మాతృశతకము - Maatru satakam

P Madhav Kumar

 

: మాతృశతకము : 

ఉ. శ్రీపతియైనఁ గాని విధుశేఖరుఁడైన త్రిశూలపాణియై-
నా పరమేష్ఠియైన గణనాయకుఁడైన రమామృడానులై-
నా పలుకుం బొలంతియయినా పరిరక్షణకార్యసత్క్రియో-
ద్దీపనబోధనోక్తులను దెల్పను తల్లినిఁ బోలరెవ్వరున్. 1

చ. జలరుహనేత్రుఁడైన యల చక్కనిదేవునిబొడ్డుతమ్మిలో-
పలను జనించి వాగ్వనిత పాలిటి పెన్నిధియో యనంగఁ బెం-
పలరిన బ్రహ్మసృష్టికిని నాదిమకారణమై త్రయీమయో-
క్తులఁ గొనియాడి నాద్యయగు తొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 2

చ. చిఱుతతనంబునన్ జెలులఁ జేరి విహారము సల్పువేళ నా-
దరమునఁ గొయ్యబొమ్మను ముదంబునఁ బుత్రునిగాఁ దలంచి తాఁ
బరవశమొంది వేడుక నెపంబిడి లాలనఁ జేసి మిక్కిలిన్
మురిపముఁ గాంచి మోహమున నూల్కొను తల్లినిఁ బోలరెవ్వరున్. 3

ఉ. బాలలఁ గూడి బొమ్మ నొడిపైఁ గడుఁబ్రేమ చెలంగ నిల్పి తా-
నోలలు పాడుచున్ బొదలి యుగ్గిడి కేలను మేను దువ్వుచోఁ
జాల మనంబుతో నిటులఁ జక్కనిపట్టిని గాన నెప్పుడో
కాల మటంచు నెంచు మదిఁ గల్గిన తల్లినిఁ బోలరెవ్వరున్. 4

చ. ఇలఁ గల దేవతాతతులనెల్ల మనంబున నెంచి నామముల్
పలుమఱు నోటఁ బల్కుచును బార్వతి గేహముఁ జొచ్చి శాంభవీ-
లలితకుమారసంభవఫలప్రదమైన వివాహమింకఁ గా-
వలెనని మ్రొక్కి వేఁడు సుతవాంఛకుఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 5

చ. చిలుకలు లేని పంజరము శీతమయూఖుఁడు లేని రాత్రి చెం-
గలువలు లేని పెంగొలను గాదె పరేహసుఖప్రదానని-
ర్మలగుణశాలి నాఁ దగు కుమారకునిం గనలేనిదాని మే-
ల్చెలువమదేల యంచు మదిఁ జింతిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 6

చ. సుతులను గన్నయట్టి నెఱసుందరులం గని భాగ్యభోగసం-
గతమతులార నందనులు గల్గుటకున్ దిటమార నేమి నోఁ-
చితిరొ తపంబు లేమి మఱి చేసితిరో యని పుత్రవాంఛలోఁ
గుతుక మెలర్పఁగా నడుగు కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 7

చ. పొరుగిరుగిండ్ల భామినులు పుత్రులు గల్గుట కాత్మతత్త్వసు-
స్థిరమతిఁ జేయు సాధనముఁ జెప్పిన య ట్లుపవాసదేవతా-
చరణయుగార్చనప్రభృతి సత్కృతులెల్లను దానొనర్చుచోఁ
జిఱుతల మీఁది యాశ మదిఁ జేడ్పడు తల్లినిఁ బోలరెవ్వరున్. 8

చ. తనయుని మీఁది బాళి మదిఁ దాఁకినచో నుపవాస మీశ్వరా-
ర్చనమును నోములాదియగు సత్క్రియలెల్లను జేయుచో నెదం
బెనఁగిన ప్రేమమై నొగిఁ దపింపఁగ నోర్చుచు సౌఖ్యమేమి నె-
మ్మనమున నాస పాల్పడని మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 9

ఉ. సేతువులో మునుంగు నతిశేముషి దీనుల నన్నదానసం-
ప్రీతులఁ జేయు దేవతలఁ బేర్కొను నైదువరాండ్ర కెల్లన-
య్యే తనివారు వాయనములిచ్చుఁ బురాణము లాలకించుఁ దా-
నేతఱి నోమునోఁచుఁ దనయేచ్ఛను దల్లినిఁ బోలరెవ్వరున్. 10

ఉ. మోద మెలర్పఁగా దనయమోహము చేతను బిప్పలద్రు నా-
గాది ప్రతిష్ఠలెల్ల జనులందఱు సంతసమందఁ జేయుచో,
బేదఱికం బదెంత మఱి బిడ్డలు గల్గినఁ జాలునంచు నా-
పాదన జేయుచో నెపుడుఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 11

చ. ఇలఁ బెఱవారినందనుల నెత్తుచు ముద్దిడుచోఁ బెనంగి య-
న్నులఁ గని బిడ్డలెన్నటికినో కననోఁతు నటంచు బల్కి లే-
మొలకమెఱుంగునవ్వులకు మోదముఁ జెందుచు నిష్టదైవమున్
దలఁచుచు బుత్రవాంఛ మతిఁ దాఁకిన తల్లినిఁ బోలరెవ్వరున్. 12

చ. తనయుల బాళి మ్రుగ్గులిడుఁ దాలిమి మీఱఁగ నెవ్వరేమి చె-
ప్పిన నది సేయుచుండు నిలవేల్పులకున్‍ మఱి మీఁదు గట్టు దా-
ననయము గర్భహేతువివిధౌషధముల్ పచరించు ధర్మచిం-
తన నొకకాలమైన మదిఁ దప్పని తల్లినిఁ బోలరెవ్వరున్. 13

చ. అనయము నందనేచ్ఛ హృదయంబున మల్లడిసేయ మీనలో-
చన నిలయంబులో నిలిచి షణ్ముఖునిం జెలువారఁ గన్న యో
జనని దయానిధీ సుతులఁ జయ్యననిమ్మని నెమ్మి మీఱఁగా
మునుకొని సాగిలం బడుచు మ్రొక్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 14

చ. మునుకొని తాను బెద్దలకు మ్రొక్కిన వారును బ్రేమఁ బుత్రులం
గనుఁగొని సర్వకాలము సుఖంబున నుండుదు వీ వటంచు దీ-
వన లిడునంతలోనన సువర్ణమహీధర మెక్కినట్లు నె-
మ్మనమున జాల సంతసిలు మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 15

చ. ఎఱుకులసానిగద్దె విననెంచు మనోరథ ముప్పతిల్లఁగాఁ,
గరగతలేఖ లూర్జితముగాఁ గని పెద్దలు నీకుఁ బుత్రులే-
వురు గలరన్న మాత్రమున నూరట దోఁప సుతేచ్ఛ లోన ము-
ప్పిరిగొన సంతసిల్లి మది బేర్చెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 16

చ. నెల నిలిచెం గదే యనుచు నీరజపాణులు పల్కునంతలో-
పల నిధిఁ గన్నయ ట్లుదరభాగములోపలఁ బిండ ముష్ణమున్
దొలఁగెడు రీతి భోజనవిధుల్ మఱి గోరుచుఁ బుత్రమోహ మ-
త్యురుతరభంగిఁ గొల్పు వగనుండెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 17

ఉ. వేవిళు లోఁకిరింతలును విన్నఁదనంబును దోఁప డస్సి గ-
ర్భావరణార్భకావనశుభక్రమ మొప్పఁగ మంత్రతంత్రసం-
భావన మీఱ మాంత్రికుల భావనఁ జేయుచుఁ ‘బుత్రవృద్ధికిన్
దైవము తోడు గావలె సదా’ యను తల్లినిఁ బోలరెవ్వరున్. 18

చ. నెల నిలువన్ మనోరథము నివ్వటిలంగను బైఁడిరక్ష రే-
కులు మెడఁగట్టు మోమునను గోరిక మీఱ విభూతిఁ బెట్టు దా-
నలయక గాలి సోఁకెడునటంచు సుతేచ్ఛను నాఁడునాఁటి కీ-
చెలువున నుత్తమక్రియలు చేసెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 19

చ. చెలు లిటు రమ్మటంచుఁ దనుఁ జీఱిన వేసట గర్భగోళసం-
కలితసుతావనేచ్ఛఁ జనఁగా మఱి యూహఁ దొలంగు దేహళీ-
స్థలి నెగదాఁటనేరనని తగ్గులు మిఱ్ఱులు చూచి తిన్నఁగాఁ
గలక దలంగి తా నడచు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 20

ఉ. మాసములెల్లఁ బూర్ణమయి మానవతీమణి గర్భవేదనా-
యాసముతోడ నుండుతఱి నంగన పుత్రునిఁ గాంచె నన్నుఁ దా-
నా సడి విన్న మాత్రమున నా వచనం బమృతప్రవాహధా-
రాసమమైనచో మనము రంజిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 21

చ. విసుకుచు బిడ్డనుం గనిన వేదనఁ గుందుచు నున్నయప్పు డా
నిసుపును దెచ్చి పొత్తులను నించినచోఁ దన కష్టరీతులన్
మసలక తత్సుతావనవిమర్శ ఘనంబుగఁ జిందు ద్రొక్క దా-
మసమునఁ బ్రోచు నేర్పుగల మానిని దల్లినిఁ బోలరెవ్వరున్. 22

చ. చిఱుత జనించునంతఁ దన చిత్తము సార్థకమై చెలంగిన-
ట్లురుతరభాగ్య మబ్బినటు లుర్వి సమస్తము నేలినట్లు పెం-
దురమున గెల్చుచో విజయతూణము లెల్లెడ నాఁటినట్టు ల-
బ్బురముగ సంతసిల్లు విరిబోఁడిని దల్లినిఁ బోలరెవ్వరున్. 23

చ. పురిటిలు సొచ్చి యున్నతఱిఁ బుత్రునకున్ వివిధోపచారముల్
మెఱవడి చేయువారలను మిక్కిలి ప్రార్థన చేసి దేవతా-
తరుణులయట్లు చూచు నెఱ తాలిమి మీఱగ నిట్టు లర్భకా-
తురమున నేమి చెప్పవలెఁ దొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 24

చ. తన కుపచారముల్ జరుపు తామరసాక్షులఁ జూచి బిడ్డ కిం-
పొనరఁగ బోరుమాన్పి చెలువొందఁగ నుగ్గిడరమ్మ మీరలే
దినదినమంచు బల్కి తన దేహసుఖం బిసుమంతయైనఁ గో-
రని తనయావనక్రియల రంజిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 25

చ. ప్రమదము మీఱఁ గన్న యల బాలునకై యొకవేళఁ బక్షిదో-
షమొనరు దృష్టి సోఁకు గ్రహసంసరణంబును గాలి ముట్టు దో-
షము మొదలైన దోషములు సంధిలకుండఁగ నంతలోన వే-
గమునను రక్షరేకు మొలఁ గట్టెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 26

చ. పురుడు చనంగ జాతకపుఁ బొంక మెఱింగినయట్టి పెద్ద లా-
దరమున దీర్ఘకాలము ముదంబున మీనవిలోచనాతివి-
స్ఫురకరుణావిశేషమున శోభిలుచుం భవదాత్మజుండు బ-
ల్వరలు నటన్న మాట విన వాంఛిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 27

చ. నెలపురు డీఁగుదాఁక బలునే ర్పలరారను మూలయింటిలో-
పలఁ బరు లెవ్వరేని తన పట్టినిఁ జూచిన దృష్టి దాఁకు ని-
మ్ముల నని దాఁచి గాలితెఱ ముంగలఁ దానొనరించి పెంపుటిం-
తుల పయిఁగాఁపుగా నిడిన తొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 28

ఉ. కారము నూరిపోయు నెడ గాసిలనీయదు బోరుబెట్టినన్
గూరిమితోడ నెత్తుకొని గుబ్బల పాలిడు జోలఁ బాడు స-
త్కారము మీఱుచోఁ గసురు దాఁకె నటం చని కుందుఁ బుత్రలీ-
లారతి నాఁటనాఁట నిటుల న్మదిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 29

చ. తన పొరుగిండ్ల భామినులు తారసిలంగను దృష్టి తాఁకునో
యని మిహిరాదిక గ్రహచయాభిమతు ల్పచరించి మీనలో-
చనను దలంచి నందనుని సంగతిఁ బాయక ప్రోవవమ్మ యో
జనని యటంచు నంజలులు సల్పెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 30

చ. పెనఁకువ మీఱునంతఁ దన బిడ్డపయిం గలయట్టి బాళిచే-
తను మలమూత్రము ల్గడుముదంబున నెమ్మెయిఁ బూసినట్టి చం-
దనహిమనీరసౌరభము దారిఁ దలంచు నిజాన్వయాబ్ధిచం-
ద్రునిఁ గనినట్లు బొంగు భళిరే యల తల్లినిఁ బోలరెవ్వరున్. 31

చ. అనుదిన మాత్మసంభవున కాముద ముగ్గిడు నంతమీఁద లో-
చనములు ముక్కు పెందొడలు చంకలు కాళ్లును చేతు లాదిగాఁ
గను సమమొందఁగా నివిరి చక్కనివాఁ డగునట్లు చేయు నే-
ర్పున నలరారుచున్న ననబోణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 32

చ. పిడికిలి పట్టువేళఁ దనుఁ బేర్కొని నవ్వెడువేళ నోరలం
బడియెడువేళ నూకురులు పల్కెడివేళను దోఁగులాడుటన్
దడఁబడువేళఁ జూడఁ గని తప్పుటడుంగిడువేళఁ బ్రేమ బల్
గడలుకొనంగ సంతసిలు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 33

ఉ. బాలుని వృద్ధికై యొరులు పల్కినయట్టుల నెంత ద్రవ్యమై-
నా లవమాత్ర మంచుఁ దన నాథునకున్ దెలియంగఁ బల్కుచున్
లీల ఘటించి నందనుని లీలలకు న్మది సొక్కి యోగులం
బోలినయట్టులుండు ననబోణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 34

చ. మన మతిప్రీతి నొంద నొకమంచిముహూర్తముఁ జూచినంతఁ దా-
ననువమరంగ రంగలరు నన్నము ముట్టఁగఁ జేసి బిడ్డఁ డిం-
పెనయఁగ నాఁకఁటం బొదలి యెన్నఁడు బువ్వదినంగ నేర్చునో
యని మది నూహ పాల్పడిన యంగనఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 35

చ. చెలు లుదకంబు దేరఁ దన చేతను నూనియఁ దోఁగ నంటుచోఁ
దల జలకంబు లార్చి బలుతాలిమితోఁ దడి యొత్తి మోమునన్
దిలకముచుక్క బొట్టువలె దీరిచి సంతసమంద నాత్మలో-
పల నలరారుచున్న యల భామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 36

ఉ. ఇంతులఁ జూచి మీ సుతుల కే పస రుగ్గిడినారు మీరు గో-
రంత యెఱుంగఁ బల్కఁగదరమ్మ యటంచుఁ జికిత్స దోఁప నిం-
తంతనరాని యౌషధము లారయుచున్ గడుబ్రోచుచున్న ధ-
న్వంతరియో యనంగఁ జెలువారెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 37

ఉ. భావ మెలర్ప మూలికల భావన చేసినయట్టి బంగరుం
దీవెల నూకచిట్టుడుకు దీసి మరీచిఘృతోచితంబుగాఁ
ద్రావఁగఁ జేసి వేఁడి జలధారల మేను గడింగి నిద్దురం
బోవఁగ జోలఁ బాడుచును బొంగెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 38

ఉ. క్షీరము శర్కరాన్నమును జిక్కని గట్టిపెరుంగు పాయసం-
బారయ బొజ్జ నిండునటు లామెతగాఁ దినిపించి బిడ్డఁ డే-
మో రహిలేక ముట్టఁ డని మో మఱ వాంచుచు “ముద్దులయ్యగా,
రార” యటంచుఁ బిల్చుచును రాజిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 39

చ. చిఱుతను జంకఁ బెట్టుకొని చిత్రముఁ జూపుచు వెండిగిన్నెలో
మెఱయుచునున్న బువ్వఁ దినుమీ తినకున్నను బూచివాని వే-
గిర మిదె పిల్తునంచు నళికించుచుఁ గాకికి వేతునంచుఁ దా
బిరబిర చేతిముద్దఁ దినిపించెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 40

చ. అరమర మానుచున్ గురుపదార్థము లెవ్వి భుజించితేని పా-
లరుగవు బిడ్డకంచు విహితాశనముం గబళించుచోఁ బరా-
త్పరుని మునీంద్రు లట్లు సుతతత్పరదృష్టు లనంతపథ్యవి-
స్ఫురణఁ జెలంగుచున్న యిలసుందరిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 41

ఉ. ఆఁకొని పోరువెట్టునెడ నారయ నడ్డముగాఁ దనూజునిం
జేకొని క్రుచ్చి ముద్దిడుచుఁ జెక్కిలి దువ్వుచుఁ “బాయి ద్రావ రా-
రా కనతండ్రి” యంచని మనంబునఁ గుందుచు బొజ్జనిండ ర-
క్షాకలితోక్తిఁ జన్గుడుపు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 42

చ. తడఁబడునట్లు ముంగిటను దప్పుటడుం గిడువేళ నజ్ఞతన్
బడునను చింతయు న్నడువఁ బాల్పడెనన్న కుతూహలంబు చే-
డ్పడ నొకటైన మైమఱచి బాలునకున్ దన వ్రేలొసంగి నే-
ర్పడరఁగ ద్రిప్పుచో శుభముఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 43

చ. తన సరిబాలురం గలసి దవ్వుల కాటల కేగియున్నచోఁ
దనయుఁ డిదేమొ లేఁడనుచుఁ దత్తఱ మొందుచు నావ తాగిన-
ట్లనయము నాత్మఁ గుందుచుఁ దదాగమనాభిముఖాభిలాష పై-
కొని కనినంత సంతసిలు కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 44

చ. చిఱుతలతోడ నాటలకుఁ జేతులు జాచుచు సందుగొందులం
బరుగులు పారుచున్న పశుబాధ ఘటించునటంచు సాధ్వసా-
తురమున రాణివాస మటుద్రోసి బహిస్థలి కేఁగి యంత నా
బురుకనిఁ గేల నందికొనిపోయెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 45

చ. కడువడి నెందఱిన్ గనినఁగాని తనూజులు చెంతఁ జేరి పైఁ-
బడి మురిపంపుఁ బెంపు నెఱబాధలు పెట్టినఁగాని వేసటం
బడక నితోఽధికంబయిన బాలురఁ గన్వలెనంచు బాళిలోఁ
బొడమి చరించుచుండు విరిబోణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 46

చ. వినవినఁ బాలు గాఱు నెఱవేడుక మీఱఁగ ముద్దుముద్దుగాఁ
దనయుఁడు పల్కుచున్న విని తాఁ గనకం బొడిఁ గట్టినట్లు నె-
మ్మనమున సంతసిల్లుచును మాటికిమాటికి దృష్టి దీయుచోఁ
జను గుడిపించి మై నివురు చక్కని తల్లినిఁ బోలరెవ్వరున్. 47

చ. గునగున నేగుదెంచి తనకు న్మఱి పప్పు లొసంగుమంచుఁ బ-
ల్కిన నెఱముద్దుమాటలకుఁ గేవలము న్మది సొక్కి తద్వచో-
జనితసుధారసానుభవసంగతి నాఁకలి నొప్పిదప్పు లెం-
చని తనుజేప్సితార్థఫలశాలినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 48

చ. పెరచిఱుత న్మథింపఁ గని పెంచిన యాబిడ చాడి చెప్పినన్
మఱి విని నీ తనూభవుని మంచికి నీ మది మెచ్చఁబోలు మా
బురుకని గొట్టినాఁడనుచు బొంకి నిజాలయసీమఁ జేరి య-
బ్బురముగ బుద్ధిఁ జెప్పు సిరిబోలిన తల్లినిఁ బోలరెవ్వరున్. 49

చ. తనయుని కొంటెచేఁతలకుఁ దండ్రి యహో బెదరించుచున్న లే-
దనుచు నిజాత్మనాయకుని యాజ్ఞ దొలంగఁగ రాదటన్న వా-
గ్ధన మటు డించి నందనుని దండనపా ల్పడనీక యడ్డముం
జని కరుణింపఁజేయు నెఱజాణను దల్లినిఁ బోలరెవ్వరున్. 50

చ. తలఁపున నున్న భావ మొకదారిఁ జెలంగఁగ వచ్చిరాని మా-
టలు మఱి పల్కువేళఁ గడు ఠాయి జెలంగెడు శౌరిసత్కథా-
కలితవినోదముల్ వినెడు కైవడిగా వడి నాలకించుచో
ఫల మొనఁగూడెనంచు నుతిఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 51

చ. తన తనుజాతుఁ డొక్కతఱిఁ దప్పిదముల్ ఘటియింప భర్త నె-
మ్మనమున సంతసించుటకు మంచివిగా వినిపించు మంచిగాఁ
బను లొనరింప నందఱును “బాలుఁడు యోగ్యుఁ” డటన్న మాటఁ దా,
విని మది సంతసిల్లు నలివేణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 52

చ. తినుకుచు బువ్వఁ బెట్టుమని తేపకుఁ బాతరలాడుఁ బెట్టినన్
గనుఁగొని పాలుపోయుమను గ్రక్కునఁ బోసిన “వెన్న గావలెం,
జనని”యటంచుఁ దా నగడు జేసినఁ గోపము లేక తన్మనం-
బనువడఁ జేసి సంతసిలు నంగనఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 53

చ. కలకొలఁదిం దనూజునకుఁ గా నొనరించినయట్టి భూషణం-
బులు ధరియించుచో నెదుటఁ బుత్రునకుం దన దృష్టి తాఁకి మై-
చెలువు దొలంగునో యనుచుఁ జేరువవారలమీఁద దృష్టి నె-
క్కొలుపుచు సంతసిల్లు సుమకోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 54

చ. అలసట వేసటల్ దలఁప కాఁకలిదప్పుల మీఁది యాశమై
తొలఁగుచు రాత్రులుం బగలు తోడిచెలు ల్మది మెచ్చఁ దత్తనూ-
విలసనకార్యకర్మపదవిం బడి “భర్తృవినోద మింతకుం,
గలదె” యటంచు సంతసిలు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 55

చ. సరసవివేకము ల్దనరుజాడ గలుంగను బిడ్డ నొక్కస-
ద్గురునకు నొప్పగింపుమని కోరిక మీఱ నిజేశుతో మనో-
హరగతి మీఱఁ బల్కి “తనయా విను నీ వెపుడో పురాణవై-
ఖరు లెఱిఁగింతు” వంచుఁ గుతుకంపడు తల్లినిఁ బోలరెవ్వరున్. 56

ఉ. శ్రీలు చెలంగఁగాఁ జదువు చెప్పెడువేళఁ బరాకు మాని మా
బాలున కిప్డు విద్య బహుభంగుల నేర్పుమటంచు పెక్కుచం-
దాల నొసంగు వస్తుసముదాయము నాథుఁ డెఱుంగనీక బ-
ల్మాలిమి మీఱ నట్టి సుకుమారిని దల్లినిఁ బోలరెవ్వరున్. 57

చ. చదివితివేని నీ కిపుడు జామఫలంబులు దెచ్చి యిత్తు స-
మ్మదమున మంచిదోవతులు మాడలొసంగుదునంచుఁ బల్కి మే-
ల్పొదలఁగ బుజ్జగించుచును బొంకముగా బడిఁ జేరఁ బంపి తాఁ
బదపడి త్రోవలో నిలుచుఁ బల్మఱు తల్లినిఁ బోలరెవ్వరున్. 58

చ. చిఱుతను ద్రోవ బాలకులు చిన్నతనంబునఁ గొట్టకుండ భూ-
సురునకు దిట్టముం బఱుచుచో నిలుచేరను బ్రొద్దుపోవఁగా
నరయుచు బిడ్డఁ డాఁకొనియెనంచు మదిన్ దిగులొంది పిల్వఁగాఁ
బఱచుఁ దనంతటన్ బడికిఁ బల్మఱు తల్లినిఁ బోలరెవ్వరున్. 59

చ. పెనఁకువ మీఱ భోజనము పెట్టుమటంచని రాఁ గుమారునిన్
గని చిఱునవ్వు మోవిపయిఁ గ్రమ్మఁగ నీ విపుడేమి నేర్చితో
వినవలెనంచుఁ గోరుచును వేమఱు లాలనసేసి వేడుకన్‌
దినుమని బువ్వఁ బెట్టు యువతీమణిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 60

చ. మఱి బడిఁ జేరఁబోవునెడ మార్గములోపల ముల్లు నాఁటునో
మెఱవడి గోవులేమయిన మీదికిఁ జేడ్వడి వచ్చునో యటం-
చఱిమురి కొందఱిం బనిచి యాదటఁ దానును బోవనెంచు వాం-
ఛ రహి చెలంగ నెల్లపుడుఁ జయ్యనఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 61

చ. కొడు కెటువంటివాఁ డయినఁ గుంభినిలో నదలింపరాని దుం-
దుడుకయి యున్న నన్యులకు దొడ్డఱికం బెఱిఁగించుచున్ మదిన్
జిడజిడ మాని సంతసము చిప్పిలఁ గంటికి ఱెప్ప చాడ్పునన్
దొడఁబడి ప్రోచుచున్న యలతొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 62

చ. సదమలరీతు లుల్లసిల సార మెఱింగెడి రీతిఁ జక్కఁగాఁ
జదివితివేని భూజనులు సన్నుతి చేసెద రింతెకాక సం-
పద లెడఁగూడు నీ కనుచు బాలునకు న్మఱి బుద్ధి చెప్పుచో
మది ముదమంది యొప్పెసఁగు మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 63

చ. తనయుఁడు సర్వవిద్యలను దద్జ్ఞతఁ గాంచి పఠించుచున్నచో
విని పరితోషనీరనిధి వెల్లువగాఁ బయిఁ బాఱినట్లు నె-
మ్మనమున సంతసిల్లుచుఁ ‘గుమారునిఁ గన్న ఫలంబుఁ గంటిఁగా’
యని తలపోయుచుండు కనకాంగినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 64

చ. వెడవెడ నింక భోజనపువేళ గతించిన బిడ్డఁడేమొకో
బడి విడి రాఁడు నేఁ డనుచుఁ బాతరలాడుచు నుండునంతలోఁ
గడఁ జనుదేర నెత్తుకొని కౌఁగిటఁ జేరిచి చుంచు దువ్వి మై-
బడలిక దీఱ సంతసిలు భామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 65

చ. తనయుని ముద్దుమాటలకుఁ దా ముదమందుచుఁ దేటనీట మ-
జ్జన మొనరించి మోమునను జాఁదిడి సన్నపుఁ జేలఁ గట్టి బల్
పెనఁకువ షడ్రసాన్నములు పెట్టి భుజించిన “ముద్ద ముట్టలే”
దని పెఱవారితోఁ బలుకులాడెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 66

చ. పలుమఱు తాను నందనుఁడు పాఠకశాలకుఁ బోనినాఁడు “నా
పలుకు వినంగదయ్య మృదుభాషణ లాడఁగదయ్య సత్యమున్
బలుకఁగదయ్య నీ కెపుడు భాగ్యము గల్గు” నటంచు బ్రేమతోఁ
దెలుపుచు బుద్ధిఁ జెప్పు యువతీమణిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 67

చ. సరసులు మెచ్చఁగా గణితశాస్త్రము నేరిచి సంఖ్యలెల్ల సు-
స్థిరమతితోడఁ జెప్పుటకుఁ దెల్వి వహించినయట్టి మంచిలే-
కరి యగుఁగాక నా సుతశిఖామణి యంచుఁ బరాపరేశు స-
ద్గురునిఁ దలంచుచో నెదను గోరెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 68

చ. విమలవిచారశీలుఁడయి విశ్రుతకీర్తి దిశల్ ఘటిల్ల మా-
ఘము మొదలైన కావ్యరసకల్పనలు న్మఱి శాస్త్రము ల్పురా-
ణములు నలంకృతు ల్మనమునన్ బెనుపారఁగ నెన్నఁ డింక నా
కొమరుఁడు నేర్చునో యనుచుఁ గోరెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 69

చ. స్వరము లలంకృతుల్ కృతులు సయ్యన ముప్పదిరెండు రాగముల్
మెఱయఁగఁ దాళమానలయమిశ్రసమంచితఖండజాతి సు-
స్థిరఘనతాపసంగతులు తేటపడ న్మఱి పాడనేర్చునా
వరసుతుఁ డెన్నఁ డింక నని వాంఛిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 70

చ. పొలు పలరారఁగాఁ జదివి పూర్ణతఁ గాంచి వయోవిలాసముల్
వెలయుచునున్న నందనుని వేడుకఁ గన్గొని పెండ్లిచేయఁగా-
వలెనని భర్తతో వినయవాక్యములం దగువేళఁ దిన్నఁగాఁ
దెలుపుచు సంతసిల్లెడు సతీమణిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 71

చ. కులమును రూపముం జెలువుఁ గోమలతం దలిదండ్రు లన్నద-
మ్ములుఁ గలదానిఁగా సుగుణము ల్గలదానినిఁగా దలంచి పై-
దలి నటు పెండ్లిచేసి యల దంపతులం గని మూఁడులోకముల్
చెలువుగ నేలినట్లు విలసిల్లెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 72

చ. చెలువము మీఱుచున్న తన చిన్నికుమారునిఁ జూచి మంత్రవా-
దులు కలుషం బొనర్తురని తోడనె పెద్దల నాశ్రయించి ని-
ర్మలుఁ డగునట్లు చేయ హరిమంత్రములన్ బఠియింపఁ బూన్చి వా-
రల కుపయుక్తిఁ జేయ నలరారెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 73

చ. కొమరుఁడు రాజకార్యములకున్ జని క్రమ్మఱ నింటఁ జేర రాఁ
దమక మెలర్పఁగాఁ బనులు తాల్మి ఘటించినఁగాని వందిత-
క్రమ మిగురొత్త నందఱిని గాదని తాఁ దనివార నందనా-
భిమతము మీఱ భోజనముఁ బెట్టెడి తల్లినిఁ బోలరెవ్వరున్. 74

చ. కర మరుదార రాజహితకార్యములన్ సవరించి రా సభాం-
తరమునఁ జేయు సత్క్రియలు దా విని తత్కమనీయకల్పనా-
పరవశయై సదా “త్రిపురభంజన సేమ మొసంగు” మంచు మీ-
సర మలరార దీవనలు సల్పెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 75

ఉ. భూరివివేకుఁడై సుజనపోషకుఁడై యభిమానుఁడై సదా-
చారవిహారుఁడై పరమసాత్త్వికుఁడై గుణవంతుఁడయ్యు నేఁ
గోరినయట్లు పట్టి తనకుం బ్రభవిల్లెఁ గదా యటంచుఁ దా-
నూరక సంతసిల్లి మదినుబ్బెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 76

చ. చతురతఁ గాంచుచో విమలసాత్త్వికశాస్త్రములెల్ల నేర్చి సు-
వ్రతుఁడయి సత్యసంధుఁడయి రాజసభాంతరపూజనీయుఁడై,
సుతుఁ డుదయించెనంచు మదిఁ జొక్కి ప్రహర్షణ ముప్పతిల్ల లోఁ
గుతుకము మీఱుచున్న యల కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 77

ఉ. శ్రీలలరారు సంతతసుశీలుఁడు భూతదయాపరుండు వా-
చాలుఁ డనన్యచారుజలజాతముఖీహృదయానుకూలుఁ డీ
బాలకుఁడంచు సజ్జనులు పల్కినఁ దద్వచనంబు వీనులం
గ్రోలుచు సంతసిల్లు సుమకోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 78

ఉ. దానధురాయశోవినయ ధైర్యనిరంతరసాహసక్రియా-
మాన జనోపకారఘనమాన్యరతుండయి మీనలోచనా-
ధ్యానమనస్కుఁడై సకలధర్మవిశారదుఁడైన సూనునిం
దాను దలంచి సంతసిలు తన్వినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 79

చ. పరనిరతోపకారమృదుభాషణభూషణుఁ డాశ్రితావన-
స్థిరగుణశాలి నీతిపథజీవనజీవనుఁ డుత్తమాధమాం-
తరము లెఱుంగు మేటి తలిదండ్రులకు న్జవదాఁటఁడన్నచో
నరసి మనంబులోన ముదమందెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 80

చ. కలుపుఁదనంబుతోడఁ దనుఁ గన్న కుమారుఁడు సంతసిల్లి కో-
డలికి నలంకరించుచు నొడంబడి బుద్ధులు చెప్పుచున్ దనూ-
జులవలెఁ బ్రేమ మీఱ మఱి చూచుచు భూజనులాడు మంచిప-
ల్కులకుఁ బ్రమోదమొందు సుమకోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 81

చ. కొమరుని దేహపోషణకుఁ గోడలితో దమయంతి సత్కథా-
క్రమము లతాంగి చంద్రమతి కార్యము జానకి వర్తనంబు చం-
దము ననసూయ నర్మిలి మొదల్ జగతిం గల మేల్పతివ్రతా-
త్వము లెఱిఁగించుచుండెడు సువాసినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 82

చ. తనవలె నన్నపానములఁ దన్పునొ తన్పదొ ప్రేమమీఱ నం-
దనుని నటంచు సందియము తన్నెడఁబాయమిఁ గోడ లంత భో-
జన మిడువేళఁ దాను బతిసౌఖ్యసమాచరణంబు ముక్తిసా-
ధనమని తెల్పు ధర్మగుణదాయినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 83

ఉ. చూతఫలోష్ణనూత్నఘృతసూపసమంచదపూపషడ్రసో-
పేతము గాఁగ భోజనము పెట్టి కుమారున కోలి ఘర్మసం-
జాతశరీరబాధ దిగజాఱుటకై దయఁ దాళవృంతముం
జేతి కొసంగు దివ్యగుణశీలను దల్లినిఁ బోలరెవ్వరున్. 84

చ. కొడుకును గోడ లొంటిపడి కొంకుచు సైగలు నారజంపు టా-
గడములు వింతవింత నెఱగారవముల్ గిలిగింతలాడు మే-
ల్సడిసడిసన్నలుం గుసగుసల్ జరిగించుట చూచి యాత్మలోఁ
బుడమి సమస్తమేలు గతిఁ బొంగెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 85

చ. తనయుఁడు పుత్రులం గనువిధంబు ఘటించుటకై రమేశు నీ-
శుని సిరి మీనలోచనను జొక్కము మీఱ భజించు నెన్నఁ డే
మనుమని నెత్తి ముద్దిడుదు మక్కువతోడ నటంచుఁ గోడలిం
గని ముదమందుచో మిగులఁ గాంక్షిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 86

చ. కర మనురక్తి నందనులు గల్గుటకై తన ముద్దుగోడలిం
గురుతరభక్తి దేవతలకుం బ్రణమిల్లఁగఁ జేయు వేంకటే-
శ్వరునకు మీఁదుగట్టుమని చాటును నోములు నోఁచ ద్రవ్య ము-
త్కరముగ నిచ్చుచోఁ గరుణ గల్గిన తల్లినిఁ బోలరెవ్వరున్. 87

చ. “అనయము కీర్తిహాని సుజనాదరణీయము గాదు సిగ్గుఁబా-
టెనయఁగఁ జేయు లోకు లతిహీనతగా మతినెంతు రెందు దు-
ర్జనసహవాస మేరికినిఁ జౌక ఘటించుఁ దలంచినన్ సుమా
విను”మని బుద్ధిఁ జెప్పు ఘనవేణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 88

చ. “ధన మొనగూర్చు సద్గుణవితాన మొనర్చు ధరిత్రిలోపలన్
ఘనత ఘటించు రాజగురుకార్యసమున్నతిఁ జేయుఁ గీర్తికాం-
తను గొనితెచ్చు ముక్తిపథతత్త్వములెల్ల నెఱుంగఁజేయు స-
జ్జనసహవాస” మంచు నుడి సల్పెడు తల్లినిఁ బోలరెవ్వరున్. 89

చ. “అనయము రాజకార్యములయందుఁ బ్రవర్తన సేయువేళ భూ-
జనులకుఁ గీడు పన్నునెడ సడ్డ ఘటింపఁగ నీకు లోకనిం-
దన కెడగాని నిర్మలవిధంబు సమస్తము నీకుఁ గీర్తిసా-
ధన” మని తెల్పు సద్గుణమతల్లిని దల్లినిఁ బోలరెవ్వరున్. 90

చ. “తలఁప నగణ్యుఁడై బుధవితానము వర్ణనచేయ సత్క్రియా-
కలనఁ జెలంగి సద్గుణము గల్గిననుం దనుఁ గన్న తల్లితం-
డ్రుల గుణమెల్లఁ బాయ భళిరే యని పల్కుదు” రంచుఁ బట్టికిం
దెలుపుచు సంతసిల్లు యువతీమణిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 91

ఉ. శిష్టులు మెచ్చ సజ్జనులు చేకొనునట్లు దలంచి జ్ఞానవా-
సిష్ఠముఖప్రబంధములు చెప్పుచు సత్త్వపురాణమర్మసా-
భీష్టవిధుల్ పఠించుటకుఁ బెద్దలఁ జూపుచుఁ బుత్రవాంఛ సం-
తుష్టి చెలంగుచున్న యల తొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 92

ఉ. కోడలు గర్భమౌట తనకు న్మదిఁ దోఁచినయంత బ్రేమ గొం-
డాడ సుపుత్రునిం బడయునట్లు ఘటింపు మటంచు శూలి పూఁ-
బోఁడిని మందగామినినిఁ బుష్పసుగంధిని మీనలోచనన్
వేడుకమీఱ వేఁడు నలివేణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 93

చ. మనుమఁ డటంచుఁ బిల్వ సుకుమారునిఁ గోడలు గన్న మాటఁ దా
విని యనివారదానముల వేలముగా నొనరింపఁజేసి చ-
య్యన శుభవాద్యముల్ మొరయునట్లు ఘటించెఁ గదా యటంచుఁ గ-
న్గొని ముదమందునట్టి యల కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 94

చ. కలిమి బలంబు భోగము సుఖంబు జయంబు యశస్సమృద్ధియుం
గలుగఁగఁ గోరుచుం దనదు కాయము డస్సిన శక్తి లేమిడిన్
బలము దొలంగియుండినను బాయని కూర్మి తురంగలింప ని-
ర్మలమతిఁ బుత్రవత్సలత రంజిలు తల్లినిఁ బోలరెవ్వరున్. 95

చ. సరవిఁ గుమారవాంఛ కొనసాగుటకై పడు వేవులింత నో-
రరుచి విచేష్ట గాసి మొదలైన ప్రయాసములెల్లఁ జూడఁగా
హరిహరపంకజాసనముఖామరులైననుగాని యిట్టి దు-
ష్కరతరబాధ లోరువరు గావునఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 96

చ. కడువడి మీఱ నందనుని గర్భములో భరియించి యింటిలో
నడిచెడివేళఁ దాఁ బనులు నాణెముగా నొనరించువేళ నిం-
పడరఁగఁ గూరుచుండు నెడనైన ప్రయాసము లోర్చెఁ గాన నీ
పుడమిని లోకమాత యనఁబోలిన తల్లినిఁ బోలరెవ్వరున్. 97

చ. ప్రసవము నొందునాఁడు పడు బాములు చూచినఁ బ్రాణహానియై
యెసఁగినఁగాని లోనఁ గసటెంతయు లేకయె పుత్రవాంఛ లో
మసలెడుఁ గాన నింకిట సమానదయారసపూర్ణు లెవ్వ రీ
వసుమతిలోన దివ్యగుణవార్ధినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. 98

ఉ. నేరుపు విద్యయుం గలిమి నీతివివేకము గల్గునట్లుగా
సారెకుఁ దెల్పుచో జగతి సౌఖ్యము గల్గ ఘటింపఁజేయుచో
నారయఁ బ్రేమఁ దా నహరహంబును గంటికి ఱెప్ప చాడ్పు మం-
దారము రీతిఁ బ్రోచు గుణధన్యను దల్లినిఁ బోలరెవ్వరున్. 99

ఉ. శ్రీ వెలయంగ లోకు లిది చిత్రమటంచు మదిం దలంప న-
ప్పా వతిభక్తితో జననిపైఁ గల ప్రేమ దురంగలించి రాఁ-
గా వగ మీఱ మాతృశతకం బొనగూరిచెఁ గానఁ జూచినం
బూవిలుకానిఁ గన్న సిరిఁబోలిన తల్లినిఁ బోలరెవ్వరున్. 100

మాతృశతకము సంపూర్ణము.

పీఠిక
తెలుఁగు బాసలోఁ బేరెన్నికఁ గన్న శతకములలో మాతృశతక మొకటిగా నెన్నఁదగియున్నది. ఇందు గర్భధారణమునకు ముందునుండి పుత్రవాంఛతో సతు లువ్విళులూరు విధము, గర్భభారముచేఁ గృశించుచు సత్పుత్రునకై జనని పొందు నాందోళనము, కుమారుని శ్రేయోవృద్ధులకు విద్యావిశేషాదులకుఁ దల్లి యానందించు విధము రమణీయముగ, మనోహరముగ, స్వభావానుకూలముగ రసవత్తరముగ వర్ణింపఁబడినది. తన కుమారుఁడు విద్యావివేకశాలియై రాజకీయకార్యములతోఁ బేరెన్నిక గనినంత తల్లి భారము తీఱదని కాఁబోలు, ఈ కవి కొడుకు గోడలు కలసి మెలసి యుండునపుడు, మనుమడు కలిగినపుడు మాతృదేవి పొందు సంతోషపారవశ్యము లీ గ్రంథమున సజీవముగఁ జిత్రించియున్నాఁడు.

మాతృలీలలను శతకకర్తయగు నీ కవి చక్కఁగ హృదయగతము గావించుకొని భక్తిరసావృతమగు నిరర్గళకవితతో “మాతృదేవో భవ” యను వేదవాణిని ముక్తకంఠముతో గానము గావించి మాతౄణముక్తుఁ డయ్యెను. ఆంధ్రవాఙ్మయమునఁ గల శతక సమూహమునం దిట్టి ప్రేమస్వరూప మనఁదగు మాతృదేవతను స్మరించు గ్రంథములు చాల యరుదుగా నున్నవి. ఈ శతకము మాతూరి అప్పావు మొదలారిచే రచింపఁబడినటులఁ బూర్వముద్రణమువలనఁ దెలియుచున్నది. అంతియగాక కవి తన నామము అప్పావు అని నూఱవపద్యములోఁ జెప్పికొనినాడు. ఈ శతకములోఁ బలుతావుల మీనాక్షిస్మరణము (చూ. ప. 14, 30, 70, 86, 93) చేసియుంటవలనను, మాతృశతకము పూర్వముద్రణము గావించిన కవికుమారుని నామము మీనాక్షిదాసు ఐయుంటవలనను కవి మీనాక్షిభక్తుఁడనియు మధురామండల నివాసి యనియు నూహచేయ నవకాశము చిక్కుచున్నది. శతకమునుండి కవిచరిత్ర మింత కెక్కుడు తెలియరాదు.

ఈ శతకరచయితయగు అప్పావు మొదలారి ద్రవిడదేశము చేరిన యాంధ్రుఁడని కవితనుబట్టి యూహ చేయవచ్చును. ఈ శతకము ప్రథమ ముద్రణము కవికుమారుఁడు క్రీ.శ. 1861లో నొనర్చియుంటవలన నిది యిప్పటికి రమారమి డెబ్బది సంవత్సరములనాఁడు రచింపఁబడినటులఁ దోఁచుచున్నది. ఉపజ్ఞాకల్పితమగు నిట్టి యుత్తమశతకమును పునర్ముద్రణ మొనర్చి యాంధ్రలోకమున కొసంగిన బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారి యుద్యమము ప్రశంసాపాత్రము. కవితలో నటనట వ్యాకరణదోషములు గానవచ్చుచున్నవి.
 
రచించినవారు - మాతూరి అప్పావు మొదలారి
 

శ్రీ శేషాద్రిరమణకవులు
భక్తిరసశతకసంపుటము - 2, వావిళ్ల. 1928

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat