ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాల వారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించెనని క్రైస్తవులు భావిస్తారు.
ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతార కధల ప్రధాన ఇతివృత్తం.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చుకల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన. కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయంలో "శంభల" రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణపురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి