: కుప్పుసామి శతకము :
గొంటరులఁ దుంటరుల గుమిగూర్చి సృష్టిఁ
జేసి చీటికి మాటికి డాసి వారు
తన్నుకొని చచ్చుచుండంగఁ దనియుచుండు
గొప్ప వానికి జేజేలు కుప్పుసామి. 1
ఏడొ, పద్నాలుగో, మూఁడొ యెన్నొ, జగము
లెల్ల సృష్టించి నటువంటి యీశుఁడొకరొ
యిర్వురో, యెందఱో వారి కెల్ల నేటి
కోళ్ళ నర్పింతు భక్తితోఁ గుప్పుసామి. 2
చిన్న పిల్లలకును దల్లి చెప్పునటులఁ
దెలుఁగు మాటల పొంకంబుఁ దీర్చి దిద్ది
తెలిసి తెలియక యర్థంబు తెలియునటులఁ
జెప్పఁ బూనితిఁ గఱదలు కుప్పుసామి. 3
మున్ను పెద్దలు చెప్పిన వెన్నొ కలవు,
ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు
పేరుగాఁ గ్రుచ్చి మెడలోన వేతువానిఁ
గుతిల పడకుండఁ దాల్చుము కుప్పుసామి. 4
కమ్మ నెత్తావి దెసలెల్లఁ జిమ్మునట్టి
గంధఫలి చెంతఁజేరదు గండు తేఁటి
తేనె లేదన్న సంగతిఁ దెలిసికొనుచుఁ
దప్ప కీనీతి స్మరియింపు కుప్పుసామి. 5
పూలు తెగఁబూసినప్పుడు మూఁగుచుండుఁ
దేనెటీఁగలు పైఁబడి తేనెకొఱకు
స్నేహితులు కొంద ఱీరీతిఁ జేరుచుందు
రప్పుడప్పుడు కనిపెట్టు కుప్పుసామి. 6
పండ్ల చెట్లక్రిందకు నెట్టి బాటసారి
యూఱకేరాఁడు ఫలమును గోరివచ్చు
వాని నొకకంటఁ గనిపెట్ట వలసియుండు
గోల గాకుండ సుంతైనఁ గుప్పుసామి. 7
ఒకనియెడఁ గృతఘ్నతఁజూపి యున్న వాని
నమ్మియుండుట తగదు లేశమ్ము కూడఁ
దనకు లాభంబు కల్గుచోఁ దత్క్షణంబ
ముప్పు తప్పక చేకూర్చుఁ గుప్పుసామి. 8
ఒక్కమానవుండు డొక్కచీల్చినఁగాని
నారికేళఫలము నీరు నీదు
గొంటుకాని నిట్లు గోరాడకుండిన
నొప్పుకలుగఁనీడు కుప్పుసామి. 9
పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు
వానినెపుడు నమ్మ వలదు, వలదు
మేలుకలుగబోదు మెఱమెచ్చుల కతండు
తప్పుచెప్పుచుండుఁ గుప్పుసామి. 10
నీతిలేనివాని నిరసించు జగమెల్ల
నీతిశాలి కెపుడు నెగడు లేదు
నీతిశాలి నెపుడు నీతియే కాపాడుఁ
గుజనుబారినుండి కుప్పుసామి. 11
నాలిమ్రుచ్చు నెపుడు నమ్మరా దాతండు
కొంపఁదీయగలఁడు; కుదులకుండఁ
గొండచిలువ యట్టె గుటుకున దిగమ్రింగుఁ
గుతిలపడఁగ జీవి కుప్పుసామి. 12
పరుని నీముందుఁ దిట్టెడు వాఁడు నిన్ను
నొరుని ముందటఁ దిట్టక యుండఁబోఁడు
చనవు రవ్వంత వాని కొసంగరాదు
ముప్పువచ్చుఁ దప్పక దానఁ గుప్పుసామి. 13
నమ్మకంబున్న లేకున్న నచ్చకున్నఁ
బరులమాటకుఁ దలయూఁచు వాఁడు సత్య
మాత్మ గౌరవమేలేని యట్టివాఁడు
ముప్పుపుట్టు వానిని నమ్మఁ గుప్పుసామి. 14
ఒరుల గొప్పతనముఁజూచి యోర్వలేని
పురుషుఁ డెందు వేదనఁబడి పొక్కిపొక్కి
తెవులులేకయే తెగటారుఁ జివరకతఁడు
తప్ప దీమాట వేదంబు కుప్పుసామి. 15
వదరి యూరకే ఱంకెలు వైచువాఁడు
పట్టుమన నెట్టిపనికైనఁ బనికిరాఁడు
వానఁ గురియదు శారద వారిదంబు
తప్ప కుఱుముచుండునుగాని కుప్పుసామి. 16
అప్పులిడువానితోడను జెప్పులున్న
వానితోడను బైనంబుఁ బూనఁదగదు;
చింతసేయక పయనంబుఁ జేసిరేని
యొప్పమి ఘటిల్లు నద్దానఁ గుప్పుసామి. 17
పుటము వెట్టినపుడె పుత్తడి యిత్తడి
తెలియఁగలదు వేఱె తెలియరాదు;
సిలుఁగులొందునపుడె చెన్నఁటి సుగుణంబు
కూడఁ దెలియఁగలరు కుప్పుసామి. 18
ఏటినీరుపొడువ నెక్కలి యిసుమెల్ల
నీటితోడఁ బోవు నిలువకుండఁ
బెద్దవారితోడఁ బిన్నలీరీతిగాఁ
దప్ప కేగుచుంద్రు కుప్పుసామి. 19
గుడికిఁ దఱచుపోయి గొణుగుచుండెడివాఁడు
చెడ్డపాపమేదొ చేసియుండు
నదియె వానిఁబట్టి యట్టిట్టు పీడింప
గుడికిఁ బోవు నతఁడు కుప్పుసామి. 20
ప్రొద్దుపొడువకుండ నిద్దుర మేల్కాంచి
బుడిగిబుడిగి నీట మునిఁగి మునిఁగి
మొగమునిండ బూది పూసినమాత్రానఁ
గుదుటఁబడునె మనసు కుప్పుసామి. 21
ఎంతనీతి కలిగి యెపుడు వర్తించిన
నెంత నియతికల్గి యెప్పుడున్నఁ
ద్రాగుబోతు నమ్మరాదు నిజంబుగా
ముప్పువచ్చు దానఁ గుప్పుసామి. 22
రాజు వ్యభిచారి యైనచో రసికుఁడంద్రు
త్రాగి తందనాలాడుచో భోగియంద్రు
పాడిదప్పిన మంత్రాంగ పరుఁడటంద్రు
తప్పు తెలియని లోకులు కుప్పుసామి. 23
కాసులను గూడఁబెట్టిన దాసికొడుకు
పలుకుబడిగల్గి యందందుఁ బ్రాకులాడు;
ధనముతోఁ గాని పనులేవి ధరణిలేవు
మెప్పుకొఱకుఁ జెప్పుటకాదు కుప్పుసామి. 24
గురునిపజ్జ విద్దెల నేర్చి కొనక యదియు
నిదియు మూచూచి మురితోడ నెగిరిపడెడి
చుంబకుని మాటలం జెవిఁ జొన్పఁబోకు
ముప్పువచ్చును దానిచేఁ గుప్పుసామి. 25
నవల చదువు, వ్యాజ్యంబుల కవిలెకట్ట,
యోట్లు, సిగరెట్లు, సినిమాలు, చీట్లు, కాఫి,
నూత్న సప్తవ్యసనములనుచు వచింత్రు
గొప్ప నీతిశాస్త్రవిదులు కుప్పుసామి. 26
ఒదిఁగి పనిపాటు లేవియు నొల్లనట్టి
వాని నెప్పుడు దరిఁజేర్ప వలదు, దాన
నుభయులకుఁ గీడు వాటిల్లు చుండుననుచుఁ
చెప్పుచుందురు పెద్దలు కుప్పుసామి. 27
రఘుకులంబునఁ బుట్టరే రాముకన్న
గొప్పవారు? వారల పేరు లెప్పుడైన
వింటిమే సత్కవికటాక్ష వితతిచేత
గొప్పవాఁడయ్యె రాముండు కుప్పుసామి. 28
ఆయమును మించి యెవ్వండు వ్యయముచేయు
నతనికి సుఖంబు లవలేశ మబ్బఁబోదు
తుదకుఁ గడగండ్ల పాలౌను బ్రదుకుతెఱవు
కూడ లేకుండఁ బోవును గుప్పుసామి. 29
గొంటరికి మంచి చేసిన మంటమండుఁ
గాలియాఱిన సున్నపు రాలమీఁదఁ
జల్లని జలంబు చల్లిన సలసలమని
నిప్పుసెగఁ జిమ్ముకైవడిఁ గుప్పుసామి. 30
ఓరుగాలి విసరి యుయ్యాలలూపంగ
శిరము వంచినట్టి చెట్లు బ్రదుకు
నిక్కి నీల్గుచెట్లు నేలమీఁదను గూలుఁ
గుప్పకూరగాఁగఁ గుప్పుసామి. 31
చదువుకొన్న భార్య సహధర్మచారిణి
యగుటకన్న మంత్రి యగుట కోరు
జగతి మంత్రి గొప్పొ సహధర్మచారిణి
గొప్పొ తెలిసి మెలఁగు కుప్పుసామి. 32
చదువులేని జాయ సల్లాపములకన్నఁ
జదువుకొన్న జాయ చలము మేలు;
వీనువిందుగాఁగ వినవచ్చు నొకమాట
నప్పుడప్పుడైనఁ గుప్పుసాము. 33
అణఁగి మణఁగియుండు నటువంటి కులకాంత
భయము భక్తిగల్గు ప్రియసుతుండు
సంభవించు వాని జన్మంబు నిజముగా
గొప్ప సార్థకంబు కుప్పుసామి. 34
భార్యచదువు పతికిఁ బనికివచ్చుచునుండుఁ
గొడుకు చదువుకన్నఁ గొంతవఱకు
చదువుకొన్న భార్య సంసారమును దిద్ది
కొనుచుఁ బతికిఁగూర్చుఁ గుప్పుసామి. 35
తనదు నీలువుఁ గాపాడు కొనఁగలేని
యతివ భర్త గౌరవముఁ గాపాడఁగలదె?
యట్టి యామెతోఁ గాపుర మహరహంబు
కూర్చుచుండుఁ గష్టంబులఁ గుప్పుసామి. 36
భార్య తనకుఁగాఁ బ్రేమించు భర్త నెపుడు
భర్త తనకుఁగాఁ బ్రేమించు భార్య నెపుడు
స్వార్థమీ ప్రేమయందుఁ గన్పట్టుచుండు
నొప్పిదముగా విచారింపఁ గుప్పుసామి. 37
పాతకుని చేత నెప్పుడు గీతయుండు
మొగముపై వింత వింతఁగఁ బొట్టులుండుఁ
జిన్నెలివియె మనస్సాక్షి సన్నగిలిన
యప్పుడు జనాళి కెందును గుప్పుసామి. 38
ఇంతలోన మాఱి యేయెండ కాగొడ్గు
బట్టువానిఁ జేరఁ బట్టరాదు
సమయ మేగుదేర సంశయింప కతండు
గొంతు నులిమివైచుఁ గుప్పుసామి. 39
పరులు చెప్పు మాటఁ బరికించి చూడక
సమ్మతించువాఁడు జడుఁడు గాఁడె?
వానినమ్మి యెట్టి పనిని జేయఁగరాదు
తప్పకుండఁ జెడును కుప్పుసామి. 40
కూలినాలి చేసికొనుచు జీవించువాఁ
డేని నీతిశాలి యెందుఁ బూజ
నీయుఁ డతని నెపుడు నెఱనమ్మగా వచ్చుఁ
గొఱఁతరాదు దానఁ గుప్పుసామి. 41
బ్రతికి చెడ్డవాని వలని నేస్తముఁజేయు
చెడి బ్రదికినవాని చెలిమి వలదు
వీనియందు నేది విపరీతమైనను
ముప్పు తప్పఁబోదు కుప్పుసామి. 42
ఒక్క కొడుకెయైన నూరక చెడిపోవు
మకురు తనము చేత మాటలేల?
పెద్దయైన కొలఁది పెద్దగాఁ జింతించుఁ
గొడుకు కొఱకుఁ దండ్రి కుప్పుసామి. 43
ప్రతిభ గల్గువాఁడు పతనంబుఁ జెందిన
మరల పైకివచ్చు మహిత శక్తి
రాలి పడిన పూలు రమణులు క్రొవ్వెద
నొప్పుఁ జూపరావె? కుప్పుసామి. 44
చేతగామిఁ బనులు చెడిపోయి నంతనే
విధిని దూరుచుంద్రు వెఱ్ఱివారు
విధికి దీననేమి పెత్తనంబుండునో!
తప్పుమాటగాక కుప్పుసామి. 45
ముండులున్న నేమి మురువు గొల్పు గులాబి
గొప్పవారుకూడఁ గొనుచునుంద్రు
కొద్దిదోషమున్న గుణవంతుఁ బూజింత్రు
తప్పకుండ జనులు కుప్పుసామి. 46
సాన నరగఁదీయు కొలంది చందనంబు
కలయఁ జిమ్ముచు నుండును గమ్మతావి
సజ్జనుం డిట్టులనె కష్ట సమయమందు
నొప్పుఁ గాంచుచు నుండును గుప్పుసామి. 47
వారకాంతలఁ బడఁదిట్టు వారుగలరు
విటులు క్రవ్వింపకుండిన వేశ్యలెట్లు
చెఱచువారలో పురుషులఁ జెప్పఁబోరు
కుచ్చితులుగారె వీరెల్లఁ గుప్పుసామి. 48
విత్త మన్యాయముగఁ గూడఁబెట్టి భయము
చేత దానధర్మంబులఁ జేయుటేల
అడుసు ద్రొక్కఁగానేల? కాల్గడుగనేల?
యెప్పుడైన లాభముకద్దె? కుప్పుసామి. 49
పురుషుఁ డెన్ని రోగములచేతఁ బీడింపఁ
బడుచునున్న సతికి వరవుడంబు
సల్ప ధర్మమంట జగతిలో నిదియెటో
చెప్పఁబోరు జనులు కుప్పుసామి. 50
కుష్ఠురోగియైనఁ గుత్సితుండైనను
మగువ తీర్పవలయు మగనికోర్కె
సతికి హక్కులేదె స్వశరీరమును బ్రోచి
కొనఁగ సుంతయైనఁ కుప్పుసామి. 51
చదువు చెప్పకుండ జడురాండ్రఁగాఁ జేసి
స్త్రీలఁ దిట్టిపోయఁ జెల్లుచుండె
దోస మెవరియందు దొరలాడుచుండెనో
చెప్పఁబోవ రెవరు కుప్పుసామి. 52
తీరుబాటు కల్గితిరునాళ్ళకై పోవు
వింతలుండు ననెడి వెఱ్ఱిచేత
భక్తిచేతఁ గాదు ప్రాకృత లోకంబు
తిప్పలైనఁ బొంది కుప్పుసామి. 53
నీచుఁ డెపుడు క్రింద జూచు నైజమగుటఁ
గొండమీఁద నున్న కొలఁదివాఁగు
నేల వైపుఁ జూచు నిలిచియుండక యందు
గొణిఁగికొనుచు నెపుడు కుప్పుసామి. 54
అడచి పాటులేని యనురాగవతి పొందు
మనసుఁ గరఁచఁజాలు మంచి కవిత
పోరులేని యిల్లు పుణ్యాత్ములకుఁగాక
కూడ వన్యులకును గుప్పుసామి. 55
మాతృ భాషయందు మాతృదేశమునందు
మమత లేనివాఁడు మనుజుఁడగునె?
తగని మమతయుండు మృగ పక్షిజాతికిఁ
గూడఁ దెలియలేవె కుప్పుసామి. 56
అత్తవారింట సుఖమెంత యబ్బుచున్నఁ
బుట్టినింటిపైఁ బేరాస పొరయుచుండు
సహజ మాడుబిడ్డకు నిద్ది జగతియందుఁ
గ్రొత్తమాట కాదిది యెందుఁ గుప్పుసామి. 57
వీరుఁ డెప్పుడు రణభూమి వీడిపోఁడు
పాఱుఁ డెప్పుడు రణభూమి పజ్జఁబోడు
మిండఁడెప్పుడు సతిప్రక్కఁ బండఁబోఁడు
కోటి లాభము గల్గినఁ గుప్పుసామి. 58
చిన్ననాఁటనే బిడ్డకుఁ జెప్పకున్న
నీతు లవల సాధ్యముకాదు; మొక్క
యపుడు వదలిపెట్టి యది చెట్టయిన వంకఁ
గూడఁ దీయుటఁ తలమౌనె? కుప్పుసామి. 59
వాజ మాన్పరాదు వసుధాతలంబున
నెట్టివానికైనఁ బట్టుఁబట్టి
యెవరు తీర్పనేర్తు రేటివంకల నెల్లఁ?
చెప్పు చూత మిపుడు కుప్పుసామి. 60
జీవహింస చేసి జీవింతు ననుకంటెఁ
జెట్టయెందుఁ గూడఁ బుట్టఁబోదు
జీవహింస మాని జీవింపరాదొకో?
కొంత మేలు దానఁ గుప్పుసామి. 61
మాంసము భుజింప నిచ్ఛించి మానవుండు
మ్రొక్కు మ్రొక్కంచు దేవుని ముందుఁబెట్టి
గొంతుగోసి యే మృగమునో కుడుచుచున్నఁ
గోపపడకున్న దేవుండు? కుప్పుసామి. 62
కష్టమైన నేమి కల్ల చెప్పనటంచు
హితుఁడు తప్పకుండ హితముఁజెప్పు
పరుఁడు స్వార్థపరుఁడు మెఱమెచ్చులనుబల్కఁ
గొంకఁ డింతయేని కుప్పుసామి. 63
మాట పరుసదనము మార్తురఁ బుట్టించు
మెత్తదనము కూర్చు మిత్రకోటి
గుడ్లగూబ కేల కొల్లగా నుందురు
తప్పఁ దిట్టువారు? కుప్పుసామి. 64
బుట్టనున్న పాము బుసకొట్టి పోఁబోవు
వీలు చిక్కినపుడు వేగిరించి
సకలభూతములకు స్వాతంత్ర్య కాంక్షయే
యొప్పు సహజముగను కుప్పుసామి. 65
నీటిలోని జీవి నీటిలోఁ జచ్చును
మెట్టనున్న జీవి మెట్టఁజచ్చు
ఘాతుకుండు చచ్చు ఘాతుక కృత్యంబు
లుప్పరించుచుండఁ గుప్పుసామి. 66
ఉప్పతించువాని కుప్పతిల్లదు మేలు
క్రుళ్ళి క్రుళ్ళి చచ్చుఁ గొట్టకొనకు
పరులఁజూచి యోర్చి బ్రదుకువాఁడు శుభంబుఁ
దప్పకుండఁ బొందుఁ గుప్పుసామి. 67
కారణములేక కుజనుండు కష్టపెట్టు
నెట్టివారల నేనియు నెండ్రి యొకటి
చేనిలోనుండి మెల్లగాఁ జేనిపైరు
కొఱికి వైచెడి కైవడిఁ గుప్పుసామి. 68
సానఁ బటినయపుడె వజ్రముల కాంతి
ప్రజ్వలితమగు నా ప్రకారంబె కష్ట
సమయమందె ప్రకాశించు శౌర్యరాశి
గురుతరంబైన శౌర్యంబు కుప్పుసామి. 69
అంత్యనిష్ఠురంబుకన్న నాదినిష్ఠు
రంబు మేలుగావునఁ దత్తరంబు లేక
యున్న దున్నట్టుగాఁ జెప్పుచుందురు బుధ
లొప్పమిని లెక్కపెట్టక కుప్పుసామి. 70
ఎన్ని రసములున్న నేమి రుచించును
నుప్పులేని కూర చప్పనగుచుఁ?
కోటిగుణములున్నఁ గొరగావు నీతి యొ
క్కొండు లేకయున్నఁ గుప్పుసామి. 71
తలలు గొఱిగించి కావి బట్టలనుగట్టి
మెడల రుద్రాక్షమాలిక లిడినయంత
ముక్తి వచ్చునే నిస్సంగ బుద్ధిలేక
కుమతి మాటలనేమి కుప్పుసామి. 72
తప్పుఁ దెలిసికొన్నఁ దత్క్షణమే సజ్జ
నుండు దిద్దికొనఁగ నూలుకొనును;
గఱతలాఁడు దానిఁ గప్పిపుచ్చఁ గడంగుఁ
గుటిలబుద్ధిచేతఁ కుప్పుసామి. 73
చచ్చిపోయిన వెంటనే జన్మమెత్తు
జీవి కుడువఁ గర్మమటంచుఁ జెప్పుచుండు
రట్టులైనచోఁ బితృలోక మెట్టువచ్చుఁ?
గుటిలజనసృష్టి గాదొక్కొ కుప్పుసామి. 74
చచ్చిపోయిన వాని కేసరణిఁ జేరఁ
గలవు పిండములు నివాప జలముకూడ
నావులును భోక్తలును దృప్తు లగుటకొఱకుఁ
గూర్చి పెట్టిరిగాకేమి కుప్పుసామి. 75
ముక్కు మొగముఁ జెక్కి మూలవిరాట్టంచు
నొక్క రాయిఁదెచ్చి యుంచి గుడులఁ
గూడు గుడ్డలిచ్చి కొల్తురు ప్రజలెల్లఁ
గొంటెపనులు గావె కుప్పుసామి. 76
మండి వెలుఁగుదాని మన దీపమని చెప్పి
ముద్దు పెట్టుకొన్న మూతిఁగాలు;
మూర్ఖుఁడైన వాని పొందు చేకూర్చును
ముప్పు దప్పకిటులఁ కుప్పుసామి. 77
కొడుకు కొమ్మలనుచుఁ గూడు గుడ్డలనుచు
నిల్లు వాకిలనుచు నెగిరి పడుచుఁ
పాపమనక యెవఁడు వర్తించు వానికిఁ
గొంప మునిఁగితీరు కుప్పుసామి. 78
పొట్టివాని కుండుఁ బుట్టెడు బుద్ధులు
పొట్టివాని నమ్మఁ బోకు మెపుడు
పొట్టివాఁడు గాదె పొడవడంచె బలిని
గూట పథముఁ ద్రొక్కి కుప్పుసామి. 79
రక రకంబులైన రంగు వల్వలు మేనఁ
గట్టినంత రాదు గౌరవంబుఁ
అంగకములఁ గప్ప గంగిరెద్దునకుఁ జాలఁ
గప్పడములు లేవె కుప్పుసామి. 80
కులములోన నొక్క కుజనుండు పుట్టినఁ
గులము జెడును దానఁ గులకలంక
మందువల్ల నెంత మంది నిర్దోషులో
గోడు గుడుచు చుంద్రు కుప్పుసామి. 81
ఎంత మంచివాని నేనియుఁ జిటికలోఁ
జెడ్డవానిఁ గాఁగఁ జేయవచ్చు
బందుకట్టి బైసి వదలుచుఁ బదిమంది
కుచ్చితములు పల్కి కుప్పుసామి. 82
ఆశ కంతంబు లేదెందు నాశ వదల
కున్నఁ బ్రాణికి సౌఖ్యంబు సున్నయగును
దృప్తిఁ గాంచనేరనియట్టి తృష్ణ నరుని
కెప్పుడొప్పుగాఁ బోవదు కుప్పుసామి. 83
చదువు సాములు చెప్పించి సంస్కరింప
కెంతో విత్తంబు గడియించి యిచ్చు తండ్రి
పుత్రునకు నెందు భీషణ శత్రువంచుఁ
జెప్పుదురు పండితోత్తముల్ కుప్పుసామి. 84
ఆఁడుదాని యీలు వంతరించిన మీఁద
నెట్టివంశమందుఁ బుట్టియున్న
గ్రుడ్డిగవ్వకైనఁ గొఱగాక పోవు, నీ
యొప్పులేనిఁ జగతిఁ గుప్పుసామి. 85
సంశయించు భర్త సాహచర్యముఁ జేయ
సాధ్యపడునె యెట్టి సాధ్వికైన?
సీత భూమిఁజొచ్చె శ్రీరామచంద్రునిఁ
గూడి యుండలేక కుప్పుసామి. 86
పెండ్లియందు నొక్కరికేల పెత్తనంబు?
కష్టసుఖము లందలి పాలి కాపులగుటఁ
బెండ్లికూఁతురు కొమరుండు పెండ్లిఁ జేసి
కొనఁగవలెఁగాని నిజముగాఁ గుప్పుసామి. 87
మ్రొక్కుగల దదిచెల్లింపఁ బోదు మంచు
గొండలెక్కి యేరులు దాఁటి కొట్టకొనకు
జుట్టునిత్తురు దేవుండు క్షోభపడఁడె
కూఁకటుల చిక్కుఁ దెలియక కుప్పుసామి. 88
అక్షమాలఁ గుంభజుఁడు పెండ్లాడె నందు
రక్షమాల పుట్టింటివా రనినయెడల
ముట్టరాదందు రిదియేల చిట్ట? విప్ర
కోటి కిది చెల్లిపోయెఁగా కుప్పుసామి. 89
తిరిపెమెత్తి జీవించెడి దేబెకున్న
యాత్మసంతుష్టి కలదె ధనాఢ్యునకును?
ధనము సంతుష్టి నీదు విద్యాధనంబొ
కూర్చు నాత్మసంతుష్టిని గుప్పుసామి. 90
వయసు చెల్లుచున్నంత లావణ్యముడుగు
నుడుగనిది యొక్క శీలంబు పడతికెప్పు
డుడుగకుండంగ వర్ధిల్లు చుండుఁ గాన
గుణములేని చెలువయేల కుప్పుసామి. 91
తలలు మాడుచున్నఁ దమపాదములఁ బట్టి
కొన్నవారి కిచ్చు గొప్పనీడ
పాదపంబు లిట్లె పండితు లిత్తురు
కోర్కె లాశ్రితులకుఁ కుప్పుసామి. 92
దేహపాటవంబు దిగజారు కొలఁదిని
విషయవాంఛ మిగులఁ బెఱుగుచుండు
నందుచేత దేహ మారోగ్యమున నుంచి
కొనుట మేలు ప్రజకుఁ గుప్పుసామి. 93
పాడిపంటలేక పశుసంపదయు లేక
కాయకష్టము పడు కడిమిలేక
బ్రదుకుచుండునట్టి రైతుబిడ్డల నమ్మఁ
గూడదెపుడు సుంత కుప్పుసామి. 94
మేనమామ పోల్కి మేనత్త చాలిక
యనెడి సంప్రదాయ మధిగమించి
పెండ్లిచేయునపుడు పెద్దగా యోజించి
కులము నెమకవలయుఁ కుప్పుసామి. 95
కానిడబ్బు చేతఁ గల్గువాఁ డెట్టివాఁ
డయిన గౌరవంబు నందుటెఱిఁగి
పరువుఁగోరి బ్రదుకు వాఁడెందు ద్రవ్యంబుఁ
గూడఁ బెట్టవలయుఁ గుప్పుసామి. 96
చిడిపిరాళ్ళగనిని బొడఁగట్టు వజ్ర మొ
క్కొక్కమాటు గాన నోర్మిగల్గి
వెదకి వెదకి చాల వెడవంగడమునుండి
కొనఁగవచ్చుఁబిల్లఁ గుప్పుసామి. 97
పెట్టుపోతలున్న యట్టి వంగస మెందుఁ
గుతిలపడదు ధనము కొఱఁతఁబడినఁ
గానఁ బెట్టుపోత లానుగా జరుపుట
కూర్చుచుండు మేలు కుప్పుసామి. 98
జంతుజాలమునకుఁ జావు నైజమగుటఁ
దెలివి గల్గువారు దెలిసికొనుచు
దానధర్మములను దనివోవఁ జేతురు
కూర్చు శుభము దానఁ కుప్పుసామి. 99
తల్లి కప్పిపుచ్చుఁ దనబిడ్డలందున్న
యెన్ని దప్పులైన నెట్టివైనఁ
దలకుఁ జుట్టుగుడ్డ తనకున్న చిఱుగులఁ
గప్పిపుచ్చునట్లు కుప్పుసామి. 100
కైతకైదువన్న భీతిపడు జగంబు
కైదు వున్నయట్లె కవితయున్నఁ
గవుల నాశ్రయించి కడచన్నరాజులు
గొప్పవారలైరి కుప్పుసామి. 101
కఱద లిన్నికూర్చి కవిరాజు వచియించెఁ
బరులకొఱకుఁ గార్య పరులకొఱకుఁ
జిక్కువచ్చినపుడు చిక్కుదీరును దీని
విప్పి చదువుకొన్నఁ కుప్పుసామి. 102