరంలో రెండు సార్లు. ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయణంలో మరోసారి. అదే ప్రత్యక్ష నారాయణుని కిరణాభిషేకం.

ఏంతో లోపలికి ఉండే గర్భాలయానికి ఉదయారుణ  కిరణాలు ఆ రెండు రోజుల్లో మాత్రమే ప్రవేశించి మూలవిరాట్టు ను నేరుగా తాకడం నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.


🙏జై శ్రీమన్నారాయణ 🙏

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat